పితోర్‌గఢ్: భారత్–చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వత సానువుల్లో కీలకమైన వ్యూహాత్మక రోడ్డు నిర్మాణం వేగవంతం చేసేందుకుగాను భారీ యంత్ర సామగ్రిని హెలీకాప్టర్ల ద్వారా తరలించినట్లు సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) తెలిపింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్‌గఢ్ జిల్లా జోహార్ లోయలో మున్సియారీ–బుగ్డియార్–మిలాం మార్గంలో రోడ్డు నిర్మాణం పూర్తయితే చైనా సరిహద్దులకు అతి సమీపంలోకి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. కానీ, భారీ కొండరాళ్లు అడ్డురావడంతో రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ఈ రాళ్లను అడ్డుతొలగించేందుకు అవసరమైన భారీ యంత్ర సామగ్రిని అక్కడికి తరలించేందుకు బీఆర్‌వో 2019లో చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా, యంత్ర సామగ్రితో బయలుదేరిన హెలీకాప్టర్లు ఆ మార్గానికి దగ్గర్లోని లాప్సిలో విజయవంతంగా దిగాయి. దీంతో పనులు వేగం పుంజుకుని ఈ రహదారి నిర్మాణం వచ్చే మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని బీఆర్‌వో చీఫ్ ఇంజినీర్ బిమల్ గోస్వామి వెల్లడించారు. 2010లో ప్రారంభమైన ఈ రహదారి కోసం ప్రభుత్వం రూ.325 కోట్లు కేటాయించింది. దాదాపు 65 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిలోని మొదటి, చివరి భాగాలు పూర్తి కాగా భారీ కొండరాళ్ల కారణంగా 22 కిలోమీటర్ల నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment