ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్‌కు, వీటికి మధ్య తేడా ఏమిటి? - అనిల్ కుమార్, విజయవాడ
ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లాంటివే. కొనుగోలు, అమ్మకం వంటి విషయాల్లో వీటికి మ్యూచువల్ ఫండ్స్‌కు తేడా ఉంటుంది. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేయాలనుకుంటే, ఈ సంస్థ ఏజెంట్ ద్వారా ఆ రోజు ముగింపు ఎన్‌ఏవీ ధరకు ఆయా ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈటీఎఫ్‌ల విషయంలో అలా కాదు.
షేర్లను కొనుగోలు చేసినట్లే ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఏదైనా స్టాక్ బ్రోకర్ ద్వారా ఆర్డర్ చేసి ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈటీఎఫ్‌ల కొనుగోలు వ్యయం సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. ఈటీఎఫ్‌లనేవి పాసివ్ ఫండ్స్. వీటిని నిర్వహించడానికి మ్యూచువల్ ఫండ్స్‌కు ఉన్నట్లుగా ఎలాంటి ఫండ్ మేనేజర్ ఉండడు, ఇండెక్స్ కదలికలను బట్టి మీకు రాబడులు వస్తాయి.
సెక్షన్ 80సి ప్రకారం రూ. లక్ష వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే ఇది కాకుండా ఇతరత్రా పన్ను ఆదా మార్గాలున్నాయా? వివరించగలరు. - కార్తికేయ, హైదరాబాద్
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం రూ. లక్ష రూపాయలు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ సెక్షన్ ద్వారానే కాకుండా మరికొన్ని పన్ను ఆదా మార్గాలున్నాయి. వాటి వివరాలు....
సెక్షన్ 80సీసీజీ: రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు రూ.50 వేలలోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 50 శాతం మొత్తానికి పన్ను రాయితీ పొందవచ్చు. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశంగా ఈ స్కీమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న నివాసిత భారతీయులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇంతకు ముందు డీ మ్యాట్ అకౌంట్ ద్వారా ఈక్విటీల్లో గానీ, డెరివేటివ్‌ల్లో కానీ ఇన్వెస్ట్ చేయని వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌కు లాక్-ఇన్ పీరియడ్ మూడేళ్లు.
సెక్షన్ 80డి: మెడికల్ బీమాకు చెల్లించిన ప్రీమియమ్‌కు పన్ను మినహాయింపులు పొందవచ్చు. రూ.15,000 వరకూ చెల్లించిన ప్రీమియంలపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక మీ తల్లిదండ్రులకు కూడా మెడికల్ బీమా ప్రీమియం చెల్లిస్తే, అదనంగా మరో రూ.15,000 వరకూ తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ కేటగిరిలోకి వస్తే, రూ.20,000 వరకూ చెల్లించిన ప్రీమియమ్‌నకు పన్ను తగ్గింపు పొందవచ్చు.
సెక్షన్ 80డిడి: ఈ సెక్షన్ కింద మీపై ఆధారపడిన పిల్లలు, మీ జీవిత భాగస్వామికై వెచ్చించిన వైద్య చికిత్స ఖర్చులను రూ.50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. ఒక వేళ రోగం తీవ్రమైనదైతే మినహాయింపు రూ.75,000 వరకూ ఉంటుంది.
సెక్షన్ 80డిడిబి: కేన్సర్, కిడ్నీ వైఫల్యం తదితర కొన్ని తీవ్రమైన జబ్బులకు అయిన వైద్య ఖర్చులకు ఈ సెక్షన్ కింద రూ.40,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒక వేళ ఈ ఖర్చులు సీనియర్ సిటిజన్‌ల కోసం చేసినవైతే, మినహాయింపు పరిమితి రూ.60,000 వరకూ ఉంటుంది.
సెక్షన్ 80ఈ: సొంతానికి గాని, భాగస్వామికి గాని, పిల్లల కోసం గానీ తీసుకున్న విద్యా రుణం అసలుకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు.
సెక్షన్ 80జి: ఈ సెక్షన్ కింద ధార్మిక కార్యక్రమాలకు ఇచ్చిన విరాళాలకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ మినహాయింపు మీ స్థూల ఆదాయంలో 10 శాతానికి మించకూడదు.
సెక్షన్ 80జీజీ: ఈ సెక్షన్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించిన ఇంటి అద్దెలో రూ.24,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. మీ వేతన ప్యాకేజీలో హెచ్‌ఆర్‌ఏ కూడా ఒక భాగమై ఉంటే మీకు ఈ మినహాయింపు వర్తించదు.
సెక్షన్ 80జీజీసీ: ఈ సెక్షన్ కింద రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలకు పన్ను మినహాయింపు పొందొచ్చు. విరాళం విషయంలో పరిమితి లేదు.
పన్ను ఆదాకు ఇతర మార్గాలు ఇవే
Published Mon, Mar 24 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM
Advertisement