కొంచెం కొంచెం వెనక్కు
ఎవరిని చూసినా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టమనే చెబుతారు. ఏ నిపుణుడిని చూసినా ఏ షేరు, ఎప్పుడు కొనాలో చెబుతూనే ఉంటారు. కాకపోతే కొందరు అప్పుడే కొనమని చెబితే... మరికొందరు కొన్నాళ్లు వేచి చూడమని చెబుతారు.
కానీ మీ దగ్గరున్న షేర్లు విక్రయించమని చెప్పే వాళ్లు ఒక్కరు కూడా కనబడరేం? మీరు లాభాలు స్వీకరించడానికి ఇదే మంచి సమయమని ఎవరూ చెప్పరేం? అలాంటివాళ్ల కోసమే అందుబాటులోకి వచ్చింది సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ). ఇలా విత్‌డ్రా చేసుకునే మొత్తాన్ని ఏం చేయాలో తెలియని వారి కోసం... రిస్కు తక్కువగా ఉండే పెట్టుబడి సాధనాల్లోకి మళ్లించేందుకు సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చింది. దేశీయ స్టాక్ సూచీలు నూతన శిఖరాలను అధిగమించి... ఐదేళ్ల క్రితం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోయిన వారికి ఇప్పుడు లాభాలు స్వీకరించే అవకాశాలొచ్చిన నేపథ్యంలో ఈ రెండు పథకాల గురించి వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం..
మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోయిన వారికి ఇప్పుడు లాభాలు స్వీకరించే అవకాశాలొచ్చిన నేపథ్యంలో ఈ రెండు పథకాల గురించి వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనగానే అంతా మొదట సూచించేది సిప్‌నే. అంటే ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయటమే ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్). అచ్చు దీనికి వ్యతిరేకంగా పనిచేసేదే ఎస్‌డబ్ల్యూపీ. సిప్‌లో ప్రతి నెలా కొంత మొత్తం ఎలా ఇన్వెస్ట్ చేస్తామో.. ఈ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో ఒకేసారిగా కాకుండా కొంత మొత్తం వెనక్కి తీసుకుంటాం. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతినెలా ఆదాయాన్ని పొందొచ్చు.
ప్రయోజనమేంటి?
స్టాక్ మార్కెట్లు ఎంత ఎత్తు వరకు పెరుగుతాయో కచ్చితంగా అంచనా వేయలేం. ఇప్పుడు సెన్సెక్స్ నూతన గరిష్ట స్థాయి 22,000 పాయింట్లు దాటింది. ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతాయా లేక పడిపోతాయా అనేది చెప్పటం కష్టం. వచ్చింది చాల్లే అని వైదొలగితే... ఇక్కడ నుంచి సూచీలు భారీగా పెరిగితే.. తక్కువ లాభాలతో వైదొలగామన్న వేదన జీవితాంతం ఉంటుంది. అలాకాకుండా ఇంకా పెరుగుతుంది కదా అని వదిలేశామనుకోండి. భారీగా పడితే... అయ్యో! పెరిగినపుడు అమ్మేసి ఉంటే బావుండునే!! అనే బాధ కూడా వెంటాడుతుంది. అందుకే ప్రతి నెలా లేదా మూడు నెలలకోసారి కొంత చొప్పున వెనక్కి తీసుకుంటే మార్కెట్లు పెరిగినా, పడినా మనం మరీ పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు సహజమే అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే మంచి లాభాలందిస్తున్నాయి. అంతేకాక ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఏడాది దాటాక వైదొలగితే ఎటువంటి పన్ను భారం కూడా ఉండదు. ఇపుడు సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌ను దాదాపు ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థా అందిస్తోంది.
సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్
కొన్ని సందర్భాల్లో ఆస్తులు విక్రయించడం వల్లో, బోనస్‌ల రూపంలోనో పెద్ద మొత్తం చేతికి అందొచ్చు. కానీ ఈ మొత్తాన్ని ఒకేసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామంటే... 2008 జనవరి ఉదంతం ఇంకా కళ్ల ముందే ఉంది. ఇలాంటి వారి కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇప్పుడు సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ) అందిస్తున్నాయి. ఈ విధానంలో మీ దగ్గరున్న భారీ మొత్తాన్ని నష్ట భయం తక్కువగా ఉండే డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవచ్చు.
ఎస్‌టీపీ అంటే..
కమపద్థతి ప్రకారం ఒక పథకంలోంచి మరో పథకంలోకి మారే విధానాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ) అంటారు. మరోవిధంగా చెప్పాలంటే ఎస్‌టీపీ అనేది లమ్‌సమ్+సిప్. ఒకే ఫండ్‌హౌస్‌కు చెందిన రెండు పథకాలు.. అవి ఈక్విటీ టు ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ, ఈక్విటీ టు డెట్ ఇలా ఒకదాని నుంచి మరోదానికి మారవచ్చు. కానీ ఈ రెండూ ఒకే ఫండ్ హౌస్‌కు చెందినవై ఉండాలి. సాధారణంగా సిప్‌లో అయితే నెలకు కొంత మొత్తం చొప్పున ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇందులో ఒక పథకంలో మొత్తం సొమ్మును ఇన్వెస్ట్ చేసి దాన్ని కొంత మొత్తం చొప్పున వేరే పథకంలోకి మారుస్తారు.
ప్రయోజనమేంటి?
ఎస్‌టీపీ విధానం రెండు సందర్భాల్లో ఉపయుక్తంగా ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తాలను ఇన్వెస్ట్ చేయాలనుకునే వారితో పాటు ఏదైనా లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసి.. ఆ లక్ష్యానికి చేరుకున్నప్పుడు రిస్క్ తక్కువగా ఉండే వాటిలోకి మారే సందర్భాల్లో ఎస్‌టీపీ ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్ద మొత్తాలను బ్యాంకుల్లో ఉంచి కొద్దికొద్దిగా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ దీని వలన బ్యాంకుల్లో వచ్చే వడ్డీ తక్కువగా ఉండటంతో పాటు డిపాజిట్ల వడ్డీపై పన్నుభారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న పెద్ద మొత్తాన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడిని పొందుతూ దీనిని ప్రతి నెలా ఈక్విటీ ఫండ్‌లోకి మార్చుకోవచ్చు.
లాభాలను రక్షించుకోవడానికి.
వచ్చిన లాభాలను రక్షించుకోవడానికి కూడా సిస్టమాటిక్ ట్రాన్సఫర్ ప్లాన్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల చదువు, పెళ్ళి, రిటైర్మెంట్... ఇలా ఏదైనా లక్ష్యంతో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ లక్ష్యానికి చేరుకున్నప్పుడు లేదా లక్ష్య సమయం దగ్గరకు వచ్చినప్పుడు వచ్చిన లాభాలను రక్షించుకోవడమనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటి వరకు మనం పైన చెప్పుకున్న దానికి ఇది పూర్తి భిన్నమన్నమాట. ఈక్విటీ మార్కెట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించడం కష్టం. అందుకని లక్ష్యానికి చేరువవుతున్నప్పుడు వీటిని నెమ్మదిగా రిస్క్ తక్కువగా ఉండే డెట్ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లోకి మార్చుకోవడం ద్వారా పొందిన లాభాలను కాపాడుకోవచ్చు.