406 పాయింట్ల రిలీఫ్ ర్యాలీ..
పన్ను రేట్లు తగ్గాలన్న జైట్లీ వ్యాఖ్యలతో లాభాలు
• 26వేల పైకి సెన్సెక్స్, 8 వేల పైకి నిఫ్టీ
• డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్
• 125 పాయింట్ల లాభంతో 8,033కు నిఫ్టీ
పన్ను రేట్లు తగ్గాల్సిన అవసరముందన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. మరో రెండు రోజుల్లో డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో స్టాక్ సూచీలు మంచి లాభాలు సాధించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ మళ్లీ 26వేల పాయింట్ల, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,000 పాయింట్ల ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయి నుంచి, నిఫ్టీ ఏడు నెలల కనిష్ట స్థాయిల నుంచి కోలుకుని వారం గరిష్ట స్థాయికి చేరాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 406 పాయింట్లు (1.57 శాతం)లాభపడి 26,213 పాయింట్లు వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు (1.58 శాతం) లాభపడి 8,033 పాయింట్ల వద్ద ముగిశాయి. మూడు వారాల్లో స్టాక్ సూచీలు ఈ స్థాయిలో లాభపడడం ఇదే మొదటిసారి. ఎఫ్‌ఎంసీజీ, లోహ, వాహన, ఫార్మా షేర్ల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా లాభపడ్డాయి.
రోజంతా లాభాలే..
లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. షేర్ల లాభాలపై మూలధన లాభాల పన్ను విధించే యోచనేదీ ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రి అభయమివ్వడం సోమవారం ప్రభావం చూపించకపోయినా, మంగళవారం కొంత ప్రభావం చూపించిందని నిపుణులంటున్నారు. దీనికి తోడు పన్ను రేట్లు తగ్గాల్సిన అవసరముందన్న ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వ్యాఖ్యలతో మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. రూపాయి పతనమైనా, ఆ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడలేదు.
చైనా ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటంతో లోహ, మైనింగ్ షేర్లు లాభపడడం కలసివచ్చింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం సానుకూల ప్రభావం చూపాయి. ఇటీవల బాగా పతనమైన ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, లోహ, ఆయిల్, గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా కంపెనీల ఆర్థిక పలితాలు ఎలా ఉంటాయో అనిశ్చితి నెలకొందని, డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు రేపు(గురువారం) ముగియనున్నందున రానున్న రోజుల్లో మార్కెట్ మరింతగా ఒడిదుడుకులకు గురవుతుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
వెలుగులో సిగరెట్ల షేర్లు..
30 సెన్సెక్స్ షేర్లలో ఒక్క గెయిల్ ఇండియా షేర్ మాత్రమే నష్టపోయింది. మిగిలిన 29 కంపెనీలూ లాభాల్లోనే ముగిశాయి. రెండు రకాల సిగరెట్ల ధరలను 14–15 శాతం పెంచిన నేపథ్యంలో ఐటీసీ షేర్ 4 శాతం ఎగసింది. రూ.234 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడ్డ షేర్ ఇదే. బడ్జెట్లో సిగరెట్లపై సుంకం పెరగకపోవొచ్చనే అంచనాలు కూడా సిగరెట్ ఉత్పాదక కంపెనీల షేర్లు పెరగడానికి కారణమయ్యింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్, గోల్డెన్ టుబాకో షేర్లు 3–20 శాతం రేంజ్‌లో పెరిగాయి. గత రెండు సెషన్లలో 34 శాతం నష్టపోయిన దివీస్ ల్యాబ్స్ షేర్ కోలుకుంది. 3 శాతం లాభంతో రూ.789 వద్ద ముగిసింది. బాష్, టాటా స్టీల్, అరబిందో ఫార్మా, టాటా మోటార్స్ డీవీఆర్, లుపిన్, హిందాల్కో, షేర్లు 2.5–3.5 శాతం రేంజ్‌లో పెరిగాయి. బీఎస్‌ఈలో 1,708 షేర్లు లాభాల్లో, 860 షేర్లు నష్టాల్లో ముగిశాయి.