border area
-
డ్రైవర్ వింత ప్రవర్తన.. ప్యాంటు, జాకెట్‌ను చెక్ చేస్తే 9 పాములు, 43 బల్లులు
కాలిఫోర్నియాలోని అమెరికా సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తి దుస్తుల్లో ఏకంగా 52 బల్లులు, పాములు బయటపడటంతో బోర్డర్ అధికారులు షాక్‌కి గురయ్యారు. వివరాల ప్రకారం.. మెక్సికో సరిహద్దుల్లో ఉన్న శాన్సిడ్రో సరిహద్దు వద్దకు ఓ వ్యక్తి ట్రక్కుతో వచ్చాడు. అయితే తనిఖీల్లో భాగంగా అధికారులు అతన్ని బయటకు పిలిచారు. ఈ క్రమంలో అతని ప్రవర్తన వింతగా ఉండేసరికి అధికారులకు అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేసేసరికి అసలు బాగోతమంతా బయటపడింది. (చదవండి: యుద్దం ఎఫెక్ట్.. దేశం వీడుతున్న ప్రేయసి.. లవ్ ప్రపోజ్ చేసిన ఉక్రెయిన్ సైనికుడు.. వీడియో వైరల్ ) అతను ఏకంగా 52 సరీసృపాలను చిన్న చిన్న సంచుల్లో దాచి సరఫరా చేసేందుకు ప్రయత్నించాడు. 9 పాములు, 43 అరుదైన బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి వేసుకున్న జాకెట్, ప్యాంటు పాకెట్లు, ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ వాటిని దాచిపెట్టుకుని సరిహద్దు దాటేందుకు ప్రయత్నించబోయాడు. అతను తరలిస్తున్న వాటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్న జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. "స్మగ్లర్లు ఇలాంటి వాటిని సరఫరా చేసేందుకు రకరకాల దారులు ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు. -
నిత్య దిగ్బంధనాలా..?
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు జాతీయ రహదారులను దిగ్బంధిస్తుండడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రహదారుల దిగ్బంధనానికి ముగింపు ఎక్కడ అని ప్రశ్నించింది. రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారులపై 20 నిమిషాల ప్రయాణానికి 2 గంటలు పడుతోందంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. సమస్యను న్యాయస్థానాలు, పార్లమెంట్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ జాతీయ రహదారులపై జనం రాకపోకలను అడ్డుకోవడం ద్వారా కాదని పేర్కొంది. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహకులదని స్పష్టం చేసింది. ‘ఏవైనా ఆదేశాలు జారీ చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి వచ్చామంటూ ఆరోపిస్తారు. చట్టాన్ని ఎలా అమలు చేయాలనేది కార్యనిర్వాహకుల బాధ్యత’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోడ్లపై ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా రైతులను అభ్యరిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. జాతీయ రహదారులను దిగ్బంధించకుండా నిరసనకారులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నామని హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. చర్చల నిమిత్తం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, రైతులు రావడానికి నిరాకరిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు నాలుగుకు వాయిదా వేసింది. -
బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాలకు కొత్తగా బలగాలను తరలించరాదన్న ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖకు చైనా వైపున్న మిలటరీ పాయింట్స్‌లో బలగాల సంఖ్యను పెంచింది. ఉద్రిక్తతలను తొలగించే ఉద్దేశంతో గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఈ చర్యలకు పాల్పడింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఘర్షణాత్మక ప్రదేశాలకు కొత్తగా బలగాలను పంపించరాదని గతేడాది సెప్టెంబర్ 21న జరిగిన 6వ విడత చర్చల సమయంలో చైనానే ప్రతిపాదించడం గమనార్హం. తమ ప్రతిపాదనపై కుదిరిన ఒప్పందాన్నే చైనా ఉల్లంఘించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచే బలగాల మోహరింపు కార్యక్రమాన్ని చైనా చేపట్టిందని వెల్లడించాయి. చైనా చర్యలను గమనించిన భారత్.. ముందు జాగ్రత్తగా పలు కీలక ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. దాంతో, ఇరుదేశాల సాయుధ దళాలు, యుద్ధ ట్యాంకులు మరింత దగ్గరగా మోహరించిన పరిస్థితి మరోసారి నెలకొంది. చైనాతో 9వ విడత చర్చలు భారత్, చైనాల మధ్య ఆర్మీ కమాండర్ స్థాయిలో మరో విడత చర్చలు ఆదివారం జరిగా యి. దాదాపు రెండున్నర నెలల తరువాత జరిగిన 9వ విడత చర్చలు ఇవి. నవంబర్ 6న ఇరు దేశాల మధ్య 8వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాల ఉపసంహరణ కొనసాగాలన్న అంశంపై 9వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు ఆవలివైపు(చైనా వైపు) మోల్దో సరిహద్దు పాయింట్ వద్ద ఉదయం 10 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీజీకే మెనన్ నాయకత్వం వహించారు. ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌లోని పలు వ్యూహాత్మక పర్వత ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది భారత సైనికులు మోహరించి ఉన్నారు. చైనా కూడా దాదాపు అంతే సంఖ్యలో సైనికులను సిద్ధంగా ఉంచింది. మరిన్ని దళాలను పంపించకూడదని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించ కూడదని, 6వ విడత చర్చల సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే. -
వ్యూహాత్మక రోడ్డుకోసం భారీ నిర్మాణ సామగ్రి
పితోర్‌గఢ్: భారత్–చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వత సానువుల్లో కీలకమైన వ్యూహాత్మక రోడ్డు నిర్మాణం వేగవంతం చేసేందుకుగాను భారీ యంత్ర సామగ్రిని హెలీకాప్టర్ల ద్వారా తరలించినట్లు సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) తెలిపింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్‌గఢ్ జిల్లా జోహార్ లోయలో మున్సియారీ–బుగ్డియార్–మిలాం మార్గంలో రోడ్డు నిర్మాణం పూర్తయితే చైనా సరిహద్దులకు అతి సమీపంలోకి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. కానీ, భారీ కొండరాళ్లు అడ్డురావడంతో రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ రాళ్లను అడ్డుతొలగించేందుకు అవసరమైన భారీ యంత్ర సామగ్రిని అక్కడికి తరలించేందుకు బీఆర్వో 2019లో చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా, యంత్ర సామగ్రితో బయలుదేరిన హెలీకాప్టర్లు ఆ మార్గానికి దగ్గర్లోని లాప్సిలో విజయవంతంగా దిగాయి. దీంతో పనులు వేగం పుంజుకుని ఈ రహదారి నిర్మాణం వచ్చే మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని బీఆర్వో చీఫ్ ఇంజినీర్ బిమల్ గోస్వామి వెల్లడించారు. 2010లో ప్రారంభమైన ఈ రహదారి కోసం ప్రభుత్వం రూ.325 కోట్లు కేటాయించింది. దాదాపు 65 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిలోని మొదటి, చివరి భాగాలు పూర్తి కాగా భారీ కొండరాళ్ల కారణంగా 22 కిలోమీటర్ల నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. -
‘కాగ్నా’ వద్ద ఇసుక మంటలు
