గొప్ప వాక్కును కొందరు మహాత్ములు పద్యరూపంలో చెప్పారు. మరి కొందరు గద్యరూపంలో చెప్పారు, ఇంకొందరు గీతం రూపంలో చెప్పారు. పోతన భాగవతాన్ని పద్య, గద్యరూపంలో చెప్పారు. ప్రధానంగా పద్య రూపంలో చెప్పారు. పద్యానికి ఉన్న లక్షణం –అది ఛందోబద్దం. నాలుగుసార్లు చదివితే అది నోటికొచ్చేస్తుంది. జ్ఞాపకంలో ఉండిపోతుంది.
జీవితంలో ఏది ప్రధానంగా జ్ఞాపకం ఉంచుకోవాలో, అలా ఉంచుకుని సందర్భాన్నిబట్టి గుర్తు తెచ్చుకుని సానుకూలంగా ఆచరణలో పెట్టుకోగలిగిన వాటిని ఛందోబద్దంగా ఇస్తే అవి మనసుకు హత్తుకుని మనకు అవసరాన్నిబట్టి ప్రయోజనం కలిగిస్తాయి. కానీ అంత జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేని వాటిని గద్యరూపంలో(వచనంగా) అందించాడు పోతన, పద్యం, గద్యం కలిసి రాసినప్పుడు. తెలుగులో పద్యరూపంలో చెప్పినట్టుగానే, సంస్కృతంలో శ్లోకరూపంలో చెప్పారు.
ఒక పద్యాన్ని చదవడంకన్నా, ఒక శ్లోకాన్ని చదవడంకన్నా, మేము వాక్యరూపంలో ఉన్న వచనాన్ని(గద్యాన్ని) చదువుకుని ప్రయోజనం పొందుతామని ఇష్టపడేవారికి గద్యంలో కూడా అందుబాటులో ఉంచారు. మరికొందరు చాలా తేలికగా అవతలివారికి బోధ చేయడానికి గీతం రూపంలో అందించారు. గీతం అంటే పాట. పాట మనసును రంజింప చేస్తుంది.
సహజంగా పుట్టుకచేత క్రౌర్యం ఉన్నవి కూడా సంగీతం వినబడేటప్పటికి అవి వాటి క్రూరత్వాన్ని ఆ కాసేపు పక్కనబెట్టేస్తాయి. అలాగే గాఢమైన అజ్ఞానంతో ఏమీ తెలియనివారు కూడా సంగీతంతో కూడిన గీతం వినేటప్పటికి గొప్ప శాంతిని పొందుతారు. పశువులు కావచ్చు, పసిబిడ్డలు కావచ్చు .. పాటవినేటప్పటికి ఒక తన్మయావస్థకు లోనుకావడం జరుగుతుంది. ఏడుస్తున్న వాళ్ళు కూడా ఆ కాసేపు ఏడుపు ఆపేస్తారు. మనసు శాంతిని పొందుతుంది.
సమాజ హితం కోసం పద్యరూపంలోగానీ, గద్య, గీత రూపాల్లో కానీ ఎవరు ఏమీ ఆశించకుండా వాక్కులుగా వెచ్చించారో వారు శాశ్వత్వాన్ని పొందారు. ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్/ సొమ్ములు? గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము? బాసి కాలుచే/ సమ్మెట పోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ/ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.’ అంటాడు పోతన. నేను సమాజహితాన్ని కోరి పలుకుతున్నాను తప్ప నేనేమీ ఆశించడంలేదన్నాడు.. అదే శాశ్వతమైనది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment