సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు జాతీయ రహదారులను దిగ్బంధిస్తుండడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రహదారుల దిగ్బంధనానికి ముగింపు ఎక్కడ అని ప్రశ్నించింది. రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారులపై 20 నిమిషాల ప్రయాణానికి 2 గంటలు పడుతోందంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. సమస్యను న్యాయస్థానాలు, పార్లమెంట్‌లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ జాతీయ రహదారులపై జనం రాకపోకలను అడ్డుకోవడం ద్వారా కాదని పేర్కొంది.
ఈ విషయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహకులదని స్పష్టం చేసింది. ‘ఏవైనా ఆదేశాలు జారీ చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి వచ్చామంటూ ఆరోపిస్తారు. చట్టాన్ని ఎలా అమలు చేయాలనేది కార్యనిర్వాహకుల బాధ్యత’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోడ్లపై ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా రైతులను అభ్యరిస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. జాతీయ రహదారులను దిగ్బంధించకుండా నిరసనకారులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నామని హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. చర్చల నిమిత్తం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, రైతులు రావడానికి నిరాకరిస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు నాలుగుకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment