చందా కొచర్‌కు ఈడీ షాక్‌! | ED Raid On Chanda Kochhar And Videocon Chief Venugopal Dhoot Homes In Loan Case | Sakshi
Sakshi News home page

చందా కొచర్‌ ఇంట్లో ఈడీ సోదాలు

Published Fri, Mar 1 2019 12:21 PM | Last Updated on Fri, Mar 1 2019 12:26 PM

ED Raid On Chanda Kochhar And Videocon Chief Venugopal Dhoot Homes In Loan Case - Sakshi

న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచర్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించింది. వీడియోకాన్‌కు మంజూరు చేసిన రుణాల వివాదంలో ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్‌ కొచర్, వీడియోకాన్‌ గ్రూప్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌లపై సీబీఐ లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఈడీ.. చందా కొచర్‌తో పాటు వేణుగోపాల్‌ ధూత్‌ ఇంటిపై కూడా రైడ్‌ చేసింది.

కాగా వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ. 1,875 కోట్ల మేర ఆరు రుణాలు మంజూరు చేయడంలో.. అప్పటి సీఈఓ చందా కొచర్‌ కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్‌ గ్రూప్‌ ఎండీ ధూత్‌.. చందా భర్త దీపక్‌ కొచర్‌ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఇలా క్విడ్‌ ప్రో కో లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని అభియోగాలు ఉన్నాయి. తొలుత చందా కొచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ బోర్డు వెనకేసుకొచ్చినప్పటికీ, అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో జస్టిస్‌ బి.ఎన్‌. శ్రీకృష్ణ సారథ్యంలో స్వతంత్ర కమిటీ వేసింది. ఈ కమిటీ చందా కొచర్‌ని దోషిగా తేల్చింది.

అయితే అంతకు ముందే చందా కొచర్‌ తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణించడంతో పాటు అప్పటిదాకా ఇచ్చిన ఇంక్రిమెంట్లు, బోనస్‌లు మొదలైనవన్నీ వెనక్కి తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు, చందా కొచర్, దీపక్‌ కొచర్, ధూత్‌లపై సీబీఐ క్రిమినల్‌ కుట్ర, మోసం అభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాల్లో చాలా భాగం మొండిబాకీలుగా మారగా, ఐసీఐసీఐకి రూ. 1,730 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. అప్పట్లో రుణాలు మంజూరు చేసిన కమిటీలో సభ్యులైన పలువురు బ్యాంకింగ్‌ దిగ్గజాల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ ప్రస్తావించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement