ఢాకా: రెండు దేశాల సరిహద్దుల్లోని ఐదు ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించిందంటూ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆదివారం ఢాకాలోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది. కంచె నిర్మాణం ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రణయ్ వర్మ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి విదేశాంగ శాఖ కార్యదర్శి జషీముద్దీన్‌తో దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ బీఎస్‌ఎస్ తెలిపింది.
ఈ పరిణామంపై అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సమావేశం అనంతరం హైకమిషనర్ వర్మ మీడియాతో మాట్లాడారు. ‘రెండు దేశాల సరిహద్దులను బీఎస్‌ఎఫ్, బీజీబీలు కాపలాకాస్తున్నాయి. ఈ రెండు విభాగాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి కూడా. సరిహద్దుల వెంట నేరాల కట్టడికి రెండు దేశాల మధ్య ఉన్న అంగీకారానికి అనుగుణంగా సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నాం’అని చెప్పారు. అంతకుముందు, బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి మీడియాతో మాట్లాడుతూ..ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో భారత్ ఫెన్సింగ్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను బంగ్లా జవాన్లు, స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. 1974లో కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment