‘విమర్శ’ సామాజిక బాధ్యతగా... | Kadiyala Rammohan Roy: Telugu Writer, Biography, Family, Tribute | Sakshi
Sakshi News home page

Kadiyala Rammohan Roy: ‘విమర్శ’ సామాజిక బాధ్యతగా...

Published Thu, Apr 7 2022 1:46 PM | Last Updated on Thu, Apr 7 2022 1:51 PM

Kadiyala Rammohan Roy: Telugu Writer, Biography, Family, Tribute - Sakshi

డా. కడియాల రామమోహన్‌ రాయ్‌

సాహిత్య విమర్శను తన సామాజిక బాధ్యతగా గుర్తెరిగి నిబద్ధతా నిజాయితీలతో వ్యవహరించిన డా. కడియాల రామమోహన్‌ రాయ్‌ గుంటూరులో ఏప్రిల్‌ 6న తుది శ్వాస విడిచారు. కొన్ని వందల సాహిత్యవ్యాసాలు, ఆరువందల పైచిలుకు గ్రంథ సమీక్షలు, శతాధిక రేడియో ప్రసంగాలు రామమోహన్‌ రాయ్‌ నిరంతర సాహిత్య కృషికి అద్దం పడతాయి. వీరు రాసిన ‘తెలుగు కవితా వికాసం’, ‘కృష్ణశాస్త్రి కవితా వైభవం’, ‘20వ శతాబ్ది తెలుగు కవిత్వం’, ‘గుంటూరి శేషేంద్ర శర్మ’, ‘ఉత్తరాంధ్ర నవలా వికాసం’, ‘కృష్ణశాస్త్రి కవితావైభవం’, ‘పదమూడు ఉత్తమ కథలు’, ‘శ్రీశ్రీ రచనల ప్రభావం’ వంటి గ్రంథాలు ఆంధ్ర పాఠకులు మరువలేరు. 1983లో వీరు సమర్పించిన ‘తెలుగు సాహిత్యంలో కృషీవల జీవనం’ అన్న గ్రంథానికి నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ పట్టాను ప్రసాదించింది. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ విమర్శ పురస్కారం పొందారు. 

ఆయన 1944 ఏప్రిల్‌ 11న గుంటూరు జిల్లా సిరిపురం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి కడియాల భద్రయ్య, తల్లి కమల. తండ్రి నాస్తికుడు, హేతువాది, సాహిత్యాభిలాషి కావడం వల్ల ఆయన ప్రభావం రామమోహన్‌ రాయ్‌పై పడింది. గుంటూరు హిందూ కళాశాలలో బీఏ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ(తెలుగు) చదివారు. గుంటూరు జేకేసీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా  పనిచేశారు. వీరికి తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) వారి ఉత్తమ విమర్శక పురస్కారం, 2017లో నవ్యాంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ వారి భాషా పురస్కారం, 2018లో అద్దేపల్లి రామమోహనరావు కవిత్వ విమర్శా పురస్కారం లభించాయి. (చదవండి: ప్రజాస్వామ్యమే అంబేడ్కర్‌ భావసారం)

రాయ్‌ రాసిన ‘మన తెలుగు నవలలు’ తెలుగు నవలా ప్రియులకు కరదీపికగా నిలుస్తుంది. ‘తెలుగు సాహిత్యంలో రైతు జీవితం’, ‘ఇరవయ్యవ శతాబ్ది తెలుగు సాహిత్య వికాసం’, ‘వెయ్యేళ్ల తెలుగు పద్య వికాసం – సమగ్ర పరిశోధన’, ‘మన తెలుగు నాటకాలు – నాటికలు’ వంటి గ్రంథాలు ఇంకా ప్రచురణకు నోచుకోలేదు. 78 సంవత్సరాల వయసులో కూడా ఉత్సాహంగా సాహిత్య సభల్లో పాల్గొని అనర్గళంగా ప్రసంగించేవారు. రామమోహన్‌ రాయ్‌ మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు. (చదవండి: ఎంవీఆర్‌..ఆయనే ఒక చరిత్ర)

– డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, నెల్లూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement