చైనాకు తగిన బుద్ధి చెబుతాం.. | Political Leaders Visitation karnal Santosh Babu Family nalgonda | Sakshi
Sakshi News home page

తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు

Published Wed, Jun 17 2020 7:06 AM | Last Updated on Wed, Jun 17 2020 1:13 PM

Political Leaders Visitation karnal Santosh Babu Family nalgonda - Sakshi

సంతోష్‌ ఫొటోను తడిమిచూస్తున్న తల్లి మంజుల

15 ఏళ్ల సర్వీసు.. నాలుగు పదోన్నతులు.. ఎన్నో గోల్డ్‌మెడల్స్‌..  ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, లడక్, పాకిస్తాన్‌ సరిహద్దులో విధుల నిర్వహణ..  సూర్యాపేట జిల్లావాసి కల్నల్‌ సంతోష్‌బాబు పేరిట ఉన్న రికార్డ్‌ ఇది. ఉన్నతకుటుంబం నుంచి ఆర్మీలోకి అడుగుపెట్టిన సంతోష్‌బాబు దేశసేవలో తనముద్ర వేసుకున్నాడు. లడక్‌లోని గాల్వన్‌ లోయ వద్ద భారత్‌–చైనా బలగాల మధ్య జరిగిన బాహాబాహీలో సంతోష్‌బాబు వీరమరణం పొందాడు.

సూర్యాపేట / సూర్యాపేట క్రైం : దేశం కోసం సేవ చేయాలనే తపన ఉంది. కాని చేయలేకపోయాడు. ఎలాగైనా తన కుటుంబం నుంచి ఆర్మీలో ఒకరు ఉండాలన్న ఆలోచనతో సూర్యాపేట జిల్లాకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్‌ తన కుమారుడు సంతోష్‌బాబును ఆర్మీలోకి అడుగు పెట్టించాడు. తండ్రి ఆశయాన్ని కుమారుడు   నెరవేర్చాడు. కానీ అర్ధంతరంగా దేశసేవలోనే ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం రాత్రి లడక్‌లోని గాల్వన్‌ లోయ వద్ద భారత్‌– చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేట జిల్లావాసి కల్నల్‌ సంతోష్‌బాబు మరణించారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్‌ – మంజుల దంపతులకు ఇద్దరు సంతానం.

భార్యపిల్లలతో సంతోష్‌బాబు(ఫైల్‌)
కుమారుడు సంతోష్‌ బాబు, కుమార్తె శృతి ఉన్నారు. ఉపేందర్‌ ఎస్‌బీఐలో వివిధ హోదాల్లో పనిచేస్తూ చీఫ్‌ మేనేజర్‌గా రిటైర్డ్‌ అయ్యారు. ఉపేందర్‌ సంతోష్‌బాబును చిన్ననాటి నుంచే ఆర్మీలోకి అడుగుపెట్టే విధంగా తయారుచేశాడు. సంతోష్‌బాబు 1 నుంచి 5 వ తరగతి వరకు సంధ్య హైస్కూల్‌లో, 1993లో 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు కోరుకొండ సైనిక్‌స్కూల్‌ విజయనగరంలో విద్యనభ్యసించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్మీలో చేరాడు. పాఠశాలలో మౌర్య, గుప్తాహౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆయన 2018 బ్యాచ్‌లో కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ టాపర్‌గా నిలిచాడు. సంతోష్‌ అన్ని పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ నేషనల్‌ డిఫెన్స్‌ పూణెలో, ట్రైనింగ్‌ ఇండియన్‌ ఆర్మీ డెహ్రాడూన్‌లో పూర్తి చేసుకున్నాడు. 2004, డిసెంబర్‌లో లెఫ్ట్‌నెంట్‌గా ఢిల్లీలో బీహార్‌ –16 బెటాలియన్‌లో ఉద్యోగంలో జాయిన్‌ అయ్యాడు. ప్రస్తుతం సంతోష్‌బాబు సతీమణి సంతు, కుమారుడు అనిరు«ధ్, కుమార్తె అభిజ్ఞలు ఢిల్లీలోనే ఉన్నారు. కుమార్తె అభిజ్ఞ మూడో తరగతి విద్యనభ్యసిస్తోంది. సంతోష్‌బాబు మరణవార్తతో సూర్యాపేట జిల్లాలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

జిల్లాలో రెండో మరణం
జిల్లాలో ఇది రెండో మరణం. కార్గిల్‌ యుద్ధంలో 20 ఏళ్ల క్రితం పెన్‌పహాడ్‌ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన పోలోజు గోపయ్యచారి వీరమరణం పొందాడు. 

పదిహేనేళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు..
సంతోష్‌బాబు తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొంది ప్రస్తుతం లడక్‌లో ( కల్నల్‌) కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న వయసులోనే కల్నల్‌గా ఎదిగి ఎన్నో గోల్డ్‌మెడల్స్‌ను సొంతం చేసుకున్నాడు. అదే విధంగా 2007లో ముగ్గురు చొరబాటు దారులను సైతం అంతమొందించాడు. 15 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, లడక్, పాకిస్థాన్‌ సరిహద్దులో పనిచేశాడు. కొంతకాలం ఖంగో దేశంలో కూడా విధులు నిర్వహించాడు.

