నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) 2013 అక్టోబర్ నెలలో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే నెపంతో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు, కవి, రచయిత ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను అరెస్ట్ చేసింది. ఆయన జైలుశిక్షకు ఎనిమిదేళ్ళు నిండాయి. బాంబే హైకోర్టు ఈ కుట్రకేసును కొట్టివేసినా, సుప్రీంకోర్టు ఆ తీర్పును సస్పెండ్ చేసింది. ఇవ్వాళ ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. సాయిబాబా ఈ కేసు నుండి బయట పడతారు, ఎనిమిదేళ్ళ సాయి జైలు జీవితం పరిసమాప్తి అవుతుందని ప్రజాస్వామిక వాదులు ఆశగా చూస్తున్నారు.
ఇవాళ్టి కోనసీమ జిల్లాలోని అమలాపురం పక్కన చిన్న గ్రామంలో జన్మించారు సాయిబాబా. కొబ్బరి చెట్ల ఆకుల ఆవాసంలో, కిరోసిన్ దీపం వెలుగులో చదువుకొని, తన జ్ఞానపరిధిని ఢిల్లీ వరకు విస్తరించుకున్నారు. ఆదివాసులపై జరుగుతున్న దాడినీ, మధ్య భారతంలోని వనరుల దోపి డీనీ, బహుళజాతి సంస్థలు నిర్వహిస్తున్న మైనింగ్ అక్రమ దోపిడీనీ, ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. 2013లో అరెస్టు అయిన నాటికే సాయిబాబా ప్రజల గొంతుగా ఉన్నాడు. వికలాంగుడైనా ఆయన దృఢచిత్తుడు. జైలు జీవితమంటే జ్ఞాపకాల మధ్య జీవించడమే. ఈ ఎనిమిదేళ్ళ నిర్బంధంలో సాయిబాబా కవిగా రూపొందిన క్రమం చాలా చిత్రమైనది. జైలు కవిగా ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’, ‘కబీరు కవితలు’, ‘ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనువాదం’... అనేవి ఆయన కవిగా వ్యక్తీకరించుకున్న రచనలు.
‘నేను చావును ధిక్కరిస్తున్నాను’ విరసం ప్రచురణగా వచ్చింది. దీని ఆంగ్ల పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ బుక్స్, న్యూఢిల్లీ వారు ప్రచురించారు. సుదీర్ఘ కాలం జైలు జీవితంలోని అనుభవాన్ని సాయి కవిత్వం ద్వారా వ్యక్తీకరించాడు. జైలు, జైలు అధికారులు, సిబ్బంది నాలుగు గోడల మధ్య ఒక స్వాప్నికుని నిర్బంధం. క్లాసులో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ జైలు వంటి తరగతి గదిలో తన వంటి ఖైదీలతో జీవితాన్ని పంచుకునే విధానం... తన సహచరి, తోబుట్టువులు, తను పాఠాలు చెప్పే పిల్లలు... ఇవన్నీ సాయిబాబా కవితా వస్తువులు. తన రాజకీయ విశ్వాసాల కారణంగా తను ఎంచుకున్న వస్తువు కవితాత్మకంగా మలిచిన తీరు, కవిత్వ పరిభాషలో పరిణతి. విప్లవం, ప్రేమ, దిగాలు పడిన రాత్రులు, నూతన ఉదయాలు, జైలు గది కిటికీపై వాలిన ఒంటరి పిచ్చుక. ఈ కవిత్వం నిర్బంధితుని ఒంటరి గానాలాపన!
సాయిబాబా విడుదల కావాలని ఢిల్లీలో విద్యార్థులు ప్రదర్శన చేస్తే ఏబీవీపీ ఆ విద్యార్థులపై దాడిచేసింది. ఆయన చేసిన నేరం మనుషులందరికీ ఒకే విలువ ఉండాలని ఘోషించడం.
– అరసవిల్లి కృష్ణ, విరసం అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment