India - China
-
మూడోరోజూ అమ్మకాలే..!
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇంధన, ఐటీ రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 531 పాయింట్లను కోల్పోయి 48,348 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133 పాయింట్లు పతనమైన 14,238 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు. ఈ మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1444 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 407 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, అధిక వెయిటేజీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు సిక్కిం సరిహద్దుల్లో భారత్– చైనా సైనిక బలగాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. సూచీల ఒకశాతం పతనంతో రూ.2.1 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.192.3 లక్షల కోట్లకు దిగివచ్చింది. దేశీయ ఇన్వెస్టర్ల(డీఐఐ)తో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ నికర అమ్మకందారులుగా మారి మొత్తం రూ.765 కోట్ల షేర్లన విక్రయించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నేడు (మంగళవారం) మార్కెట్లకు సెలవు. ఇంట్రాడేలో 988 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్..! ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల పరిణామాలతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలో కొంత షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 385 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడ్డాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొన్న అంతర్గత బలహీనతలు సూచీల లాభాలకు అడ్డువేశాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. నేడు మార్కెట్‌కు సెలవు, ఎల్లుండి జనవరి ఎఫ్అండ్ఓ ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. చివరి అరగంటలో అమ్మకాల తీవ్రత మరింత పెరగడంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి(49,263) 988 పాయింట్లను కోల్పోయి 48,275 వద్దకు వచ్చింది. నిఫ్టీ సైతం డే హై(14,491) నుంచి 274 పాయింట్లు నష్టపోయి 14,491 స్థాయిని తాకింది. రిలయన్స్‌ను అధిగమించిన టీసీఎస్ రిలయన్స్ షేరు పతనం టీసీఎస్ కంపెనీకి కలిసొచ్చింది. మార్కెట్ క్యాప్ విషయంలో రిలయన్స్‌ను అధిగమించి టీసీఎస్ దేశంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ షేరు ఇంట్రాడేలో రూ.3,345 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకి చివరికి 0.36% స్వల్ప నష్టంతో రూ.3,291 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 12.34 లక్షల కోట్లకు చేరింది. ఇక 5.36% పతనమైన రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.12.29 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఒక్కరోజులో ముకేశ్ అంబానీకి రూ. 38వేల కోట్ల నష్టం రిలయన్స్ షేరు భారీ పతనంతో ఈ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరోజులోనే రూ.38 వేల కోట్ల సంపదను కోల్పోయారు. రిలయన్స్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లు మెప్పించలేకపోయాయి. దీంతో షేరు ఇంట్రాడేలో 5.71% నష్టపోయి రూ.1932 స్థాయికి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. ఫలితంగా కంపెనీలో సగానికి పైగా వాటా కలిగిన ముకేశ్ ఏకంగా రూ.38 వేల కోట్ల నష్టాన్ని చవిచూశారు. దీంతో బ్లూమ్‌బర్గ్ బిలినియర్ ఇండెక్స్‌లో అంబానీ 11వ స్థానం నుంచి 12వ స్థానానికి తగ్గింది. -
చైనాతో బంధంపై ‘సరిహద్దు’ ప్రభావం
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, ఈ పరిస్థితులు రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. తను రాసిన ‘ది ఇండియా వే’పై జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. భారత్–చైనా సరిహద్దు సమస్య చాలా కష్టమైందీ, క్లిష్టమైంది అంటూ ఆయన.. గత మూడు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలను చారిత్రక కోణంలో ఆవిష్కరించారు. వాణిజ్యం, పర్యాటకం, ఇతర కార్యక్రమాల ద్వారా 1980ల నుంచి ఈ సంబంధాలు క్రమంగా మెరుగుపడుతూ వచ్చాయన్నారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణానికి భంగం కలిగితే ఆ ప్రభావం రెండు దేశాల మధ్య సంబంధాలపైనా ఉంటుందని, ఏం జరుగనుందో చూడాలని అన్నారు. అంతర్జాతీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్న భారత్, చైనాలు..తమ మధ్య సమతౌల్యాన్ని ఎలా సాధిస్తాయనేదే పెద్దప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకాన్ని ఏప్రిల్‌కు ముందే రాశాననీ, అప్పటికి తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు మొదలుకాలేదని ఆయన అన్నారు. -
చైనాకు దీటుగా బదులిస్తాం
-
చైనాకు దీటుగా బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో చైనా సుమారు 17 వేల సైనికులను, యుద్ధ వాహనాలను మోహరించింది. ఏప్రిల్, మేల నుంచే చైనా ఆ ప్రాంతాలకు బలగాల తరలింపు ప్రారంభించింది. అలాగే, అక్కడ పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 10 నుంచి పీపీ 13 వరకు భారత బలగాల గస్తీ విధులను చైనా సైనికులు అడ్డుకోవడం ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో, భారత్ కూడా అదే స్థాయిలో స్పందించిందని, టీ 90 రెజిమెంట్స్ సహా భారీగా బలగాలను ఆ ప్రాంతాలకు తరలించిందని వెల్లడించాయి. కారకోరం పాస్ దగ్గర్లోని పీపీ 1 దగ్గర్నుంచి పెద్ద ఎత్తున భారత్ బలగాలను దెప్సాంగ్‌కు తరలించిందని తెలిపాయి. ఏదైనా దుస్సాహసానికి పాల్పడాలంటే చైనా పలుమార్లు ఆలోచించే స్థాయిలో 15 వేల మంది భారత జవాన్లు అక్కడ సిద్ధంగా ఉన్నారన్నాయి. టీడబ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి కారకోరం కనుమ వరకు రోడ్డు నిర్మించాలని చైనా భావిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణంతో రెండు బెటాలియన్ల మధ్య దూరం చాలా తగ్గుతుంది. భారత భూభాగంలోని పీపీ 7, పీపీ 8 మధ్య చైనా గతంలో చిన్న వంతెనను నిర్మించగా భారత సైనికులు దాన్ని కూల్చేశారు. భౌగోళిక సమగ్రతలో రాజీ లేదు చైనాకు మరోసారి స్పష్టం చేసిన భారత్ దేశ భౌగోళిక సమగ్రత విషయంలో రాజీ లేదని చైనాకు భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సొ, ఇతర ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ఇరుదేశాల మిలటరీ కమాండర్ స్థాయి ఐదో విడత చర్చల సందర్భంగా స్పష్టం చేసింది. సీనియర్ కమాండర్ స్థాయి అధికారుల నేతృత్వంలో ఆదివారం చైనా భూభాగంలోని మోల్డో వద్ద 11 గంటల పాటు చర్చించారు. రెండు దేశాల మధ్య సౌహార్ధ సంబంధాలు నెలకొనాలంటే.. వాస్తవాధీన రేఖ వెంట గతంలో ఉన్న యథాతథ స్థితి నెలకొనడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేసినట్లు ఆర్మీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ‘గల్వాన్ లోయ, పలు ఇతర ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ పాంగాంగ్ సొ ప్రాంతంలోని ఫింగర్ 4, ఫింగర్ 8 ల్లో, గొగ్రా వద్ద బలగాలను ఉపసంహరించకపోవడంపై భారత్ గట్టిగా ప్రశ్నించింది’ అని వివరించాయి. 1.75 లక్షల కోట్ల టర్నోవర్ లక్ష్యం 2025 నాటికి రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ రూ. 1.75 లక్షల కోట్లకు చేరాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ‘డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020’ ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. అందులో, రానున్న ఐదేళ్లలో అంతరిక్ష రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని అందులో పేర్కొంది. -
ఎల్ఏసీకి అదనపు బలగాలు
న్యూఢిల్లీ: గాల్వన్ లోయలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 3,500 కిలోమీటర్ల భారత్–చైనా సరిహద్దు వెంట అదనపు సైనిక బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఎల్ఏసీలో సైనిక, వైమానిక దళం హై అలర్ట్ ప్రకటించాయి. చైనా యుద్ధ నౌకలు తిష్టవేసిన హిందూ మహాసముద్రంలో ఇకపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని భారత నావికా దళం తమ సిబ్బందికి అదేశాలు జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వద్దకు అదనపు బలగాలు, ఆయుధాలను పంపించినట్లు భారత సైనిక దళం వెల్లడించింది. ఇకనుంచి సన్నద్ధత విభిన్నంగా ఉంటుందని సైనికాధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు, గాల్వన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన ప్రాంతంలో భారత్, చైనాల మధ్య మేజర్ జనరల్ స్థాయి చర్చలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. -
చైనాకు తగిన బుద్ధి చెబుతాం..
15 ఏళ్ల సర్వీసు.. నాలుగు పదోన్నతులు.. ఎన్నో గోల్డ్‌మెడల్స్.. ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, లడక్, పాకిస్తాన్ సరిహద్దులో విధుల నిర్వహణ.. సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్‌బాబు పేరిట ఉన్న రికార్డ్ ఇది. ఉన్నతకుటుంబం నుంచి ఆర్మీలోకి అడుగుపెట్టిన సంతోష్‌బాబు దేశసేవలో తనముద్ర వేసుకున్నాడు. లడక్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్–చైనా బలగాల మధ్య జరిగిన బాహాబాహీలో సంతోష్‌బాబు వీరమరణం పొందాడు. సూర్యాపేట / సూర్యాపేట క్రైం : దేశం కోసం సేవ చేయాలనే తపన ఉంది. కాని చేయలేకపోయాడు. ఎలాగైనా తన కుటుంబం నుంచి ఆర్మీలో ఒకరు ఉండాలన్న ఆలోచనతో సూర్యాపేట జిల్లాకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్ తన కుమారుడు సంతోష్‌బాబును ఆర్మీలోకి అడుగు పెట్టించాడు. తండ్రి ఆశయాన్ని కుమారుడు నెరవేర్చాడు. కానీ అర్ధంతరంగా దేశసేవలోనే ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం రాత్రి లడక్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్– చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్‌బాబు మరణించారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్ – మంజుల దంపతులకు ఇద్దరు సంతానం. భార్యపిల్లలతో సంతోష్‌బాబు(ఫైల్) కుమారుడు సంతోష్ బాబు, కుమార్తె శృతి ఉన్నారు. ఉపేందర్ ఎస్బీఐలో వివిధ హోదాల్లో పనిచేస్తూ చీఫ్ మేనేజర్‌గా రిటైర్డ్ అయ్యారు. ఉపేందర్ సంతోష్‌బాబును చిన్ననాటి నుంచే ఆర్మీలోకి అడుగుపెట్టే విధంగా తయారుచేశాడు. సంతోష్‌బాబు 1 నుంచి 5 వ తరగతి వరకు సంధ్య హైస్కూల్లో, 1993లో 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు కోరుకొండ సైనిక్‌స్కూల్ విజయనగరంలో విద్యనభ్యసించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్మీలో చేరాడు. పాఠశాలలో మౌర్య, గుప్తాహౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆయన 2018 బ్యాచ్‌లో కోరుకొండ సైనిక్ స్కూల్ టాపర్‌గా నిలిచాడు. సంతోష్ అన్ని పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ నేషనల్ డిఫెన్స్ పూణెలో, ట్రైనింగ్ ఇండియన్ ఆర్మీ డెహ్రాడూన్‌లో పూర్తి చేసుకున్నాడు. 2004, డిసెంబర్లో లెఫ్ట్‌నెంట్‌గా ఢిల్లీలో బీహార్ –16 బెటాలియన్‌లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం సంతోష్‌బాబు సతీమణి సంతు, కుమారుడు అనిరు«ధ్, కుమార్తె అభిజ్ఞలు ఢిల్లీలోనే ఉన్నారు. కుమార్తె అభిజ్ఞ మూడో తరగతి విద్యనభ్యసిస్తోంది. సంతోష్‌బాబు మరణవార్తతో సూర్యాపేట జిల్లాలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలో రెండో మరణం జిల్లాలో ఇది రెండో మరణం. కార్గిల్ యుద్ధంలో 20 ఏళ్ల క్రితం పెన్‌పహాడ్ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన పోలోజు గోపయ్యచారి వీరమరణం పొందాడు. పదిహేనేళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు.. సంతోష్‌బాబు తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొంది ప్రస్తుతం లడక్‌లో ( కల్నల్) కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న వయసులోనే కల్నల్‌గా ఎదిగి ఎన్నో గోల్డ్‌మెడల్స్‌ను సొంతం చేసుకున్నాడు. అదే విధంగా 2007లో ముగ్గురు చొరబాటు దారులను సైతం అంతమొందించాడు. 15 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, లడక్, పాకిస్థాన్ సరిహద్దులో పనిచేశాడు. కొంతకాలం ఖంగో దేశంలో కూడా విధులు నిర్వహించాడు. సంతోష్ బాబు మరణ వార్తను టీవీలో చూస్తున్న తల్లిదండ్రులు మధ్యాహ్నం 2 గంటలకు సంతోష్‌బాబు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు.. సంతోష్‌బాబు మరణవార్త తెలిసినప్పటికీ తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. తిరిగి తల్లిదండ్రులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్మీ అధికారులు ఫోన్ ద్వారా చేరవేశారు. బు«ధవారం తెల్లవారేసరికి సంతోష్‌బాబు పార్థి వదేహాన్ని ఢిల్లీలో కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు ఆర్మీ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సంతోష్‌బాబు పార్థివదేహం బుధవారం మధ్యాహ్నానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా కోవిడ్ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే నిర్వహించాలని ఆర్మీ అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సంతోష్‌బాబు నివాసాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు సంతోష్‌బాబు మరణ వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, సూర్యాపేట డీఎస్పీ ఎస్.మోహన్‌కుమార్, సీఐలు ఆంజనేయులు, విఠల్‌రెడ్డి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంతోష్‌బాబు మృతికి పలువురు సంతాపం.. బిక్కుమళ్ల సంతోష్‌బాబు మృతిపై సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ వైవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్‌కుమార్, ఉ ప్పల ఆనంద్, కక్కిరేణి శ్రీనివాస్, రాజు, రమేష్ ఆయన నివాసానికి చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చి పరామర్శించారు. పలువురు పరామర్శ సంతోష్ కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. తల్లిదండ్రులు ఉపేందర్, మంజులను సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ ఓదార్చారు. దేశసేవలో సంతోష్ సేవలను కొనియాడారు. అదే విధంగా టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కూడా పరామర్శించారు. సంతోష్‌బాబుకు ఆత్మకూర్(ఎస్) మండలంతో అనుబంధం ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : చైనా దుశ్చర్యతో మృతిచెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు పూర్వీకులది మండల పరిధిలోని బొప్పారం గ్రామం. సంతోష్‌బాబు తాత చక్రయ్య గ్రామంలో ఉంటూ వ్యాపారం చేసేవాడు. చక్రయ్య ముగ్గురు సంతానం వ్యాపారరీత్యా సూర్యాపేటలో స్థిరపడ్డారు. ఈ ముగ్గురిలో ఉపేందర్ కుమారుడు సంతోష్‌బాబు ఉన్నత విద్యను అభ్యసించి దేశ సేవలో భాగంగా ఆర్మీలో చేరాడు. మంగళవారం భారత్, చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో సంతోష్‌బాబు మృతిచెందడం పట్ల మండలవాసులు, బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖుల సంతాపం సూర్యాపేట అర్బన్ : భారత్, చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సూర్యాపేట నివాసి బిక్కుమళ్ల సంతోష్ బాబు మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగళవారం ఫోన్లో సంతోష్‌బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దేశం కోసం వీర మరణం పొందిన సంతోష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. సంతోష్‌బాబు దేశం కోసం తన ప్రాణాలను అర్పించి వీర మరణం పొందారని ఆయన వారితో పేర్కొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ పరామర్శించారు. నేటి యువతకు ఆదర్శం : మండలి చైర్మన్ నల్లగొండ : దేశం కోసం కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు వీరమరణం పట్ల శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన సంతోష్ బాబు దేశ రక్షణ కోసం ఆర్మీ ఉద్యోగంలో చేరి కల్నల్ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్ సరిహద్దులో కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబు వీరమరణం పొందడం పట్ల నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సంతాపం తెలిపారు. చైనాకు తగిన బుద్ధి చెబుతాం : డాక్టర్ చెరుకు సుధాకర్ సూర్యాపేట : కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ మరణానికి కారణమైన చైనా దేశానికి తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ హెచ్చరించారు. శాంతిమంత్రం జపిస్తూ దందుడుకుగా యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న చైనా వైఖరిని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. కల్నల్ సంతోష్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చిరస్థాయిగా నిలిచిపోతాడు : సంకినేని దేశం కోసం సరిహద్దులో వీర మరణం పొందిన సంతోష్‌బాబు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్లు సంతాపం ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్ పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఫోన్లో కల్నల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
భారత్ – చైనా ప్రచ్ఛన్నయుద్ధం?
న్యూయార్క్: భారత్, చైనాల మధ్య సంబంధాల్లో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కనిపిస్తోందని అమెరికా మాజీ దౌత్యాధికారిణి అలిసా ఐర్స్ అన్నారు. చైనాను నిలువరించే క్రమంలో అమెరికా నేతృత్వంలోని కూటమిలో భారత్ చేరే అవకాశాలు లేవన్నారు. దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల విభాగంలో పనిచేసిన అలిసా ప్రస్తుతం విదేశీ వ్యవహారాల కౌన్సిల్లో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె రాసిన పుస్తకం ‘అవర్ టైం హాజ్ కమ్: హౌ ఇండియా ఈజ్ మేకింగ్ ఇట్స్ ప్లేస్ ఇన్ ది వరల్డ్’ విడుదల సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చైనాతో పటిష్టమైన వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ సంతృప్తి చెందటం లేదన్నారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెంచుకోవటం, ముఖ్యంగా డిజిబౌటిలో సైనిక స్థావరం ఏర్పాటును భారత్ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పాక్, శ్రీలంకలతో చైనా సన్నిహితంగా మెలుగుతూ పెట్టుబడులు పెట్టడం భారత్‌కు ఇబ్బంది కలిగిస్తోందన్నారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు ప్రాధాన్యమిచ్చే వాతావరణం ప్రపంచమంతటా ఉండాలని భారత్ ఆకాంక్షిస్తోందని ఆమె చెప్పారు. 2008 ముంబై దాడుల వంటివి పునరావృతమైతే భారత్ ఉదాసీన వైఖరితో ఉంటుందని భావించలేమన్నారు. నిర్ణయాత్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని అంచనా వేశారు. గతేడాది పాక్ భూభాగంపై భారత్ సర్జికల్ దాడులను ఇందుకు ఉదాహరణగా చెప్పారు. 2018లో ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ ముందడుగు వేస్తోందని చెప్పారు. -
నాలుగో రోజూ మార్కెట్ అప్
భారత్ – చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు సడలిన ప్రభావం ముంబై: దౌత్యపరమైన ఒప్పందం ద్వారా భారత్–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు సడలటంతో సోమవారం స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ జరిగింది. ప్రపంచ మార్కెట్లు సైతం సానుకూలంగా ట్రేడ్‌కావడం సెంటిమెంట్‌ను బలపర్చింది. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ 155 పాయింట్లు జంప్‌చేసి 31,751 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల పెరుగుదలతో 9,913 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సూచీలు లాభాలతో ముగియడం వరుసగా ఇది నాల్గవ రోజు. మరో వారంరోజుల్లో చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోది హాజరుకానున్న నేపథ్యంలో డొకలాం వద్ద సైనిక బలగాల మోహరింపును వెనక్కు తీసుకోవాలన్న ఒప్పందానికి ఇరుదేశాలు వచ్చిన కారణంగా దేశీయ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. రూపాయి బలపడటం కూడా కలిసివచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇన్ఫీ జోరు... సూచీల పరుగుకు హెవీవెయిట్ షేరు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ర్యాలీ జరపడం ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆధార్ ఆర్కిటెక్ట్ నందన్ నీలకేని ఇన్ఫోసిస్ కొత్త ఛైర్మన్‌గా నియమితులుకావడాన్ని మార్కెట్ స్వాగతించిందని, దాంతో ఇన్ఫోసిస్ 3 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 941 వద్ద ముగిసినట్లు వారు వివరించారు. ఇటీవలి కనిష్టస్థాయి రూ. 860 నుంచి 9 శాతం మేర ఇన్ఫీ ర్యాలీ జరపడం విశేషం. నీలకేని రాకతో ఇన్ఫోసిస్ యాజమాన్యానికి స్థిరత్వం ఏర్పడుతుందన్న భావన ఇన్వెస్టర్లలో కలగడంతో ఇన్ఫోసిస్ షేరు రిలీఫ్ ర్యాలీ జరిపిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, హీరో మోటో కార్ప్, హెచ్‌యూఎల్‌లు 1–2 శాతం మధ్య ఎగిసాయి. డాక్టర్ రెడ్డీస్‌లాబ్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్ షేర్లు 1 శాతంపైగా క్షీణించాయి. నిఫ్టీ 50–లోకి బజాజ్ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్, యూపీఎల్ ఏసీసీ, బీఓబీ, టాటా పవర్ తొలగింపు నిఫ్టీ–50 ఇండెక్స్‌లో కొత్తగా బజాజ్ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్, యునైటెడ్ పాస్ఫరస్ లిమిటెడ్ (యూపీఎల్)లు ప్రవేశించనున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇప్పటివరకూ భాగమైన ఏసీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), టాటా పవర్ షేర్లను నిఫ్టీ–50 నుంచి తొలగించనున్నారు. ఈ మార్పులు సెప్టెంబర్ 29నుంచి అమల్లోకి వస్తాయి. సమీక్షానంతరం ఈ మార్పుల్ని చేస్తున్నట్లు ఎన్ఎస్ఈకి చెందిన ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రాడక్ట్స్ సోమవారం ప్రకటించింది. ప్రధాన సూచీతో పాటు ఇతర సూచీల్లో కూడా ఐఐఎస్ఎల్ మార్పులు చేసింది. -
డోక్లామ్‌పై దొంగాట !
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేందుకు డ్రాగన్ కుయుక్తులు డోక్లామ్... భారత్, చైనా, భూటాన్ సరిహద్దులు కలిసే పీఠభూమి! 38 రోజుల క్రితం ఈ ప్రాంతంలో రగిలిన వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. భారత్–చైనా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కూడా దీనిపై దృష్టి సారించింది. రెండు దేశాలూ ప్రత్యక్ష చర్చలతో సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి గారి రాస్ సూచించారు. ఈ వివాదంపై మొదట్నించీ చర్చలకు, శాంతియుత పరిష్కారానికి భారత్ ఎన్నిసార్లు పిలుపునిచ్చినా చైనా సానుకూలంగా స్పందించడం లేదు. డోక్లామ్ పీఠభూమి తమదేనంటూ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోంది. పైపెచ్చు రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు భూటాన్ సేనలకు మద్దతుగా ఆ ప్రాంతానికి వచ్చిన భారత దళాలే భూటాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయంటూ బుకాయిస్తోంది. డోక్లామ్‌పై చైనాతో సంప్రదింపులకు సిద్ధమేనని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ 11న ప్రతిపాదించినా ఆ దేశం ఆసక్తి ప్రదర్శించలేదు. డోక్లామ్‌పై చైనా ఆడుతున్న దొంగాటపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ భారత్, చైనా మధ్య రోజురోజుకూ ముదురుతున్న వివాదం డోక్లామ్ ప్రాంతం నుంచి ఉభయ పక్షాలూ మొదట తమ సేనలను ఉపసంహరించుకుంటే వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని గురువారం పార్లమెంటులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాల్సిన చైనా ఉద్రిక్తతలు మరింత పెంచేలా జవాబిచ్చింది. సుష్మ అబద్ధమాడారంటూ తన తెంపరితనాన్ని చాటుకుంది. చైనాకు నిజంగా ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఇలా స్పందించేది కాదనీ, సిక్కిం సెక్టార్లో ఉద్రిక్తతలు కొనసాగాలనే కోరుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉభయ దేశాల దళాలూ ఈ ప్రాంతం నుంచి వైదొలగాలని సుష్మ ప్రతిపాదిస్తుండగా.. భారత దళాలు ఉపసంహరిస్తేనే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉంటుందని చైనా చెబుతోంది. అంతేగాక భారత్‌ను పలుచన చేసి మాట్లాడటానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’తో హెచ్చరికలు చేయిస్తోంది. 1962 యుద్ధంలోనే భారత్ వెనకబడిపోయిందనీ, అప్పటితో పోల్చితే చైనా రక్షణపరంగా బాగా బలోపేతమైందనీ, ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధమే వస్తే భారత్ తీవ్రంగా నష్టపోతుందని ఈ పత్రిక పదేపదే ‘భయపెట్టే’ ప్రయత్నాలు చేస్తోంది. మంచుకొండల్లో ఎప్పటిదాకా ఈ వేడి? 1986లో భారత్, చైనా మధ్య అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతంలోని సుమ్‌దొరాంగ్ చూలో రాజుకున్న వివాదం దాదాపు ఏడాది పాటు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈసారి భారత్‌కు ఎంతో కీలకమైన సిలిగురి కారిడార్(కోడిమెడ) దగ్గరలో రాజుకున్న నిప్పురవ్వలు మంటలుగా మారకుండా ఎప్పుడు మామూలు పరిస్థితులు ఏర్పడతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నవంబర్‌లో జరిగే చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ(కాంగ్రెస్) ముగిసే వరకూ డోక్లామ్ వివాదం రగులుతూనే ఉంటుందని భారత మాజీ జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి శివశంకర్ మీనన్ అభిప్రాయపడుతున్నారు. ‘‘చైనా అధ్యక్షుడు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) ప్రధాన కార్యదర్శి జిన్‌పింగ్.. పార్టీ 19వ జాతీయ కాంగ్రెస్ నాటికి బలమైన నేతగా నిలబడటమేగాక పొరుగుదేశాల విషయంలో కరకుగా వ్యవహరించే పాలకునిగా కనిపించాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే.. సీపీసీ కాంగ్రెస్ వరకూ డోక్లామ్ ఉద్రిక్తతలు కొనసాగుతాయి’’ అని మీనన్ చెప్పారు. అయితే ఈ నెలాఖరులో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా ఉన్నతాధికారులతో భేటీ సందర్భంగా డోక్లామ్‌పై చర్చించే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. అప్పుడు అరుణాచల్ సరిహద్దులో.. 1986లో ఇలాగే భారత్–చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధ వాతావరణం కనిపించింది. అరుణాచల్‌ప్రదేశ్ సమీపంలోని సుమ్‌దొరాంగ్ వద్ద జరిగిన ఓ సంఘటన కారణంగా ఈ ప్రాంతంలోని సరిహద్దులో భారత్, చైనాలు వేల సంఖ్యలో తమ సేనలను ఏడాదిపాటు సమీకరించారు. తర్వాత ఉభయ దేశాల మధ్య చర్చలు జరిగి ఉద్రిక్తతలు చల్లారడానికి ఎనిమిదేళ్లు పట్టింది. దీని ఫలితంగా అప్పట్నుంచి ఇప్పటి వరకూ జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకూ 3,844 కిలోమీటర్ల సరిహద్దులో శాంతియుత వాతావరణం కొనసాగింది. తాజాగా డోక్లామ్‌తో సిక్కిం సెక్టార్ మళ్లీ వేడెక్కింది. వాచ్ టవర్‌తో వివాదం! 2014లో డోక్లామ్‌లో నిర్మించిన సైనిక వాచ్ టవర్‌కు రోడ్డు నిర్మించాలన్న చైనా సర్కారు నిర్ణయమే ఈ వివాదానికి దారితీసి ఉండొచ్చని చైనాలోని ఓ ప్రముఖ ఇంటర్నెట్ బ్లాగ్ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో అంతంతమాత్రంగా ఉన్న భూటాన్ సేనలను గమనించిన చైనా 2007 తర్వాతే డోక్లామ్ పీఠభూమిని తన అధీనంలోకి తెచ్చుకుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘‘డోక్లామ్ ఎప్పుడూ చైనా అంతర్భాగమేగానీ 2007 దాకా భూటాన్ అధీనంలో ఉండేది. ఆ తర్వాతే పూర్తిగా చైనా చేతికి చిక్కింది. 1890 బ్రిటన్–చైనా ఒప్పందం ప్రకారం ఈ పీఠభూమి చైనాకే చెందినా కొన్నేళ్ల క్రితం ఇక్కడ భూటాన్ రెండు వాచ్ టవర్లు నిర్మించి తన అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో చైనా 2007లో వాటిని ధ్వంసం చేసి అదే చోట కొత్త టవర్లు నిర్మించింది’’ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వాచ్ టవర్లకు రోడ్లు వేస్తున్న క్రమంలోనే ఈ వివాదం రాజుకుంది. మన ఆయుధ సామగ్రి పదిరోజులకే కాగ్ నివేదిక డోక్లామ్ వద్ద భారత్–చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ఆయుధ సామగ్రిపై కాగ్ ఇచ్చిన తాజా నివేదిక చర్చనీయాంశమైంది. యుద్ధం వస్తే మన ఆర్మీ వద్దనున్న ఆయుధ సామగ్రి పది రోజుల్లోనే ఖర్చయిపోతుందని ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఈ విషయాన్ని 2013లోనే గుర్తించి వెలుగులోకి తెచ్చినా గత నాలుగేళ్లలో ఎలాంటి మార్పు కనిపించలేదని కాగ్ పేర్కొంది. మరోవైపు చైనా తన ఆయుధ సామగ్రిని గణనీయంగా పెంచుకుంటోంది. రక్షణ మంత్రిత్వశాఖ అధీనంలోని 41 ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీల ద్వారా భద్రతా దళాలకు ఆయుధ సామగ్రి అందుతోంది. ఈ ఫ్యాక్టరీలకు రక్షణ ఉత్పత్తుల తయారీలో 200 ఏళ్లకు పైగా అనుభవం ఉందని చెబుతున్నా.. 2013 నుంచి ఆర్మీకి సరఫరా చేసిన ఆయుధ సామగ్రి నాణ్యత నాసిరకంగా ఉందని కాగ్ స్పష్టంచేసింది. 127 ఏళ్ల వివాదం డోక్లామ్‌తో చైనా–భూటాన్–భారత్ మధ్య ఏర్పడిన ఈ వివాదానికి నూటా పాతికేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1890లో టిబెట్–సిక్కింలకు సంబంధించిన విషయాలపై ఆనాడు భారత్‌ను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం–క్వింగ్ (చైనా సార్వభౌముల) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఛుంబి లోయ వెంట అంతర్జాతీయ సరిహద్దును నిర్ణయించారు. ఆ తర్వాత కూడా టిబెట్–భూటాన్ మధ్య సరిహద్దు వివాదాస్పదంగానే ఉండేది. దానికి చైనా–భూటాన్–భారత్ కలిసే సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్ (ట్రై జంక్షన్ ) కేంద్రంగా మారింది. చైనాతో భూటాన్‌కు ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో ఈ వివాదంలో భారత్ సహకారాన్ని ఆ దేశం కోరుతోంది. భారత్–భూటాన్ మధ్య అనేక ఒప్పందాలున్నాయి. చైనా అధీనంలోని డోక్లామ్ పీఠభూమిలో భారీ సైనిక వాహనాల కోసం రోడ్డు వేసేందుకు గతనెల 16న చైనా బలగాల సహాయంతో యంత్రాలను తరలించారు. తమ భూభాగంలోకి చొచ్చుకు రావడంపై భూటాన్ ఆర్మీ అభ్యంతరం తెలపడంతో పాటు వారిని వెనక్కు పంపేందుకు భారత్ సైన్యం సాయం కోరింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు జూన్ 18న భారత్ సేనలు అక్కడకు చేరుకున్నాయి. ఇది కొనసాగుతుండగానే గతనెల 28న సిక్కిం సెక్టార్‌లోకి చైనా ప్రవేశించినట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రదేశం కూడా ట్రై జంక్షన్‌కు సమీపంలోనే ఉండటం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. ఈ ప్రాంతమే ఈశాన్య రాష్ట్రాలతో దేశాన్ని కలుపుతుండటం గమనార్హం. నాథూలాలోనూ వివాదమే.. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ను, పశ్చిమబెంగాల్లోని కళింపాంగ్, చైనా అ«ధీనంలోని టిబెట్ యాతుంగ్ను కలిపేదే నాథూలా మార్గం. టిబెట్ భాషలో నాథూలా అంటే వింటున్న చెవి అని అర్థం. చైనాతో 1962 యుద్ధం తర్వాత భారత్ దీన్ని మూసేసింది. ఆనాటి నుంచి సరిహద్దుల్లో అతిక్రమణలు కొనసాగుతూనే వచ్చాయి. అయితే 1967లో నాథూలా సమీపంలోని భూభాగాన్ని చైనా ఆక్రమించే ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ పోరులో 400 మంది చైనా సైనికులు చనిపోగా.. భారత్ 70 మంది జవాన్లను కోల్పోయింది. ఈ మార్గాన్ని 2006లో భారత్ తెరిచింది. డోక్లామ్ వద్ద ఇరుదేశాల ఉద్రిక్తతల మధ్య భారత్ నుంచి మానససరోవర్ యాత్రికులు వెళ్లకుండా నాథూలా మార్గాన్ని చైనా మూసేసింది. భూటాన్–చైనాలు 470 కి.మీ. సరిహద్దును కలిగి ఉన్నాయి. 1972–1984 మధ్యలో భారత్ సహకారంతో భూటాన్ చైనాతో సరిహద్దు చర్చలు జరిపింది. ఈ ప్రాంతంలో శాంతిని, యథాతథ స్థితిని కొనసాగించేందుకు 1988, 1998లలో ఈ దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. -
వాణిజ్యాన్ని బలోపేతం చేద్దాం
చైనా, భారత్ విదేశాంగ మంత్రుల నిర్ణయం సుష్మతో సమావేశమైన చైనా మంత్రి వాంగ్ యీ మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చైనాతో తొలి ఉన్నతస్థాయి సమావేశం న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్-చైనా నిర్ణయించాయి. ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లో పెట్టుబడులను గణనీయంగా పెంచాలని అవగాహనకు వచ్చాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఏటా ఉన్న 65 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఆదివారమిక్కడ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత భారత్-చైనా మధ్య జరిగిన తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇది. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో వాణిజ్యంతోపాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. సరిహద్దు వివాదం, చొరబాట్లు, వీసాల మంజూరు, బ్రహ్మపుత్ర నదిపై జలాశయ నిర్మాణం, పెట్టుబడులు తదితర అంశాలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. మంత్రులతోపాటు రెండు దేశాల విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరుదేశాల్లో అభివృద్ధికి ఆస్కారం ఉన్న రంగాల్లో పురోగమిస్తూనే సరిహద్దులు వంటి సున్నిత అంశంపై ఒకరిపట్ల ఒకరు గౌరవప్రదంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ఏటా పలు అంశాలపై రాష్ట్రపతి, ప్రధాని, మంత్రిత్వస్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. కైలాస్ మానససరోవర్ యాత్రికుల సంఖ్య పెంచే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని చైనాను సుష్మ స్వరాజ్ కోరినట్లు చెప్పారు. అలాగే చర్చల సందర్భంగా చైనా టిబెట్ అంశాన్ని లేవనెత్తినట్టు సమాచారం. ఈ విషయంలో తమ వైఖరి మారలేదని, టిబెట్‌ను చైనాలో భాగంగానే చూస్తున్నామని భారత్ స్పష్టంచేసింది. తమ భూభాగంలో చైనాకు వ్యతిరేకంగా టిబెటన్లు చేపట్టే కార్యక్రమాలను అనుమతించబోమని తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. -
బంధాన్ని బలోపేతం చేసుకుందాం: లీ కెఖియాంగ్
* భారత్-చైనా ప్రధానుల అభిలాష * మోడీకి ఫోన్ చేసిన లీ కెఖియాంగ్ బీజింగ్/న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాల ప్రధానులు గురువారం అభిలషించారు. భారత కొత్త ప్రభుత్వంతో పటిష్ట బంధాన్ని కోరుకుంటున్నట్లు చైనా ప్రధాని లీ కెఖియాంగ్ పేర్కొనగా.. ఇరుదేశాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మోడీతో పాటు కొత్త విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చే నెల 8న తమ విదేశాంగ మంత్రిని భారత్‌కు పంపాలని బుధవారమే చైనా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లీ గురువారం మోడీతో 25 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీకి ఫోన్ చేసి మాట్లాడిన తొలి విదేశీ నేత ఆయనే కావడం విశేషం. ఈ సందర్భంగా భారత్‌తో దృఢమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు లీ చెప్పారు. ఇందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. భారత విదేశాంగ విధానంలో చైనాకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల విస్తృతిని స్వాగతిస్తానని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చైనా నాయకత్వంతో కలిసి పనిచేస్తామని మోడీ వివరించారు. మోడీకి అభినందనలు తెలపడానికి, కొత్త ప్రభుత్వంలోని మంత్రులను కలుసుకోడానికి తమ విదేశాంగ మంత్రి వాంగ్ ఈని భారత్‌కు పంపుతున్నట్లు చైనా అధికారిక సమాచారం ఇచ్చిందని కూడా పేర్కొన్నాయి. భారత్‌లో పర్యటించాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ని ఆ దేశ ప్రధాని ద్వారా మోడీ ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. జూలైలో జరిగే బ్రిక్స్ దేశాల సదస్సులో మోడీ, లీ కలుసుకునే అవకాశముందన్నారు. సుష్మాకు ఫోన్ల మీద ఫోన్లు: విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుష్మా స్వరాజ్‌కు బుధవారం రాత్రి నుంచే ప్రపంచ దేశాల నుంచి ఫోన్లు వెల్లువెత్తాయి. మొదటగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆమెకు ఫోన్ చేయడం విశేషం. ఇరు దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చ లు జరిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోడానికి భారత్ ప్రాధాన్యమిస్తుందని సుష్మ పేర్కొన్నారు. తర్వా త ఆస్ట్రేలియా, కెనడా, ఇజ్రాయెల్, యూఏఈ, యూకే, దక్షిణాఫ్రికా దేశాల మంత్రులు కూడా సుష్మతో ఫోన్లో మాట్లాడారు.