డబ్బు అవసరమైతేనే లాభాలు స్వీకరించండి | dhirendra kumar interview | Sakshi
Sakshi News home page

డబ్బు అవసరమైతేనే లాభాలు స్వీకరించండి

Published Mon, May 11 2015 1:38 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

డబ్బు అవసరమైతేనే లాభాలు స్వీకరించండి - Sakshi

డబ్బు అవసరమైతేనే లాభాలు స్వీకరించండి

 నేను 2004 నుంచి 2007 వరకూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. పెట్టిన పెట్టుబడులపై 5-6 రెట్లు రాబడులు వచ్చాయి. 2009 నుంచి మళ్లీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాను. మంచి రాబడులే వస్తున్నాయి. ఇంత వరకూ వీటిని విక్రయించలేదు. వీటి నుంచి లాభాలను తీసుకొని ప్రస్తుతం మరింత రాబడులు ఇస్తున్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? ఇక మా నాన్నగారు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టమని సలహా ఇచ్చాను. నా సలహా సరైనదేనా?
 - వాసుదేవ్, గుంటూరు
 మీరు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేశారు కాబట్టి, మీకు మంచి రాబడులు వచ్చాయి. మీరు దీర్ఘకాలం దృష్ట్యా కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. కానీ వాటిని విక్రయించలేదు.  లాభాలను తీసుకోలేదు.  షేర్లలో ఇన్వెస్ట్ చేసేవారు కాక  ట్రేడింగ్ చేసేవారు లాభాలు స్వీకరిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఇది సరికాదు. లాభాలు వస్తే, తీసుకోకుండా ఎందుకు ఉండాలనేది చాలా మంది వాదిస్తారు. దీనికి మీ అనుభవమే మంచి ఉదాహరణ. మీరు 2004లో ఇన్వెస్ట్ చేశారు. 2007లో మంచి రాబడులు వచ్చాయి. అయినా టెంప్ట్ కాకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించారు. ఒక వేళ మీరు టెంప్ట్ అయి లాభాలను బుక్ చేశారనుకోండి. ఇప్పుడున్న  రాబడులు వచ్చేవి కావు కదా? లాభాల స్వీకరణ కోసం కాకుండా మీకు డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే మీరు మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించాలి. మీరు దీర్ఘకాలం దృష్ట్యా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతమున్న మ్యూచువల్ ఫండ్స్‌లోనే మీ  ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. ఇక మీ నాన్నగారి విషయానికొస్తే, ఏదైనా డైవర్సిఫైడ్ ఫండ్‌ను ఎంచుకోమనండి. ఆ ఫండ్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయమనండి. మంచి రాబడులు పొందవచ్చు.
 
 నా  పుట్టింటి వారి నుంచి స్త్రీ ధనం కింద పెద్ద మొత్తం లభించింది. ఇంత పెద్ద మొత్తం మరో మూడేళ్ల వరకూ మాకు అవసరం లేదు. ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్‌ఎంపీ)లో గానీ, దీర్ఘకాలం ఉండే ఇన్‌కం ఫండ్‌లో గానీ ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. భద్రత, లిక్విడిటీ, పన్ను ప్రయోజనాలు... వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తగిన సలహా ఇవ్వగలరు.           - సరళా రాణి, విశాఖ
 భద్రత, లిక్విడిటీ, పన్ను ప్రయోజనాలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మీరు మీ సొమ్ములను దీర్ఘకాలం ఉండే ఇన్‌కం ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. వీటి ట్రాక్ రికార్డ్‌ను బట్టి మీరు వీటిని సులభంగా ఎంచుకోవచ్చు. ఇక ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్‌ఎంపీ) విషయానికొస్తే, వీటి పనితీరును అంచనా వేసే ట్రాక్ రికార్డ్ అందుబాటులో ఉండదు. అంతేకాకుండా ఎఫ్‌ఎంపీలు క్లోజ్‌డ్ ఎండెడ్ ఫండ్స్. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండదు.  మూడేళ్ల పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, ఎఫ్‌ఎంపీకైనా, దీర్ఘకాలం ఉండే ఇన్‌కం ఫండ్‌కైనా  పన్ను ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. ప్రస్తుతమున్న వడ్డీరేట్ల పరిస్థితులు ఇన్‌కం ఫండ్స్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఇన్‌కం ఫండ్స్ ప్రస్తుతం  లాంగ్ టెర్మ్ గిల్ట్ సెక్యూరిటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాయి. అందరూ అంచనా వేస్తున్నట్లుగా వడ్డీరేట్లు మరింతగా తగ్గితే ఇన్‌కం ఫండ్స్‌కు మరిన్ని రాబడులు వస్తాయి.
 
 డిస్ట్రిబ్యూటర్ల సర్వీస్ ట్యాక్స్ భారం ఇన్వెస్టర్లపైనే ఉంటుందనే వార్త విన్నాను. ఇది నిజమేనా? మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్‌లలో ఇన్వెస్ట్ చేసేవారిపై కూడా ఈ భారం ఉంటుందా?
 - సదానంద, తిరుపతి.
 సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించి ఈ ఏడాది బడ్జెట్ రెండు రకాల మార్పులను తీసుకువచ్చింది. మొద టిది 12.3 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ను 14 శాతానికి పెంచారు. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్‌లు...రెండింటికి ఇది వర్తిస్తుంది. ఇక రెండోది డిస్ట్రిబ్యూటర్ల కమిషన్‌ను సర్వీస్ ట్యాక్స్ పరిధిలోనికి తెచ్చారు. ఫలితంగా డిస్ట్రిబ్యూటర్ల కమిషన్‌పై కూడా సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్‌ను డిస్ట్రిబ్యూటర్లే చెల్లించాలని సెబీ ఆదేశాలున్నప్పటికీ, ఈ భారం ఇన్వెస్టర్లపైననే పడుతుంది.  అయితే డెరైక్ట్ ప్లాన్స్ విషయంలో ఎలాంటి డిస్ట్రిబ్యూటర్లు ఉండరు కాబట్టి దీనికి మినహాయింపు ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement