poems
-
మనసుకు హత్తుకునేలా...
గొప్ప వాక్కును కొందరు మహాత్ములు పద్యరూపంలో చెప్పారు. మరి కొందరు గద్యరూపంలో చెప్పారు, ఇంకొందరు గీతం రూపంలో చెప్పారు. పోతన భాగవతాన్ని పద్య, గద్యరూపంలో చెప్పారు. ప్రధానంగా పద్య రూపంలో చెప్పారు. పద్యానికి ఉన్న లక్షణం –అది ఛందోబద్దం. నాలుగుసార్లు చదివితే అది నోటికొచ్చేస్తుంది. జ్ఞాపకంలో ఉండిపోతుంది. జీవితంలో ఏది ప్రధానంగా జ్ఞాపకం ఉంచుకోవాలో, అలా ఉంచుకుని సందర్భాన్నిబట్టి గుర్తు తెచ్చుకుని సానుకూలంగా ఆచరణలో పెట్టుకోగలిగిన వాటిని ఛందోబద్దంగా ఇస్తే అవి మనసుకు హత్తుకుని మనకు అవసరాన్నిబట్టి ప్రయోజనం కలిగిస్తాయి. కానీ అంత జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేని వాటిని గద్యరూపంలో(వచనంగా) అందించాడు పోతన, పద్యం, గద్యం కలిసి రాసినప్పుడు. తెలుగులో పద్యరూపంలో చెప్పినట్టుగానే, సంస్కృతంలో శ్లోకరూపంలో చెప్పారు. ఒక పద్యాన్ని చదవడంకన్నా, ఒక శ్లోకాన్ని చదవడంకన్నా, మేము వాక్యరూపంలో ఉన్న వచనాన్ని(గద్యాన్ని) చదువుకుని ప్రయోజనం పొందుతామని ఇష్టపడేవారికి గద్యంలో కూడా అందుబాటులో ఉంచారు. మరికొందరు చాలా తేలికగా అవతలివారికి బోధ చేయడానికి గీతం రూపంలో అందించారు. గీతం అంటే పాట. పాట మనసును రంజింప చేస్తుంది. సహజంగా పుట్టుకచేత క్రౌర్యం ఉన్నవి కూడా సంగీతం వినబడేటప్పటికి అవి వాటి క్రూరత్వాన్ని ఆ కాసేపు పక్కనబెట్టేస్తాయి. అలాగే గాఢమైన అజ్ఞానంతో ఏమీ తెలియనివారు కూడా సంగీతంతో కూడిన గీతం వినేటప్పటికి గొప్ప శాంతిని పొందుతారు. పశువులు కావచ్చు, పసిబిడ్డలు కావచ్చు .. పాటవినేటప్పటికి ఒక తన్మయావస్థకు లోనుకావడం జరుగుతుంది. ఏడుస్తున్న వాళ్ళు కూడా ఆ కాసేపు ఏడుపు ఆపేస్తారు. మనసు శాంతిని పొందుతుంది. సమాజ హితం కోసం పద్యరూపంలోగానీ, గద్య, గీత రూపాల్లో కానీ ఎవరు ఏమీ ఆశించకుండా వాక్కులుగా వెచ్చించారో వారు శాశ్వత్వాన్ని పొందారు. ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్/ సొమ్ములు? గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము? బాసి కాలుచే/ సమ్మెట పోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ/ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.’ అంటాడు పోతన. నేను సమాజహితాన్ని కోరి పలుకుతున్నాను తప్ప నేనేమీ ఆశించడంలేదన్నాడు.. అదే శాశ్వతమైనది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సింగపూర్‌లో మొట్టమొదటిసారిగా తెలుగు పద్యాల పోటీ
తెలుగు భాషా ప్రాధాన్యం తగ్గిపోతున్న ఈ రోజుల్లో దేశం కాని దేశంలో తెలుగుపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. సింగపూర్ తెలుగు తోరణము అనే పేరుతో ఓ రియాలిటీ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేమన, సుమతి శతకాల నీతి పద్యాల పోటీని నాలుగు వృత్తాలుగా, పది ఎపిసోడ్లుగా నిర్వహిస్తున్నారు. 20 మంది చిన్నారులు ఈ పోటీలో పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్దికి ఈ కార్యక్రమం ఒక ముందడుగులా ఉంటుందని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అనంతరం పోటీలో పాల్గొన్న చిన్నారులకు పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని అందజేశారు. కాగా మొదటి రౌండ్ పోటీకి రాంబాబు పాతూరి, గాడేపల్లి అపర్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంఘ సింగపూర్ తెలుగు టీవీ యేట్యూబ్ చానల్లో ప్రతి శనివారం ఒక భాగంగా మొత్తం 10 భాగాలుగా విడుదల అవుందని నిర్వాహకులు తెలిపారు. -
GN Saibaba Poems: ఒంటరి గానాలాపన
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) 2013 అక్టోబర్ నెలలో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే నెపంతో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు, కవి, రచయిత ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను అరెస్ట్ చేసింది. ఆయన జైలుశిక్షకు ఎనిమిదేళ్ళు నిండాయి. బాంబే హైకోర్టు ఈ కుట్రకేసును కొట్టివేసినా, సుప్రీంకోర్టు ఆ తీర్పును సస్పెండ్ చేసింది. ఇవ్వాళ ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. సాయిబాబా ఈ కేసు నుండి బయట పడతారు, ఎనిమిదేళ్ళ సాయి జైలు జీవితం పరిసమాప్తి అవుతుందని ప్రజాస్వామిక వాదులు ఆశగా చూస్తున్నారు. ఇవాళ్టి కోనసీమ జిల్లాలోని అమలాపురం పక్కన చిన్న గ్రామంలో జన్మించారు సాయిబాబా. కొబ్బరి చెట్ల ఆకుల ఆవాసంలో, కిరోసిన్ దీపం వెలుగులో చదువుకొని, తన జ్ఞానపరిధిని ఢిల్లీ వరకు విస్తరించుకున్నారు. ఆదివాసులపై జరుగుతున్న దాడినీ, మధ్య భారతంలోని వనరుల దోపి డీనీ, బహుళజాతి సంస్థలు నిర్వహిస్తున్న మైనింగ్ అక్రమ దోపిడీనీ, ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. 2013లో అరెస్టు అయిన నాటికే సాయిబాబా ప్రజల గొంతుగా ఉన్నాడు. వికలాంగుడైనా ఆయన దృఢచిత్తుడు. జైలు జీవితమంటే జ్ఞాపకాల మధ్య జీవించడమే. ఈ ఎనిమిదేళ్ళ నిర్బంధంలో సాయిబాబా కవిగా రూపొందిన క్రమం చాలా చిత్రమైనది. జైలు కవిగా ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’, ‘కబీరు కవితలు’, ‘ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనువాదం’... అనేవి ఆయన కవిగా వ్యక్తీకరించుకున్న రచనలు. ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’ విరసం ప్రచురణగా వచ్చింది. దీని ఆంగ్ల పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ బుక్స్, న్యూఢిల్లీ వారు ప్రచురించారు. సుదీర్ఘ కాలం జైలు జీవితంలోని అనుభవాన్ని సాయి కవిత్వం ద్వారా వ్యక్తీకరించాడు. జైలు, జైలు అధికారులు, సిబ్బంది నాలుగు గోడల మధ్య ఒక స్వాప్నికుని నిర్బంధం. క్లాసులో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ జైలు వంటి తరగతి గదిలో తన వంటి ఖైదీలతో జీవితాన్ని పంచుకునే విధానం... తన సహచరి, తోబుట్టువులు, తను పాఠాలు చెప్పే పిల్లలు... ఇవన్నీ సాయిబాబా కవితా వస్తువులు. తన రాజకీయ విశ్వాసాల కారణంగా తను ఎంచుకున్న వస్తువు కవితాత్మకంగా మలిచిన తీరు, కవిత్వ పరిభాషలో పరిణతి. విప్లవం, ప్రేమ, దిగాలు పడిన రాత్రులు, నూతన ఉదయాలు, జైలు గది కిటికీపై వాలిన ఒంటరి పిచ్చుక. ఈ కవిత్వం నిర్బంధితుని ఒంటరి గానాలాపన! సాయిబాబా విడుదల కావాలని ఢిల్లీలో విద్యార్థులు ప్రదర్శన చేస్తే ఏబీవీపీ ఆ విద్యార్థులపై దాడిచేసింది. ఆయన చేసిన నేరం మనుషులందరికీ ఒకే విలువ ఉండాలని ఘోషించడం. – అరసవిల్లి కృష్ణ, విరసం అధ్యక్షులు -
వినయమే బలం.. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని విర్రవీగితే ఇక అంతే!
ఒకడు బాగా రాస్తాడు, ఒకడికి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. ఒకడు బాగా పాడతాడు, ఒకడు బాగా అలంకారం చేస్తాడు, ఒకడు బాగా మాట్లాడతాడు...ఏది ఉన్నా అది భగవంతుడు వాడికి ఇచ్చిన విభూతి. ‘‘యద్యత్ విభూతిరాతిమత్ సత్వం శ్రీమదూర్జిత మేవనా/తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్’’ అంటాడు గీతాచార్యుడు. ఎక్కడెక్కడ ఏ ఉత్కృష్టమయిన ప్రాణి ఉన్నా అది పరమేశ్వరుడి విభూతి. ‘అది ఈశ్వరుడు నాకు అనుగ్రహించిన మహత్తరమైన శక్తి’ అని ఎవరయితే నమస్కారం పెట్టి వినయంతో బతుకుతుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. ఇదంతా నా మహిమే.. నాతో సాటిరాగల వాడు లేడు.. అని విర్రవీగుతాడో వాడు ఎప్పటికీ ముందుకు పోలేడు. పాడయి పోతాడు. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని ఎవర్నయినా తూలనాడుతూ తక్కువచేసి ప్రవర్తిస్తే... అవతలి వాడు సాధనచేసి ఏదో ఒకరోజు నిన్ను దాటిపోతాడు. నిజంగా అవతలివాడు నీకన్నా తక్కువ అనిపించినప్పుడు సానుభూతితో, ప్రేమతో పెద్ద మనసు చేసుకొని వాడిని వృద్ధిలోకి తీసుకురావడానికి నీ వంతు ప్రయత్నం నీవు చేయడం ధర్మం అవుతుంది. అది లేనప్పుడు... ‘‘కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతింబొందరే?/వారేరీ సిరిమూటగట్టుకుని పోవంజాలరే? భూమిపై/ బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై/యీరే కోర్కులు? వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!’’ ఈ పద్యం మనందరికీ తెలిసిందే. అంటే పొగరుబోతు తనంతో నీవు బావుకునేదేమీ ఉండదు. వినయంతో ప్రవర్తించిన వాళ్ళను చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. సంస్కృత భాగవతాన్ని అద్భుతంగా ఆంధ్రీకరించిన పోతనామాత్యుడు ఎక్కడా ఆ ప్రతిభ తనదికానే కాదన్నాడు. ‘‘పలికెడిది భాగవతమట/పలికించు విభుండు రామభద్రుండట /నేపలికిన భవహరమగునట/పలికెద; వేరొండు గాథ పలుకగనేలా!’’ అన్నాడు. నేను కానే కాదు, ఆ రామచంద్రమూర్తి నా వెనుక ఉండి నాచేత దానిని ఆంధ్రీకరింప చేస్తున్నాడు. ఆయన నాతో ఏది చేయిస్తున్నాడో అదే చేస్తాను తప్ప మరొకటి చేసే శక్తి నాకు లేదు... అని నిలబడినందుకు తరతరాలుగా ప్రజలు ఆ మహాకవిని గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు. హనుమ కూడా... ‘లంకకు వెళ్లిరాగల శక్తి నాకు పుష్కలంగా ఉంది’ అన్లేదు. రామచంద్ర మూర్తి బంగారు కోదండాన్ని పట్టుకొని అక్షయ బాణ తూణీరం లోంచి ఒక బాణాన్ని తీసి వింటినారిని సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెట్టినప్పుడు రాముడి శక్తి బాణంలోకి వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో ఆయన అనుగ్రహంతో ఆయన శక్తి నాలో ప్రవేశించినందువల్ల లంకాపట్టణానికి వెళ్ళగలుగుతున్నాను తప్ప నాకుగా ఆ శక్తి లేదు’ అని సవినయంగా చెప్పుకొన్న కారణంతో సదా రాముడి కనుసన్నలలో మెలిగే అదృష్టాన్ని పొందాడు హనుమ. అందుకే ఈరోజున రాముడి గుడి లేని ఊరు లేనట్టే, హనుమంతుడి విగ్రహం లేని వీథి లేదు. వినయం అంటే అదీ. బలవంతుడనాకేమని ...అని చెప్పిన బద్దెన గారే సుమతీ శతకంలో మరో చోట ఇలా అంటారు. ‘‘అధరము గదిలియు గదలక / మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడై/ అధికార రోగపూరిత బధిరాంధక శవము జూడబాపము సుమతీ’’... అధికారంతో విర్రవీగుతూ ఎవరితో మాట్లాడనివాడు అధికారం అన్నరోగం సోకి శవంగా మారినవాడు...అని ఘాటుగా విమర్శించారు. ఇష్టమైన ఆహార పదార్థాలను ఆస్వాదిస్తూ తిన్నట్లుగా తెలుగులో ఉన్న మంచి పద్యాలను కూడా జ్ఞాపకం పెట్టుకొంటే జీవితంలో అక్కరకు వస్తాయి. (సుమతీ శతక నీతి పద్యాలు ఇంతటితో సమాప్తం) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
విదేశాల్లో తెలుగు వెలుగులు, చిన్నారుల నోట భాగవత ఆణిముత్యాలు
భాగవతం ఆణిముత్యాలు. ఆర్గ్ వారి "రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీ - 2021" సింగపూర్ కార్యక్రమం ఆన్ లైన్ వేదికగా జరిగింది. చిన్నదేశమైన సింగపూర్ నుంచే 15 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోతన భాగవతంలోని పద్యాలను నేర్చుకొని పాడి వినిపించడంతో పాటు చక్కగా వర్ణించడం పండితుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ భాగవత పద్యపఠన పోటీలలో భాగంగా సింగపూర్ తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఈ వారాంతంలో తొలిదశ పోటీ కార్యక్రమాన్ని సింగపూర్ లోని ప్రధాన సంస్థలైన "కాకతీయ సాంస్కృతిక పరివారం" "తెలుగు భాగవత ప్రచార సమితి" "శ్రీ సాంస్కృతిక కళాసారథి" మరియు "సింగపూర్ తెలుగు సమాజం" కలిసి అంతర్జాల వేదికపై చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా అమెరికా నుండి "భాగవత ఆణిముత్యాలు" సంస్థ అధ్యక్షులు శ్రీ మల్లిక్ పుచ్చా, మరియు నిర్వాహకులు సాయి రాచకొండ, ప్రముఖ గాయకులు నేమాని పార్థసారథి విచ్చేసి చిన్నారులకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలైన లంక దుర్గాప్రసాద్ , పాతూరి రాంబాబు,దొర్నాల రాధాకృష్ణ శర్మలు చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు శ్రీ ఊలపల్లి భాస్కర్ మాట్లాడుతూ భాగవతం వంటి ఆధ్యాత్మిక నిధిని మన భావి తరాలకు అందజేయడం ఎంతో అవసరమని, అందుకు IBAM వంటి సంస్థలు ఇటువంటి పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలలో ముఖ్యంగా భాగవతంపై ఆసక్తి పెరిగేందుకు తోడ్పడుతుందని, ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో సింగపూర్ నుండి తమ చిన్నారులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని" హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేక బహుమతిగా శ్రీ నేమాని పార్థసారథి గారిచే నెల రోజుల పాటు భాగవత పద్యాల శిక్షణ ఇవ్వబడుతుంది. అలాగే కార్యక్రమంనుండి ఎంపిక చేయబడిన చిన్నారులు సెప్టెంబరులో జరుగనున్న రెండవ దశ పోటీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు జ్యోతీశ్వర రెడ్డి, కాకతీయ సాంస్కృతిక పరివారం ఉపాధ్యక్షుడు సుబ్బు పాలకుర్తి , సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ తదితరులు పాల్గొని చిన్నారులకు చక్కటి ప్రోత్సాహాన్ని, అభినందనలని అందజేశారు. ఈ కార్యక్రమానికి నమోదు చేసుకున్న పిల్లలకి రాధ పింగళి గత ఆరు వారాలుగా తర్ఫీదునిచ్చి పోటీకి వన్నె తెచ్చారు. రామాంజనేయులు చామిరాజ్ వ్యాఖ్యాతగా, సమన్వయకర్తగా చేసారు. గణేశ్న రాధా కృష్ణ సాంకేతిక సమన్వయం అందించగా చివుకుల సురేష్ , జాహ్నవి వేమూరి, రాధికా మంగిపూడి తదితరులు సాంకేతిక సహకారం అందించారు. -
నీతో యుద్ధం చెయ్యలేను
పద్యం 8 నీతో యుద్ధము చేయనోప, గవితానిర్మాణశక్తి న్నినున్ –– బ్రీతుం చేయగలేను, నీకొరకు తండ్రిం చంపగా జాల నా –– చేతన్ రోకటి నిన్ను మొత్త వెఱతున్ చీకాకు నాభక్తియే –– రీతి న్నాకిక నిన్ను జూడగ నగున్ శ్రీ కాళహస్తీశ్వరా ! భావం శ్రీ కాళహస్తీశ్వరా! నీతో యుద్ధం చెయ్యలేను.మంచి కవిత్వంతో నిన్ను మెప్పించలేను. నీ కోసం తండ్రిని చంపలేను.రోకలితో నిన్ను కొట్టడానికి నాకు భయం. నీపై నాకున్న భక్తి నన్ను చికాకు పెడుతోంది. మరి ఎలా నిన్ను దర్శించగలను ? పద్యం 9 ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం –– బేలా నామెడ గట్టినాడవిక నిన్నే వేళ జింతింతు, ని ––– ర్మూలంబైన మనంబులోనెగడు దుర్మోహాబ్ధిలో గ్రుంకి యీ –– శీలామాలపు జింతనెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా ! భావం శ్రీ కాళహస్తీశ్వరా ! భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, ధనము, అనే ఈ బంధాలను నా మెడకు ఎందుకు కట్టావు? ఇక నిన్ను ఏ సమయంలో ధ్యానించేది ? నిన్ను స్మరించడం మాని, ఈ మోహసముద్రం లోమునిగిన నా భరించరాని దుఃఖాన్ని ఎలా తొలగిస్తావు? -తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం -
నేను నీ మాట వినడం మానేశానా?
పద్యం 6 స్వామిద్రోహము చేసి, వేరొకని గొల్వంబోతినో, కాక నే –– ––నీమాట న్విన నొల్లకుండితినొ నిన్నే దిక్కుగా జూడనో! ––– ఏమీ యిట్టి వధాపరాధినగు నన్నున్ దుఃఖవారాశి వీ –– చీ మధ్యంబున ముంచియుంప ––దగునా శ్రీ కాళహస్తీశ్వరా ! భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా యజమానివైన నిన్ను, నేను ద్రోహం చేసి, మరొకరిని సేవించడానికి పోయానా? నేను నీ మాట వినడం మానేశానా? నువ్వే దిక్కని నేను భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను నీవు దుఃఖసముద్రపు కెరటాల మధ్య ముంచివేయడం భావ్యమా? పద్యం 7 దివిజక్ష్మారుహ ధేను రత్నఘన –భూతిన్ ప్రస్ఫురద్రత్న సా –– –నువు నీ విల్లు నిధీశ్వరుండు సఖు డర్ణోరాశి కన్యావిభుం –– ––డు విశేషార్చకు డింక నీకెన ఘనుండున్ గల్గునే నీవు చూ– చి విచారింపవు లేమి నెవ్వ –డుడుపున్ శ్రీకాళహస్తీశ్వరా ! భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కల్పవృక్షం, కామధేనువు, అను గొప్పసంపదలతో అలరే మేరుపర్వతం నీ విల్లు. సంపదలకు అధిపతియైన కుబేరుడు నీ మిత్రుడు. సముద్రునికి అల్లుడైన శ్రీ విష్ణువు నీకు విశేషార్చకుడు. నీకు సాటి ఎవరు? పరమేశ్వరుడవైన నీవు దయతలచకుంటే మా పేదరికాన్ని ఎవరు తొలగిస్తారు ? తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం -
ఇంగ్లిష్‌లో ‘శతక సానెట్స్’
చేర్యాల(సిద్దిపేట): వివిధ సంస్థలు గత మే నెల 2వ తేదీ నుంచి నేటి వరకు నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ ఇంగ్లిష్ పద్యాల పోటీల్లో మండల పరిధిలోని గుర్జకుంట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రేణుకుంట్ల మురళి శతక సానెట్స్ పూర్తి చేసి 50కి పైగా అవార్డులు సాధించాడు. గురువారం మురళి విలేకరులతో మాట్లాడుతూ.. పీబీ పబ్లిషర్స్ కమ్యూనిటీ, అన్టచ్డ్ ఎమోషన్స్, వ్రైటర్స్ యునైట్, నాజ్మేహయత్ సంస్థలు ఆన్లైన్లో నిర్వహించిన ఇంగ్లిష్ పద్యాల పోటీల్లో పాల్గొని కన్స్టాలేషన్, మదర్ గాడ్డెస్, స్మైల్ చైల్డ్‌హుడ్ మెమొరీస్, గస్టీ విండ్స్, విల్టెడ్ రేయిన్బో మొదలైన అంశాలపై 100కు పైగా పద్యాలు రాసినట్లు చెప్పారు. అందుకుగాను 50కి పైగా అవార్డులను ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుచుకున్నట్లు తెలిపారు. తాను రాసిన పద్యాలలో కొన్నింటిని ఇన్సెంటివ్, ఇన్పినిటీ, బియాండ్, ఎంబర్, అరోరా, డియర్డాడ్, ఫోర్జెన్ ఫోలెన్, ఇంక్ పాబ్లెస్ లాంటి 20 ఆంథోళజీ పుస్తకాల్లో ముద్రించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్పోకెన్ ఇంగ్లిష్, గ్రామర్ పుస్తకం రచించానని, ప్రచురణ జరుగుతుందన్నాడు. తాను రచించిన పుస్తకాలు అమేజాన్, అమేజాన్ కిండ్లే, నేషన్ ప్రెస్, పిబి పబ్లిషర్స్ వంటి ప్రముఖ పుస్తక విక్రయశాలల్లో లభిస్తాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన మురళిని కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు అభినందించారు. -
నేను బొమ్మ గీస్తే..!
‘‘సినిమాలో పాత్ర పండటం కోసం ఏదేదో చేస్తాం. ఫైట్ చేస్తాం, వంట చేస్తాం, గయ్యాళిలా ప్రవర్తిస్తాం.. ఇలా పాత్రకు తగ్గట్టు చేస్తాం. అవన్నీ రియల్ లైఫ్‌లో చేయం. అసలు సినిమాల్లో కనిపించే మేం వేరు.. రియల్ లైఫ్‌లో మేం వేరు’’ అంటున్నారు తమన్నా. ఎందుకు ఇలా అంటున్నారంటే.. ఆ మధ్య విడుదలైన ‘అభినేత్రి 2’లో ఈ మిల్కీ బ్యూటీ పెయింటర్ పాత్ర చేశారు. మరి.. నిజజీవితంలో మీకు బొమ్మలు గీయడం వచ్చా? అని అడిగితే – ‘‘నేనా? బొమ్మలు గీయడమా? రానే రాదు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నాను (నవ్వుతూ). నాకెవరైనా ఖాళీ కాగితం ఇచ్చి, బొమ్మలు గీయమంటే.. ఓ సర్కిల్ (వలయం) గీసి, దానికి రెండు కాళ్లు, రెండు చేతులు గీయగలను. అవేముంది? జస్ట్ గీతలే కదా. నా బొమ్మలో ఆ గీతలే కాళ్లూ చేతులు. ఆ బొమ్మ బొమ్మలా ఉండదు. అయితే నాకు కవితలు రాయడం బాగా వచ్చు. షూటింగ్ లేనప్పుడు కవితలు రాస్తుంటాను’’ అని చెప్పారు. చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో తమన్నా ఓ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది నెగటివ్ రోల్ అనే వార్త ప్రచారంలో ఉంది. అయితే అది నిజం కాదని సమాచారం. -
చిన్నారి కాదు.. చిచ్చర పిడుగు
చేర్యాల(సిద్దిపేట) : ఆరున్నరేళ్ల వయసులోనే వంద పద్యాలను చూడకుండా పాడిన బాల కవయిత్రి శ్రేష్ట ప్రవస్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. మంగళవారం రాత్రి సిద్దిపేట జిల్లా, చేర్యాలలోని గాయత్రి హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రేష్ట ఈ ఘనత సాధించింది. చేర్యాలకు చెందిన శివగారి కిరణ్, రజని దంపతుల కుమార్తె శ్రేష్ట ప్రవస్థి 18 నిమిషాల్లో వేమన శతకంలోని 100 పద్యాలను చూడకుండా పాడి రికార్డు సాధించింది. కాగా, శ్రేష్ట ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలుగు మహాసభల్లో నిర్వహించిన బాలకవి సమ్మేళనంలో పాల్గొని 52 పద్యాలు పాడి అందరి మన్ననలు పొందింది. త్వరలోనే వంద పద్యాలు పాడి రికార్డు సాధిస్తానని చెప్పింది. అన్నట్టుగానే వేమన శతకాన్ని 18 నిమిషాల్లో చూడకుండా చదివి వినిపించి రికార్డు సృష్టించింది. -
వేమన శతకం వేనోళ్ల వర్థిల్లు
సందేశం వేమన తన శతకం ద్వారా ఈ లోకంలో మనుషుల తీరు తెన్నులను సులువైన భాషలో, సామాన్యులకు అర్ధమయ్యేటట్లు వివరించాడు. ప్రతి పద్యంలో మన జీవితాల్లో దాగున్న సత్యాలు కనిపిస్తాయి. ఆ యోగి చెప్పిన బాటలో నడిస్తే జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ప్రయాణించి, అనుకున్న పనులు సులువుగా సాధించి, సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. దైనందిన జీవితంలో మనం నడుచుకోవాల్సిన తీరు సులభంగా ఉండేలా చెప్పాడు వేమన. ‘‘అనగ అనగ రాగమతిశయిల్లుచునుండు...’’ ఏ పనైనా సాధన ద్వారా అలవడుతుంది, కేవలం ఒకసారి ప్రయత్నిస్తే లాభం ఉండదు,చేసే పనిపై శ్రద్ధాసక్తులు కనబరిస్తే అది తప్పకుండా సాధ్యపడుతుందని చెప్పిన వేమన పలుకులు అక్షర సత్యం. ‘‘ఆపదైనవేళనరసి బంధుల జూడు’’ బంధువులెవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం మన కర్తవ్యం, కానీ మనం చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశిస్తే అది బంధుత్వమే కాదు, స్వార్థం అవుతుందని బంధుత్వాన్ని నిర్వచించాడు వేమన. ‘‘చిక్కియున్నవేళ సింహంబునైనను’’ మనం అశక్తులమైనప్పుడు సహనం వహించడం మంచిది, లేకుంటే ప్రతివారికి చులకనవుతాం, అంటూ ఆవేశం అన్నివేళలా అనర్థదాయకమని మృదువుగా చెబుతాడు శతక కర్త. ‘‘తప్పులెన్నువారు తండోపతండంబు’’ ఇతరుల మీద అనవసరమైన నిందలు మోపుతుంటారు కొందరు, అదే తప్పు వారు చేస్తే మాత్రం కిమ్మనరు. మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం అవి మనం కనీసం గుర్తించము, కాని ఇతరుల తప్పులను మాత్రం వెంటనే వేలెత్తి చూపుతాం. ఆత్మస్తుతి, పరనింద చేసే వారు ఆత్మవిమర్శ చేసుకునేలా హితవు పలికాడు వేమన. ‘‘పట్టుబట్టరాదు పట్టివిడువరాదు’’ ఏ పనైనా ప్రారంభించి మధ్యలోనే వదిలేస్తుంటారు, అది మనతో సాధ్యపడదని తలచి ఆపనిని విరమించుకుంటారు కొందరు, కాని పట్టుదలతో ఏ పనైనా మనం సాధించవచ్చని వేమన ఆనాడే మానవాళికి మంచి చెప్పాడు. ‘‘ఇనుము విరిగినేని యినుమారు ముమ్మారు’’ పరుషంగా మాట్లాడి పరులను బాధపెట్టేవారు, క్షణికావేశంతో ఆ మాటలను అనవచ్చు, కాని ఆ మాట పడ్డవారు అప్పటితో మరచిపోలేరు, అది వారిని చాలా కాలం బాధిస్తుంటుంది అంటూ వైవిధ్యమైన పద్యాలను మనకు అందించాడు యోగి వేమన. ఒక్కో పద్యానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అన్వయించగల పద్యాలు వేమన సొంతం. ఆయన పద్యాల్లోని సారం అనిర్వచనీయం. ముఖ్యంగా ఆధునిక సమాజంలోని అవకతవకలను తన నీతి వాక్యాల ద్వారా నవసమాజానికి అందించాడు వేమన. ఆయన పద్యాల్లో కొన్నింటినైనా నేర్చుకుంటే, అది మన వికాసానికి తోడ్పడుతుంది. పెద్దలు చిన్నారులకు రోజుకొక పద్యం చొప్పున నేర్పిస్తే మంచి ఫలితముంటుందనడంలో సందేహం లేదు. -
తెలుగు మాధుర్యాన్ని భావితరాలకు పంచుదాం
కర్నూలు(వైఎస్ఆర్ సర్కిల్): సమాజంపై నవీన నాగిగరికత ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో తెలుగు భాష మాధుర్యాన్ని భావితరాలకు పంచేందుకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా తెలుగు పండితులు కృషి చేయాలని కర్నూలు జిల్లా తెలుగురచయితల సంఘం అధ్యక్షులు గన్నమరాజు సాయిబాబా పిలుపునిచ్చారు. స్థానిక మద్దూర్ నగర్‌లోని తెలుగుతోటలో ఆదివారం ‘తెలుగు పద్యము-వ్యక్తిత్వ వికాసము’ అన్న అంశంపై ఏర్పాటు చే సిన సాహిత్య సదస్సులో సాయిబాబా మాట్లాడారు. సాహిత్య సౌరభాల గుభాళింపులే సమాజ చైతన్యానికి ప్రామాణికమన్నారు. విశాలము, విస్తార భావాలను సంక్షిప్తంగా రసవత్తరంగా పదకూర్పుతో పద్యాలల్లి సమాజానికి దిశానిర్దేశము చేయగల సత్తా ఒక కవికి మాత్రమే ఉందన్నారు. వేమనశతకం, కృష్ణశతకాల్లో అలతి అలతి పదాలతో మహోన్నత వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే నీతి బోధనలెన్నో ఉన్నాయన్నారు. బాల్యం నుంచి ఇలాంటి పద్యకవితలపై అవగాహన కల్పిస్తే భావితరాలు కూడా తెలుగుభాషలోని తీయదనాన్ని రుచి చూస్తారనీ, తద్వారా మాతృభాష ఔన్నత్యాన్ని చాటిచెప్పిన వారమవుతామన్నారు. అనంతరం డోన్‌కు చెందిన తెలుగు పండితుడు సురేష్ దంపతులను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, జేఎస్ఆర్కే శర్మ, వీపూరి వెంకటేశ్వర్లు, పురోహితులు శ్రీనివాసులు, రఘుబాబు, కెంగేరి మోహన్, సూర్యచంద్రారెడ్డి, రఘునాథ్, హరినాథ్, శ్రీధర్‌మూర్తి, దేవేంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
శతక పద్యాలను కంఠస్తం చేయాలి
తెలుగు భాష అమృతం లాంటిది. ప్రతి తెలుగువాడు శతక పద్యాలను కంఠస్తం చేయాలి. తోటి తెలుగువారితో తెలుగులోనే మాట్లాడాలి. ఆంగ్లంలో సంపాదిద్దాం.. ఆంధ్రభాషలో సంభాషిద్దామని ప్రతిజ్ఞ పూనాలి. జై తెలుగుతల్లి. సోమంచి శ్రీనివాసశాస్త్రి, తెలుగు పండితుడు, పాలకొల్లు -
11న పౌరాణిక పద్య పోటీలు
చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత డాక్టర్ వి.ఆర్.రాసాని రూపొందించిన ప్రసిద్ధ తెలుగు నాటక పద్యాలు పుస్తకాన్ని ఈనెల 11న తెనాలిలో ఆవిష్కరించనున్నట్లు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు షేక్ జానీబాషా, ఎం.సత్యనారాయణశెట్టి చెప్పారు. తెనాలిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అదేరోజు ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రస్థాయి పౌరాణిక పద్య పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పౌరాణిక నటుడు ఉప్పాల నాంచారయ్యను సత్కరిస్తామని చెప్పారు. -
కవిత - 2014 కోన్ని పద్యాలు వెలిగాయి
తెలుగు కవి ఏమరుపాటుగానే ఉన్నాడు. స్పందించవలసిన సమయంలో స్పందిస్తూనే ఉన్నాడు. ఉద్యమప్పుడు చెలరేగి, ఉద్యమం ముగిశాక కాపలాదారుగా మారి, బయట దారుల్లో తోడు నిలిచి, లోపలి సంఘర్షణలకు దారి కనుక్కొని తెలుగు కవి ఎప్పటిలాగే నిత్య యవ్వనంతో ఉన్నాడు. సీతాకోకచిలుకల్లా ఎగిరిన పద్యాలు, దీపాల్లా వెలిగిన పద్యాలు, కొన్ని సంపుటాలు, అశ్రువులతో కలసి ఉప్పగా మారిన కొన్ని కవితా పాదాలు, ఇక సెలవంటు వీడ్కోలు తీసుకున్న ఆత్మీయకలాలు... వెరసి 2014లో వచ్చిన కవిత్వంపై ఒక విహంగ వీక్షణం ఇది. ఇక్కడ ప్రస్తావించినవి కొన్నే.... ప్రస్తావించదగినవి మరెన్నో.... బహుశా గడచిన రెండు మూడు సంవత్సరాలతో పోల్చి చూసినపుడు తెలుగుభాషలో కవిత్వం అత్యధికంగా వెలుగు చూసిన సంవత్సరం 2014. ఒకవైపు దిన, వారపత్రికలలో, బులెటిన్లలో... మరొకవైపు అంతర్జాల వేదికలపైనా ఎక్కడ చూసినా విరివిగా కవిత్వం. వీటికి తోడు వెలుగు చూసిన అనేక కవితా సంపుటులు, సంకలనాలు! కవిత్వం కళకళలాడిన సంవత్సరం ఇది. ఇంతకీ 2014 నిండా పరుచుకున్న కవిత్వం ఏమిటి? చాలా ఉంది. 2013లో- అంతకుముందూ- తెలంగాణ కవి ఉద్యమ కవిత్వంలో మునిగిపోయాడు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత అతడు సహజంగానే సంబరపడ్డాడు. పన్నెండు వందల ప్రాణాలు ధార వోయంగ దుక్క సముద్రమైన తెలంగానం అమరులకు జోహార్ అనుకుంట రానే వొచ్చింది (అన్నవరం దేవేందర్) అని సంబురపడుతున్నాడు. మరొక వైపు ఈ ఉద్యమాలు మిగిల్చిన గోడును కూడా గుర్తు చేసుకుంటున్నాడు రజాకార్లకు తాత బలైపాయే నక్సలైట్లకు నాయిన బాయె ఉద్దెమంల కొడుకులు ఊడ్సుక పోయే మా బతుకులు కొమ్మాల జాతర్ల ప్రభలాయే... (బండారి రాజ్‌కుమార్) అంతేకాదు, ఉద్యమం ఉధృతంగా సాగిన రోజులలో కనీసం అటువైపు తొంగి కూడా చూడక ఇవాళ తెలంగాణ రాగానే పదవుల కోసం ప్రభువుల ప్రాపకం కోసం వెంపర్లాడుతున్న వాళ్ళని పిల్లితో పోల్చి పరిహసిస్తున్నాడు. ‘ఇవ్వాళ్ల అందరికన్నా ముందు నేనంటే నేనని నిలబడింది’.... (జూకంటి జగన్నాథం) మరొక అడుగు ముందుకువేసి తెలంగాణవచ్చాక కూడా ఆగని రైతుల ఆత్మహత్యలను చూసి- తెలంగాణకు లోహాల తళతళలు అక్కర్లేదు ఇది మట్టి తెలంగాణ ఇక్కడ మట్టి బతికితే చాలు (దర్భశయనం శ్రీనివాసాచార్య) అని ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇదే సమయంలో అటు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం అక్కడి గ్రామాలు ధ్వంసమైపోవడాన్ని చూసి ఒక నిర్మాణం కోసం సామూహిక జీవన సూత్రం ధ్వంసం కావడం వ్యవస్థీకృత విషాదం (ఏమ్వీ రామిరెడ్డి) అని బాధపడే సీమాంధ్ర కవి కనిపిస్తాడు. ఇంతకూ మనం ఎందుకు యుద్ధం చేస్తున్నామో నీకేమైనా జ్ఞాపకం వున్నదా? నా కోసం కాదు నీ కోసం కాదు మరెందు కోసం మట్టి కోసమా గోడల కోసమా? (హెచ్చార్కే) అని నిరసన తెలిపే తెలుగు కవి కూడా కనిపిస్తాడు. తెలంగాణ వస్తువు కేంద్రంగా వెలువడిన కవిత్వం ఇట్లా వుంటే చుండూరు సంఘటన పైన కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తెలుగు కవి అగ్రవర్ణాల కొమ్ము కాసే రాజ్యం ఆగడాలని నిలదీస్తూ అవునొరే ఇక్కడో కోర్టు వున్న జ్ఞాపకం ఇక్కడో ఐ.పి.సి అమ్మోరు వున్న జ్ఞాపకం (పైడి తెరేష్ బాబు) అని వెటకారం చేస్తూ కనిపిస్తాడు. ఈ కాలంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలను హుద్ హుద్ తుఫాను చుట్టుముట్టింది. అది సృష్టించిన విధ్వంసాన్ని చూసి కవి స్పందించకుండా ఉంటాడా? తానిప్పుడు కెరటాల విచ్చుకత్తులతో విరుచుకుపడ్డా సరే నీ మీద ప్రేమ చావదని ఒకసారి చెప్పిరావాలి (ప్రసాదమూర్తి) అని విశాఖలోని సముద్రం పైన తన ప్రేమని చెప్పుకున్నాడు కవి. అయితే, తుఫాను తదనంతర సాయాల గురించి ఎవరెన్ని గంభీరమైన మాటలు చెప్పినా అవి దళితుల దాకా చేరకపోవడాన్ని కవి గమనించాడు. గజం స్థలం మొన మీద అడుగు పెట్టనీయని ఔదార్యం గురించి ఏ గజపతులకు మొరపెట్టుకోవాలి (తుల్లిమల్లి విల్సన్ సుధాకర్) అని గోడు చెప్పుకొన్నాడు. ఒక్క తన నేలపైనే కాదు ఎప్పట్లాగే తెలుగు కవి పరాయి దేశాలలో పెల్లుబికిన విషాదాలను కూడా తన విషాదంగా పలికాడు. గాజాలో దయలేని సైన్యాలు పసిపిల్లల్ని సైతం హతమార్చిన సంఘటనల్ని నిరసిస్తూ వాడు అమ్మతో నాన్నతో అర్ధాంగితో కన్నబిడ్డతో ముచ్చటగా తీసుకున్న అపురూప ఛాయాచిత్రాన్నయినా చూపించండిరా (అరుణ్ సాగర్) అని వేడుకునే కవిత్వంతో మనం కరగకుండా ఉండగలమా? అంతేకాదు, ఎవరి పక్షం వహించాలో గ్రహించకుండా ఉండగలమా? ఆలీవ్ కొమ్మల్నే కాదు ఆయుధాల్ని సైతం పట్టుకోగల పాలస్తీనా మేము నిన్ను ప్రేమిస్తున్నాము (విమల) యుద్ధాలు ఎవరు చేసినా మొదట బలైపోయేది స్త్రీలు, పసిపిల్లలే! పాకిస్తాన్లో ఉగ్రవాదుల దాడులలో స్కూలులోని అమాయక పిల్లలు అసువులు బాయడం చూసిన తెలుగు కవి ‘తుపాకులు తుమ్మెదల మీద ఎక్కుపెట్టరాదు’ (ఎండ్లూరి సుధాకర్) అంటూ ప్రాధేయపడతాడు. ‘మీరు పొరపడ్డారు... శవపేటికలు మొత్తం 786 కాదు’ (అనంతు చింతపల్లి) అని పసిపిల్లల ప్రాణాలను బలిగొన్నవాళ్లకు చాలా తీవ్రంగా చురకలు వేశాడు. ఠి ఠి ఠి 2014 సంవత్సరంలో ‘అరుణతార’, ఇతరేతర పత్రికలలో వొచ్చిన విప్లవ కవిత్వం కొత్త నడకలతో, కొత్త ఇమేజరీలతో వెలువడిన సంగతిని స్పష్టం చేశాయి. ముఖ్యంగా మలయాళ భాషలో వొచ్చిన విప్లవ కవిత్వాన్ని తెలుగులో తీసుకురావడం వంటి ప్రయత్నాలు మరిన్ని జరగవలసిన అవసరాన్ని గుర్తు చేశాయి. మొత్తంగా 2014లోని కవిత్వాన్ని చూసినపుడు తెలుగు కవి కొన్ని సంఘటనలకు స్పందించి రాసిన కవిత్వం కన్నా తన గురించీ, తన సంబంధాల గురించీ, తన విషాదాల గురించీ, తన ఏకాకితనాల గురించీ అర్థం చేసుకునే క్రమంలో రాసిన కవిత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. మనుషులలో క్రమంగా పేరుకుపోతున్న ఈ ఒంటరితనాల గురించి- హరప్పా మొహెంజదారో శిథిలాల్లో నీ చిరునామా దొరికింది నాగరికతా పరిణామంలో ఒంటరితనమే నీకు మిగిలింది (ఎన్.గోపి) అని వాపోయే కవి కనిపిస్తాడు. అంతే కాదు ‘చెంపల మీది బిందువుల్లా రోజులు జారి పడిపోతున్న చప్పుడు’ (మామిడి హరికృష్ణ)ని చూసి గుండెలు బాదుకుంటాడు. కదిలీ కదలని దారొకటి కొండచిలువలా కాళ్ళకు చుట్టుకొని పడుకుంటే తాబేటి చిప్పలలో శరీరాల్ని దాచుకుని పయనిస్తున్నామనే అనుకుంటాము (నరేష్కుమార్) అని ఇంకోకవి మనిషి ప్రయాణంలోని భ్రమలని పటాపంచలు చేస్తాడు. ఇప్పుడు ఒక్కొక్క వాక్యమూ తడిని కోల్పోయే రాతి నాలుకతో పొడిబారిపోతోంది (కేక్యూట్వర్మ) అని ఒక కవి తనను తాను నిందించుకుంటే చీకటి నా మనసెరిగిన ఏకైక చెలికాడు... నా చిరకాల నేస్తం... నా జిగ్రీ దోస్త్ (స్కై బాబా) అనేంత దూరం ఈ నైరాశ్యం పేరుకుపోయింది. మనిషికీ మనిషికీ నడుమ కరువవుతున్న మాటలే మనిషి లోపలి ఈ విషాదానికీ, విధ్వంసానికీ కారణమా? ‘మాటలు లేకపోవడం బాధే...మాటలు వొద్దనుకోవడమే విషాదం’ (బండ్లమూడి స్వాతీకుమారి) అని కవి ఎందుకు అంటున్నాడు? ‘ప్రతి యిద్దరి నిస్తంత్రీ సంభాషణలో వీచే వడగాడ్పుకి చిన్నారి పొన్నారి పిచ్చుకలు కూడా అదృశ్యం’ (నామాడి శ్రీధర్) అనడం ఎంత పెను విషాదం! అందుకే కవి- తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరినొకరం (బి.వి.వి. ప్రసాద్) అని కోరుతున్నాడు. కాని అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలు మనుషుల్ని దాదాపుగా మట్టుపెట్టేశాయి. శబ్ద చలనాలే తప్ప కరచాలనాలూ ఆలింగనాలూ లేని చోట నువ్వెప్పుడూ ఏదో ఒక టవర్ చుట్టూ ప్రవహిస్తుంటావు (బండ్ల మాధవరావు) అనేది కనిపిస్తున్న సత్యం. బహుశా ఇట్లాంటి కాలంలోనే గతం వైపు చూడాలి. జీవితాన్ని గొప్ప ఆశతో, గొప్ప ధైర్యంతో గడిపిన మన అమ్మల వైపు చూడాలి - ఇప్పటికీ ఆ కన్నుల్లో నైరాశ్యపు జాడ లేదు (కె.శ్రీకాంత్) అన్న రహస్యం ఏదో తెలుసుకోవాలి. లౌకిక వేదనాంతరంగాల్ని విస్మృతిలోకి నెట్టుకోవడం (దాట్ల దేవదానంరాజు) సాధన చేయగలమేమో చూడాలి. లేక అమ్మలాంటి ప్రకృతిలో... అమ్మ ఫొటో లాంటి పడవల రేవు అమృత స్మృతిలో (శిఖామణి) లీనమై పోగలమేమో చూడాలి. లేదా ఒక ఆనందాన్ని సముద్రంలా కప్పుకున్నప్పుడు... అలల వలల్లో తుళ్లిపడే ఒంటరి చేపవు (పసునూరి శ్రీధర్ బాబు) ఐనా కావాలి! ఆకాశం చివరంచులదాకా వెళ్లి పైలంగా తిరిగొచ్చిన పతంగి పిల్లోడిచేతిలో మళ్లీ పుట్టి పరవశించినట్టు (రవి వీరెల్లి) పరవశించాలి! అందుకే 2014లో కవి చాలా జాగరూకతతో అన్నాడు- కవిత్వం రాయడమంటే కత్తితో సహజీవనం చేయడం మొద్దుబారడానికి వీల్లేదు మోడుగా మిగలడానికి వీల్లేదు (కె.శివారెడ్డి) 2014వ సంవత్సరంలో విరివిగా కవిత్వం వెలువడడమే కాదు - కవితా సంపుటులు కూడా విరివిగానే వెలువడ్డాయి. మరిక విశేషం ఏమిటంటే 2014లో యువకవుల కవితా సంపుటులతో పాటుగా లబ్ధప్రతిష్టులైన కవుల కవితా సంపుటులు కూడా వెలువడడం! సీనియర్ కవులైన వరవరరావు ‘బీజభూమి’, నిఖిలేశ్వర్ ‘కాలాన్ని అధిగమించి’ కవితా సంపుటులు ఈ సంవత్సరంలోనే వెలువడ్డాయి. ‘ప్రతి జననం భూగోళం మీది తొలి జననంతో సమానం కదా’ అని తన ‘యాబై ఏళ్ల వాన’ సంపుటితో కొప్పర్తి వొస్తే, యాకూబ్ ‘చాలా చోట్లకి వెళ్లలేకపోవడం నేరమే.. ముఖ్యంగా నదీ మూలం లాంటి యింటికి’ అని తన ‘నదీమూలం లాంటి ఇల్లు’ సంపుటిలో పలకరించాడు. చినవీరభద్రుడు ‘స్ఫురించవలసిన శబ్దం కోసం ఒక జాలరి లాగా.. తెప్ప వేసుకుని ప్రతిరోజూ సముద్రాన్ని శోధిస్తూ’ అని తన ‘నీటి రంగుల చిత్రం’ సంపుటి వెలువరించాడు. ఇంకొక వైపు చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెరువులానైన వుండాలె చేపలానైన వుండాలె ప్రొక్లైనర్ వలే ఉండొద్దన్నం అని సిధారెడ్డి తన ‘ఇక్కడి చెట్ల గాలి’ సంపుటిలో స్పష్టంగా చెబితే ‘విప్పారిన కళ్ళతో పూలూ పిల్లలూ ఏమి మాట్లాడుకుంటారో’ అని ముకుంద రామారావు తన ‘ఆకాశయానం’ సంపుటిలో అచ్చెరువొందాడు. ఈ కవితాసంపుటులతో పాటుగా ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’, అన్నవరం దేవేందర్ ‘పొక్కిలి వాకిళ్ళ పులకరింత’, బండ్ల మాధవరావు ‘అనుపమ’, క్రాంతి శ్రీనివాసరావు ‘సిక్స్త్ ఎలిమెంట్’, మోహన్ రుషి ‘జీరో డిగ్రీ’, బాలసుధాకర మౌళి ‘ఎగరాల్సిన సమయం’, మొయిద శ్రీనివాసరావు ‘సముద్రమంత చెమటచుక్క’, కాశీరాజు ‘భూమధ్య రేఖ’, శంషాద్ ‘ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే’, యింద్రవెల్లి రమేష్ ‘వెల్లడి’ తదితర కవితా సంపుటులు కూడా 2014లోనే విడుదలయ్యాయి. అయితే 2014 మురిసిపోయిన ఒక సందర్భం - పదవ తరగతి చదువుతున్న రక్షిత సుమ అనే అమ్మాయి ‘దారిలో లాంతరు’ పేరుతో తన కవితల సంపుటిని వెలువరించడం! ఈ సందర్భంలో గత కొద్దికాలంగా తెలుగు కవిత్వలోకంలో ఒక ఉత్సవ వాతావరణాన్ని నింపేందుకు ప్రయత్నిస్తోన్న ‘కవి సంగమం’ కృషిని కూడా అభినందించాలి! 2014వ సంవత్సరం వెళుతూ వెళుతూ తెలుగు కవిత్వానికి కొన్ని విషాదాలని కూడా మిగిల్చింది. ఆధునిక తెలుగు కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన తూనికరాళ్ళను తెలుగు కవిత్వ విమర్శకు అందించిన ‘చేరాతల’ చేకూరి రామారావు గారు, దళిత కవిత్వానికి పదునైన నిరసన గొంతుకని అందించిన కవి గాయకుడు తెరేష్ బాబు, ‘లాల్ బానోగులామీ ఛోడో- బోలో వందేమాతరం’ కవిత ద్వారా రెండు మూడుతరాల యువకుల్ని ప్రభావితం చేసిన ఎన్కే, ‘తెగిన దారానికి విలవిలలాడే గాలిపటాన్ని... కేరింతలతో వినోదించడం జీవితపరమార్థం అనుకుంటాం’ అని 2014 తొలి రోజుల్లో జీవిత రహస్యాన్ని విప్పి చెప్పిన కవి జాన్‌హైడ్ తదితరులంతా 2014లోనే తెలుగు సాహిత్య లోకం నుండి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. చివరిగా తెలుగు కవులందరూ 2014లో విమల రాసిన ఈ కవితా వాక్యాలని ఒకసారి చదువుకోవాలి - కవీ! విర్రవీగకు! నీ కొన్ని పద్యాలు మాత్రమే ఎగురుతాయి పక్షుల వలే సీతాకోకచిలుకల వలే కొన్నాళ్ళు రెక్కలు తెగిపోయాక అవి కూడా ఎక్కడో అనామకంగా నేలరాలిపోతాయి ఏవో కొన్ని పద్యాలు మాత్రమే దారిలో చిరుదీపాల్లా వెలుగుతాయి.... - కోడూరి విజయకుమార్ 83309 54074 -
జాతికంతటికీ చాటేందుకే అవధాన రాజధానీ..
తీయని గొంతుతో, అందమైన రాగాలాపనతో పద్యాలు పూరించడం ఆయన ప్రత్యేకత... అత్యంత పిన్న వయస్సులో అవధానం చేసిన ఆయనే ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ. అవధానానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఈ పుంభావ సరస్వతి ప్రస్తుతం అవధాన రాజధానీ పేరుతో ఢిల్లీలో నవంబరు 2 నుంచి 9 దాకా ఏకధాటిగా ఎనిమిది రోజులపాటు 500 మంది పండితులతో కూడుకున్న సహస్రావధానం చేస్తున్నారు... ఈ సందర్భంగా సాక్షితో ప్రత్యేకంగా సంభాషించారు... మీ గురువులు ఎవరు? ఎవరికైనా సరే తల్లిదండ్రులే ప్రథమ గురువులు. మా తల్లిదండ్రులు మాడుగుల నాగభూషణశర్మ, సుశీలమ్మ. నా చిన్నప్పుడే అంటే, నాకు ఎనిమిదేళ్లు వచ్చేసరికే నాన్నగారు నాకు అమరం, ఆంధ్రనామ సంగ్రహం చెప్పారు. అక్షరాభ్యాసం చేయించిన గురువులు శ్రీ నరసింహాచార్యులు. అవధానాన్ని నిర్వచిస్తారా? అవధానం అంటే ఏకాగ్రత. చిత్తైగ్య్రం అవధానం అని అలంకార సూత్రాలలో వామనుడు అన్నాడు. అవధానంలో ఏకాగ్రత, వ్యగ్రత ఏకకాలంలో కలిసే ధారణ ప్రక్రియ ఉంటుంది. వంద, వెయ్యి, రెండు వేలు... ఎన్నో అంశాలలో ఏకకాలంలో ఏకాగ్రత కలిగి ఉండటం అవధాన లక్షణం. ప్రారంభంలో అవధానం వేదాలలోనే ఉంది. అక్కడ నుంచి లౌకిక సాహిత్యంలోకి ప్రవేశించింది. ఇది మన తెలుగు భాషలో విస్తరించినంత గొప్పగా ఏ ఇతర భాషల్లోనూ ప్రసరించలేదు. మనల్ని చూసే కన్నడిగులు, తమిళులు ప్రారంభించారు. అయితే దాని స్వరూపం వేరు. మీరు కొన్ని వందలరకాల అవధానాలు చేశారు కదా? వాటిలో మీకు బాగా నచ్చిన, మిమ్మల్ని నొప్పించిన అవధానం ఉందా? ప్రతి అవధానమూ నచ్చితేనే చేస్తాం. ఇష్టపడి చేస్తాం. అందువల్ల నొప్పి అనేది ఉండదు. అయితే ఎలా పూరిస్తామా అనే సమస్యాత్మక సందర్భాలు తటస్థపడుతుంటాయి. అమ్మవారి కృప వల్ల అలా అనుకున్నప్పుడు అత్యంత అద్భుతమైన పద్యమే ఆవిష్కరింపబడుతుంది. అటువంటి పద్యం కాని శ్లోకం కాని ఒకటి వివరిస్తారా... 1993 ప్రాంతంలో కాకినాడలో జరిగిన శతావధానంలో, మండపేట పోదాం వస్తావా చిలకా అని ఒక పద్యపాదం ఇచ్చి, ఆ పదాలను ఉపయోగిస్తూ సంస్కృతంలో శిఖరిణీ వృత్తంలో దేవదేవి, శ్రీచక్రధారిణి అయిన అమ్మవారిని వర్ణించమని శ్రీచెరువు సత్యనారాయణశాస్త్రి అనే మహాపండితుడు కోరారు. ఆయన స్వయంగా విద్వాంసుడు, అవధాని, వయ్యాకరణుడు. ఆయన ఇచ్చిన మండపేట పోదాం అన్న వాక్యంతో శిఖరిణీ వృత్తం రాదు. అలాంటప్పుడే అవధానికి ఒక్క క్షణంలో ఆలోచన స్ఫురించాలి. మొదటి పాదం చివరి భాగం, రెండవ భాగం యొక్క మొదటి భాగం కలిస్తే ఛందస్సు సరిపోతుంది. తపోదాంతే భక్తే కురుకురు దయాం తద్హృదయమం డపే ట త్వం నిత్యం భగవతి శివానంద లహరీ శివస్తానేవ త్వయి గత మహా శక్తి విభవః వయం కేవాస్తోతుం శుభంచి లకారార్ణ నిలయే॥ ఓ భగవతీ, శివానందలహరీ! తపస్సు చేత ఇంద్రియ నిగ్రహ సంపన్నుడైన భక్తుని యందు దయను ప్రసరించు తల్లీ! అటువంటి భక్తుని హృదయమండపమునందు సంచరించు! ఎందుకు నిన్ను ప్రాధేయపడటం అంటే, లోకేశ్వరేశ్వరుడైన ఆ శివుని శక్తి, వైభవం నీయందే ఉన్నాయి. నిన్ను పొగడటానికి మేమెంతవారం తల్లీ! ల (అమ్మవారు) కార వర్ణమునందు కొలువున్నదానా... అని పూరించాను. పృచ్ఛకులు ఎంతో సంబరపడ్డారు. అవధానంలో మీకు బాగా కష్టమైన అంశం ఏదని భావిస్తారు? నేను ఇష్టంగా స్వీకరించి కూర్చున్నవాడిని, కనుక అంతా ఇష్టమే. ఎంత కష్టపెట్టాలని భావించి కష్టమైన సమస్యలు ఇస్తే, నాకు అంత ఇష్టం. అటువంటప్పుడే మంచి పద్యాలు వస్తాయి. అన్నవరం సుప్రభాతం మీరు రాశారట కదా! దాని గురించి... అన్నవరం దేవస్థానం వారు స్వయంగా నా చేత రాయించుకున్నారు. అన్ని సుప్రభాతాల్లా కాకుండా విలక్షణంగా ఉండాలన్నారు. అప్పుడు అక్కడ నెల రోజులు కూర్చుని రాశాను. అప్పుడు నాకు 27 సంవత్సరాలు. ఆ సుప్రభాతాన్ని శృంగేరి భారతీతీర్థ ఆమోదించారు. అయితే ఆయన ఆమోదానికి ముందు, ఈ సుప్రభాతాన్ని అంగీకరించడానికి విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, తంగిరాల బాలగంగాధరశాస్త్రి గార్లను నియమించా రు. ఒకరు వయ్యాకరణులు, ఒకరు సాంగత్రివేద అధ్యేత, తార్కికులు. విశేషమేమిటంటే వీరిద్దరూ కవిత్వమంటేనే విముఖులు! అవధానాలలో ఎప్పుడైనా మీరు చదవని పుస్తకం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా ఎదుర్కొంటారు? ఎవ్వరూ సర్వజ్ఞుడు కాదు. అది కేవలం భగవంతుడు మాత్రమే. ఇతరులకు కుదరదు. అయ్యో చదవలేదే అని మనసులో ఉంటుంది. అయితే అమ్మవారి దయతో అపఠితమపి పఠితమివ చదవనిది కూడా ఆ సమయంలో చదివినట్లు స్ఫురిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో చేయడానికి కారణం? అవధానం ఆంధ్రులదే అయినా ఒక్కసారి అవధాన ప్రతిష్ఠ, తేజస్సు జాతికంతటికీ తెలియాలి. శిఖరాయమానంగా ఢిల్లీలో జరుగుతోంది కాబట్టి అందరికీ తెలుస్తుంది. 2000లో ఢిల్లీలో జరిగిన మిలీనియం అవధానంలో 225 మంది పండితులు పాల్గొన్నారు. ఇప్పుడు 500 మంది పాల్గొంటున్నారు. కొత్తగా వచ్చే అవధానులకు సూచనలు... శ్రద్ధ చాలా అవసరం. మనసును, ఆత్మను అర్పణ చేసి, ‘ఇది నాకు రావాలి’ అనుకునేంత తపన ఉండాలి. అందుకోసం బాగా సాధనచేయాలి. ముఖ్యంగా పుష్టిగా చదవాలి. తుష్టిగా తన ముందు అవధానులను పరిశీలించాలి. అన్ని భారతీయ, అన్ని అభారతీయ భాషలను పరిశీలిస్తే... ఒక్క తెలుగుభాషలో మాత్రమే అవధానం ఉంది. నేత్రావధానం, ఘటికావధానం, పుష్పావధానం... ఇవన్నీ ఇందులో చిన్న చిన్న భేదాలు. సాహిత్యంలో అవధానమే సంపూర్ణమైన రూపం. కొత్తగా జోడించిన అంశాలు... స్వరపది... ఒక గాత్ర విద్వాంసుడు లేదా వాద్య నిపుణుడు, ఒక రాగాన్ని ఆలపించగానే, ఆ రాగాన్ని గుర్తించి, ఆ రాగంలోనే ఒక అర్థవంతమైన గీతాన్ని సృజిస్తారు. నృత్యపది... కథక్, మణిపురి, భరతనాట్యం లేదా కూచిపూడి వంటి నృత్యరీతులలో ఒక నృత్య కళాకారుడు లేదా నృత్యకళాకారిణి తన నృత్యాన్ని గీతరహితంగా చేస్తారు. రెండు నిమిషాల వ్యవధానంలో మళ్లీ ఆరంభిస్తారు. అవధాని, ఆ నృత్యరీతిని గుర్తించి, హావభావాలను బట్టి, ఆ నృత్యం ఏమిటో వివరిస్తూ, ఒక గీతం రచిస్తారు. ఆ కళాకారుడు/ కళాకారిణి శ్రుతి, లయ, రాగయుక్తమైన రీతిలో నృత్యాభినయాన్ని కొనసాగిస్తారు. చిత్రపది... ఒక విఖ్యాత చిత్రకారుడు ఒక చిత్రాన్ని గీయటం ఆరంభిస్తారు. ఆ రేఖలను, గీతలను చూసిన అవధాని ఆ రేఖల క్రమాన్ని గమనిస్తూ ఆ రేఖల క్రమానుగతమైన పద్ధతిలో ఆ చిత్రాన్ని గురించిన ఒక గీతం గానం చేస్తారు. ఈ మూడు అవధాన క్రీడలు డా. మాడుగుల వినూత్న ఆవిష్కరణలు. అవధాన రాజధానీ కార్యక్రమంలో వీటిని కూడా మేళవించనున్నారు. సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
కలర్ స్వాతి అయ్యింది కవయిత్రి
కాదేది కవితకు అనర్హం అంటారు. అలాగే అనుభవాలు నేర్పే పాఠాలు, గుణపాఠాలు ఎన్నో. వాటికి కాస్త పరిజ్ఞానాన్ని, భావుకతను జోడిస్తే వస్తే కథలు, కవితలు కోకొల్లలు. అసలు విషయం ఏంటంటే నటి స్వాతి ఆంగ్లంలో కవితలు రాసేస్తోందట. తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఇటీవల ‘‘సమ్ ఐస్ సీ యువర్ వీక్నెస్, అండ్ ధైర్ లిప్స్ స్ప్రెడ్ అగ్లీ లైస్. దే యూజ్ ధైర్ లార్జ్ లార్జ్ వింగ్స్, దే యూస్ దెమ్ టు ప్లై ఫాస్ట్ అండ్ హై’’. ఇలాంటి పదాలతో ఈ బ్యూటీ రాసిన ఈ కవిత చూస్తుంటే తనకు ఎదురైన అనుభవాలకు కవిత రూపం ఇచ్చినట్టు లేదూ! ఏమైతేనేం ఈ కవితను తన చిత్ర పరిశ్రమ స్నేహితులందరికీ స్వాతి అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీనికి అనూహ్య స్పందన వచ్చినట్లు కూడా ఈ అమ్మడు పేర్కొంది. ఇదంతా చూస్తుంటే స్వాతి త్వరలో గీత రచయిత అయిపోతుందేమోననిపిస్తోందా? అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఒక చిత్రం చేస్తోంది. తెలుగులో నటించిన కార్తికేయ విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంలో త్వరలో విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనుంది. -
మైలపడి పోయెనోయి- నీ మనుజ జన్మ!
