సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా! | Four Types of Guests for Telugu Literature Meetings: BR Bapuji | Sakshi
Sakshi News home page

సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!

Published Mon, Dec 19 2022 2:19 PM | Last Updated on Mon, Dec 19 2022 2:19 PM

Four Types of Guests for Telugu Literature Meetings: BR Bapuji - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల సాహిత్య సభల్లో – అది పుస్తకా విష్కరణ సభ గానీ, ఇంకోరకం సభ గానీ– ఒక ధోరణి అంటువ్యాధి లాగా తయారైంది. ఆ సభలకి సంబంధించిన దాదాపు అన్ని ఆహ్వాన పత్రాల్లోనూ ఇలా ఉంటుంది: ‘‘ముఖ్య అతిథి, గౌరవ అతిథి, విశిష్ట అతిథి, ఆత్మీయ అతిథి’’– అని నాలుగు రకాల అతిథులూ, వారి పేర్లూ ఉంటాయి. ఇంతకీ, ఈ అతిథుల్లో ఎవరు ముందో, ఎవరు తర్వాతో, ఎవరు ఎక్కువ గొప్పో, ఎవరు తక్కువ గొప్పో తేల్చడం కష్టం. ఆ ఆహ్వాన పత్రంలో, ఏ వరసలో ఆ మాటలు రాశారో, బహుశా ఆ వరసలోనే వాళ్ళ అంతస్తు లేదా హోదా వుంటుందనుకోవాలేమో! 

అతిథుల్లో ఈ నాలుగు రకాల్నీ చూస్తే, చాతుర్వర్ణ వ్యవస్థ అంటారే అది గుర్తొస్తుంది. ఈ హైరార్కీని (అంతస్తుల వారీ సంబంధాలను) 11వ శతాబ్దంలో, రాజాస్థాన కవులు పాటిం చారో లేదో తెలియదు. కానీ, ఈ 21వ శతాబ్దంలో, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాల కాలంలో మాత్రం, ఆధుని కులూ, ఉత్తరాధునికులూ, అభ్యుదయ వాదులూ, విప్లవ వాదులూ, దళిత వాదులూ, స్త్రీ–పురుష సమానత్వ వాదులూ... ఇలా అన్ని రకాల వారూ ఈ హైరార్కీని పాటిస్తు న్నారు. నోరు తెరిస్తే, ‘చాతుర్వర్ణ వ్యవస్థ’,  ‘మనువాదం’, ‘బ్రాహ్మణీయ సంస్కృతి’, ‘ఫ్యూడల్‌ సంస్కృతి’, ‘పితృస్వామ్య సంస్కృతి’ అని మైకులు బద్దలయ్యేలాగా నినాదాలిస్తారు. మళ్ళీ ఆ అసమాన సంస్కృతినే పాటిస్తారు. అటు సభా నిర్వాహకులకు గానీ, ఇటు అతిథులుగా ఆహ్వానం పొందిన సాహిత్యకారులకు గానీ, ‘ఇదేమి పద్ధతి?’ అనే ఆలోచనే రావడం లేదు.

ఈ మధ్య, ఇలాంటి ఆహ్వాన పత్రాలు మూడు వేరు వేరు సభలకి సంబంధించినవి, ఫోనులో నాకు అందాయి. వాటిని పంపిన వాళ్ళతో, ‘చాతుర్వర్ణాల్లాగా, ఇన్ని రకాల అతిథు లేమిటండీ?’– అంటే, ఒకరు ‘నిజమే’ అనీ; ఇంకొకరు ‘ఈసారి ఇలా జరగకుండా చూసుకుంటాం’ అనీ; మరొకరు, రాయ డానికి బద్ధకం వేసి, ఎమోజీలు అంటారే, ఒక నవ్వు బొమ్మా, రెండు నమస్కారాల బొమ్మలూ జవాబుగా పంపారు. 

కొందరు అతిథులు తమ పేరుకు ముందుగానీ, కిందగానీ, తమకు ఉన్న డిగ్రీల్నీ (డాక్టర్, ప్రొఫెసర్‌), ఇంతకు ముందు అనుభవించిన పదవుల్నీ (డైరెక్టర్, వైస్‌–ఛాన్సలర్‌), పొందిన అవార్డుల్నీ (అకాడెమీలో, పీఠాలో ఇచ్చిన వాటిని), ఇంకేమైనా అదనపు బిరుదులు వుంటే వాటినీ, ఆహ్వాన పత్రంలో రాయమంటారని విన్నాను. రైలు ఇంజను వెనక వరసగా రైలు పెట్టెల్లాగా ఆ విశేషణాల్ని పేర్చ మంటారన్నమాట!  

చాతుర్వర్ణ విమర్శను, ‘నిజమే’ అని అంగీకరించినాయన, ‘‘ఇంతకీ, ఈ సభల్లో ‘పంచములు’ ఎవరంటారు?’’ అని ప్రశ్న వేశాడు. ‘‘ఇంకెవరు? సభకి వచ్చి, ఈ గొప్ప అతిథులందరూ కూర్చున్న వేదికని ముట్టుకోడానికి వీల్లేనంత దూరంగా (అస్పృశ్యత), ప్రేక్షక స్థానాల్లో కూర్చుంటారే వారే పంచములు!’’ అని జవాబిచ్చాను. 

సాహిత్యసభల్లో పాటిస్తున్న ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఈ నాటిది కాదు. పాతికేళ్ళ కిందట, హైదరాబాదు యూనివర్సిటీలో, ఇతర విద్యార్థి సంఘాల వారి లాగే, ఒక దళిత విద్యార్థి సంఘం వారు, వాళ్ళ సభకి సంబంధించి ఒక ఆహ్వాన పత్రాన్ని నాకు ఇచ్చారు. ఆ పత్రంలో అన్ని అంతస్తుల అతిథుల పేర్లూ రాసి, ఆ పత్రాన్ని ఖరీదైన కవరులో పెట్టి ఇచ్చారు. ‘‘ఇదేమిటి బాబూ! సభకి వచ్చే వాళ్ళల్లో ఇన్ని తేడాలు ఎందుకు? ‘వేదిక మీద వాళ్ళే ముఖ్యులు, వేదిక కింద ఉన్న వాళ్ళు ముఖ్యులు కారు’– అనా? ‘వక్తలు’ అని, ఆ సభలో మాట్లాడేవారి పేర్లు రాస్తే సరిపోతుంది గదా? మాట మాట్లాడితే ‘బ్రాహ్మణీయ సంస్కృతి నశించాలి!’ అంటారు. అసమానత్వాన్ని సూచించే పద్ధతిని మీరూ పాటిస్తే ఎలా? పైగా, ఇంత ఖరీదైన కవరు ఎందుకూ? ఆ డబ్బులేవో ఇతర వాటికి ఖర్చు చెయ్యవచ్చు గదా?’’ అన్నాను. దానికి, ఆ ఉద్యమకారుడి జవాబు: ‘‘మీ కమ్యూనిస్టులు చెయ్యడం లేదా ఈ రకంగా? ఈ కవరంటారా, ఒకతను చందాగా ఇచ్చాడు’’ అని. 

దానికి నా జవాబు: ‘‘కమ్యూనిస్టులు ఎప్పుడో చెడిపోయారు. వాళ్ళు బూర్జువా పార్టీలకి తోకలుగా తయారయ్యారు. మరి మీరు ‘బ్రాహ్మణీయ సంస్కృతి నశించాలి! మనువాదం నశించాలి!’ అని భీకరంగా నినాదాలిస్తారే? ఈ విషయంలో, మీకూ మనువాదులకీ తేడా ఏమిటి?’’ అంటే జవాబు లేదు. జవాబు చెప్పాలంటే వారికి కష్టం. ఎందుకంటే, వారు ఆరాధ్య దైవంగా భావించే అంబేడ్కర్‌ అధ్యక్షతన తయారైన రాజ్యాంగంలోనే, చాతుర్వర్ణాలను తలపించే నాలుగు రకాల ‘బిరుదులు’ ఇచ్చే ఏర్పాటు ఉంది. పౌరులందరూ సమానులే అని ఒక వైపు చెపుతూనే, కొందరు భారతరత్నలు, కొందరు పద్మ విభూషణులు, కొందరు పద్మభూషణులు, మరికొందరు పద్మశ్రీలు!

సాధారణ ఉద్యమకారులే కాదు, విప్లవవాదులు కూడా మనుషుల మధ్య ఉండే ఈ రకం అసమాన విభజనను (ఒక రకం వ్యక్తిపూజని) వ్యతిరేకించరు. ఎందుకంటే, ప్రపంచంలో ఎవ్వరూ చేయించుకోనన్ని వ్యక్తి పూజలు చేయించుకున్న ‘మహా మహో పాధ్యాయులైన కామ్రేడ్స్‌ స్టాలిన్, మావో’ల్ని ఎవరైనా విమర్శిస్తే ఈ విప్లవవాదులు సహించలేరు.

సాహిత్య సభలలో, అతిథులందరూ వేదికను ‘అలంకరించి’, ఒకరు మాట్లాడుతుండగా, మిగతా వాళ్ళు ఇద్దరేసి చొప్పున చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అసలు ఒకరు మాట్లాడుతూ ఉంటే, మిగతా వక్తలందరూ, ఆ టైములో శ్రోతలే. వాళ్ళూ ప్రేక్షకులున్న చోటే కూచుని శ్రద్ధగా వినాలి. తమ వంతు వచ్చినప్పుడు, వేదిక మీదకి వెళ్ళి మాట్లాడాలి. ఇది తర్క బద్ధమైన ప్రవర్తన. సమానత్వ భావన. దీనికి విరుద్ధంగా జరిగే సభలకి ఆత్మగౌరవం గల వారెవరైనా వెళ్ళగలరా? (క్లిక్ చేయండి: ఎలా ఉంటే స్వతంత్రత?)

- బి.ఆర్‌. బాపూజీ
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement