
మంచుచరియల కింద నుంచి 50
మందిని రక్షించిన సహాయక బృందాలు
వారిలో నలుగురి దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని ఛమోలా జిల్లా మనా గ్రామంలో హిమపాతం కారణంగా మంచు చరియల్లో కూరుకుపోయిన వారిలో మొత్తంగా ఇప్పటిదాకా 50 మంది కార్మికులను బయటకు తీసుకురాగలిగారు. అయితే వీరిలో నలుగురి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేసినా ఫలితంలేకుండా పోయింది. ఆ నలుగురు శనివారం చనిపోయారని జిల్లా విపత్తు నిర్వహణాధికారి ఎన్‌కే జోషి చెప్పారు. మంచుచరియల్లో కూరుకుపోయిన మిగతా నలుగురి కోసం అన్వేషణ తీవ్రతరం చేశారు. తొలుత ఐదుగురు చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.
ఐదుగురిలో సునీల్ అనే కార్మికుడు ప్రాణాలతో బయటపడి సొంతూరుకు వెళ్లినట్లు తాజాగా తేలింది. దీంతో నలుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. బద్రీనాథ్ ఆలయానికి వెళ్లే రహదారిలో మంచుచరియలు పడటంతో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్‌ఓ) కార్మికులు ఆ మంచును తొలగిస్తుండగా శుక్రవారం ఉదయం ఇతర 55 మంది సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్న కంటైనర్లు, షెడ్‌పై మంచుచరియలు పడటంతో దుర్ఘటన జరిగిన విషయం తెల్సిందే. వీరిలో 33 మందిని శుక్రవారం రాత్రి, 17 మందిని శనివారం మంచు నుంచి బయటకు లాగారు. మంచులో 57 మంది కూరుకుపోయారని శుక్రవారం వార్త లొచ్చాయి. శనివారం మాత్రం 55 మంది మాత్రమే చిక్కుకున్నారని అధికారులు చెప్పారు.
6 హెలికాప్టర్ల వినియోగం
శుక్రవారం రాత్రంతా భారీగా మంచు కురియడంతో అన్వేషణకు విరామమిచ్చి శనివారం ఉదయాన్నే ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్, బీఆర్‌ఓ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, వాయుసేన ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలెట్టాయి. వీరికి జిల్లా యంత్రాంగం, వైద్య విభాగం తగు సాయం అందిస్తున్నాయి. ‘‘భారతీయ సైన్యానికి చెందిన మూడు, వాయు సేనకు చెందిన రెండు, మరో పౌర హెలికాప్టర్‌ను మొత్తంగా ఆరు హెలికాప్టర్లను గాలింపు కోసం వినియోగిస్తున్నాం. బయటకులాగిన వారిలో 24 మందికి గాయాలయ్యాయి. వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించాం’’ అని ఆర్మీ అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment