Talkings
-
మితభాషణం
మనిషిని జంతుప్రపంచం నుండి వేరు చేసేది భాష, దానికి కారణమైన ఆలోచన, ఆలోచనకి మూలస్థానమైన మెదడు. ఇంతటి విలువైనదానిని సద్వినియోగం చేసుకోటం తెలివిగలవారి లక్షణం. కాని, దానిని దుర్వినియోగం చేసే వారిని ఏమనాలి? అన్నింటి వలెనే మాటని కూడా పొదుపుగా వాడుకోవాలి. ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’ అని నానుడి. ఇది మాటలకి కూడా వర్తిస్తుంది. అతిగా మాట్లాడటాన్ని వాగటం అంటారు. జల్పమన్నా అదే. అవి పేరుకి మాటలే కాని, వాస్తవానికి శబ్దాల సముదాయాలు మాత్రమే. అతిగా మాట్లాడుతూ ఉంటే అనవసర విషయాలు ప్రసక్త మౌతూ ఉంటాయి. ఏదో ఒకటి మాట్లాడాలనే తపన వల్ల అసత్యాలు దొర్లవచ్చు. కొన్నిసార్లు అప్రయత్నంగా నోరు జారి బయటపెట్ట కూడని విషయాలు బహిర్గతం అవుతాయి. ఆ సంగతిని గుర్తించక పోవచ్చు, కాని, ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోవటం కుదరదు. దాని వల్ల ఇబ్బందులు, కొండొకచో ప్రమాదాలు కూడా కల్గవచ్చు. శతృత్వాలు పెరిగితే మనశ్శాంతి కరువు అవుతుంది. కొంచెం నోరు సంబాళించుకుంటే ఎంత బాగుండేది? అని తరవాత ఎంతగా పశ్చాత్తాప పడినా ఏం లాభం? గతం గతః అతిగా మాట్లాడటం కూడా ఒక వ్యసనం. వ్యసనం అంటే వదిలి పెట్టలేని అలవాటు. చేస్తున్నది తప్పని తెలిసినా, చేయకుండా ఉండలేని బలహీనత వ్యసనం. వాగటం అనే బలహీనత ఉన్న వారు అవతలి వాళ్ళు విసుక్కుంటున్నారు, వినటం లేదు అని గుర్తించినా మాట్లాడటం ఆపలేరు. ఈ లక్షణం చిన్నపిల్లలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పెద్దవాళ్లు మాట్లాడ వద్దన్నా, చివరకు చేతితో నోరు మూసినా, వేళ్ళసందులలో నుండి తాము చెప్పదలచిన దానిని చెప్పేస్తారు. పిల్లలని వాగుడుకాయ అని తేలికగా తేల్చేస్తాం. పెద్దలని ఊరుకోమని అనలేం. పెద్దవారిని ఎదురుగా అనకపోయినా వాచాలుడు, వ్యర్థప్రసంగి, అధికప్రసంగి అంటూ తేలికగా మాట్లాడుతారు. నోరు అదుపులో ఉంటే ఈ చెడ్డ పేరు రాదు. కుటుంబ సభ్యుల మధ్య, బంధువులు స్నేహితుల మధ్య, సహోద్యోగుల మధ్య, దేశాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి సత్సంబంధాల బదులు తగాదాలు, యుద్ధాలు రావటానికి కారణం చాలా వరకు అధిక ప్రసంగాలే. ‘‘మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు’’ అని సరసంగా మొదలయిన సంభాషణ చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి ఏకైక మార్గం వీలైనంత తక్కువగా మాట్లాడటం. అందుకే ‘‘ఊరుకున్నంత ఉత్తమం లేదు’’ అనే సామెత వచ్చింది. అవతలివారి రహస్యాలను కూపీ తియ్యటానికి చేసే మొదటి పని, ఉత్తమమైన పద్ధతి వారిని మాటల్లోకి దించటం. మాటల ధోరణిలో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో మర్చిపోయి వాగి, వాగి తమ వ్యక్తిగత విషయాలను, గోప్యంగా ఉంచవలసిన కుటుంబ వ్యవహారాలను, చివరకు దేశరక్షణకు సంబంధించిన రహస్యాలను కూడా బయట పెట్టిన సందర్భాలు చరిత్రలో కనపడతాయి. ఆలోచనతో పాటు విచక్షణని కూడా ఉపయోగిస్తే దేనిని వృథా చేయటం ఉండదు. మాటని వృథా చేయటం అంటే ప్రకృతి మనకి ఇచ్చిన దానిని సరిగా వాడుకోక ప్రకృతి పట్ల అపచారం చేయటం. ఎందుకంటే మాట్లాడటానికి ఎంతో శక్తిని వెచ్చించ వలసి ఉంటుంది. వినే వారి సమయం వృథా అవుతుంది. అందుకే అతి వాగుడు ఆయుః క్షీణం అంటారు. నోరు చేసుకుని, నోరు పెట్టుకుని బతికేవాళ్ళు తగు జాగ్రత్తలని తెసుకోకపోతే ఆయువు తరిగే ప్రమాదం ఉంది సుమా! మునుల దీర్ఘాయువు రహస్యం కూడా ఇదే. కాళిదాసు పేర్కొన్న రఘువంశ రాజుల లక్షణాలలో మితభాషణం ఒకటి. అది సత్ప్రవర్తనలో ప్రధానాంశం. మనకి నోరు ఉన్నది మాట్లాడటానికే కదా! ఎందుకు పరిమితం చేసుకోవాలి? అన్న ప్రశ్నకి మహాకవి కాళిదాసే సమాధానం కూడా చెప్పాడు – ‘‘సత్యాయ మితభాషిణాం’’ అని. సత్యాన్ని పలకటానికి మాత్రమే పెదవి విప్పేవారట. -
CM MK Stalin: ఒక మహిళ చమత్కారం.. స్టాలిన్ నవ్వులు
ఆయన ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చుట్టూ భారీ కాన్వాయ్, మందీమార్బలం లేకుండా సహజంగా ఏ సీఎం కూడా కాలు బయటపెట్టరు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. సాధారణ పౌరుడిలా ‘ఎన్నమ్మా..సౌఖ్యమా’ (ఏమ్మా క్షేమంగా ఉన్నారా) అంటూ ప్రజలను నేరుగా పలుకరించి ‘వావ్ గ్రేట్’ అనిపించుకున్నారు. స్టాలిన్‌తో స్థానికులు అపూర్వమైన అనుభూతిని పంచుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. సాక్షి, చెన్నై(తమిళనాడు): ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతుంటారు. ప్రతి రోజూ ఉదయం నగరంలో సైక్లింగ్, జాగింగ్ చేయడం ఆయనకు అలవాటు. సీఎం అయిన తరువాత ఈ ఏడాది ఆగస్టులో చెన్నై నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం వరకు సైకిల్లో వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం చెన్నై అడయారు ఆలమరం ప్రాంతానికి జాగింగ్ కోసం వెళ్లారు. అదే సమయంలో స్థానికులు జాగింగ్ చేస్తూ స్టాలిన్‌కు తారసపడ్డారు. వారిని చూడగానే స్టాలిన్ రోడ్డుపై నిలబడి మాట కలిపారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళ.. ‘మిమ్మల్ని రెండేళ్ల క్రితం విమానాశ్రయంలో కలుసుకున్నాను, సీఎం కావాలని శుభాకాంక్షలు తెలిపాను, అయితే సెల్ఫీ తీసుకోవడం మిస్ అయ్యాను’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ‘మీరు సీఎం అయ్యాక ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి అడుగువేస్తున్నారు..చాలా గర్వకారణంగా ఉంది’ అంటూ మరో మహిళ ప్రశంశించారు. ‘మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం.. ఈ మంచి రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము’ అని ఇంకో మహిళ స్టాలిన్‌తో అన్నారు. ‘అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు వెళ్లిన మీ మనుమడు విజయం సాధించాలని కోరుకుంటున్నాము’ అని ఓ స్థానికుడు చెప్పడంతో సీఎం వెంటనే ధన్యవాదాలు తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం..మార్కెండేయుల్లా ఉన్నారే’ అంటూ ఆయన గ్లామర్‌పై ఒక మహిళ చమత్కరించడంతో స్టాలిన్ పెద్ద పెట్టున నవ్వగా పరిసరాల్లో ఉన్నవారంతా ఆయనతో కలిసి నవ్వులు చిందించారు. ప్రతి రోజూ వ్యాయామం చేస్తా, ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తా అని తన యవ్వన, ఆరోగ్య రహస్యాన్ని స్టాలిన్ ప్రజలతో పంచుకున్నారు. స్టాలిన్‌తో పాటు జాగింగ్‌లో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, బందోబస్తుగా వెళ్లిన పరిమిత సిబ్బంది సైతం స్థానికులతో సీఎం సంభాషణను ఎంతో ఎంజాయ్ చేశారు. సుమారు అర గంటకు పైగా సాగిన ఈ పిచ్చాపాటీతో ఆ పరిసరాలన్నీ సందడిగా మారాయి. చదవండి: ‘రేవంత్ దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో’ M K Stalin blushes as a lady asks the secret of his youthful look, during his morning walk. He responds "diet control". pic.twitter.com/178TnzrNxE — J Sam Daniel Stalin (@jsamdaniel) September 21, 2021 -
మాటలు ఘనం.. చేతలు శూన్యం
కేసీఆర్ ప్రభుత్వ పనితీరు ఇది భ్రష్టుపట్టిన విద్య, వైద్య వ్యవస్థలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ భద్రాచలం : కేసీఆర్ ప్రభుత్వ తీరు.. ‘మాటలు ఘనం, చేతలు శూన్యం’ అన్నట్టుగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. స్థానిక శ్రీ దత్త రెసిడెన్సీలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీల అమలును ప్రభుత్వం గాలికొదిలేసిందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని, సీఎం కేసీఆర్‌కుగానీ.. మంత్రులకుగానీ ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్య, వైద్య వ్యవస్థలు పూర్తిగా భ్రష్టుపట్టాయని అన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీతో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వం చాతగానితనం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం ఆసుపత్రులలో వైద్యులు సెల్ ఫోన్ లైట్ వెలుగులో ఆపరేషన్లు చేయాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. విద్యుత్ సరఫరా లోపం, సరైన పరికరాలు లేకపోవడం, వసతుల లేమి, మందుల కొరత తదితర అనేక సమస్యలు వైద్య శాఖను పట్టిపీడిస్తున్నాయని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి, హుస్సేన్ సాగర్ అభివృద్ధి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ముందుకు సాగడం లేదని విమర్శించారు. ఇప్పటికే ఆరు జీఓలను తప్పుబడుతూ కోర్టు మెట్టికాయలు వేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 67 సంవత్సరాలలో రూ.60వేల కోట్లు అప్పు ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.70వేల కోట్లు అప్పు చూపిస్తున్నదని అన్నారు. ముందు చూపు లేకుండా జిల్లాలు ఏర్పాటు చేస్తే సమస్యలు వస్తాయన్నారు. ఇప్పట్లో డీలిమిటేషన్ ఉండనందున ఒక నియోజకవర్గం రెండు జిల్లాలలో ఉంటే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్ర నాయకుడు రాములు కూడా మాట్లాడారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, నియోజకవర్గ ఇన్చార్జ్ ఫణీశ్వరమ్మ, ఎంపీపీ ఊకే శాంతమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్, పట్టణ అధ్యక్షుడు ఎస్కే అజీమ్, నాయకులు కొడాలి శ్రీనివాసన్, కుంచాల రాజారామ్, కోనేరు రాము, దుర్గాభవాని, రంగారావు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎల్.రమణ