బషీరాబాద్: కాగ్నా నది వద్ద తెలంగాణ– కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం తారస్థాయికి చేరింది. నదిలో వాటాలు తేల్చకుండానే పొరుగు రాష్ట్రం అధికారులు ఇసుక తవ్వకాలు చేపట్టడం ఇందుకు కారణమైంది. రెండు రాష్ట్రాల సరిహద్దు పంచాయితీ తేల్చకుండానే గురువారం కర్ణాటక ప్రభుత్వం పోలీసు బందోబస్తు మధ్య ఇసుక తవ్వకాలు చేపట్టింది. తమ భూ భాగంలోనే ఇసుక తవ్వకాలు జరుపుతోందని, ఎవరైనా అడ్డుçకుంటే అరెస్టు చేస్తామని కర్ణాటక పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయం తెలియగానే బషీరాబాద్ తహసీల్దార్ ఉమామహేశ్వరి, ఎస్.ఐ. మహిపాల్‌రెడ్డి తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో సుళ్‌లైపేట్ ఎస్ఐ రాజశేఖర్, బషీరాబాద్ తహసీల్దార్ ఉమామహేశ్వరితో వాగ్వాదానికి దిగారు. ముందుకు వస్తే అరెస్టు చేస్తామని తహసీల్దార్‌ను హెచ్చరించారు. దీంతో బషీరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా ఇరు రాష్ట్రాల పోలీసులు ఘర్షణకు దిగారు. కన్నడ పోలీసులపై తిరగబడిన క్యాద్గిరా రైతులు మరోవైపు క్యాద్గిరా రైతులు కూడా ఒక్కసారిగా కన్నడ పోలీసులపై తిరగబడ్డారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. సరిహద్దులపై ఉమ్మడి సర్వేకు అంగీకరించిన కన్నడ అధికారులు ఏకపక్షంగా సర్వే చేసి హద్దులు ఎలా నిర్ణయిస్తారని తహసీల్దార్ అక్కడి అధికారులపై మండిపడ్డారు. తెలంగాణ భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చి తమపైనే జులుం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. కన్నడ అధికారుల దుందుడుకు చర్యలపై తహసీల్దార్ వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫోన్లో సమాచారం చేరవేశారు. కలెక్టర్ ఆదేశాలతో తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావ్, డీఎస్పీ రామచంద్రుడు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మరోవైపు కర్ణాటక ఉన్నతాధికారులు సైతం అక్కడికి వచ్చారు. సేడం రెవెన్యూ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ సుశీల, చించొళ్లీ ›తహసీల్దార్ బీరేధర్, సుళ్‌లైపేట్ సీఐ కట్టిమణి కాగ్నాకు వచ్చి సరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ అధికారులు పూర్తి ఆధారాలు లేకుండా అడ్డుకోవడం మంచిది కాదని అసిస్టెంట్ కమిషనర్ సుశీల హెచ్చరించారు. తాము కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే అడ్డుకున్నామని ఇక్కడి అధికారులు తెలిపారు. ఎంతకీ పంచాయితీ తేలకపోవడంతో వివాదాన్ని ఇరు రాష్ట్రాల జిల్లా కలెక్టర్ల కోర్టులోకి పడేశారు. నేడు వికారాబాద్, గుల్బర్గా జిల్లాల కలెక్టర్ల భేటీ... తెలంగాణ –కర్ణాటక అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాన్ని తేల్చడానికి వికారాబాద్, గుల్బర్గా జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగారు. వికారాబాద్ కలెక్టర్ ఉమర్ జలీల్ కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా కలెక్టర్ పి.వెంకటేశ్కుమార్తో ఫోన్లో చర్చలు జరిపారు. ఇరువర్గాల అధికారులను వెనక్కి పంపించారు. సరిహద్దు సమస్య తీవ్రరూపం దాల్చడంతో దానికి ఫుల్స్టాప్ పెట్టాలని ఇరువురు కలెక్టర్లు ఏకాభి ప్రాయానికి వచ్చారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాద్గిరా దగ్గర కాగ్నాలో భేటీ కావాలని నిర్ణయించారు. ఉమ్మడి రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఉమ్మడి సర్వే చేయడానికి ఏర్పాట్లు చేయాలని సరిహద్దు ప్రాంతాల్లోని తమతమ అధికారులకు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు. బషీరాబాద్ రెవెన్యూ అధికారులు గురువారం సాయంత్రం వికారాబాద్‌లో కలెక్టర్‌ను కలసి నివేదిక అందజేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఖతార్ దేశం ఇకపై ద్వీపం!
రియాద్: ఇప్పటికే సంబంధాలు దెబ్బతిన్న సౌదీ అరేబియా, ఖతార్‌ల మధ్య చిచ్చుపెట్టే మరో అంశం తెరపైకొచ్చింది. ఖతార్ సరిహద్దులో 60 కి.మీ పొడవు, 200 మీటర్ల వెడల్పుతో ఓ కాలువను తవ్వాలని సౌదీ అరేబియా యోచిస్తోంది. ఈ కాలువ వల్ల ద్వీపకల్పంగా ఉన్న ఖతార్ దీవిగా మారుతుందని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్టు సాకారమైతే సౌదీ ప్రధాన భూభాగం నుంచి ఖతార్ ద్వీపకల్పం పూర్తిగా వేరుపడుతుందని తెలిపాయి. కాలువలో కొంత భాగాన్ని అణు వ్యర్థాల శుద్ధి ప్లాంట్‌కు కేటాయించాలని సౌదీ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్లు తెలిసింది. ప్రతిపాదిత సాల్వా దీవి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉందని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారుడు సౌద్ అల్–కాటాని శుక్రవారం ట్వీట్ చేశారు. ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఇరాన్‌కు సన్నిహితంగా మెలుగుతోందని ఆరోపిస్తూ సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు గతేడాది ఏప్రిల్‌లో ఖతార్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఖతార్‌కు ఉన్న ఏకైక భూ సరిహద్దును మూసేసారు. ఆ దేశ విమానాలు తమ గగనతలాన్ని వినియోగించుకోకుండా పొరుగుదేశాలు నిషేధం విధించాయి. సంక్షోభాన్ని పరిష్కరించడంలో అమెరికా, కువైట్ల మధ్యవర్తిత్వం విఫలమైంది. సాల్వా కాలువ ప్రాజెక్టుపై ఖతార్ స్పందించలేదు. -
గుజరాత్ సరిహద్దులో పాక్ ఎయిర్ బేస్ కలకలం
న్యూఢిల్లీ : గుజరాత్ సరిహద్దు వెంబడి సింధ్ ప్రోవిన్స్‌లో భోలారి ప్రాంతంలో పాకిస్తాన్ ఆధునిక ఎయిర్‌బేస్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఎయిర్‌బేస్‌లో పాకిస్తాన్ తన చైనా జేఎఫ్-17 యుద్ధ విమానాలను మోహరిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎయిర్‌బేస్ గత కొద్దికాలంగా పనిచేస్తున్నా యుద్ధ విమానాల విన్యాసాలు ఈ స్థాయిలో జరగడంఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత వాయుసేనకు దీటుగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ పెద్దసంఖ్యలో చైనా నుంచి జేఎఫ్-17 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది. ఇదే ఎయిర్‌బేస్‌కు చేరువలోనే పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (నేవీ) కమాండోలను సైతం రంగంలోకి దింపింది. సముద్ర మార్గం గుండా భారత్‌లో దాడులకు లష్కరే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ ఎయిర్‌బేస్‌ను వాడతారే ప్రచారం సాగుతున్న క్రమంలో కమాండోలను ఇక్కడికి రప్పించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ సన్నాహాలకు దీటుగా గుజరాత్ బోర్డర్లోని దీసా వద్ద యుద్ధ ఎయిర్‌బేస్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే అక్కడ రన్‌వే ఏర్పాటు, యుద్ధ విమానాల తరలింపు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు కనీసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. -
భారత సరిహద్దుల్లో నివసించండి!
బీజింగ్: చైనా–భారత్ సరిహద్దులో స్థిర నివాసం ఏర్పాటుచేసుకుని చైనాకు రక్షణగా ఉండాలని ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ టిబెట్ పశువుల కాపరులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. టిబెట్‌లోని లూంజె కౌంటీలో తమ టౌన్షిప్ గురించి వివరిస్తూ ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు జిన్‌పింగ్‌కు లేఖ రాశారు. దానికి బదులు పంపుతూ ఆయన...భారత సరిహద్దులో నివాసాలు ఏర్పరచుకోవాలని సూచించారు.చైనా తనదిగా చెప్పుకుంటున్న భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలోలూంజె కౌంటీ ఉంది. ఆ బాలికల కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను జిన్‌పింగ్ ప్రశంసిస్తూ వారికి ధన్యవాదాలు చెప్పారని తెలిపింది. మరింత మంది పశువుల కాపర్లు అక్కడ నివసించేలా ఆ కుటుంబం ప్రోత్సహిస్తుందని జిన్‌పింగ్ ఆశిస్తున్నట్లు పేర్కొంది. -
ఏజెన్సీలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్న చర్ల పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అంబర్కిశోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం ఆయన చర్ల పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. -
దేశమే లేని దీనులు..!
భారత్-బంగ్లా సరిహద్దు ప్రాంతవాసుల దుస్థితి ‘నో మేన్స్ ల్యాండ్’లో 70 వేల మంది పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం జీరో పాయింట్ (బంగ్లా సరిహద్దు): బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డప్పుడు అది భారత్‌తో కుదుర్చుకున్న ‘భూ సరిహద్దు ఒప్పందం’ (ఎల్బీఏ) పరిధిలోకి రాకపోవడంతో అక్కడున్న 260 గ్రామాలకు చెందిన 70 వేల మంది అనాథలుగా మారిపోయారు. ఈ పల్లెటూళ్లు ‘నో మేన్స్ ల్యాండ్’ (ఎవరికీ చెందని ప్రాంతం) పరిధిలోకి వెళ్లడంతో ఈ ప్రజలంతా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. తరచూ నేరాల బారినపడుతున్నారు. సరిహద్దు మీదుగా అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ చెలామణి అడ్డుకోవడానికి గస్తీ నిర్వహించే భద్రతా దళాలకు వీరిపై ఎలాంటి వైఖరి అనుసరించాలో తెలియని వింత పరిస్థితి ఎదురవుతోంది. ఎల్బీఏ అమలైన తరువాత సరిహద్దులోని పలు వివాదాస్పద ప్రాంతాలను భారత్, బంగ్లాదేశ్ నియమాల ప్రకారం బదలాయించుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలోని ఈ గ్రామాలపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ‘ఈ గ్రామాలను అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోకి తీసుకురావడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందని మేం ప్రభుత్వానికి విన్నవించాం. అయినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి స్పందన రాలేదు. ఈ గ్రామాలు తరచూ చట్టవ్యతిరేక కార్యకలాపాల బారినపడుతున్నాయి. కొన్నిసార్లు చొరబాటు యత్నాలు జరుగుతున్నాయి’ అని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ సందీప్ సాలుంకే అన్నారు. పానితర్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో పక్క పక్కనే ఉన్న ఇళ్లలో ఒకటి భారత్, మరొకటి బంగ్లాదేశ్ పరిధిలోకి వస్తాయి. పది మీటర్ల వెడల్పున్న మార్గం రెండు దేశాలను విడదీస్తుందని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా చొరబాట్లుదారులు, నేరగాళ్లపై నిఘా ఉంచడం కష్టసాధ్యంగా మారిందని చెప్పాయి. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు పొడవు 4,096 కిలోమీటర్లు కాగా, దక్షిణ బెంగాల్ మార్గంలోని ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నాదియా, ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల పరిధిలోనే ఇలాంటివి 54 గ్రామాలు ఉన్నాయి. వీటిలోని 4,749 కుటుంబాల్లో దాదాపు 30 వేల మంది నివసిస్తున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ నేరాల రేటు ఎక్కువగా ఉందని బీఎస్ఎఫ్ తెలిపింది. ఎవరికీ చెందని ప్రాంతాలపై నిఘా కోసం జవాన్లు వినూత్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. అక్కడి ప్రజలను సులువుగా గుర్తుపట్టడానికి ఫొటోలతో కూడిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎవరు వచ్చినా వివరాలు సేకరిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎక్కువ శాతం చిన్నవే కాబట్టి అన్నింటినీ అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోకి తీసుకురావడం ఒక్కటే శాశ్వత పరిష్కారమని బీఎస్ఎఫ్ కమాండింగ్ అధికారి రత్నేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ గ్రామాల మహిళలు, చిన్నారుల సాయంతో దళారులు సిగరెట్లు, ఆహార పదార్థాలను భారత్‌లోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని వెల్లడించారు. భారత్ నుంచి కూడా బంగ్లాదేశ్‌లోకి ఆభరణాలు, దగ్గుమందు (మత్తుకోసం), వాహన విడిభాగాలు దొంగతనంగా రవాణా అవుతున్నాయి. ఇలాంటి ఘటనలపై వందలాది కేసులు నమోదైనట్టు కుమార్ చెప్పారు.