సమస్యలేమీ లేవు.. అయినా బీమా చేయాలా? | quation to answer fo dhiresh kumar | Sakshi
Sakshi News home page

సమస్యలేమీ లేవు.. అయినా బీమా చేయాలా?

Published Mon, Jan 19 2015 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

సమస్యలేమీ లేవు.. అయినా బీమా చేయాలా?

సమస్యలేమీ లేవు.. అయినా బీమా చేయాలా?

నేను గత నాలుగేళ్లుగా బిర్లా సన్‌లైఫ్ మిడ్‌క్యాప్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఈ ఫండ్ ఆశించిన ఫలితాలనివ్వడం లేదు. వార్షిక రాబడులు 30 శాతంగా ఉన్నప్పటికీ, ఈ ఫండ్‌కు ఎక్కువ కాలం టూ స్టార్ రేటింగే ఉంటోంది.  ఈ ఫండ్ నుంచి పూర్తిగా వైదొలగమంటారా? లేక కొద్ది కొద్ది మొత్తాల్లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోమంటారా? లేదా నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ)ద్వారా బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్‌కు బదిలీ చేయమంటారా? తగిన సూచనలివ్వండి.
 - వరుణ్, హైదరాబాద్

 
మీరు చెప్పినట్లే బిర్లా సన్‌లైఫ్ మిడ్‌క్యాప్ ఫండ్ పనితీరు ఆశించిన విధంగా లేదు. మంచి పనితీరు కనబరుస్తున్న మరో ఫండ్‌కు మీరు మారిపోవడం మంచిది. మీరు ఎంపిక చేసిన బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్ మంచి రాబడులనే ఇస్తోంది. సాధారణంగా ఒక ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒకేసారి కాకుండా సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ)ద్వారా వేరే ఫండ్‌లోకి ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాం. కానీ మీరు బిర్లా సన్‌లైఫ్ మిడ్‌క్యాప్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తే ఎస్‌టీపీ కాకుండా ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అన్నింటినీ బదిలీ చేయండి.

మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరినప్పుడు మాత్రమే, లేదా మీకు డబ్బులు అత్యవసరమైనప్పుడు మాత్రమే లేదా ఆశించిన పనితీరు లేనప్పుడు  ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించాలి. ఈ పరిస్థితులు లేనప్పుడు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడమే ఉత్తమం. ఇక ఒక ఫండ్‌హౌస్‌కు చెందిన ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి యూనిట్లను ఎస్‌టీపీ విధానంలో బదిలీ చేసుకోవడం చాలా సులభం.బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్ అనేది మంచి రాబడులు ఇస్తోన్న మంచి రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకటి. ఇది కాకుండా ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్, కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్, బీఎన్‌పీ పారిబస్  మిడ్‌క్యాప్ ... ఈ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు.
 

నా వయస్సు 51 సంవత్సరాలు. డాక్టర్‌గా పనిచేస్తున్న మావారి వయస్సు 57 సంవత్సరాలు. మా ఇద్దరికీ ఎలాంటి వైద్య, ఆర్థిక సమస్యలు లేవు.ఎల్‌ఐసీ జీవన్ శ్రీ పాలసీ తీసుకున్నాము. ఇది కాకుండా మా ఇద్దరి కోసం జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాము. అయితే సరైన పాలసీని ఎంచుకోలేకపోతున్నాం. సరైన సలహా ఇవ్వండి.
 - తన్మయి, విశాఖపట్టణం.

 
ఎల్‌ఐసీ జీవన్ శ్రీ అనేది ఎండోమెంట్ ప్లాన్. రాబడులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది సరైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కాదు. ఇలాంటి ప్లాన్స్‌ను సరెండర్ చేయడం ఉత్తమమని సాధారణంగా  మేము ఇన్వెస్టర్లకు సలహా ఇస్తాం. కానీ మీరు ఇప్పటికే  ఈ  పాలసీకి సంబంధించి ప్రీమియమ్‌ల్లో 94 శాతం చెల్లించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ పాలసీని సరెండర్ చేస్తే, మీరు చెల్లించిన ప్రీమియంలో సగ భాగం కూడా మీకు రాకపోవచ్చు. అందువల్ల ఈ పాలసీని సరెండర్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే ఈ పాలసీలో కొనసాగండి. ఇలాంటి పాలసీలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
 
కుటుంబంలో కీలక సంపాదన వ్యక్తి మరణిస్తే, కుటుంబ అవసరాలను తీర్చేలా జీవిత బీమా పాలసీ ఉండాలి. మీవారు ఎంతకాలం ఆర్జిస్తారు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. మీ వయస్సు రీత్యా చూస్తే జీవిత బీమా పాలసీ తీసుకోవడంలో మీరు చాలా ఆలస్యం చేశారని భావిస్తున్నాం. అయినా ఇప్పటికైనా ఎంచుకోవడానికి మంచి టెర్మ్ పాలసీలు సిద్ధంగా ఉన్నాయి. మ్యాక్స్ లైఫ్ ఆన్‌లైన్ టెర్మ్ ప్లాన్,అవైవా ఐ-లైఫ్ టెర్మ్ ప్లాన్, కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ ఈస్మార్ట్ టెర్మ్‌ప్లాన్.. ఈ పాలసీలను పరిశీలించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement