రిటైర్‌మెంట్‌కు మంచి ప్రణాళిక ఎలా..? | How to be a good plan to retire ..? | Sakshi
Sakshi News home page

రిటైర్‌మెంట్‌కు మంచి ప్రణాళిక ఎలా..?

Published Mon, Oct 13 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

రిటైర్‌మెంట్‌కు మంచి ప్రణాళిక ఎలా..?

రిటైర్‌మెంట్‌కు మంచి ప్రణాళిక ఎలా..?

నేనొక డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఫండ్ నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్) ఫండ్‌లోకి మళ్లిద్దామనుకుంటున్నాను. ఇలాచేస్తే నాకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? సాంకేతికంగా చూస్తే ఇది కొత్త ఇన్వెస్ట్‌మెంట్ కాదు కాబట్టి పన్ను ప్రయోజనాలు లభించవని నేను అనుకుంటున్నాను. ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు  మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది.  అలా అయితే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి కదా. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.
 - రవీందర్, వరంగల్

ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోవచ్చు. ఒకేసారి కానీ, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా మార్చుకోవచ్చు. ఎస్‌టీపీ ద్వారా మార్చుకుంటేనే ఉత్తమం. ఇక ఇలా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకుంటే, ఒక ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని, మరో ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్ చేసినట్లుగా పరిగణిస్తారు. మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌లోకి మళ్లిద్దామనుకుంటున్నారు. ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చినప్పటి నుంచి లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. మీరు సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

నా తల్లిదండ్రుల కోసం యునెటైడ్ ఇండియా సూపర్ టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియమ్‌ను నగదు రూపంలో చెల్లించాను. ప్రీమియమ్‌ను చెక్కు ద్వారా గానీ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించనందున ఈ ప్రీమియమ్‌కు ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభ్యం కావని నా మిత్రుడొకరు చెప్పాడు. అయితే ప్రీమియమ్ చెల్లించిన రసీదుతో పన్ను ప్రయోజనాలు పొందవచ్చని బీమా ఏజెంట్ ఒకరు చెప్పారు. ఈ రెండింటిలో ఏది కరెక్టు?
 - సోమసుందర్, విశాఖపట్టణం
తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య పాలసీల ప్రీమియమ్‌కు ఆదాయపు పన్ను  చట్టం సెక్షన్ 80డీ ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ ప్రీమియమ్‌ను చెక్కు ద్వారా గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ చెల్లించాలి. నగదు రూపంలో చెల్లిస్తే పన్ను ప్రయోజనాలు లభ్యం కావు. ఈ విషయంలో మీ మిత్రుడే కరెక్టు. మీరు పన్ను ప్రయోజనాలు పొందలేరు.
 
రిటైర్మెంట్ అవసరాల నిమిత్తం నెలకు రూ.40,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్‌ఎస్‌సీ)లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సలహా ఇచ్చారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చనేది అతని అభిప్రాయం.  కానీ  ఇంత మొత్తం కొన్నేళ్లపాటు ఈ స్కీమ్‌లో నిరుపయోగంగా ఉండిపోతుందనేది నా అభిప్రాయం? మీరేమంటారు?
 - ఆనంద్,  హైదరాబాద్
రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయడమనేది పలు అంశాలపై ఆధారపడి  ఉంటుంది. మీ వయస్సు, మీ రిటైర్మెంట్ అవసరాలు, మీ ప్రస్తుత సంపాదన ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని రిటైర్మెంట్ కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్లాన్ చేసుకోవాలి. మీరు మీ వయస్సును వెల్లడించలేదు. కాబట్టి, మూడు రకాలైన పరిస్థితుల్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయవచ్చో సూచించాం. మీకు సరిపోయినది ఎంచుకోండి.
 
మొదటిది: మీరు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉంటే ఎన్‌ఎస్‌సీల్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. ప్రతి నెలా అంత మొత్తానికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లు కొనుగోలు చేస్తే, అవి మెచ్యూరిటీ అయి రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం పొందవచ్చు.అయితే ఎన్‌ఎస్‌సీ వంటి స్థిరాదాయ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందలేరు.

రెండోది: మీ  రిటైర్మెంట్ ఇంకా ఎక్కువ సంవత్సరాలున్నట్లయితే, ఈక్విటీల్లో కూడా  ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 10 శాతాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఏదైనా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను ఎంచుకొని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో పెట్టుబడులు పెట్టాలి. మిగిలిన మొత్తాన్ని ఎన్‌ఎస్‌సీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
మూడవది: మీకు 30లోపు వయస్సుండి, రిటైర్మెంట్ అవసరాల కోసం చూస్తున్నట్లయితే, మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 60 శాతాన్ని డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని ఎన్‌ఎస్‌సీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
 ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement