Rajiv Gandhi Equity Savings Scheme
-
రాజీవ్ ఈక్విటీ స్కీము కింద పన్ను మినహాయింపు ఎలా?
రాజీవ్‌గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ (ఆర్జీఈఎస్ఎస్) కింద రూ. 50,000 విలువైన అర్హమైన షేర్లను కొన్నాను. వీటిలో రూ. 49,000 విలువగల షేర్లకే లాక్ఇన్ వర్తించింది. నేనేం చేయాలి? ఆర్జీఈఎస్ఎస్ కింద పన్ను మినహాయింపును నేను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? - భాస్కర్, వరంగల్ మీ ప్రశ్న కొంచెం సందిగ్ధంగా వుంది. ఆర్జీఈఎస్ఎస్ కింద కొన్న అన్ని షేర్లనూ మీ డిపాజిటరీ లాక్ఇన్ చేయలేదని మీరు అడుగుతున్నారా? మీరు కొన్న షేర్లన్నీ ఆర్జీఈఎస్ఎస్ కింద అర్హమైనవే అయితే...రూ. 50,000 విలువైన మీ షేర్లను ఎందుకు లాక్ చేయలేదో మీ డిపాజిటరీ వద్ద వాకబు చేయండి. ఆర్జీఈఎస్ఎస్ కింద మీ డీమ్యాట్ ఖాతాలో ఎంతైనా పెట్టుబడి చేయవచ్చు. కానీ ఒక అర్థిక సంవత్సరంలో రూ. 50,000 విలువైన షేర్లకే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆర్జీఈఎస్ఎస్ కింద అర్హమైన షేర్లను రూ. 50,000 విలువ వరకూ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ డిపాజిటరీ ఆటోమ్యాటిక్‌గా లాక్ఇన్ చేస్తుంది. అయితే ఈ స్కీము కింద మీరు కొన్న షేర్లలో లాక్ఇన్లో అట్టిపెట్టుకొనే షేర్లను ఎంపికచేసుకునే స్వేచ్ఛ మీకుంటుంది. ఆ ఏడాదిలో ఈ స్కీము కింద అట్టిపెట్టుకోదల్చని పెట్టుబడుల్ని/షేర్లను మీరు లావాదేవీ జరిపిన తర్వాత నెలరోజుల్లోపు ఫారమ్-బి ద్వారా మీ డిపాజిటరీ పార్టిసిపెంట్‌కు ఈ విషయమై మీరు సమాచారం అందించాల్సివుంటుంది. తద్వారా ఆ షేర్లను మీరు విక్రయించడం లేదా తనఖా చేసే హక్కు లభిస్తుంది. నేను యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, బీఎస్ఎల్ టాక్స్ రిలీఫ్ 96 ఫండ్స్లోరూ. 40,000 చొప్పున పెట్టుబడి పెట్టాను. మరో రూ.40,000 వరకూ పెట్టుబడులు పెట్టగలను. ఈ మొత్తాన్ని పన్ను ఆదా, అధిక రాబడుల కోసం ఎస్బీఐ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ)లలో గానీ, మరే ఇతర ఈఎల్ఎస్ఎస్లో గానీ ఇన్వెస్ట్ చేయమంటారా? - ప్రసన్న, హైదరాబాద్ ఎన్ఎఫ్ఓలలో పెట్టుబడిని మేము సిఫార్సు చేయం. పనితీరును రుజువుపర్చుకోవాల్సి వున్న ఎన్ఎఫ్ఓకంటే ఇప్పటికే ట్రాక్ రికార్డు కలిగివున్న ప్రస్తుత స్కీమే పెట్టుబడికి ఉత్తమమన్నది మా విశ్వాసం. మార్కెట్లో లేని వినూత్నమైన సదుపాయాన్ని ఏదైనా ఎన్ఎఫ్ఓ అందిస్తుంటే మాత్రం పెట్టుబడికి పరిశీలించవచ్చు. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, బిర్లా సన్‌లైఫ్ టాక్స్ రిలీఫ్ 96లలోనే మీరు పెట్టుబడి చేయడం శ్రేయస్కరం. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ స్కీము ఫైవ్ స్టార్ ఫండ్ కాగా, బిర్లా సన్‌లైఫ్ టాక్స్ రిలీఫ్ 96 తగిన ట్రాక్ రికార్డు కలిగిన ఫోర్ స్టార్ ఫండ్. నేను ప్రభుత్వ ఉద్యోగిని. నేషనల్ పెన్షన్ స్కీము (ఎన్పీఎస్)లో యాజమాన్య వాటాపై టాక్స్ రిబేటును పొందవచ్చా? - సుందర్, విశాఖ పట్టణం ఎన్పీఎస్కు యాజమాన్య వాటాలో...ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీసీడీ (2) కింద వేతనం (బేసిక్ ప్లస్ డీఏ) 10 శాతం వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే సెక్షన్ 80సీసీఈ కింద అనుమతిస్తున్న రూ. 1.5 లక్షల పరిమితిలో ఈ ఎన్పీఎస్ మినహాయింపు వుండదు. ఎన్‌పీఎస్‌లో యాజమాన్య వాటాపై అదనపు మినహాయింపును మీరు క్లెయిమ్ చేసుకోవాల్సివుంటుంది. నా దగ్గర రూ.8 లక్షలున్నాయి. మరో ఐదేళ్ల వరకూ నాకు వీటితో అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఈక్విటీల్లో గానీ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి నాకు ఎలాంటి అనుభవం లేదు. నేను స్టాక్ మార్కెట్‌కు, మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త. మంచి రాబడులు వచ్చేలా ఇన్వెస్ట్ చేయడానికి తగిన సూచనలివ్వండి. - రాజేందర్, నెల్లూరు మీరు ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇవి కనీసం 65 శాతం ఈక్విటీల్లో, మిగిలింది డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పూర్తి ఈక్విటీ ఫండ్స్ కన్నా ఇవి కొంత తక్కువ ఒడిదుడుకులుగా ఉంటాయి. తొలిసారిగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇవి మంచి ఎంపిక. ఏదైనా బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బులను జమ చేయండి. తర్వాత ఏదైనా మంచి రేటింగ్ ఉన్న ఒకటి లేదా రెండు ఈక్విటీ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
యులిప్ సరెండర్‌పై పన్నులు ఉంటాయా?
నేనొక ఈక్విటీ ఫండ్‌లో ఏడాది క్రితం కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఈ ఈక్విటీ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్‌ను ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)కు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా బదిలీ చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తే నేనేమైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందా? మూల ధన లాభాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదని, అలాగే సెక్షన్ 80 సీ కింద పన్ను తగ్గింపును కూడా పొందవచ్చని మిత్రులంటున్నారు. ఈ అభిప్రాయం సరైనదేనా ? తగిన సూచనలివ్వండి. - ఆదిత్య, కడప ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను క్రమమైన పద్ధతిలో బదిలీ చేయడాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) అంటారు. ఈక్విటీ ఫండ్స్‌కు కేటాయింపులు పెంచడాన్ని లేదా తగ్గించడాన్ని ఈ ఎస్టీపీ ద్వారా సాధించవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) లాంటిదే ఇది కూడా. తేడా ఏమిటంటే సిప్‌లో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మ్యూచువల్ ఫండ్స్‌లోకి బదిలీ అవుతాయి. ఎస్టీపీలో ఇన్వెస్ట్మెంట్స్ ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి బదిలీ అవుతాయి. ఒక డెట్ ఫండ్ నుంచి మరో ఈక్విటీ ఫండ్‌లోకి, లేదా ఈక్విటీ ఫండ్ నుంచి డెట్ ఫండ్‌లోకి, లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ ఫండ్(ఈఎల్ఎస్ఎస్)లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్లోనికి ఎస్టీపీ ద్వారా బదిలీ చేయడాన్ని మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని, మరో కొత్త మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా పరిగణిస్తారు. ఏడాదిలోపు మీరు ఈక్విటీ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది దాటితే ఈక్విటీ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి లేదు. మీ విషయంలో మీ ఇన్వెస్ట్మెంట్ ఏడాదిదాటింది కాబట్టి మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వా రా సెక్షన్ 80 సీ కింద మీరు పన్ను ఆదా కూడా చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని మరచిపోవద్దు. సరైన రాబడులనివ్వని కారణంగా పాత యులిప్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలని మీరు గతంలో సలహా ఇచ్చారు. నేను కూడా యులిప్ ఫండ్ బాధితుడినే. నేను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ యులిప్ స్కీమ్‌లో 2009, ఆగస్టులో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాను. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కన్నా తక్కువగానే రాబడులు వచ్చాయి. వచ్చే నెలలో ఈ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. యులిప్నుంచి ముందస్తుగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే పన్ను బాధ్యత ఎలా ఉంటుంది ? సరెండర్ చార్జీలపై ఏమైనా సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలా? ఆదాయపు పన్ను బాధ్యత ఏమైనా ఉంటుందా? దీనిని డెట్‌ఫండ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరణగా భావించి ఏమైనా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుందా? తగిన వివరణ ఇవ్వగలరు. - ఫాతిమా, నిజామాబాద్ యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(యులిప్) విషయానికొస్తే, పాలసీ తీసుకున్న ఐదేళ్ల కంటే ముందుగానే, మీ పాలసీని సరెండర్ చేస్తే, సరెండర్ చేసిన యూనిట్ల విలువ మీ ఆదాయానికి కలిపి మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను లెక్కిస్తారు. అంతే కాకుండా ఇంతకు ముందు ఈ పాలసీలపై సెక్షన్ 80 సీ కింద మీరు పొందిన పన్ను తగ్గింపులను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ఐదేళ్ల కాలం పూర్తయితే, సరెండర్ విలువపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ (ఆర్జీఈఎస్ఎస్) ఇంకా కొనసాగుతోందా? ఈ ఏడాది బడ్జెట్లో ఈ స్కీమ్‌కు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు చేశారా ? - వంశీకృష్ణ, బెంగళూరు రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్(ఆర్జీఈఎస్ఎస్) ప్రస్తుతం అమల్లో ఉంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో మీరు రూ.50,000 వరకూ ఇన్వెస్ట్ చేసి, రూ.25,000 వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఇంత మొత్తంలో రిటర్న్‌లు వస్తాయనే గ్యారంటీ ఏమీ లేదు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో ఈ స్కీమ్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. -
పన్ను ఆదాకు ఇతర మార్గాలు ఇవే
ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్‌కు, వీటికి మధ్య తేడా ఏమిటి? - అనిల్ కుమార్, విజయవాడ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంటివే. కొనుగోలు, అమ్మకం వంటి విషయాల్లో వీటికి మ్యూచువల్ ఫండ్స్‌కు తేడా ఉంటుంది. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేయాలనుకుంటే, ఈ సంస్థ ఏజెంట్ ద్వారా ఆ రోజు ముగింపు ఎన్ఏవీ ధరకు ఆయా ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈటీఎఫ్‌ల విషయంలో అలా కాదు. షేర్లను కొనుగోలు చేసినట్లే ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఏదైనా స్టాక్ బ్రోకర్ ద్వారా ఆర్డర్ చేసి ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈటీఎఫ్‌ల కొనుగోలు వ్యయం సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. ఈటీఎఫ్‌లనేవి పాసివ్ ఫండ్స్. వీటిని నిర్వహించడానికి మ్యూచువల్ ఫండ్స్‌కు ఉన్నట్లుగా ఎలాంటి ఫండ్ మేనేజర్ ఉండడు, ఇండెక్స్ కదలికలను బట్టి మీకు రాబడులు వస్తాయి. సెక్షన్ 80సి ప్రకారం రూ. లక్ష వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే ఇది కాకుండా ఇతరత్రా పన్ను ఆదా మార్గాలున్నాయా? వివరించగలరు. - కార్తికేయ, హైదరాబాద్ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం రూ. లక్ష రూపాయలు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ సెక్షన్ ద్వారానే కాకుండా మరికొన్ని పన్ను ఆదా మార్గాలున్నాయి. వాటి వివరాలు.... సెక్షన్ 80సీసీజీ: రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు రూ.50 వేలలోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 50 శాతం మొత్తానికి పన్ను రాయితీ పొందవచ్చు. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశంగా ఈ స్కీమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న నివాసిత భారతీయులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇంతకు ముందు డీ మ్యాట్ అకౌంట్ ద్వారా ఈక్విటీల్లో గానీ, డెరివేటివ్ల్లో కానీ ఇన్వెస్ట్ చేయని వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌కు లాక్-ఇన్ పీరియడ్ మూడేళ్లు. సెక్షన్ 80డి: మెడికల్ బీమాకు చెల్లించిన ప్రీమియమ్‌కు పన్ను మినహాయింపులు పొందవచ్చు. రూ.15,000 వరకూ చెల్లించిన ప్రీమియంలపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక మీ తల్లిదండ్రులకు కూడా మెడికల్ బీమా ప్రీమియం చెల్లిస్తే, అదనంగా మరో రూ.15,000 వరకూ తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ కేటగిరిలోకి వస్తే, రూ.20,000 వరకూ చెల్లించిన ప్రీమియమ్‌నకు పన్ను తగ్గింపు పొందవచ్చు. సెక్షన్ 80డిడి: ఈ సెక్షన్ కింద మీపై ఆధారపడిన పిల్లలు, మీ జీవిత భాగస్వామికై వెచ్చించిన వైద్య చికిత్స ఖర్చులను రూ.50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. ఒక వేళ రోగం తీవ్రమైనదైతే మినహాయింపు రూ.75,000 వరకూ ఉంటుంది. సెక్షన్ 80డిడిబి: కేన్సర్, కిడ్నీ వైఫల్యం తదితర కొన్ని తీవ్రమైన జబ్బులకు అయిన వైద్య ఖర్చులకు ఈ సెక్షన్ కింద రూ.40,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒక వేళ ఈ ఖర్చులు సీనియర్ సిటిజన్ల కోసం చేసినవైతే, మినహాయింపు పరిమితి రూ.60,000 వరకూ ఉంటుంది. సెక్షన్ 80ఈ: సొంతానికి గాని, భాగస్వామికి గాని, పిల్లల కోసం గానీ తీసుకున్న విద్యా రుణం అసలుకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. సెక్షన్ 80జి: ఈ సెక్షన్ కింద ధార్మిక కార్యక్రమాలకు ఇచ్చిన విరాళాలకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ మినహాయింపు మీ స్థూల ఆదాయంలో 10 శాతానికి మించకూడదు. సెక్షన్ 80జీజీ: ఈ సెక్షన్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించిన ఇంటి అద్దెలో రూ.24,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. మీ వేతన ప్యాకేజీలో హెచ్ఆర్ఏ కూడా ఒక భాగమై ఉంటే మీకు ఈ మినహాయింపు వర్తించదు. సెక్షన్ 80జీజీసీ: ఈ సెక్షన్ కింద రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలకు పన్ను మినహాయింపు పొందొచ్చు. విరాళం విషయంలో పరిమితి లేదు.