చందా కొచర్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబయి : రూ వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్ ప్రజలను మోసగించారని బీజేపీ ఆగ్నేయ ఢిల్లీ ఎంపీ ఉదిత్ రాజ్ ఆరోపించారు. చందా కొచర్ దంపతులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. దీపక్ కొచర్ కు వ్యాపార అనుబంధం ఉన్న వీడియోకాన్ గ్రూప్‌కు రుణాల జారీలో అవినీతి, ప్రలోభాల పర్వం ఆరోపణలపై సీబీఐ ప్రస్తుతం ప్రాధమిక దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. కొచర్ కుటుంబానికి కేసులో కీలక సంబంధాలున్నాయనే కోణంలో చందా కొచర్ మరిది రాజీవ్ కొచర్ ను సీబీఐ రెండు రోజుల పాటు ప్రశ్నించింది.
రాజీవ్‌కు సంబంధించిన కంపెనీకి డీల్ దక్కేలా ఆమె వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. వేణుగోపాల్ ధూత్ నేతృత్వంలోని వీడియోకాన్ గ్రూప్‌కు రుణాల మంజూరులో అవినీతి జరిగిందని ఐసీఐసీఐ షేర్ హోల్డర్ అరవింద్ గుప్తా ఫిర్యాదుతో వెలుగుచూసిన ఈ కేసుపై సీబీఐ ప్రాధమిక దర్యాప్తు చేపట్టింది. అరవింద్ గుప్తా ఫిర్యాదును పరిశీలించిన మీదట చందా కొచర్ తన భర్త దీపక్, వీడియోకాన్ గ్రూప్‌తో నేరపూరిత కుట్రకు పాల్పడి వేల కోట్ల ప్రజాధనాన్ని రుణాల పేరుతో దారి మళ్లించారని స్పష్టంగా అవగతమవుతోందని బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment