![Centre is handling this issue correctly says CJI - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/11/farm%20laws%20sc.jpg.webp?itok=HD3R-uxc)
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం సుదీర్ఘ ఉద్యమం చేస్తున్న రైతులు, రైతు సంఘాలకు భారీ ఊరట లభించింది. మూడు వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం చట్టాల అమలును నిలిపి వేయాలని లేదంటే తామే స్టే విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెగేసి చెప్పింది. ఈ చట్టాల పరిశీలనకు గాను ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే రైతులు తమ నిరసనను కొనసాగించుకోవచ్చని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాల పై స్టే ఇచ్చిన తర్వాత ఆందోళన నిలిపి వేస్తారా ? అని సుప్రీం రైతు సంఘాల ఉద్యమ నేతలను ప్రశ్నించింది. తదుపరి వాదనలను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.
ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మక సమస్యగా ఎందుకు చూస్తోందని ప్రశ్నించిన సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా కేంద్ర వైఖరిపై అసంతృప్తితో ఉన్నామన్నారు. రైతుల ఆందోళన, సమస్యను పరిష్కరించడంలో సరిగా వ్యవహరించలేదన్నారు. పలు దఫాలు చర‍్చలు విఫలంపై స్పందిస్తూ కేంద్రం పరిస్థితిని సరిగ్గా నిర్వహిస్తోందని, చర్చలు ప్రభావవంతంగా ఉన్నాయని తాము విశ్వసించడలేదంటూ ఘాటుగా స్పందించారు. అందుకే చట్టాల అమలును నిలిపివేయడం ద్వారా వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతు సంఘాలతో ప్రభుత్వ చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య సీజేఐ వ్యాఖ్యలు ప్రాధన్యతను సంతరించుకున్నాయి.
కొంతమంది రైతులు ఆత్మహత్యలను ప్రస్తావించిన సుప్రీం, వీటిపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటికీ ప్రభుత‍్వమే బాధ్యత వహించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతోందని కూడా ప్రశ్నించింది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. మ ఇకపై ఎవరి రక్తంతోనూ మన చేతులు తడవకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాల పరిశీనలకుగాను ఐసీఎఆర్‌తో సహా నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై వ్యతిరేక, అనుకూల వాదనలను ఈ కమిటీకి అందించుకోవచ్చని, కమిటీ నివేదిక మేరకు వ్యవహరిస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు కేవలం రెండు, మూడు రాష్ట్రాలు మాత్రమే నిరసన తెలుపుతున్నాయని అటార్నీ జనరల్ మెహతా సుప్రీంకు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల రైతులు, ఇతర ప్రాంతాల రైతులు నిరసనల్లో పాల్గొనడం లేదన్నారు. అయితే కమిటీ వేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చట్టాలను నిలుపుదల చేయవద్దని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment