భారత రాయబారి, మాల్యా.. ఓ వివాదం
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి బ్రిటన్ కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యా లండన్ లోని ఒక పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి కూడా హాజరుకావడం వివాదాన్ని రేకెత్తించింది. సహ రచయిత, పాత్రికేయుడు సన్నీ సేన్ తో కలసి సుహేల సేథ్ రచించిన 'మంత్రాస్ ఫర్ సక్సెస్' అనే పుస్తకాన్ని ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గురువారం ఆవిష్కరించారు.
మీడియా నివేదికల ప్రకారం భారత హై కమిషనర్ నవతేజ్ సార్నా పాల్గొన్న సభకు మాల్యా కూడా హాజరయ్యారు. దీంతోపాటు అనంతరం జరిగిన ప్యానెల్ డిస్కషన్ సెషన్‌లో కూడా మాల్యా పాల్గొన్నాడని తెలిసింది. ఆ సమయంలో సార్నా అక్కడ ఉండడం విమర్శలకు తావిచ్చింది.
దీనిపై ప్రభుత్వం స్పందించింది.ఇది భారత దౌత్యకార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మాల్యాను చూసిన మరుక్షణమే నవ్ తేజ్ ఆ వేదికనుంచి, ఆ సభనుంచి బయటకు వచ్చేసారని ప్రకటించింది. అలాగే తాము మాల్యాను ఆహ్వానించలేదనీ.. ఈ పుస్తకావిష్కరణ సభ గురించి సోషల్ మీడియా ప్రకటించడం, ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం ఈ పరిణామం చోటు చేసుకుందని నిర్వాహకులు చెప్పారని ప్రభుత్వం తెలిపింది.
అయితే తన పుస్తకావిష్కరణ సభకు అందరూ ఆహ్వానితులేనని, ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని రచయిత సేథ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. మిగతా ప్రేక్షకుల్లాగానే మాల్యా కూడా పాల్గొన్నారని తెలిపారు.