ఈక్విటీ మార్కెట్ ఎప్పటికప్పుడు నూతన గరిష్టాలను నమోదు చేస్తోంది. కనుక స్మార్ట్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? - నియతి దూబే
రెగ్యులర్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)కు వినూత్నమైనవే స్మార్ట్ సిప్‌లు. ఇవి ఎలా స్మార్ట్ అంటే.. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం కాకుండా మార్కెట్ తీరు ఆధారంగా వ్యవహరిస్తాయి. కొన్ని అంశాల ఆధారంగా మార్కెట్లు ఖరీదుగా ఉన్నాయా? లేక చౌకగా ఉన్నాయా..?ఎలా ఉన్నాయన్నది చెప్పే ఆల్గోరిథమ్ (సాఫ్ట్‌వేర్) వాటికి ఉంటుంది.
మార్కెట్ల విలువ చాలా ఖరీదుగా ఉన్నట్టు ఆల్గోరిథమ్ భావిస్తే ఇన్వెస్టర్ నుంచి వచ్చే సిప్ మొత్తాన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా, కొంత మొత్తాన్నే కేటాయిస్తాయి. ఉదాహరణకు ప్రతి నెలా ఒక ఇన్వెస్టర్ నుంచి రూ.1,000 సిప్ రూపంలో వస్తుంటే, అందులో కొంత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్ (డెట్ ఫండ్)లోకి మళ్లిస్తాయి. మళ్లీ స్టాక్స్ విలువలు దిగొచ్చినప్పుడు తిరిగి ఎక్కువ మొత్తాన్ని స్టాక్స్‌కు, తక్కువ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌కు కేటాయిస్తుంటాయి.
స్మార్ట్ సిప్‌లు అంటే ఈక్విటీ, డెట్ పెట్టుబడుల కలబోతగా ఉంటాయి. స్మార్ట్ సిప్‌లు ఇలానే పనిచేస్తుంటాయి. ఇది విజయాన్నిచ్చే విధానం. ఈక్విటీలు ఖరీదుగా ఉన్నప్పుడు తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసి, ఎక్కువ మొత్తాన్ని డెట్ ఫండ్ రూపంలో ఉంచుకోవడం, మార్కెట్లు చౌకగా మారినప్పుడు దీనికి విరుద్ధంగా వ్యవహరించడం ఇందులో కనిపిస్తుంది. కానీ వాస్తవికంగా చూస్తే మార్కెట్లు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టం.
ఎవరూ కూడా నిరాటంకంగా ఈ విషయంలో కచ్చితత్వంతో వ్యహరించలేరు. మార్కెట్ల గమనాన్ని కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితికి ముందు నుంచి ఉన్న సిప్ నిజానికి ఒక పరిష్కారం. ఈ విధానంలో మార్కెట్లు ఖరీదుగా ఉన్నా, చౌకగా ఉన్నా సరే ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఖరీదుగా ఉన్నప్పుడు
కొన్ని యూనిట్లు వస్తే, మార్కెట్లు పడిపోయినప్పుడు అంతే సిప్‌తో ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. మార్కెట్లగమనం, అంచనా రిస్క్‌ను అధిగమించేందుకు ఇదే మెరుగైన పరిష్కారం. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇన్వె స్ట్ చేసుకుంటూ, దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందు కు ఇది వీలు కల్పిస్తుంది. కనుక రెగ్యులర్ సిప్‌లను ఎంపిక చేసు కోవాలన్నదే మా సూచన.
ఇండెక్స్ ఫండ్ ఎంపిక చేసుకునే విషయంలో ఎలాంటి అంశాలను పరిశీలించాలి? -లలావత్ రాములు
ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం సులభమే. ఎక్స్‌పెన్స్ రేషియో, ట్రాకింగ్ ఎర్రర్ ఈ రెండు అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో ఎక్స్‌పెన్స్ రేషియో కీలకమైనది. ఇది ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ నుంచి వసూలు చేసే నిర్ణీత చార్జీ. ఇది తక్కువగా ఉంటే దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులకు వీలుంటుంది.
ఉదాహరణకు ఒక ఫండ్ 0.10 శాతం, మరో ఫండ్ 0.25 శాతం వసూలు చేస్తుంటే.. ఈ రెండింటిలో మొదటి పథకంలో ఎక్కువ రాబడులు వస్తాయి. ట్రాకింగ్ ఎర్రర్ అనేది ఒక పథకం పనితీరుకు, బెంచ్‌మార్క్ సూచీ రాబడులను మధ్య ఉన్న వ్యత్యాసం.
ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉంటే, పథకం పనితీరు సూచీలకు తగిన స్థాయిలోనే ఉందని అర్థం. అలాంటి పథకం ఇన్వెస్టర్లకు అనుకూలం. ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో, పరిమిత ట్రాకింగ్ ఎర్రర్ ఉన్న పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఎక్కువ రాబడులకు అవకాశం ఉంటుంది.
ధీరేంద్ర కుమార్ -సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment