మనిషిని జంతుప్రపంచం నుండి వేరు చేసేది భాష, దానికి కారణమైన ఆలోచన, ఆలోచనకి మూలస్థానమైన మెదడు. ఇంతటి విలువైనదానిని సద్వినియోగం చేసుకోటం తెలివిగలవారి లక్షణం. కాని, దానిని దుర్వినియోగం చేసే వారిని ఏమనాలి? అన్నింటి వలెనే మాటని కూడా పొదుపుగా వాడుకోవాలి.
‘‘అతి సర్వత్ర వర్జయేత్’’ అని నానుడి. ఇది మాటలకి కూడా వర్తిస్తుంది. అతిగా మాట్లాడటాన్ని వాగటం అంటారు. జల్పమన్నా అదే. అవి పేరుకి మాటలే కాని, వాస్తవానికి శబ్దాల సముదాయాలు మాత్రమే. అతిగా మాట్లాడుతూ ఉంటే అనవసర విషయాలు ప్రసక్త మౌతూ ఉంటాయి. ఏదో ఒకటి మాట్లాడాలనే తపన వల్ల అసత్యాలు దొర్లవచ్చు. కొన్నిసార్లు అప్రయత్నంగా నోరు జారి బయటపెట్ట కూడని విషయాలు బహిర్గతం అవుతాయి.
ఆ సంగతిని గుర్తించక పోవచ్చు, కాని, ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోవటం కుదరదు. దాని వల్ల ఇబ్బందులు, కొండొకచో ప్రమాదాలు కూడా కల్గవచ్చు. శతృత్వాలు పెరిగితే మనశ్శాంతి కరువు అవుతుంది. కొంచెం నోరు సంబాళించుకుంటే ఎంత బాగుండేది? అని తరవాత ఎంతగా పశ్చాత్తాప పడినా ఏం లాభం? గతం గతః అతిగా మాట్లాడటం కూడా ఒక వ్యసనం. వ్యసనం అంటే వదిలి పెట్టలేని అలవాటు. చేస్తున్నది తప్పని తెలిసినా, చేయకుండా ఉండలేని బలహీనత వ్యసనం.
వాగటం అనే బలహీనత ఉన్న వారు అవతలి వాళ్ళు విసుక్కుంటున్నారు, వినటం లేదు అని గుర్తించినా మాట్లాడటం ఆపలేరు. ఈ లక్షణం చిన్నపిల్లలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పెద్దవాళ్లు మాట్లాడ వద్దన్నా, చివరకు చేతితో నోరు మూసినా, వేళ్ళసందులలో నుండి తాము చెప్పదలచిన దానిని చెప్పేస్తారు. పిల్లలని వాగుడుకాయ అని తేలికగా తేల్చేస్తాం. పెద్దలని ఊరుకోమని అనలేం. పెద్దవారిని ఎదురుగా అనకపోయినా వాచాలుడు, వ్యర్థప్రసంగి, అధికప్రసంగి అంటూ తేలికగా మాట్లాడుతారు. నోరు అదుపులో ఉంటే ఈ చెడ్డ పేరు రాదు.
కుటుంబ సభ్యుల మధ్య, బంధువులు స్నేహితుల మధ్య, సహోద్యోగుల మధ్య, దేశాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి సత్సంబంధాల బదులు తగాదాలు, యుద్ధాలు రావటానికి కారణం చాలా వరకు అధిక ప్రసంగాలే. ‘‘మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు’’ అని సరసంగా మొదలయిన సంభాషణ చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి ఏకైక మార్గం వీలైనంత తక్కువగా మాట్లాడటం. అందుకే ‘‘ఊరుకున్నంత ఉత్తమం లేదు’’ అనే సామెత వచ్చింది.
అవతలివారి రహస్యాలను కూపీ తియ్యటానికి చేసే మొదటి పని, ఉత్తమమైన పద్ధతి వారిని మాటల్లోకి దించటం. మాటల ధోరణిలో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో మర్చిపోయి వాగి, వాగి తమ వ్యక్తిగత విషయాలను, గోప్యంగా ఉంచవలసిన కుటుంబ వ్యవహారాలను, చివరకు దేశరక్షణకు సంబంధించిన రహస్యాలను కూడా బయట పెట్టిన సందర్భాలు చరిత్రలో కనపడతాయి. ఆలోచనతో పాటు విచక్షణని కూడా ఉపయోగిస్తే దేనిని వృథా చేయటం ఉండదు.
మాటని వృథా చేయటం అంటే ప్రకృతి మనకి ఇచ్చిన దానిని సరిగా వాడుకోక ప్రకృతి పట్ల అపచారం చేయటం. ఎందుకంటే మాట్లాడటానికి ఎంతో శక్తిని వెచ్చించ వలసి ఉంటుంది. వినే వారి సమయం వృథా అవుతుంది. అందుకే అతి వాగుడు ఆయుః క్షీణం అంటారు. నోరు చేసుకుని, నోరు పెట్టుకుని బతికేవాళ్ళు తగు జాగ్రత్తలని తెసుకోకపోతే ఆయువు తరిగే ప్రమాదం ఉంది సుమా! మునుల దీర్ఘాయువు రహస్యం కూడా ఇదే.
కాళిదాసు పేర్కొన్న రఘువంశ రాజుల లక్షణాలలో మితభాషణం ఒకటి. అది సత్ప్రవర్తనలో ప్రధానాంశం. మనకి నోరు ఉన్నది మాట్లాడటానికే కదా! ఎందుకు పరిమితం చేసుకోవాలి? అన్న ప్రశ్నకి మహాకవి కాళిదాసే సమాధానం కూడా చెప్పాడు – ‘‘సత్యాయ మితభాషిణాం’’ అని. సత్యాన్ని పలకటానికి మాత్రమే పెదవి
విప్పేవారట.
Comments
Please login to add a commentAdd a comment