book relase
-
రాధిక మంగిపూడి రాసిన 'విజయనగర వైభవ శతకం' ఆవిష్కరణ
'విజయనగర ఉత్సవ్ 2024' ప్రారంభోత్సవ సభలో మంగిపూడి రాధిక రాసిన విజయనగర వైభవ శతకం ఆవిష్కరించబడింది. శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర MSME SERP NRI సంబంధాల మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విజయనగరం శాసనసభ సభ్యురాలు ఆదితిగజపతి, జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ,ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు తదితర ప్రముఖులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.విజయనగరం జిల్లా వైభవాన్ని కీర్తిస్తూ వెలువడుతున్న తొలి పద్యశతకం ఇది. రాధిక మంగిపూడి తన స్వస్థలమైన విజయనగరం చరిత్ర, వారసత్వం, కళలు, అక్కడ పుట్టిన మహానుభావుల గురించి, 111 తేటగీతి పద్యాలతో ఈ 'విజయనగర వైభవ శతకం' రచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి ఉత్సవ సందర్భంగా ఆ అమ్మవారికి ఈ పుస్తకం అంకితమిచ్చారు. ' విజయనగరం సాగి జ్ఞానాంబ మెమోరియల్ బుక్ ట్రస్ట్' ఈ పుస్తకాన్ని ప్రచురించింది.రచయిత్రి, వ్యాఖ్యాత్రి, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాధిక “శ్రీ సాంస్కృతిక కళాసారధి” సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు. ''గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం' సంస్థ' వ్యవస్థాపక అధ్యక్షురాలు. 100 కు పైగా అంతర్జాతీయ కార్యక్రమాలకు వ్యాఖ్యాత్రిగా వ్యవహరించారు. ఇప్పటివరకు రెండు కథా సంపుటులు, రెండు కవితా సంపుటలు, ఒక పద్య శతకం, ఒక వ్యాస సంపుటి రచించారు."ఈ శతకం తన ఆరవ పుస్తకం అని, విజయనగరంలో ఇందరు పెద్దల చేతులమీదుగా ఈ పుస్తకం ఆవిష్కరణ జరగడం చాలా సంతోషంగా ఉందని, ఆ అవకాశాన్ని అందించిన మంత్రివర్యులకు, జిల్లా అధికారులకు రాధిక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సింగపూర్ 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితర సభ్యులందరూ రాధికకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. త్వరలో మరల అంతర్జాతీయ స్థాయిలో "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు"వేదికపై ఖతార్ దేశంలో దోహా నగరంలో ఈ శతకంలో పాటుగా రాధిక రాసిన మరొక వ్యాస సంపుటి కూడా ఆవిష్కరింపబడుతోందని హర్షం వ్యక్తం చేశారు. -
ఈ ఏడాది నా జీవితం పూరిపూర్ణమైంది
‘‘ఈ వేదికపై (శిల్ప కళా వేదిక) జరిగిన వందల ఆడియో ఫంక్షన్లకు వచ్చాను. నా పాటలు కూడా ఆవిష్కరించబడ్డాయి. కానీ ఆ ఫంక్షన్స్‌లో హీరోలను చూసేందుకు ప్రేక్షకులు వచ్చేవారు. కానీ ఈ రోజు ఇక్కడ పాట హీరో.. సంగీతం హీరో.. సాహిత్యం హీరో. ‘తాజ్‌మహల్’ సినిమాతో నన్ను రామానాయుడుగారు పరిచయం చేశారు. 1995లో మొదలైన నా ప్రయాణం 2023 వరకూ.. 28 సంవత్సరాలు.. 860కి పైగా సినిమాలు.. 3600లకు పైగా పాటలు రాశాను. ఈ ఏడాది నాకు, నా జీవితానికి, నా సాహిత్యానికి పరిపూర్ణతను తీసుకొచ్చింది. ఈ ఏడాది నాపై పురస్కారాల వర్షం కురిసింది. ఫిబ్రవరిలో గోల్డెన్‌గ్లోబ్ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్, క్రిటిక్స్ అవార్డు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్, బాంబే హంగామా అవార్డు, ఉత్తమ జాతీయ గీతరచయిత అవార్డు.. ఇలా వరుసగా ఒకే సంవత్సరం నన్ను ఆరు పురస్కారాలు వరించాయి. మన తెలుగుకు వెయ్యేళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాషా చరిత్ర ఉంది. నా మిత్రుడు ఒకరు ‘సంకల్పం’ అనే పుస్తకం తెలుగులో రాసి, ఈ పుస్తకం కోసం వారం రోజులు సెలవు పెట్టి అమెరికా నుంచి వచ్చారు. ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు ఆయన సహోద్యోగి ఎందుకు సెలవు పెట్టారని అడగ్గా... తెలుగు భాష పుస్తకం కోసం అని చెప్పగా.. ఆవిడ తెలుగు అంటే.. ఆ నాటు నాటు లాంగ్వేజ్ అన్నారట. ప్రపంచంలో తెలుగు అనేది ఒకటి ఉందని చాలామందికి తెలియదు. కానీ మొట్టమొదటిసారి ‘నాటు పాట’తో ఇది నాటు భాష అని తెలిసింది. ఈ పాట సృష్టికర్తల్లో నేను ఒకడిని. నా జన్మ చరితార్థమైంది. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించిన నిహారిక, ప్రదీప్, సరస్వతిలకు, వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు’’ అని అన్నారు. ఈ ఏడాది ఆస్కార్, జాతీయ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్న రచయిత చంద్రబోస్‌ని సత్కరించడానికి ‘తెలుగు జాతీయ చంద్రబోస్’ పేరిట శనివారం హైదరాబాద్‌లో నటుడు ప్రదీప్ ఓ వేడుక నిర్వహించారు. ఈ వేదికపై చంద్రబోస్‌ని, ఆయçన సతీమణి, నృత్యదర్శకురాలు, దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్‌ని సత్కరించారు. ఈ సందర్భంగా రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఆస్కార్, జాతీయ అవార్డు అందుకున్న చంద్రబోస్‌గారికి మా కవి కులం తరఫున అభినందనలు. బోస్‌గారి ప్రయాణం, ప్రస్థానం ఆదర్శవంతంగా ఉంటాయి. ఈ గొప్పదనం, ఆదర్శం ఒక్కరోజులో రాదు. తొలి రోజు నుంచే కష్టపడుతూ ఉండాలి. ఓ రచయితకు జరిగిన ఈ సన్మానాన్ని అక్షరానికి జరిగిన సన్మానంలా భావిస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో పలువురు కళాకారులను సన్మానించారు. మురళీమోహన్, ముప్పలనేని శివ, ఎంఎం శ్రీలేఖ, చంద్రబోస్ సోదరుడు రాజేందర్‌తో పాటు పలువురు సినీ, టీవీ నటీనటులు పాల్గొన్నారు. -
సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!
ఇటీవల సాహిత్య సభల్లో – అది పుస్తకా విష్కరణ సభ గానీ, ఇంకోరకం సభ గానీ– ఒక ధోరణి అంటువ్యాధి లాగా తయారైంది. ఆ సభలకి సంబంధించిన దాదాపు అన్ని ఆహ్వాన పత్రాల్లోనూ ఇలా ఉంటుంది: ‘‘ముఖ్య అతిథి, గౌరవ అతిథి, విశిష్ట అతిథి, ఆత్మీయ అతిథి’’– అని నాలుగు రకాల అతిథులూ, వారి పేర్లూ ఉంటాయి. ఇంతకీ, ఈ అతిథుల్లో ఎవరు ముందో, ఎవరు తర్వాతో, ఎవరు ఎక్కువ గొప్పో, ఎవరు తక్కువ గొప్పో తేల్చడం కష్టం. ఆ ఆహ్వాన పత్రంలో, ఏ వరసలో ఆ మాటలు రాశారో, బహుశా ఆ వరసలోనే వాళ్ళ అంతస్తు లేదా హోదా వుంటుందనుకోవాలేమో! అతిథుల్లో ఈ నాలుగు రకాల్నీ చూస్తే, చాతుర్వర్ణ వ్యవస్థ అంటారే అది గుర్తొస్తుంది. ఈ హైరార్కీని (అంతస్తుల వారీ సంబంధాలను) 11వ శతాబ్దంలో, రాజాస్థాన కవులు పాటిం చారో లేదో తెలియదు. కానీ, ఈ 21వ శతాబ్దంలో, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాల కాలంలో మాత్రం, ఆధుని కులూ, ఉత్తరాధునికులూ, అభ్యుదయ వాదులూ, విప్లవ వాదులూ, దళిత వాదులూ, స్త్రీ–పురుష సమానత్వ వాదులూ... ఇలా అన్ని రకాల వారూ ఈ హైరార్కీని పాటిస్తు న్నారు. నోరు తెరిస్తే, ‘చాతుర్వర్ణ వ్యవస్థ’, ‘మనువాదం’, ‘బ్రాహ్మణీయ సంస్కృతి’, ‘ఫ్యూడల్ సంస్కృతి’, ‘పితృస్వామ్య సంస్కృతి’ అని మైకులు బద్దలయ్యేలాగా నినాదాలిస్తారు. మళ్ళీ ఆ అసమాన సంస్కృతినే పాటిస్తారు. అటు సభా నిర్వాహకులకు గానీ, ఇటు అతిథులుగా ఆహ్వానం పొందిన సాహిత్యకారులకు గానీ, ‘ఇదేమి పద్ధతి?’ అనే ఆలోచనే రావడం లేదు. ఈ మధ్య, ఇలాంటి ఆహ్వాన పత్రాలు మూడు వేరు వేరు సభలకి సంబంధించినవి, ఫోనులో నాకు అందాయి. వాటిని పంపిన వాళ్ళతో, ‘చాతుర్వర్ణాల్లాగా, ఇన్ని రకాల అతిథు లేమిటండీ?’– అంటే, ఒకరు ‘నిజమే’ అనీ; ఇంకొకరు ‘ఈసారి ఇలా జరగకుండా చూసుకుంటాం’ అనీ; మరొకరు, రాయ డానికి బద్ధకం వేసి, ఎమోజీలు అంటారే, ఒక నవ్వు బొమ్మా, రెండు నమస్కారాల బొమ్మలూ జవాబుగా పంపారు. కొందరు అతిథులు తమ పేరుకు ముందుగానీ, కిందగానీ, తమకు ఉన్న డిగ్రీల్నీ (డాక్టర్, ప్రొఫెసర్), ఇంతకు ముందు అనుభవించిన పదవుల్నీ (డైరెక్టర్, వైస్–ఛాన్సలర్), పొందిన అవార్డుల్నీ (అకాడెమీలో, పీఠాలో ఇచ్చిన వాటిని), ఇంకేమైనా అదనపు బిరుదులు వుంటే వాటినీ, ఆహ్వాన పత్రంలో రాయమంటారని విన్నాను. రైలు ఇంజను వెనక వరసగా రైలు పెట్టెల్లాగా ఆ విశేషణాల్ని పేర్చ మంటారన్నమాట! చాతుర్వర్ణ విమర్శను, ‘నిజమే’ అని అంగీకరించినాయన, ‘‘ఇంతకీ, ఈ సభల్లో ‘పంచములు’ ఎవరంటారు?’’ అని ప్రశ్న వేశాడు. ‘‘ఇంకెవరు? సభకి వచ్చి, ఈ గొప్ప అతిథులందరూ కూర్చున్న వేదికని ముట్టుకోడానికి వీల్లేనంత దూరంగా (అస్పృశ్యత), ప్రేక్షక స్థానాల్లో కూర్చుంటారే వారే పంచములు!’’ అని జవాబిచ్చాను. సాహిత్యసభల్లో పాటిస్తున్న ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఈ నాటిది కాదు. పాతికేళ్ళ కిందట, హైదరాబాదు యూనివర్సిటీలో, ఇతర విద్యార్థి సంఘాల వారి లాగే, ఒక దళిత విద్యార్థి సంఘం వారు, వాళ్ళ సభకి సంబంధించి ఒక ఆహ్వాన పత్రాన్ని నాకు ఇచ్చారు. ఆ పత్రంలో అన్ని అంతస్తుల అతిథుల పేర్లూ రాసి, ఆ పత్రాన్ని ఖరీదైన కవరులో పెట్టి ఇచ్చారు. ‘‘ఇదేమిటి బాబూ! సభకి వచ్చే వాళ్ళల్లో ఇన్ని తేడాలు ఎందుకు? ‘వేదిక మీద వాళ్ళే ముఖ్యులు, వేదిక కింద ఉన్న వాళ్ళు ముఖ్యులు కారు’– అనా? ‘వక్తలు’ అని, ఆ సభలో మాట్లాడేవారి పేర్లు రాస్తే సరిపోతుంది గదా? మాట మాట్లాడితే ‘బ్రాహ్మణీయ సంస్కృతి నశించాలి!’ అంటారు. అసమానత్వాన్ని సూచించే పద్ధతిని మీరూ పాటిస్తే ఎలా? పైగా, ఇంత ఖరీదైన కవరు ఎందుకూ? ఆ డబ్బులేవో ఇతర వాటికి ఖర్చు చెయ్యవచ్చు గదా?’’ అన్నాను. దానికి, ఆ ఉద్యమకారుడి జవాబు: ‘‘మీ కమ్యూనిస్టులు చెయ్యడం లేదా ఈ రకంగా? ఈ కవరంటారా, ఒకతను చందాగా ఇచ్చాడు’’ అని. దానికి నా జవాబు: ‘‘కమ్యూనిస్టులు ఎప్పుడో చెడిపోయారు. వాళ్ళు బూర్జువా పార్టీలకి తోకలుగా తయారయ్యారు. మరి మీరు ‘బ్రాహ్మణీయ సంస్కృతి నశించాలి! మనువాదం నశించాలి!’ అని భీకరంగా నినాదాలిస్తారే? ఈ విషయంలో, మీకూ మనువాదులకీ తేడా ఏమిటి?’’ అంటే జవాబు లేదు. జవాబు చెప్పాలంటే వారికి కష్టం. ఎందుకంటే, వారు ఆరాధ్య దైవంగా భావించే అంబేడ్కర్ అధ్యక్షతన తయారైన రాజ్యాంగంలోనే, చాతుర్వర్ణాలను తలపించే నాలుగు రకాల ‘బిరుదులు’ ఇచ్చే ఏర్పాటు ఉంది. పౌరులందరూ సమానులే అని ఒక వైపు చెపుతూనే, కొందరు భారతరత్నలు, కొందరు పద్మ విభూషణులు, కొందరు పద్మభూషణులు, మరికొందరు పద్మశ్రీలు! సాధారణ ఉద్యమకారులే కాదు, విప్లవవాదులు కూడా మనుషుల మధ్య ఉండే ఈ రకం అసమాన విభజనను (ఒక రకం వ్యక్తిపూజని) వ్యతిరేకించరు. ఎందుకంటే, ప్రపంచంలో ఎవ్వరూ చేయించుకోనన్ని వ్యక్తి పూజలు చేయించుకున్న ‘మహా మహో పాధ్యాయులైన కామ్రేడ్స్ స్టాలిన్, మావో’ల్ని ఎవరైనా విమర్శిస్తే ఈ విప్లవవాదులు సహించలేరు. సాహిత్య సభలలో, అతిథులందరూ వేదికను ‘అలంకరించి’, ఒకరు మాట్లాడుతుండగా, మిగతా వాళ్ళు ఇద్దరేసి చొప్పున చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అసలు ఒకరు మాట్లాడుతూ ఉంటే, మిగతా వక్తలందరూ, ఆ టైములో శ్రోతలే. వాళ్ళూ ప్రేక్షకులున్న చోటే కూచుని శ్రద్ధగా వినాలి. తమ వంతు వచ్చినప్పుడు, వేదిక మీదకి వెళ్ళి మాట్లాడాలి. ఇది తర్క బద్ధమైన ప్రవర్తన. సమానత్వ భావన. దీనికి విరుద్ధంగా జరిగే సభలకి ఆత్మగౌరవం గల వారెవరైనా వెళ్ళగలరా? (క్లిక్ చేయండి: ఎలా ఉంటే స్వతంత్రత?) - బి.ఆర్. బాపూజీ రిటైర్డ్ ప్రొఫెసర్ -
భారత రాయబారి, మాల్యా.. ఓ వివాదం
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి బ్రిటన్ కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యా లండన్ లోని ఒక పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి కూడా హాజరుకావడం వివాదాన్ని రేకెత్తించింది. సహ రచయిత, పాత్రికేయుడు సన్నీ సేన్ తో కలసి సుహేల సేథ్ రచించిన 'మంత్రాస్ ఫర్ సక్సెస్' అనే పుస్తకాన్ని ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గురువారం ఆవిష్కరించారు. మీడియా నివేదికల ప్రకారం భారత హై కమిషనర్ నవతేజ్ సార్నా పాల్గొన్న సభకు మాల్యా కూడా హాజరయ్యారు. దీంతోపాటు అనంతరం జరిగిన ప్యానెల్ డిస్కషన్ సెషన్లో కూడా మాల్యా పాల్గొన్నాడని తెలిసింది. ఆ సమయంలో సార్నా అక్కడ ఉండడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది.ఇది భారత దౌత్యకార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మాల్యాను చూసిన మరుక్షణమే నవ్ తేజ్ ఆ వేదికనుంచి, ఆ సభనుంచి బయటకు వచ్చేసారని ప్రకటించింది. అలాగే తాము మాల్యాను ఆహ్వానించలేదనీ.. ఈ పుస్తకావిష్కరణ సభ గురించి సోషల్ మీడియా ప్రకటించడం, ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం ఈ పరిణామం చోటు చేసుకుందని నిర్వాహకులు చెప్పారని ప్రభుత్వం తెలిపింది. అయితే తన పుస్తకావిష్కరణ సభకు అందరూ ఆహ్వానితులేనని, ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని రచయిత సేథ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. మిగతా ప్రేక్షకుల్లాగానే మాల్యా కూడా పాల్గొన్నారని తెలిపారు.