దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను విధించం.. | No move to impose long-term capital gains tax: Jaitley | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను విధించం..

Published Mon, Dec 26 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను విధించం..

దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను విధించం..

ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశమేదీ లేదు...
ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..
ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వివరణ  


న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను(లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌) విధించే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. శనివారం సెబీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగింస్తూ క్యాపిటల్‌ మార్కెట్లపై చేసిన వ్యాఖ్యలతో స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర కలకలం చేలరేగిన సంగతి తెలిసిందే. దీంతో జైట్లీ దీనిపై వివరణ ఇచ్చారు. ప్రధాని ప్రసంగంపై మీడియాలో వచ్చిన వార్తలు సరికాదని.. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

‘ప్రధాని మాట్లాడిన అంశంపై మీడియాలోని కొన్ని వర్గాలు పరోక్షంగా షేర్ల లావాదేవీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును విధిస్తారంటూ ఊహాగానాలను తీసుకొచ్చారు. ఇది పూర్తిగా తప్పు. ప్రధాని ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో నేను కచ్చితమైన వివరణ ఇస్తున్నా.  ప్రధాని మాటల్లోకానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ ఈ పన్ను విధింపు ఉద్దేశాలేవీ లేవు. కాబట్టి అనవసరంగా ఇలాంటి ఊహాగానాలకు తావివ్వొద్దు’ అని జైట్లీ వివరించారు.

మోదీ ఏమన్నారు..
దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం మరిన్ని ఆర్థిక సంస్కరణలకు సిద్ధంగా ఉందని మోదీ సెబీ కార్యక్రమంలో స్పష్టం చేయడం తెలిసిందే. ఈ విషయంలో ఎంత కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ఇక క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి ఖజానాకు పన్నుల రూపంలో మరింత మొత్తం సమకూరాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘మార్కెట్ల నుంచి లాభాలను పొందుతున్నవారు దేశాభివృద్ధి కోసం పన్నుల రూపంలో సహకారం అందించాల్సిన అవసరం ఉంది. పారదర్శకమైన, సమర్థమైన రీతిలో పన్నుల పెంపుపై దృష్టిపెడతాం. ఇప్పుడున్న పన్నుల చట్టాలు, అక్రమ కార్యకలాపాల కారణంగా ఫైనాన్షియల్‌ మార్కెట్ల నుంచి ఖజానాకు చాలా తక్కువ పన్నుల ఆదాయం లభిస్తోంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. మరో నెల రోజుల్లో కేంద్రం ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. కేంద్రం స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి ప్రధానంగా దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును విధించే అవకాశం ఉందంటూ పరిశీలకులు ఊహగానాలకు తెరతీశారు.

ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో షేర్ల క్రయవిక్రయాలపై స్పల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగా ఉంది. అదే షేర్లను కొనుగోలు చేసిన ఏడాది తర్వాత విక్రయిస్తే.. దీనిపై ఎలాంటి పన్నూ లేదు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇక స్టాక్‌ మార్కెట్లో అన్ని లావాదేవీలపై సెక్యూటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(ఎస్‌టీటీ) 0.017%–0.125% మేర విధిస్తున్నారు.

డబ్బంతా బయటికొచ్చింది...
పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) తర్వాత బ్యాంకుల్లోకి కుప్పలుతెప్పలుగా డిపాజిట్లు వెల్లువెత్తడంపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ... ఇదివరకూ ఉన్నట్లుగా నగదుపై దాపరికం తొలగిపోయిందన్నారు. చలామణిలో ఉన్న సొమ్మంతా వ్యవస్థలోకి వచ్చిచేరుతోందని చెప్పారు. ఆదివారమిక్కడ నగదు రహిత లావాదేవీ(క్యాష్‌లెస్‌)లకు సంబంధించిన నిర్వహించిన డిజిధన్‌ మేళా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘డీమోనిటైజేషన్‌తో నగదు మొత్తం వ్యవస్థలోకి వచ్చింది. దీనివల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. గ్రామీణాభివృద్ధి, సామాజిక–సంక్షేమ కార్యక్రమాలకు నిధుల లభ్యత పెరుగుతుంది. అదేవిధంగా ఈ డబ్బంతా పన్నుల వ్యవస్థలో భాగంగా కూడా అవుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న చర్యతో నల్లధనాన్ని వ్యవస్థ నుంచి తొలగించేందుకు వీలవుతుంది. నకిలీ కరెన్సీ, ఉగ్రవాదులకు నిధులందించే కార్యకలాపాలకు కూడా అడ్డుకట్టపడుతుంది’ అని జైట్లీ పేర్కొన్నారు.

క్యాష్‌లెస్‌ అంటే తక్కువ నగదు వాడకం..
దేశ ప్రజల ప్రయోజనం కోసమే క్యాష్‌లెస్‌ ఆర్థిక వ్యవస్థపై దృష్టిసారించామని.. దీనివల్ల ఎకానమీ కూడా పూర్తిగా ప్రక్షాళన అవుతుందని జైట్లీ పేర్కొన్నారు. ‘సామాన్య ప్రజలు దీని ప్రయోజనాలను అర్థం చేసుకున్నారు. ప్రతిపక్షానికి మాత్రం చాలా సమయం పట్టేట్టుంది. ఇక క్యాష్‌లెస్‌ అంటే పూర్తిగా నగదు వాడకం లేకుండా చేయడం కాదు.. తక్కువ నగదును వినియోగించేలా చూడటమే’ అని వ్యాఖ్యానించారు. డీమోనిటైజేషన్‌ తర్వాత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ జోరందుకుందని.. 75 కోట్ల డెబిట్, క్రెడిట్‌ కార్డుల్లో 45 కోట్ల వరకూ చురుగ్గా వాడకంలోకి వచ్చాయని జైట్లీ చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థలో నగదు వాడకాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది.

ప్రస్తుతం బడ్జెట్‌ పరిమాణం రూ.20 లక్షల కోట్లు కాగా, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపేణా రూ.16 లక్షల కోట్లు మాత్రమే లభిస్తోంది. రూ. 4లక్షల కోట్ల మేర లోటు ఉంటోంది. పన్నుల రూపంలో ఆదాయం పెరిగితే ఈ లోటు దిగొస్తుంది. అదనపు నిధులను గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, దేశ రక్షణకు కేటాయించేందుకు వీలవుతుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రకటించిన లక్కీ గ్రాహక్‌ యోజన, డిజిధన్‌ వ్యాపార్‌ యోజన స్కీమ్‌లలో తొలిసారిగా లక్కీ డ్రా విజేతలను ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి స్కీమ్‌లను మరింతగా కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement