వేతన జీవులకు సిప్.. వ్యాపారులకు? | dhirendra kumar ceo value research | Sakshi
Sakshi News home page

వేతన జీవులకు సిప్.. వ్యాపారులకు?

Published Mon, Apr 6 2015 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

వేతన జీవులకు సిప్.. వ్యాపారులకు?

వేతన జీవులకు సిప్.. వ్యాపారులకు?

నేను ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని 8 లేదా 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ ఫండ్‌ను ఎంచుకోవాలి? ఆ ఫండ్ పనితీరు, ట్రాక్  రికార్డ్ తదితర సమాచారాన్నంతటినీ సేకరించాను. అయితే నేను ఎప్పుడు ఆ ఫండ్ నుంచి వైదొలగాలో అన్న విషయం నాకు కొంచెం గజిబిజిగా ఉంది. ప్రతీ 2-3 ఏళ్లకు కొంత రాబడి లక్ష్యంగా పెట్టుకుని, ఆ రాబడులు రాగానే  వైదొలగడం మంచిదంటారా? లేకుంటే నేను లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక లక్ష్యం(పిల్లల చదువు) కోసం అవసరమయ్యే రాబడి ఎప్పుడు వస్తే అప్పుడు వైదొలగమంటారా? తగిన సలహా ఇవ్వండి.  - మార్కండేయ, హైదరాబాద్

 సాధారణంగా ట్రేడర్లు ఒక నిర్దేశిత రాబడి లక్ష్యంగా పెట్టుకుని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కొంత ధరను స్టాప్ లాస్‌గా పెట్టుకుంటారు.  ఈ తరహా వ్యూహంలో లక్ష్యంగా పెట్టుకున్న రాబడి రాగానే లాభాలను స్వీకరిస్తారు. అయితే ఈ విధానం సాధారణ ఇన్వెస్టర్లకు సరిపడదు. ఈ విధానంలో క్రమం తప్పకుండా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందే అవకాశాన్ని ఇన్వెస్టర్లు కోల్పోతారు. సిప్ విధానం ఎంచుకునేది దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందడానికోసమే కదా. అందుకని 2, 3 ఏళ్లకు మీరు ఆశించిన కొంత రాబడి వచ్చినప్పటికీ, ఆ ఫండ్ నుంచి వైదొలగకుండా అలాగే కొనసాగడం మంచిది. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్‌ను ఎంచుకోండి. దాంట్లో క్రమం తప్పకుండా సిప్ విధానంలో కనీసం మూడేళ్లకు పైగానే ఇన్వెస్ట్ చేయండి. మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యానికి(ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువు తదితర అంశాలు)  ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ ఫండ్ యూనిట్లన్నింటినీ విక్రయించండి.
 
 నెలా నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తంలో వేతనాలు లభించే వారికి సిప్ విధానం భేషుగ్గా ఉంటుంది. అయితే వ్యాపారం చేసే నా లాంటి వాళ్లకు ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో సొమ్ములు సమకూరే అవకాశం లేదు. అలాంటి వాళ్లం సిప్ విధానాన్ని అనుసరించలేం కదా. ఇప్పుడు నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులున్నాయి. నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త. నేను ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ వ్యూహాన్ని అనుసరించాలి?  - దక్షిణామూర్తి, విజయవాడ

 మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడం కోసం సిప్ విధానాన్ని అనుసరిస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చని మేం సూచిస్తూ ఉంటాం. మార్కెట్ ఉచ్ఛస్థాయిలో మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ తర్వాత మార్కెట్ పడిపోతే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ బాగా తగ్గిపోతుంది. ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నవాళ్లు ఇది తట్టుకోగలుగుతారు. చిన్న, కొత్త ఇన్వెస్టర్లకు మాత్రం ఇది అశనిపాతమే. అందుకని ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం శ్రేయోదాయకం కాదు. అందుకని ఈక్విటీల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెబుతుంటాం. ఇక మీ విషయానికొస్తే, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న పెద్ద మొత్తాన్ని ముందుగా ఫిక్స్‌డ్ ఇన్‌కం ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత ఏదైనా ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకొని, సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ)ద్వారా ఈ ఈక్విటీ ఫండ్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తరలించండి. ఇలా చేస్తే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ పొందడమే కాకుండా, మంచి ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
 
 నేనొక ఈక్విటీ ఫండ్‌లో ఏడాది క్రితం ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను  ఎస్‌టీపీ(సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్) ద్వారా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)కు బదిలీ చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తే నేను మూలధన పన్ను లాభాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు కదా. మరోవైపు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద ఇతర పన్ను ప్రయోజనాలు ఏమైనా లభిస్తాయా? వివరించగలరు.   - సరిత, నెల్లూరు

 ఎస్‌టీపీ ద్వారా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు బదిలీ చేయడం అంటే-ఒక మ్యూచువల్ ఫండ్‌లో యూనిట్లను విక్రయించి, కొత్తగా మరో మ్యూచువల్ ఫండ్‌లో యూనిట్లను కొనుగోలు చేయడమే. అందుకని ఏడాదికన్నా ముందే మీరు ఏదైనా ఈక్విటీ ఫండ్ నుంచి వైదొలిగితే, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ విషయంలో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏడాది కాలాన్ని దాటాయి కాబట్టి మీకు ఇది వర్తించదు. ఈక్విటీ ఫండ్స్‌లో యూనిట్లను ఏడాది దాటాక విక్రయిస్తే ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లిం చాల్సిన పని లేదు. ఇక మీరు బదిలీ చేయాలనుకుం టున్న ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌కు సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈఎల్‌ఎస్‌ఎస్ యూనిట్లకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. మీరు బదిలీ చేసే ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని గుర్తుంచుకోండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement