వాణిజ్యాన్ని బలోపేతం చేద్దాం
చైనా, భారత్ విదేశాంగ మంత్రుల నిర్ణయం
సుష్మతో సమావేశమైన చైనా మంత్రి వాంగ్ యీ
మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చైనాతో తొలి ఉన్నతస్థాయి సమావేశం
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్-చైనా నిర్ణయించాయి. ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లో పెట్టుబడులను గణనీయంగా పెంచాలని అవగాహనకు వచ్చాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఏటా ఉన్న 65 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఆదివారమిక్కడ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశమయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత భారత్-చైనా మధ్య జరిగిన తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇది. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో వాణిజ్యంతోపాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. సరిహద్దు వివాదం, చొరబాట్లు, వీసాల మంజూరు, బ్రహ్మపుత్ర నదిపై జలాశయ నిర్మాణం, పెట్టుబడులు తదితర అంశాలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది.
మంత్రులతోపాటు రెండు దేశాల విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరుదేశాల్లో అభివృద్ధికి ఆస్కారం ఉన్న రంగాల్లో పురోగమిస్తూనే సరిహద్దులు వంటి సున్నిత అంశంపై ఒకరిపట్ల ఒకరు గౌరవప్రదంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ఏటా పలు అంశాలపై రాష్ట్రపతి, ప్రధాని, మంత్రిత్వస్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. కైలాస్ మానససరోవర్ యాత్రికుల సంఖ్య పెంచే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని చైనాను సుష్మ స్వరాజ్ కోరినట్లు చెప్పారు. అలాగే చర్చల సందర్భంగా చైనా టిబెట్ అంశాన్ని లేవనెత్తినట్టు సమాచారం. ఈ విషయంలో తమ వైఖరి మారలేదని, టిబెట్‌ను చైనాలో భాగంగానే చూస్తున్నామని భారత్ స్పష్టంచేసింది. తమ భూభాగంలో చైనాకు వ్యతిరేకంగా టిబెటన్లు చేపట్టే కార్యక్రమాలను అనుమతించబోమని తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు.