నేనొక ఈక్విటీ ఫండ్‌లో ఏడాది క్రితం కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఈ ఈక్విటీ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్‌ను ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)కు సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా బదిలీ చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తే నేనేమైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందా? మూల ధన లాభాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదని, అలాగే సెక్షన్ 80 సీ కింద పన్ను తగ్గింపును కూడా పొందవచ్చని మిత్రులంటున్నారు. ఈ అభిప్రాయం సరైనదేనా ? తగిన సూచనలివ్వండి. - ఆదిత్య, కడప
ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను క్రమమైన పద్ధతిలో బదిలీ చేయడాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) అంటారు. ఈక్విటీ ఫండ్స్‌కు కేటాయింపులు పెంచడాన్ని లేదా తగ్గించడాన్ని ఈ ఎస్‌టీపీ ద్వారా సాధించవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) లాంటిదే ఇది కూడా. తేడా ఏమిటంటే సిప్‌లో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మ్యూచువల్ ఫండ్స్‌లోకి బదిలీ అవుతాయి.
ఎస్‌టీపీలో ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి బదిలీ అవుతాయి. ఒక డెట్ ఫండ్ నుంచి మరో ఈక్విటీ ఫండ్‌లోకి, లేదా ఈక్విటీ ఫండ్ నుంచి డెట్ ఫండ్‌లోకి, లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ ఫండ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోనికి ఎస్‌టీపీ ద్వారా బదిలీ చేయడాన్ని మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని, మరో కొత్త మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా పరిగణిస్తారు. ఏడాదిలోపు మీరు ఈక్విటీ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఏడాది దాటితే ఈక్విటీ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి లేదు. మీ విషయంలో మీ ఇన్వెస్ట్‌మెంట్ ఏడాదిదాటింది కాబట్టి మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వా రా సెక్షన్ 80 సీ కింద మీరు పన్ను ఆదా కూడా చేసుకోవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని మరచిపోవద్దు.
సరైన రాబడులనివ్వని కారణంగా పాత యులిప్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలని మీరు గతంలో సలహా ఇచ్చారు. నేను కూడా యులిప్ ఫండ్ బాధితుడినే. నేను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ యులిప్ స్కీమ్‌లో 2009, ఆగస్టులో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాను. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కన్నా తక్కువగానే రాబడులు వచ్చాయి. వచ్చే నెలలో ఈ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. యులిప్‌నుంచి ముందస్తుగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే పన్ను బాధ్యత ఎలా ఉంటుంది ? సరెండర్ చార్జీలపై ఏమైనా సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలా? ఆదాయపు పన్ను బాధ్యత ఏమైనా ఉంటుందా? దీనిని డెట్‌ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉపసంహరణగా భావించి ఏమైనా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుందా? తగిన వివరణ ఇవ్వగలరు. - ఫాతిమా, నిజామాబాద్
యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(యులిప్) విషయానికొస్తే, పాలసీ తీసుకున్న ఐదేళ్ల కంటే ముందుగానే, మీ పాలసీని సరెండర్ చేస్తే, సరెండర్ చేసిన యూనిట్ల విలువ మీ ఆదాయానికి కలిపి మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను లెక్కిస్తారు. అంతే కాకుండా ఇంతకు ముందు ఈ పాలసీలపై సెక్షన్ 80 సీ కింద మీరు పొందిన పన్ను తగ్గింపులను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ఐదేళ్ల కాలం పూర్తయితే, సరెండర్ విలువపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు.
రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ (ఆర్‌జీఈఎస్‌ఎస్) ఇంకా కొనసాగుతోందా? ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ స్కీమ్‌కు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు చేశారా ? - వంశీకృష్ణ, బెంగళూరు
రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్(ఆర్‌జీఈఎస్‌ఎస్) ప్రస్తుతం అమల్లో ఉంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో మీరు రూ.50,000 వరకూ ఇన్వెస్ట్ చేసి, రూ.25,000 వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఇంత మొత్తంలో రిటర్న్‌లు వస్తాయనే గ్యారంటీ ఏమీ లేదు. ఇక ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ స్కీమ్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు.
యులిప్ సరెండర్‌పై పన్నులు ఉంటాయా?
Published Mon, Aug 11 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM
Advertisement