సంతోష్‌ బాబు మరణ వార్తను టీవీలో చూస్తున్న తల్లిదండ్రులు
మధ్యాహ్నం 2 గంటలకు సంతోష్‌బాబు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు..
సంతోష్‌బాబు మరణవార్త తెలిసినప్పటికీ తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. తిరిగి తల్లిదండ్రులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్మీ అధికారులు ఫోన్‌ ద్వారా చేరవేశారు. బు«ధవారం తెల్లవారేసరికి సంతోష్‌బాబు పార్థి వదేహాన్ని ఢిల్లీలో కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు ఆర్మీ అధికారులు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.
సంతోష్‌బాబు పార్థివదేహం బుధవారం మధ్యాహ్నానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా కోవిడ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే నిర్వహించాలని ఆర్మీ అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

సంతోష్‌బాబు నివాసాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు
సంతోష్‌బాబు మరణ వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్, సూర్యాపేట డీఎస్పీ ఎస్‌.మోహన్‌కుమార్, సీఐలు ఆంజనేయులు, విఠల్‌రెడ్డి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంతోష్‌బాబు మృతికి పలువురు సంతాపం..    
బిక్కుమళ్ల సంతోష్‌బాబు మృతిపై సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ వైవి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిషోర్‌కుమార్, ఉ ప్పల ఆనంద్, కక్కిరేణి శ్రీనివాస్, రాజు, రమేష్‌ ఆయన నివాసానికి చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చి పరామర్శించారు.

పలువురు పరామర్శ
సంతోష్‌ కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. తల్లిదండ్రులు ఉపేందర్, మంజులను  సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ ఓదార్చారు. దేశసేవలో సంతోష్‌ సేవలను కొనియాడారు. అదే విధంగా టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేష్‌ రెడ్డి కూడా పరామర్శించారు.

సంతోష్‌బాబుకు ఆత్మకూర్‌(ఎస్‌) మండలంతో అనుబంధం
ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : చైనా దుశ్చర్యతో మృతిచెందిన కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు పూర్వీకులది మండల పరిధిలోని బొప్పారం గ్రామం. సంతోష్‌బాబు తాత చక్రయ్య గ్రామంలో ఉంటూ వ్యాపారం చేసేవాడు. చక్రయ్య ముగ్గురు సంతానం వ్యాపారరీత్యా సూర్యాపేటలో స్థిరపడ్డారు. ఈ ముగ్గురిలో ఉపేందర్‌ కుమారుడు సంతోష్‌బాబు ఉన్నత విద్యను అభ్యసించి దేశ సేవలో భాగంగా ఆర్మీలో చేరాడు. మంగళవారం భారత్, చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో సంతోష్‌బాబు మృతిచెందడం పట్ల మండలవాసులు, బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు.    

ప్రముఖుల సంతాపం
సూర్యాపేట అర్బన్‌ : భారత్, చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సూర్యాపేట నివాసి బిక్కుమళ్ల సంతోష్‌ బాబు మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగళవారం ఫోన్‌లో సంతోష్‌బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దేశం కోసం వీర మరణం పొందిన సంతోష్‌ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. సంతోష్‌బాబు దేశం కోసం తన ప్రాణాలను అర్పించి వీర మరణం పొందారని ఆయన వారితో పేర్కొన్నారు.

మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ పరామర్శించారు.

నేటి యువతకు ఆదర్శం : మండలి చైర్మన్‌
నల్లగొండ : దేశం కోసం కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు వీరమరణం పట్ల శాసన మండలి చైర్మన్‌ శ్రీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక  సామాన్య కుటుంబంలో జన్మించిన సంతోష్‌ బాబు దేశ రక్షణ కోసం ఆర్మీ ఉద్యోగంలో చేరి కల్నల్‌ స్థాయికి ఎదిగిన ఆయన  జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్‌ సరిహద్దులో కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు వీరమరణం పొందడం పట్ల నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సంతాపం తెలిపారు.   

చైనాకు తగిన బుద్ధి చెబుతాం : డాక్టర్‌ చెరుకు సుధాకర్‌
సూర్యాపేట : కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ మరణానికి కారణమైన చైనా దేశానికి తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ హెచ్చరించారు. శాంతిమంత్రం జపిస్తూ దందుడుకుగా యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న చైనా వైఖరిని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. కల్నల్‌ సంతోష్‌ కుమార్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.   

చిరస్థాయిగా నిలిచిపోతాడు : సంకినేని
దేశం కోసం సరిహద్దులో వీర మరణం పొందిన సంతోష్‌బాబు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్లు సంతాపం ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్‌ పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు.  అదేవిధంగా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఫోన్‌లో కల్నల్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement