సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేందుకు డ్రాగన్ కుయుక్తులు
డోక్లామ్... భారత్, చైనా, భూటాన్ సరిహద్దులు కలిసే పీఠభూమి! 38 రోజుల క్రితం ఈ ప్రాంతంలో రగిలిన వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. భారత్–చైనా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కూడా దీనిపై దృష్టి సారించింది. రెండు దేశాలూ ప్రత్యక్ష చర్చలతో సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి గారి రాస్ సూచించారు. ఈ వివాదంపై మొదట్నించీ చర్చలకు, శాంతియుత పరిష్కారానికి భారత్ ఎన్నిసార్లు పిలుపునిచ్చినా చైనా సానుకూలంగా స్పందించడం లేదు.
డోక్లామ్ పీఠభూమి తమదేనంటూ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోంది. పైపెచ్చు రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు భూటాన్ సేనలకు మద్దతుగా ఆ ప్రాంతానికి వచ్చిన భారత దళాలే భూటాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయంటూ బుకాయిస్తోంది. డోక్లామ్‌పై చైనాతో సంప్రదింపులకు సిద్ధమేనని భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ 11న ప్రతిపాదించినా ఆ దేశం ఆసక్తి ప్రదర్శించలేదు. డోక్లామ్‌పై చైనా ఆడుతున్న దొంగాటపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్..
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
భారత్, చైనా మధ్య రోజురోజుకూ ముదురుతున్న వివాదం
డోక్లామ్ ప్రాంతం నుంచి ఉభయ పక్షాలూ మొదట తమ సేనలను ఉపసంహరించుకుంటే వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని గురువారం పార్లమెంటులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాల్సిన చైనా ఉద్రిక్తతలు మరింత పెంచేలా జవాబిచ్చింది. సుష్మ అబద్ధమాడారంటూ తన తెంపరితనాన్ని చాటుకుంది. చైనాకు నిజంగా ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఇలా స్పందించేది కాదనీ, సిక్కిం సెక్టార్‌లో ఉద్రిక్తతలు కొనసాగాలనే కోరుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉభయ దేశాల దళాలూ ఈ ప్రాంతం నుంచి వైదొలగాలని సుష్మ ప్రతిపాదిస్తుండగా.. భారత దళాలు ఉపసంహరిస్తేనే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉంటుందని చైనా చెబుతోంది. అంతేగాక భారత్‌ను పలుచన చేసి మాట్లాడటానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’తో హెచ్చరికలు చేయిస్తోంది. 1962 యుద్ధంలోనే భారత్ వెనకబడిపోయిందనీ, అప్పటితో పోల్చితే చైనా రక్షణపరంగా బాగా బలోపేతమైందనీ, ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధమే వస్తే భారత్ తీవ్రంగా నష్టపోతుందని ఈ పత్రిక పదేపదే ‘భయపెట్టే’ ప్రయత్నాలు చేస్తోంది.
మంచుకొండల్లో ఎప్పటిదాకా ఈ వేడి?
1986లో భారత్, చైనా మధ్య అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతంలోని సుమ్‌దొరాంగ్ చూలో రాజుకున్న వివాదం దాదాపు ఏడాది పాటు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈసారి భారత్‌కు ఎంతో కీలకమైన సిలిగురి కారిడార్(కోడిమెడ) దగ్గరలో రాజుకున్న నిప్పురవ్వలు మంటలుగా మారకుండా ఎప్పుడు మామూలు పరిస్థితులు ఏర్పడతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నవంబర్‌లో జరిగే చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ(కాంగ్రెస్) ముగిసే వరకూ డోక్లామ్ వివాదం రగులుతూనే ఉంటుందని భారత మాజీ జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి శివశంకర్ మీనన్ అభిప్రాయపడుతున్నారు.
‘‘చైనా అధ్యక్షుడు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) ప్రధాన కార్యదర్శి జిన్‌పింగ్.. పార్టీ 19వ జాతీయ కాంగ్రెస్ నాటికి బలమైన నేతగా నిలబడటమేగాక పొరుగుదేశాల విషయంలో కరకుగా వ్యవహరించే పాలకునిగా కనిపించాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే.. సీపీసీ కాంగ్రెస్ వరకూ డోక్లామ్ ఉద్రిక్తతలు కొనసాగుతాయి’’ అని మీనన్ చెప్పారు. అయితే ఈ నెలాఖరులో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా ఉన్నతాధికారులతో భేటీ సందర్భంగా డోక్లామ్‌పై చర్చించే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
అప్పుడు అరుణాచల్ సరిహద్దులో..
1986లో ఇలాగే భారత్–చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధ వాతావరణం కనిపించింది. అరుణాచల్‌ప్రదేశ్ సమీపంలోని సుమ్‌దొరాంగ్ వద్ద జరిగిన ఓ సంఘటన కారణంగా ఈ ప్రాంతంలోని సరిహద్దులో భారత్, చైనాలు వేల సంఖ్యలో తమ సేనలను ఏడాదిపాటు సమీకరించారు. తర్వాత ఉభయ దేశాల మధ్య చర్చలు జరిగి ఉద్రిక్తతలు చల్లారడానికి ఎనిమిదేళ్లు పట్టింది. దీని ఫలితంగా అప్పట్నుంచి ఇప్పటి వరకూ జమ్మూ కశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకూ 3,844 కిలోమీటర్ల సరిహద్దులో శాంతియుత వాతావరణం కొనసాగింది. తాజాగా డోక్లామ్‌తో సిక్కిం సెక్టార్ మళ్లీ వేడెక్కింది.
వాచ్ టవర్‌తో వివాదం!
2014లో డోక్లామ్‌లో నిర్మించిన సైనిక వాచ్ టవర్‌కు రోడ్డు నిర్మించాలన్న చైనా సర్కారు నిర్ణయమే ఈ వివాదానికి దారితీసి ఉండొచ్చని చైనాలోని ఓ ప్రముఖ ఇంటర్నెట్ బ్లాగ్ అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో అంతంతమాత్రంగా ఉన్న భూటాన్ సేనలను గమనించిన చైనా 2007 తర్వాతే డోక్లామ్ పీఠభూమిని తన అధీనంలోకి తెచ్చుకుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘‘డోక్లామ్ ఎప్పుడూ చైనా అంతర్భాగమేగానీ 2007 దాకా భూటాన్ అధీనంలో ఉండేది. ఆ తర్వాతే పూర్తిగా చైనా చేతికి చిక్కింది. 1890 బ్రిటన్–చైనా ఒప్పందం ప్రకారం ఈ పీఠభూమి చైనాకే చెందినా కొన్నేళ్ల క్రితం ఇక్కడ భూటాన్ రెండు వాచ్ టవర్లు నిర్మించి తన అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో చైనా 2007లో వాటిని ధ్వంసం చేసి అదే చోట కొత్త టవర్లు నిర్మించింది’’ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వాచ్ టవర్లకు రోడ్లు వేస్తున్న క్రమంలోనే ఈ వివాదం రాజుకుంది.
మన ఆయుధ సామగ్రి పదిరోజులకే కాగ్ నివేదిక
డోక్లామ్ వద్ద భారత్–చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ఆయుధ సామగ్రిపై కాగ్ ఇచ్చిన తాజా నివేదిక చర్చనీయాంశమైంది. యుద్ధం వస్తే మన ఆర్మీ వద్దనున్న ఆయుధ సామగ్రి పది రోజుల్లోనే ఖర్చయిపోతుందని ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఈ విషయాన్ని 2013లోనే గుర్తించి వెలుగులోకి తెచ్చినా గత నాలుగేళ్లలో ఎలాంటి మార్పు కనిపించలేదని కాగ్ పేర్కొంది. మరోవైపు చైనా తన ఆయుధ సామగ్రిని గణనీయంగా పెంచుకుంటోంది. రక్షణ మంత్రిత్వశాఖ అధీనంలోని 41 ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీల ద్వారా భద్రతా దళాలకు ఆయుధ సామగ్రి అందుతోంది. ఈ ఫ్యాక్టరీలకు రక్షణ ఉత్పత్తుల తయారీలో 200 ఏళ్లకు పైగా అనుభవం ఉందని చెబుతున్నా.. 2013 నుంచి ఆర్మీకి సరఫరా చేసిన ఆయుధ సామగ్రి నాణ్యత నాసిరకంగా ఉందని కాగ్ స్పష్టంచేసింది.
127 ఏళ్ల వివాదం
డోక్లామ్‌తో చైనా–భూటాన్–భారత్ మధ్య ఏర్పడిన ఈ వివాదానికి నూటా పాతికేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1890లో టిబెట్–సిక్కింలకు సంబంధించిన విషయాలపై ఆనాడు భారత్‌ను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం–క్వింగ్ (చైనా సార్వభౌముల) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఛుంబి లోయ వెంట అంతర్జాతీయ సరిహద్దును నిర్ణయించారు. ఆ తర్వాత కూడా టిబెట్–భూటాన్ మధ్య సరిహద్దు వివాదాస్పదంగానే ఉండేది. దానికి చైనా–భూటాన్–భారత్ కలిసే సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్ (ట్రై జంక్షన్ ) కేంద్రంగా మారింది. చైనాతో భూటాన్‌కు ద్వైపాక్షిక సంబంధాలు లేకపోవడంతో ఈ వివాదంలో భారత్ సహకారాన్ని ఆ దేశం కోరుతోంది.
భారత్–భూటాన్ మధ్య అనేక ఒప్పందాలున్నాయి. చైనా అధీనంలోని డోక్లామ్ పీఠభూమిలో భారీ సైనిక వాహనాల కోసం రోడ్డు వేసేందుకు గతనెల 16న చైనా బలగాల సహాయంతో యంత్రాలను తరలించారు. తమ భూభాగంలోకి చొచ్చుకు రావడంపై భూటాన్ ఆర్మీ అభ్యంతరం తెలపడంతో పాటు వారిని వెనక్కు పంపేందుకు భారత్ సైన్యం సాయం కోరింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు జూన్ 18న భారత్ సేనలు అక్కడకు చేరుకున్నాయి. ఇది కొనసాగుతుండగానే గతనెల 28న సిక్కిం సెక్టార్‌లోకి చైనా ప్రవేశించినట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రదేశం కూడా ట్రై జంక్షన్‌కు సమీపంలోనే ఉండటం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. ఈ ప్రాంతమే ఈశాన్య రాష్ట్రాలతో దేశాన్ని కలుపుతుండటం గమనార్హం.
నాథూలాలోనూ వివాదమే..
సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ను, పశ్చిమబెంగాల్‌లోని కళింపాంగ్, చైనా అ«ధీనంలోని టిబెట్ యాతుంగ్‌ను కలిపేదే నాథూలా మార్గం. టిబెట్ భాషలో నాథూలా అంటే వింటున్న చెవి అని అర్థం. చైనాతో 1962 యుద్ధం తర్వాత భారత్ దీన్ని మూసేసింది. ఆనాటి నుంచి సరిహద్దుల్లో అతిక్రమణలు కొనసాగుతూనే వచ్చాయి. అయితే 1967లో నాథూలా సమీపంలోని భూభాగాన్ని చైనా ఆక్రమించే ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ పోరులో 400 మంది చైనా సైనికులు చనిపోగా.. భారత్ 70 మంది జవాన్లను కోల్పోయింది. ఈ మార్గాన్ని 2006లో భారత్ తెరిచింది.
డోక్లామ్ వద్ద ఇరుదేశాల ఉద్రిక్తతల మధ్య భారత్ నుంచి మానససరోవర్ యాత్రికులు వెళ్లకుండా నాథూలా మార్గాన్ని చైనా మూసేసింది. భూటాన్–చైనాలు 470 కి.మీ. సరిహద్దును కలిగి ఉన్నాయి. 1972–1984 మధ్యలో భారత్ సహకారంతో భూటాన్ చైనాతో సరిహద్దు చర్చలు జరిపింది. ఈ ప్రాంతంలో శాంతిని, యథాతథ స్థితిని కొనసాగించేందుకు 1988, 1998లలో ఈ దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.