మాటలు ఘనం.. చేతలు శూన్యం | Don't working.. only Talkings | Sakshi
Sakshi News home page

మాటలు ఘనం.. చేతలు శూన్యం

Published Sat, Aug 13 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

మాటలు ఘనం.. చేతలు శూన్యం

మాటలు ఘనం.. చేతలు శూన్యం

  • కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరు ఇది
  • భ్రష్టుపట్టిన విద్య, వైద్య వ్యవస్థలు
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ
  • భద్రాచలం : కేసీఆర్‌ ప్రభుత్వ తీరు.. ‘మాటలు ఘనం, చేతలు శూన్యం’ అన్నట్టుగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. స్థానిక శ్రీ దత్త రెసిడెన్సీలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీల అమలును ప్రభుత్వం గాలికొదిలేసిందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని,  సీఎం కేసీఆర్‌కుగానీ.. మంత్రులకుగానీ ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో విద్య, వైద్య వ్యవస్థలు పూర్తిగా భ్రష్టుపట్టాయని అన్నారు. ఎంసెట్‌ పేపర్‌ లీకేజీతో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వం చాతగానితనం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం ఆసుపత్రులలో వైద్యులు సెల్‌ ఫోన్‌ లైట్‌ వెలుగులో ఆపరేషన్లు చేయాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. విద్యుత్‌ సరఫరా లోపం, సరైన పరికరాలు లేకపోవడం, వసతుల లేమి, మందుల కొరత తదితర అనేక సమస్యలు వైద్య శాఖను పట్టిపీడిస్తున్నాయని అన్నారు.
    మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి, హుస్సేన్‌ సాగర్‌ అభివృద్ధి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ముందుకు సాగడం లేదని విమర్శించారు. ఇప్పటికే ఆరు జీఓలను తప్పుబడుతూ కోర్టు మెట్టికాయలు వేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 67 సంవత్సరాలలో రూ.60వేల కోట్లు అప్పు ఉండగా, కేసీఆర్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.70వేల కోట్లు అప్పు చూపిస్తున్నదని అన్నారు. ముందు చూపు లేకుండా జిల్లాలు ఏర్పాటు చేస్తే సమస్యలు వస్తాయన్నారు. ఇప్పట్లో డీలిమిటేషన్‌ ఉండనందున ఒక నియోజకవర్గం రెండు జిల్లాలలో ఉంటే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్ర నాయకుడు రాములు కూడా మాట్లాడారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఫణీశ్వరమ్మ, ఎంపీపీ ఊకే శాంతమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్, పట్టణ అధ్యక్షుడు ఎస్కే అజీమ్, నాయకులు కొడాలి శ్రీనివాసన్, కుంచాల రాజారామ్, కోనేరు రాము, దుర్గాభవాని, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

    మాట్లాడుతున్న ఎల్‌.రమణ
     

Advertisement
Advertisement