ఎస్‌టీపీ అంటే ఏమిటి? దీని వల్ల ప్రయోజనమెంత?
సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ) గురించి తెలుసుకునే ముందు సిప్ విధానంపై అవగాహన తెచ్చుకోవాలి. ఒక నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెల ఒక ఇన్వెస్ట్‌మెంట్ సాధనంలో పెట్టుబడిగా పెట్టడాన్ని సిప్‌గా పేర్కొనవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్లలో అస్థిరతను తప్పించుకోవడానికి ఇదొక మంచి మార్గం. ఎస్‌టీపీ కూడా సిప్ లాంటిదే. యూనిట్ హోల్డర్ ఒక నిర్ణీత మొత్తాన్ని నిర్దేశిత కాలంలో ఒక స్కీమ్ నుంచి మరొక స్కీమ్‌కు బదిలీ చేసుకోవడాన్నే ఎస్‌టీపీగా పరిగణిస్తాం. ఈ విధానంలో ఇన్వెస్టర్ తన పెట్టుబడులను పలు అసెట్ తరగతులకు సులభంగా బదిలీ చేసుకోవచ్చు. దీని ద్వారా పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ సరళతరం అవుతుంది.
మార్కెట్ అస్థిరత నుంచి తప్పించుకోవడానికి, ఆర్థిక లక్ష్యాల సాకారానికి ఎస్‌టీపీ దోహదపడుతుంది. ఎస్‌టీపీ రెండు రకాలు. మొదటిది ఫిక్స్‌డ్ ఎస్‌టీపీ. ఇందులో ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ నుంచి కొంత స్థిర మొత్తాన్ని వేరొక ఇన్వెస్ట్‌మెంట్‌కు బదిలీ చేస్తాడు. ఇక రెండవది క్యాపిటల్ అప్రిషియేషన్ ఎస్‌టీపీ. ఇక్కడ ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లో వచ్చిన ప్రాఫిట్‌ను మాత్రమే వేరొక ఇన్వెస్ట్‌మెంట్‌లోకి బదిలీ చేస్తాడు.
ఉత్తమ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాల్లో సిప్‌ది ఎప్పుడు అగ్రస్థానమే. ఇక దీని తర్వాతి స్థానం మాత్రం ఎస్‌టీపీది. మార్కెట్‌లో అస్థిరతను అధిగమించడానికి ఎస్‌టీపీ ఎలాగైతే ఉపయోగపడుతుందో.. అదేవిధంగా మార్కెట్ బుల్లిష్‌గా ఉన్నప్పుడు వచ్చే లాభాలు తగ్గడానికి కూడా ఇది కారణంగా నిలువొచ్చు.