తపాలా: మా పిల్లలకు చిన్నప్పుడే తెలుగుభాషపై అభిరుచి, అభిమానం ఏర్పడాలని కొంత ప్రయత్నించాను. దానికోసం ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి తేలికైన పద్యాలను పాడి, తాత్పర్యాలను బోధించేవాణ్ని. వారికి చిన్నపోటీకూడా పెట్టేవాణ్ని. ఎవరు ఎక్కువ పద్యాలు రాగయుక్తంగా, భావయుక్తంగా పాడితే ‘ఇంత’ డబ్బు ఇస్తాననేవాణ్ని. అలా జాషువా, పోతన పద్యాలను కూడా కంఠతా పట్టించాను. ఈ కార్యక్రమమంతా మా పిల్లలు ప్రాథమిక పాఠశాల చదువులప్పుడే జరిగింది. హైస్కూలు చదువు కూడా అయిపోయి కాలేజీలో చేర్పించే సమయమొచ్చి మా అబ్బాయిని గుంటూరులో చేర్పించాను. ఎలాగూ ఇంత దూరం వచ్చాం. పాపయ్యశాస్త్రిగారిని చూసి పోవాలన్న కోరిక ఎన్నాళ్లనుండో ఉండటంతో, అప్పుడక్కడే ‘వార్త’ పత్రిక చీఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న మిత్రుడు పున్నా కృష్ణమూర్తితో మనసులోని మాట చెప్పాను.‘వెళ్దాం పదండి; నేనూ వారిని ఎన్నడూ చూడ్డం పడనేలేదు’ అన్నాడు. ముగ్గురమూ వెళ్లాం. బహుశా అది లక్ష్మీపురమయ్యుంటుంది. రైలుకట్ట అవతలుంది. శాస్త్రిగారు ఇంట్లోనే ఉన్నారు. నమస్కరించా! ‘‘అయ్యా! నేను నల్లగొండ జిల్లా నుండి వచ్చాను. మాకు ఖమ్మం అతి దగ్గరగా ఉంటుంది. వీడు మా అబ్బాయి సిద్ధార్థ. ఇక్కడే చదువుకుంటున్నాడు. వీరు, పున్నా కృష్ణమూర్తి - గుర్రం మల్లయ్యగారి మనవడు - మిమ్ము చూడాలని వచ్చాం’’ అన్నాను. మా పిల్లలకు నేర్పిన వారి పద్యాల గురించి చెప్పాను. ‘‘బుద్ధదేవుని భువిలోన పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమో అందమును హత్య చేసెడి హంతకుండ మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ! దీనితో పాటే, అమ్మచేతి తాలింపు కమ్మదనము - భరతదేశాన గుమగుమ పరిమళించెనన్న పద్యమూ, జాషువాగారి గబ్బిలంలోని పద్యాలూ, ఫిరదౌసిలోని పద్యాలు కూడా కొన్నింటిని కంఠతా పట్టించాను’’ అన్నాను. అప్పుడు శాస్త్రిగారు ఓ ఉదంతం చెప్పారు. అదే ఇప్పుడు మీకు చెబుతున్నది. ‘‘నన్ను తెలుగు అకాడెమీవారు సత్కరించడం కోసమని, అకాడెమీ డెరైక్టరుగారు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చారు. అకాడెమీ కార్యక్రమాల గురించి, విశ్వవిద్యాలయపు తీరుతెన్నుల గురించి అనేక విషయాలు మాట్లాడాక, అతిథికి కాఫీ ఇవ్వడం కోసమని ఇంట్లోకి వెడుతూ, నా ఎడల వారి అభిమానానికి గుర్తుగా ఓ గులాబీని అందించాను. అప్పటికే నా భార్య కాలం చేసింది. అందువల్ల నేను కాఫీ చేసి పట్టుకురావడానికి కొంత సమయం తీసుకుంది. ఆశ్చర్యం, వారి వద్ద నేనిచ్చిన గులాబీ జాడ కనిపించనే లేదు. కాడ మటుకు టీపాయ్ మీద ఉంది. నేను గ్రహించిందేమంటే, వారు గులాబీ ఒక్కొక్క రేకును వలిచి నమిలి మింగేశారని! నా మొహం వివర్ణమైపోయింది. నాకు పువ్వుల ఎడ ఉన్న ఆర్ద్రతను ‘పుష్పవిలాపం’లో చెప్పానన్న విషయం నా అతిథికి తెలియనిది కాదు. అయినా ఇలా జరిగిందేమిటన్న ఆలోచన నన్ను ప్రశాంతంగా ఉండనీయలేదు’’ అన్నారాయన. పువ్వుల్ని ప్రేమించలేనివాడు తాడితుల్ని, పీడితుల్ని ఏం ప్రేమిస్తాడని ‘పుష్పవిలాపం’ పద్యాల ద్వారా చెప్ప ప్రయత్నించానని ముగించారు. మా అమ్మ ముక్కు గట్టిగా వుండాలి స్వామీ! మా తమ్ముడు బెంగళూరు లో ఉంటాడు. నేను, మా బాబు రిషి, వేసవి సెలవుల్లో బెంగళూరు వెళ్లాం. మా తమ్ముడికి నాలుగేళ్లు బాబు ఉన్నాడు. వాడి పేరు అక్షయ్. అక్షయ్ పుట్టినరోజున కొత్త బట్టలు వేసి, హారతి ఇస్తుంటే, ‘‘నేను దేవుడినా? నాకు హారతి ఇస్తున్నారు’’ అన్నాడు. మేమెంతో ఆశ్చర్యపోయాం. అక్షయ్‌కు వాళ్ల అమ్మ ముక్కు పట్టుకోవటమంటే ఎంతో ఇష్టం. వాళ్ల పక్కింటివాళ్లలో ఒకరు, ‘మీ అమ్మ ముక్కును నేను తీసేసుకుంటాను’ అని సరదాగా అన్నారు. వెంటనే వాడు కొంచెం దిగాలుగా దేవుడి గదిలోకి వెళ్లి, ‘‘మా అమ్మ ముక్కును స్ట్రాంగ్‌గా చేసి ఆంటీ తీసుకువెళ్లకుండా చూడు స్వామీ’’ అని నమస్కరిస్తుంటే, మా అందరికీ నవ్వు ఆగలేదు. అక్షయ్‌తో నేను ఆడుకుంటున్నప్పుడు మా ఇద్దరి తలలు ఢీ కొట్టుకున్నాయి. మరునాడు, ‘‘చూడు అక్షయ్, నా తల వాచిపోయింది’’ అని నేనంటే, వాడు వెంటనే, ‘‘వాచి పోయిందా? వాచ్ పోయిందా?’’అనగానే, వాడి రైమింగ్ వర్డ్స్‌కు ఆశ్చర్యపడి నవ్వుకున్నాం. - విజయశంకర్ ద్రాక్షారామం - గుడిపూడి సుబ్బారావు మలక్‌పేట, హైదరాబాద్