Systematic Transfer Plan
-
శామ్కో నుంచి టైమర్ ఎస్టీపీ
శామ్కో మ్యుచువల్ ఫండ్ .. టైమర్ ఎస్టీపీ పేరిట ఒక సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)ని, ఓవర్‌నైట్ ఫండ్‌ను ఆవిష్కరించింది. టైమర్ఎస్టీపీని వారంవారీ, నెలవారీ, త్రైమాసికాలవారీగా కనీసం రూ. 25,000 నుంచి ప్రారంభించవచ్చు. తాము సొంతంగా తయారు చేసిన ఈక్విటీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇండెక్స్ (EMOSI) ఇండికేటర్ ఆధారంగా ఇది పని చేస్తుందని కంపెనీ సీఐవో ఉమేష్ కుమార్ మెహతా తెలిపారు. మార్కెట్లు గరిష్ట, కనిష్ట స్థాయుల్లో ఉన్నప్పుడు తగు రీతిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. మరోవైపు, ఓవర్‌నైట్ ఫండ్ ఎన్ఎఫ్వో (న్యూ ఫండ్ ఆఫర్) అక్టోబర్ 4న ప్రారంభమై 6న ముగుస్తుంది. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. -
ఇన్వెస్ట్ చేయాలా..? విక్రయించాలా..?
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. దేశాలన్నీ ఇప్పుడు ఈ వైరస్ నియంత్రణ కోసమే తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలకు ‘లాక్’ వేసి పోరాటం సాగిస్తున్నాయి!. మన దేశంలో ఏప్రిల్ 14 వరకు లౌక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, సేవలు మినహా మిగిలిన పరిశ్రమలు, వ్యాపారాలన్నీ మూతబడ్డాయి. దీంతో ఎంతోమంది జీవనోపాధి అనిశ్చితిలో పడింది. ఈ పరిణామాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లలో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రధాన సూచీలు వాటి గరిష్టాల నుంచి 35 శాతం పడిపోయాయి. విడిగా స్టాక్స్‌ను పరిశీలిస్తే 60 శాతానికి పైగా క్షీణించినవీ ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇన్వెస్టర్లను ఆత్మరక్షణలోకి నెట్టేవే. అదనంగా ఇన్వెస్ట్ చేయాలా..? లేక ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవాలా..? ఇలా ఎన్నో ప్రశ్నలు రావచ్చు. వాటికి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.. భయపడక్కర్లేదు... తమ పెట్టుబడులను సమీక్షించుకునేందుకు ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 50 సూచీ గరిష్టం నుంచి 40 శాతం వరకు పడిపోయి గత వారం కొంత రికవరీ చూపించింది. నిజానికి ఈ తరహా భారీ కరెక్షన్ను 2008లోనూ చూశాం. అయినా ఇన్వెస్టర్లలో చాలా మంది ఈ తరహా సంక్షోభాలకు సన్నద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో మార్కెట్ల పతనం చూసి భయపడిపోయి ఉన్న ఈక్విటీ పెట్టుబడులను అమ్మేసుకుని వెళ్లిపోవడం ఈ తరుణంలో చేయాల్సిన పని కాదంటున్నారు విశ్లేషకులు. ‘‘నగదుకు అత్యవసరం లేకపోతే ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో తమ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను, సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) కొనసాగించుకోవాలి’’ అని సృజన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకురాలు దీపాలిసేన్ పేర్కొన్నారు. ఈ రెండూ కొనుగోలు ఖర్చును సగటుగా మారుస్తాయని, మార్కెట్ కరెక్షన్లో మరిన్ని యూనిట్లను సమకూర్చుకోవచ్చని ఆమె సూచించారు. ఒకవేళ ఉద్యోగం కోల్పోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే అప్పడు ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడాన్ని పరిశీలించొచ్చన్నారు. అది కూడా బ్యాంకు సేవింగ్స్ ఖాతా మొత్తం ఖాళీ అయ్యి, డెట్ ఫండ్స్, ఇతర నిల్వలన్నీ అడుగంటిన తర్వాతే ఈక్విటీ పెట్టుబడుల ఉపసంహరణను పరిశీలించాలని సూచించారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏక మొత్తంలో పెట్టుబడులను కూడా ఈ తరుణంలో చేసుకోవచ్చని, కాకపోతే ఒకే విడత కాకుండా పలు విడతలుగా చేసుకోవాలని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్‌జోషి సూచించారు. అత్యవసరాలు చూసుకోవాలి... ఈ సమయంలో జీవన అవసరాల కోసం నిధులు కావాల్సిన వారు ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి బదులు ఈపీఎఫ్ బ్యాలన్స్‌ను కొంత వెనక్కి తీసుకోవడాన్ని తాను సూచిస్తానని మ్యాక్స్ సెక్యూర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ ప్రహరాజ్ తెలిపారు. ఈపీఎఫ్ సభ్యులు తమ భవిష్య నిధి నుంచి 75 శాతాన్ని లేదా మూడు నెలల బేసిక్ వేతనం, డీఏ ఈ రెండింటిలో ఏది తక్కువ మొత్తం అయితే ఆ మేరకు ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్, లౌక్‌డౌన్ సమీప కాలంలో వృద్ధి అవకాశాలను దెబ్బతీయగా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు, వైరస్ నివారణ చర్యలతో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి పట్ల ఉన్న భయాలు ఈక్విటీ మార్కెట్లను ప్రస్తుతం చౌకగా మార్చేశాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ పేర్కొంది. పీఈ, పీబీవీ, జీడీపీలో మార్కెట్ క్యాప్ కొలమానాల ఆధారంగా ఈ సంస్థ రూపొందించిన వ్యాల్యూషన్ ట్రాకర్ మార్చి 23న 72.6 స్థాయికి చేరింది. అంటే దూకుడుగా పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నది దీని సంకేతం. చివరిగా ఈ స్థాయిలో వ్యాల్యూషన్ ట్రాకర్ కనిపించింది 2008–09లోనే కావడం గమనార్హం. మిగులు నిధులు కలిగిన వారు, రోజువారీ ఖర్చులకు సరిపడా పక్కన పెట్టేసి, అలాగే అత్యవసర పరిస్థితులకు కొంత కేటాయించుకున్న తర్వాత.. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల కోసం కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు పెట్టుబడుల కేటాయింపు దోహదపడుతుందా? లేదా అని ఓ సారి సమీక్షించుకుని, అవసరమైతే మార్పులు కూడా చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ మార్గం.. మార్కెట్ నిపుణులు, విశ్లేషకులను ప్రశ్నిస్తే ఎక్కువ మంది నుంచి వచ్చే స్పందన ఈక్విటీల్లో పెట్టుబడులకు ఇది మంచి అనుకూల సమయమనే. ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాల కోసం వేచి చూసేవారు, దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు సిప్ మార్గాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్స్ ధరల్లో దిద్దుబాటుతో అవి చాలా ఆకర్షణీయంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హెల్త్‌కేర్, టెలికం రంగాలు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించగలవన్న అంచనాతో ఉన్నారు. ఇన్వెస్టర్లు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని, వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుందని నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఈవో సందీప్‌సిక్కా తెలిపారు. మొదటి సారి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి, సీజన్ వారీగా ఇన్వెస్ట్ చేసే వారికి ఇండెక్స్ ఫండ్స్ అనుకూలమైనవిగా సిక్కా పేర్కొన్నారు. యాక్టివ్‌గా నిర్వహణతో కూడిన ఫండ్స్‌తోపాటు, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్‌ను వ్యూహాత్మకంగా ఎంచుకోవాలన్నారు. ‘‘మార్కెట్లు రికవరీ అయినప్పుడు ముందుగా సూచీల్లోనే అది ప్రతిఫలిస్తుంది. ప్రతీ పతనం తర్వాత బలమైన రికవరీ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటీఎఫ్‌లు చక్కని ఆప్షన్’’ అని సిక్కా వివరించారు. ఈక్విటీల్లో పెట్టుబడులు.. ప్రస్తుత తరుణంలో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించుకోవాలని, మిగులు నిధులు ఉంటే దీర్ఘకాలం కోసం క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలని యస్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో కన్వర్ వివేక్ సూచించారు. ‘‘స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు బేర్ మార్కెట్లు ఎంతో అనుకూలమైనవి. మార్కెట్ల పనితీరు దారుణంగా ఉందంటే మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి మంచి రాబడులకు అవకాశం ఉన్నట్టే’’ అని ఆశికా వెల్త్ అడ్వైజర్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌జైన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న నిధుల్లో 40 శాతాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు కేటాయించుకోవాలి. ఇవి 7–8 శాతం వరకు రాబడులను ఇస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను మిడ్‌క్యాప్, మల్టీక్యాప్ ఫండ్స్‌లో వచ్చే ఆరు నెలల కాలంలో క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి’’ అని అమిత్‌జైన్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హెల్త్‌కేర్ రంగంలోని కంపెనీలు, ముఖ్యంగా డయాగ్నస్టిక్స్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయని పేర్కొన్నారు. అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇంటి నుంచే పని చేస్తున్నందున డేటాకు డిమాండ్ భారీగా ఉంటుందని కనుక టెలికం కంపెనీలను సైతం పెట్టుబడులకు పరిశీలించొచ్చని సూచించారు. అలాగే, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగాలపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం తక్కువే ఉంటుందన్నారు. -
స్వయం ఉపాధికీ... ఖర్చులవేగా?
♦ ఇతరుల్లాగే ఖర్చులున్నపుడు ప్రణాళిక తప్పనిసరి ♦ రిజర్వు నిధులతో పాటు జీవిత. ఆరోగ్య బీమా ఉండాలి ♦ స్థిరమైన ఆదాయం ఉన్నట్టుగానే పెట్టుబడి వ్యూహాలు ♦ అందుకోసం సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఉత్తమం ♦ రిటైర్మెంట్ నిధికీ ప్లానింగ్ ఉండాలంటున్న నిపుణులు స్థిరమైన ఆదాయం లేనివారికి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటమనేది చాలా క్లిష్టమైన సవాలు. మన దేశంలో కోటిన్నర మంది స్వయం ఉపాధిని నమ్ముకున్న వారే. వీరికి స్థిరమైన ఆదాయం ఉండదు. ఒక నెల ఎక్కువగా ఉండొచ్చు. మరో నెలలో తగ్గిపోవచ్చు. కానీ, నెలసరి ఖర్చులు అలా ఉండవు కదా!!. అందుకే ఈ తరహా వ్యక్తులు అనుసరించాల్సిన ఆర్థిక ప్రణాళిక గురించి నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఆ వివరాలివీ... పన్నులకు ప్రణాళిక ఉందా? స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు జీఎస్టీ సహా రవాణా, తరుగుదల వ్యయాలపై పన్ను మినహాయింపుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆదాయం రూ.50 లక్షల్లోపు ఉంటే సెక్షన్ 44ఏడీఏ కింద మొత్తం ఆదాయంలో 50 శాతం మేర ఊహాత్మక వ్యయాల కింద చూపించుకోవచ్చు. అందుకే స్వయం ఉపాధిలో ఉన్నవారు తమ ఆదాయం, వ్యయాల వివరాలను ఓ రికార్డు నిర్వహించడం వల్ల పన్ను రిటర్నుల సమయంలో ఏదీ మర్చిపోయేందుకు అవకాశం ఉంది. పెట్టుబడికి ఎస్టీపీ బెటర్... వేతన జీవులకు సిప్ చక్కని సాధనం. నెలనెలా క్రమం తప్పకుండా ఇంత మొత్తం పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. కానీ, అస్థిర ఆదాయంలో ఉన్న వారికి సిప్ సాధ్యం కాకపోవచ్చు. అందుకే వీరికి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) అనువైనది. అధిక ఆదాయం వచ్చినప్పుడు లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి నెలనెలా కొంత మొత్తాన్ని డెట్, బ్యాలన్స్డ్, ఈక్విటీ ఫండ్స్‌లోకి ఎస్టీపీ చేసుకోవచ్చు. సుదర్శన్ మార్కెటింగ్‌లో ఉన్నాడు. ప్రతీ నెలా రూ.10,000 మొత్తానికి సిప్ ఎంచుకున్నాడు. కానీ, ఏడాదిలోపే ఆ సిప్ కాస్తా రూ.5,000కు తగ్గించాడు. పరిస్థితి బాగులేకపోతే ఈ మొత్తాన్ని కూడా ఎత్తేసే అవకాశం లేకపోలేదు. అందుకే ఎస్టీపీ అన్నది స్వయం ఉపాధిలో ఉన్న వారికి చక్కని సాధనం. టర్మ్ పాలసీ తప్పనిసరి!! తమపై ఆధారపడిన వారికి ఇచ్చే అపూర్వ కానుక జీవిత బీమా. సంప్రదాయ పాలసీల్లో రూ.లక్ష కవరేజీకే రూ.6,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఇంతే మొత్తానికి రూ.40–50 లక్షల టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. బీమా కవరేజీ కూడా తగినంతగా ఉండాలి. తాను లేకపోతే, తన ఆర్జన అవసరాలు కుటుంబానికి ఇంకా ఎన్నేళ్లు అవసరమో అంత మేర టర్మ్ కవరేజీ ఉండాలన్నది నిపుణుల సూచించేది. కనీసం పదేళ్ల వార్షిక సంపాదన మేరకైనా టర్మ్ కవరేజీ ఉండాలి. రిటైర్మెంట్ కోసం నిధి... నిరుద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు ఏ పింఛను పథకంలోనూ కవర్ కారు. విశ్రాంత జీవనంలో పోషణావసరాలకు, వైద్య ఇతర అవసరాలకు గాను తగిన నిధిని సమకూర్చుకునేందుకు ముందునుంచే ప్రణాళిక వేసుకోవాలి. పీపీఎఫ్, ఎన్పీఎస్ తరహా పథకాలను ఇందుకు పరిశీలించొచ్చు. నిధులను వెనక్కి తీసుకునేందుకు అవకాశం లేని పథకాలతోనే మలి జీవితానికి కావాల్సిన నిధి సాధ్యమవుతుంది. ఎన్పీఎస్ ఈ తరహాలోనే పనిచేస్తుంది. పైగా ఇందులో వ్యయాలు తక్కువ. 60 ఏళ్లకు కాల వ్యవధి తీరుతుంది. ఈక్విటీలకు గరిష్టంగా 50 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. మెచ్యూరిటీ అనంతరం వచ్చే ఫండ్‌లో 40 శాతాన్ని కచ్చితంగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతో ఆ మొత్తంపై నెలనెలా పెన్షన్ అందుతుంది. దీనిపై సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000కు పన్ను ప్రయోజనం కూడా ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల పన్ను ప్రయోజనానికి ఇది అదనం. -
ఎస్టీపీ అంటే ఏమిటి? దీని వల్ల ప్రయోజనమెంత?
సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) గురించి తెలుసుకునే ముందు సిప్ విధానంపై అవగాహన తెచ్చుకోవాలి. ఒక నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెల ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంలో పెట్టుబడిగా పెట్టడాన్ని సిప్‌గా పేర్కొనవచ్చు. ఇన్వెస్ట్మెంట్లలో అస్థిరతను తప్పించుకోవడానికి ఇదొక మంచి మార్గం. ఎస్టీపీ కూడా సిప్ లాంటిదే. యూనిట్ హోల్డర్ ఒక నిర్ణీత మొత్తాన్ని నిర్దేశిత కాలంలో ఒక స్కీమ్ నుంచి మరొక స్కీమ్‌కు బదిలీ చేసుకోవడాన్నే ఎస్టీపీగా పరిగణిస్తాం. ఈ విధానంలో ఇన్వెస్టర్ తన పెట్టుబడులను పలు అసెట్ తరగతులకు సులభంగా బదిలీ చేసుకోవచ్చు. దీని ద్వారా పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ సరళతరం అవుతుంది. మార్కెట్ అస్థిరత నుంచి తప్పించుకోవడానికి, ఆర్థిక లక్ష్యాల సాకారానికి ఎస్టీపీ దోహదపడుతుంది. ఎస్టీపీ రెండు రకాలు. మొదటిది ఫిక్స్డ్ ఎస్టీపీ. ఇందులో ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్ట్మెంట్ నుంచి కొంత స్థిర మొత్తాన్ని వేరొక ఇన్వెస్ట్‌మెంట్‌కు బదిలీ చేస్తాడు. ఇక రెండవది క్యాపిటల్ అప్రిషియేషన్ ఎస్టీపీ. ఇక్కడ ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన ప్రాఫిట్‌ను మాత్రమే వేరొక ఇన్వెస్ట్మెంట్లోకి బదిలీ చేస్తాడు. ఉత్తమ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల్లో సిప్ది ఎప్పుడు అగ్రస్థానమే. ఇక దీని తర్వాతి స్థానం మాత్రం ఎస్టీపీది. మార్కెట్లో అస్థిరతను అధిగమించడానికి ఎస్టీపీ ఎలాగైతే ఉపయోగపడుతుందో.. అదేవిధంగా మార్కెట్ బుల్లిష్‌గా ఉన్నప్పుడు వచ్చే లాభాలు తగ్గడానికి కూడా ఇది కారణంగా నిలువొచ్చు. -
సమస్యలేమీ లేవు.. అయినా బీమా చేయాలా?
నేను గత నాలుగేళ్లుగా బిర్లా సన్‌లైఫ్ మిడ్‌క్యాప్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఈ ఫండ్ ఆశించిన ఫలితాలనివ్వడం లేదు. వార్షిక రాబడులు 30 శాతంగా ఉన్నప్పటికీ, ఈ ఫండ్‌కు ఎక్కువ కాలం టూ స్టార్ రేటింగే ఉంటోంది. ఈ ఫండ్ నుంచి పూర్తిగా వైదొలగమంటారా? లేక కొద్ది కొద్ది మొత్తాల్లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోమంటారా? లేదా నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ)ద్వారా బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్‌కు బదిలీ చేయమంటారా? తగిన సూచనలివ్వండి. - వరుణ్, హైదరాబాద్ మీరు చెప్పినట్లే బిర్లా సన్‌లైఫ్ మిడ్‌క్యాప్ ఫండ్ పనితీరు ఆశించిన విధంగా లేదు. మంచి పనితీరు కనబరుస్తున్న మరో ఫండ్‌కు మీరు మారిపోవడం మంచిది. మీరు ఎంపిక చేసిన బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్ మంచి రాబడులనే ఇస్తోంది. సాధారణంగా ఒక ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒకేసారి కాకుండా సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ)ద్వారా వేరే ఫండ్‌లోకి ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాం. కానీ మీరు బిర్లా సన్‌లైఫ్ మిడ్‌క్యాప్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తే ఎస్టీపీ కాకుండా ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అన్నింటినీ బదిలీ చేయండి. మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరినప్పుడు మాత్రమే, లేదా మీకు డబ్బులు అత్యవసరమైనప్పుడు మాత్రమే లేదా ఆశించిన పనితీరు లేనప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించాలి. ఈ పరిస్థితులు లేనప్పుడు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడమే ఉత్తమం. ఇక ఒక ఫండ్‌హౌస్‌కు చెందిన ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి యూనిట్లను ఎస్టీపీ విధానంలో బదిలీ చేసుకోవడం చాలా సులభం.బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్ అనేది మంచి రాబడులు ఇస్తోన్న మంచి రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకటి. ఇది కాకుండా ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్, కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్, బీఎన్పీ పారిబస్ మిడ్‌క్యాప్ ... ఈ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. నా వయస్సు 51 సంవత్సరాలు. డాక్టర్‌గా పనిచేస్తున్న మావారి వయస్సు 57 సంవత్సరాలు. మా ఇద్దరికీ ఎలాంటి వైద్య, ఆర్థిక సమస్యలు లేవు.ఎల్ఐసీ జీవన్ శ్రీ పాలసీ తీసుకున్నాము. ఇది కాకుండా మా ఇద్దరి కోసం జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాము. అయితే సరైన పాలసీని ఎంచుకోలేకపోతున్నాం. సరైన సలహా ఇవ్వండి. - తన్మయి, విశాఖపట్టణం. ఎల్ఐసీ జీవన్ శ్రీ అనేది ఎండోమెంట్ ప్లాన్. రాబడులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు. ఇలాంటి ప్లాన్స్‌ను సరెండర్ చేయడం ఉత్తమమని సాధారణంగా మేము ఇన్వెస్టర్లకు సలహా ఇస్తాం. కానీ మీరు ఇప్పటికే ఈ పాలసీకి సంబంధించి ప్రీమియమ్‌ల్లో 94 శాతం చెల్లించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ పాలసీని సరెండర్ చేస్తే, మీరు చెల్లించిన ప్రీమియంలో సగ భాగం కూడా మీకు రాకపోవచ్చు. అందువల్ల ఈ పాలసీని సరెండర్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే ఈ పాలసీలో కొనసాగండి. ఇలాంటి పాలసీలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో కీలక సంపాదన వ్యక్తి మరణిస్తే, కుటుంబ అవసరాలను తీర్చేలా జీవిత బీమా పాలసీ ఉండాలి. మీవారు ఎంతకాలం ఆర్జిస్తారు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. మీ వయస్సు రీత్యా చూస్తే జీవిత బీమా పాలసీ తీసుకోవడంలో మీరు చాలా ఆలస్యం చేశారని భావిస్తున్నాం. అయినా ఇప్పటికైనా ఎంచుకోవడానికి మంచి టెర్మ్ పాలసీలు సిద్ధంగా ఉన్నాయి. మ్యాక్స్ లైఫ్ ఆన్లైన్ టెర్మ్ ప్లాన్,అవైవా ఐ-లైఫ్ టెర్మ్ ప్లాన్, కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ ఈస్మార్ట్ టెర్మ్ప్లాన్.. ఈ పాలసీలను పరిశీలించవచ్చు. -
రిటైర్మెంట్కు మంచి ప్రణాళిక ఎలా..?
నేనొక డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఫండ్ నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్‌లోకి మళ్లిద్దామనుకుంటున్నాను. ఇలాచేస్తే నాకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? సాంకేతికంగా చూస్తే ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి పన్ను ప్రయోజనాలు లభించవని నేను అనుకుంటున్నాను. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అలా అయితే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి కదా. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - రవీందర్, వరంగల్ ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోవచ్చు. ఒకేసారి కానీ, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా మార్చుకోవచ్చు. ఎస్టీపీ ద్వారా మార్చుకుంటేనే ఉత్తమం. ఇక ఇలా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకుంటే, ఒక ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని, మరో ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్ చేసినట్లుగా పరిగణిస్తారు. మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లోకి మళ్లిద్దామనుకుంటున్నారు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చినప్పటి నుంచి లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. మీరు సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. నా తల్లిదండ్రుల కోసం యునెటైడ్ ఇండియా సూపర్ టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియమ్‌ను నగదు రూపంలో చెల్లించాను. ప్రీమియమ్‌ను చెక్కు ద్వారా గానీ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించనందున ఈ ప్రీమియమ్‌కు ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభ్యం కావని నా మిత్రుడొకరు చెప్పాడు. అయితే ప్రీమియమ్ చెల్లించిన రసీదుతో పన్ను ప్రయోజనాలు పొందవచ్చని బీమా ఏజెంట్ ఒకరు చెప్పారు. ఈ రెండింటిలో ఏది కరెక్టు? - సోమసుందర్, విశాఖపట్టణం తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య పాలసీల ప్రీమియమ్‌కు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డీ ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ ప్రీమియమ్‌ను చెక్కు ద్వారా గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ చెల్లించాలి. నగదు రూపంలో చెల్లిస్తే పన్ను ప్రయోజనాలు లభ్యం కావు. ఈ విషయంలో మీ మిత్రుడే కరెక్టు. మీరు పన్ను ప్రయోజనాలు పొందలేరు. రిటైర్మెంట్ అవసరాల నిమిత్తం నెలకు రూ.40,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ)లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సలహా ఇచ్చారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చనేది అతని అభిప్రాయం. కానీ ఇంత మొత్తం కొన్నేళ్లపాటు ఈ స్కీమ్‌లో నిరుపయోగంగా ఉండిపోతుందనేది నా అభిప్రాయం? మీరేమంటారు? - ఆనంద్, హైదరాబాద్ రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయడమనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ వయస్సు, మీ రిటైర్మెంట్ అవసరాలు, మీ ప్రస్తుత సంపాదన ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని రిటైర్మెంట్ కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్లాన్ చేసుకోవాలి. మీరు మీ వయస్సును వెల్లడించలేదు. కాబట్టి, మూడు రకాలైన పరిస్థితుల్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయవచ్చో సూచించాం. మీకు సరిపోయినది ఎంచుకోండి. మొదటిది: మీరు రిటైర్మెంట్కు దగ్గరగా ఉంటే ఎన్ఎస్సీల్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. ప్రతి నెలా అంత మొత్తానికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు కొనుగోలు చేస్తే, అవి మెచ్యూరిటీ అయి రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం పొందవచ్చు.అయితే ఎన్ఎస్సీ వంటి స్థిరాదాయ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందలేరు. రెండోది: మీ రిటైర్మెంట్ ఇంకా ఎక్కువ సంవత్సరాలున్నట్లయితే, ఈక్విటీల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 10 శాతాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఏదైనా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకొని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో పెట్టుబడులు పెట్టాలి. మిగిలిన మొత్తాన్ని ఎన్ఎస్సీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మూడవది: మీకు 30లోపు వయస్సుండి, రిటైర్మెంట్ అవసరాల కోసం చూస్తున్నట్లయితే, మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 60 శాతాన్ని డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని ఎన్ఎస్సీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
యులిప్ సరెండర్‌పై పన్నులు ఉంటాయా?
నేనొక ఈక్విటీ ఫండ్‌లో ఏడాది క్రితం కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఈ ఈక్విటీ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్‌ను ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)కు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా బదిలీ చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తే నేనేమైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందా? మూల ధన లాభాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదని, అలాగే సెక్షన్ 80 సీ కింద పన్ను తగ్గింపును కూడా పొందవచ్చని మిత్రులంటున్నారు. ఈ అభిప్రాయం సరైనదేనా ? తగిన సూచనలివ్వండి. - ఆదిత్య, కడప ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను క్రమమైన పద్ధతిలో బదిలీ చేయడాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) అంటారు. ఈక్విటీ ఫండ్స్‌కు కేటాయింపులు పెంచడాన్ని లేదా తగ్గించడాన్ని ఈ ఎస్టీపీ ద్వారా సాధించవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) లాంటిదే ఇది కూడా. తేడా ఏమిటంటే సిప్‌లో బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మ్యూచువల్ ఫండ్స్‌లోకి బదిలీ అవుతాయి. ఎస్టీపీలో ఇన్వెస్ట్మెంట్స్ ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి బదిలీ అవుతాయి. ఒక డెట్ ఫండ్ నుంచి మరో ఈక్విటీ ఫండ్‌లోకి, లేదా ఈక్విటీ ఫండ్ నుంచి డెట్ ఫండ్‌లోకి, లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ ఫండ్(ఈఎల్ఎస్ఎస్)లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్లోనికి ఎస్టీపీ ద్వారా బదిలీ చేయడాన్ని మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని, మరో కొత్త మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా పరిగణిస్తారు. ఏడాదిలోపు మీరు ఈక్విటీ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది దాటితే ఈక్విటీ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి లేదు. మీ విషయంలో మీ ఇన్వెస్ట్మెంట్ ఏడాదిదాటింది కాబట్టి మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వా రా సెక్షన్ 80 సీ కింద మీరు పన్ను ఆదా కూడా చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని మరచిపోవద్దు. సరైన రాబడులనివ్వని కారణంగా పాత యులిప్ ఫండ్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలని మీరు గతంలో సలహా ఇచ్చారు. నేను కూడా యులిప్ ఫండ్ బాధితుడినే. నేను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ యులిప్ స్కీమ్‌లో 2009, ఆగస్టులో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాను. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కన్నా తక్కువగానే రాబడులు వచ్చాయి. వచ్చే నెలలో ఈ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను. యులిప్నుంచి ముందస్తుగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే పన్ను బాధ్యత ఎలా ఉంటుంది ? సరెండర్ చార్జీలపై ఏమైనా సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలా? ఆదాయపు పన్ను బాధ్యత ఏమైనా ఉంటుందా? దీనిని డెట్‌ఫండ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరణగా భావించి ఏమైనా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుందా? తగిన వివరణ ఇవ్వగలరు. - ఫాతిమా, నిజామాబాద్ యూనిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(యులిప్) విషయానికొస్తే, పాలసీ తీసుకున్న ఐదేళ్ల కంటే ముందుగానే, మీ పాలసీని సరెండర్ చేస్తే, సరెండర్ చేసిన యూనిట్ల విలువ మీ ఆదాయానికి కలిపి మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను లెక్కిస్తారు. అంతే కాకుండా ఇంతకు ముందు ఈ పాలసీలపై సెక్షన్ 80 సీ కింద మీరు పొందిన పన్ను తగ్గింపులను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ఐదేళ్ల కాలం పూర్తయితే, సరెండర్ విలువపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ (ఆర్జీఈఎస్ఎస్) ఇంకా కొనసాగుతోందా? ఈ ఏడాది బడ్జెట్లో ఈ స్కీమ్‌కు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు చేశారా ? - వంశీకృష్ణ, బెంగళూరు రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్(ఆర్జీఈఎస్ఎస్) ప్రస్తుతం అమల్లో ఉంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో మీరు రూ.50,000 వరకూ ఇన్వెస్ట్ చేసి, రూ.25,000 వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పొందిన లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఇంత మొత్తంలో రిటర్న్‌లు వస్తాయనే గ్యారంటీ ఏమీ లేదు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో ఈ స్కీమ్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. -
కొంచెం కొంచెం వెనక్కు
ఎవరిని చూసినా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టమనే చెబుతారు. ఏ నిపుణుడిని చూసినా ఏ షేరు, ఎప్పుడు కొనాలో చెబుతూనే ఉంటారు. కాకపోతే కొందరు అప్పుడే కొనమని చెబితే... మరికొందరు కొన్నాళ్లు వేచి చూడమని చెబుతారు. కానీ మీ దగ్గరున్న షేర్లు విక్రయించమని చెప్పే వాళ్లు ఒక్కరు కూడా కనబడరేం? మీరు లాభాలు స్వీకరించడానికి ఇదే మంచి సమయమని ఎవరూ చెప్పరేం? అలాంటివాళ్ల కోసమే అందుబాటులోకి వచ్చింది సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ). ఇలా విత్‌డ్రా చేసుకునే మొత్తాన్ని ఏం చేయాలో తెలియని వారి కోసం... రిస్కు తక్కువగా ఉండే పెట్టుబడి సాధనాల్లోకి మళ్లించేందుకు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చింది. దేశీయ స్టాక్ సూచీలు నూతన శిఖరాలను అధిగమించి... ఐదేళ్ల క్రితం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోయిన వారికి ఇప్పుడు లాభాలు స్వీకరించే అవకాశాలొచ్చిన నేపథ్యంలో ఈ రెండు పథకాల గురించి వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం.. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోయిన వారికి ఇప్పుడు లాభాలు స్వీకరించే అవకాశాలొచ్చిన నేపథ్యంలో ఈ రెండు పథకాల గురించి వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ అనగానే అంతా మొదట సూచించేది సిప్‌నే. అంటే ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయటమే ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). అచ్చు దీనికి వ్యతిరేకంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. సిప్‌లో ప్రతి నెలా కొంత మొత్తం ఎలా ఇన్వెస్ట్ చేస్తామో.. ఈ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో ఒకేసారిగా కాకుండా కొంత మొత్తం వెనక్కి తీసుకుంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతినెలా ఆదాయాన్ని పొందొచ్చు. ప్రయోజనమేంటి? స్టాక్ మార్కెట్లు ఎంత ఎత్తు వరకు పెరుగుతాయో కచ్చితంగా అంచనా వేయలేం. ఇప్పుడు సెన్సెక్స్ నూతన గరిష్ట స్థాయి 22,000 పాయింట్లు దాటింది. ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతాయా లేక పడిపోతాయా అనేది చెప్పటం కష్టం. వచ్చింది చాల్లే అని వైదొలగితే... ఇక్కడ నుంచి సూచీలు భారీగా పెరిగితే.. తక్కువ లాభాలతో వైదొలగామన్న వేదన జీవితాంతం ఉంటుంది. అలాకాకుండా ఇంకా పెరుగుతుంది కదా అని వదిలేశామనుకోండి. భారీగా పడితే... అయ్యో! పెరిగినపుడు అమ్మేసి ఉంటే బావుండునే!! అనే బాధ కూడా వెంటాడుతుంది. అందుకే ప్రతి నెలా లేదా మూడు నెలలకోసారి కొంత చొప్పున వెనక్కి తీసుకుంటే మార్కెట్లు పెరిగినా, పడినా మనం మరీ పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు సహజమే అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే మంచి లాభాలందిస్తున్నాయి. అంతేకాక ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఏడాది దాటాక వైదొలగితే ఎటువంటి పన్ను భారం కూడా ఉండదు. ఇపుడు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌ను దాదాపు ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థా అందిస్తోంది. సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కొన్ని సందర్భాల్లో ఆస్తులు విక్రయించడం వల్లో, బోనస్‌ల రూపంలోనో పెద్ద మొత్తం చేతికి అందొచ్చు. కానీ ఈ మొత్తాన్ని ఒకేసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామంటే... 2008 జనవరి ఉదంతం ఇంకా కళ్ల ముందే ఉంది. ఇలాంటి వారి కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇప్పుడు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) అందిస్తున్నాయి. ఈ విధానంలో మీ దగ్గరున్న భారీ మొత్తాన్ని నష్ట భయం తక్కువగా ఉండే డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవచ్చు. ఎస్టీపీ అంటే.. కమపద్థతి ప్రకారం ఒక పథకంలోంచి మరో పథకంలోకి మారే విధానాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) అంటారు. మరోవిధంగా చెప్పాలంటే ఎస్టీపీ అనేది లమ్సమ్+సిప్. ఒకే ఫండ్‌హౌస్‌కు చెందిన రెండు పథకాలు.. అవి ఈక్విటీ టు ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ, ఈక్విటీ టు డెట్ ఇలా ఒకదాని నుంచి మరోదానికి మారవచ్చు. కానీ ఈ రెండూ ఒకే ఫండ్ హౌస్‌కు చెందినవై ఉండాలి. సాధారణంగా సిప్‌లో అయితే నెలకు కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇందులో ఒక పథకంలో మొత్తం సొమ్మును ఇన్వెస్ట్ చేసి దాన్ని కొంత మొత్తం చొప్పున వేరే పథకంలోకి మారుస్తారు. ప్రయోజనమేంటి? ఎస్టీపీ విధానం రెండు సందర్భాల్లో ఉపయుక్తంగా ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తాలను ఇన్వెస్ట్ చేయాలనుకునే వారితో పాటు ఏదైనా లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసి.. ఆ లక్ష్యానికి చేరుకున్నప్పుడు రిస్క్ తక్కువగా ఉండే వాటిలోకి మారే సందర్భాల్లో ఎస్టీపీ ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్ద మొత్తాలను బ్యాంకుల్లో ఉంచి కొద్దికొద్దిగా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ దీని వలన బ్యాంకుల్లో వచ్చే వడ్డీ తక్కువగా ఉండటంతో పాటు డిపాజిట్ల వడ్డీపై పన్నుభారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న పెద్ద మొత్తాన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడిని పొందుతూ దీనిని ప్రతి నెలా ఈక్విటీ ఫండ్‌లోకి మార్చుకోవచ్చు. లాభాలను రక్షించుకోవడానికి. వచ్చిన లాభాలను రక్షించుకోవడానికి కూడా సిస్టమాటిక్ ట్రాన్సఫర్ ప్లాన్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల చదువు, పెళ్ళి, రిటైర్మెంట్... ఇలా ఏదైనా లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ లక్ష్యానికి చేరుకున్నప్పుడు లేదా లక్ష్య సమయం దగ్గరకు వచ్చినప్పుడు వచ్చిన లాభాలను రక్షించుకోవడమనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటి వరకు మనం పైన చెప్పుకున్న దానికి ఇది పూర్తి భిన్నమన్నమాట. ఈక్విటీ మార్కెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించడం కష్టం. అందుకని లక్ష్యానికి చేరువవుతున్నప్పుడు వీటిని నెమ్మదిగా రిస్క్ తక్కువగా ఉండే డెట్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లోకి మార్చుకోవడం ద్వారా పొందిన లాభాలను కాపాడుకోవచ్చు.