నేను ‘సంతోషం’గా ఒప్పుకుంటా.. | Sakshi Interview With Colonel Santosh Babu Wife In Family | Sakshi
Sakshi News home page

పిల్లలు ఆర్మీకి వెళ్తానంటే సంతోషంగా పంపిస్తా

Published Sat, Jun 20 2020 7:19 AM | Last Updated on Sun, Oct 17 2021 1:24 PM

Sakshi Interview With Colonel Santosh Babu Wife In Family

ఇటీవల చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన భారతమాత ముద్దుబిడ్డ కల్నల్‌ సంతోష్‌బాబు. ఆయన సతీమణి సంతోషి తన భర్త  జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. ఆమె మనోగతం ఆమె మాటల్లోనే...

చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచడం, తానూ సంతోషంగా ఉండడమే ఆయన బలం.  ఎదుటివారికి చేతనైన సహాయం చేయాలని తపన పడేవారు. కుమారుడిగా తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేరారు. అయినా కుటుంబానికి ఏమీ లోటు చేయలేదు. భర్తగా నన్ను బాగా చూసుకున్నారు. తండ్రిగా నా పిల్లలకు రోల్‌ మోడల్‌ అయ్యారు. రేపు నా పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారు ఆర్మీలో చేరతానన్నా నేను సంతోషంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే బాధ్యతాయుతమైన యువత ఆర్మీలో చేరి దేశభక్తిని చాటుకోవాలి’ అని సంతోషి ఆకాంక్షించారు.

నేనే కావాలని..
సైనికుడిగా తన జీవన సరళి అంతా వేరేలా ఉంటుందని, సగటు ఆడపిల్లలు కోరుకునే మామూలు జీవితాన్ని తాను ఇవ్వలేకపోవచ్చని, కనుక తనను అర్థం చేసుకునే అమ్మాయి కావాలని, అలాంటి సంబంధమే చూడమని సంతోష్‌ తన అమ్మా, నాన్నతో అన్నాడట. అలా చుట్టాలమ్మాయని నన్ను అతనికి చూపించారు. ‘నిన్ను చూసిన తర్వాత సంతోష్‌ రెండు, మూడు మ్యాచ్‌లు చూశాడమ్మా.. కానీ నువ్వే కావాలని అన్నాడు’ అని అత్తయ్య ఎప్పుడూ నాతో అనేది. (కల్నల్‌ సంతోష్‌ కుటుంబానికి రూ. 5 కోట్లు)

సమన్యాయం చేశారు
డ్యూటీలో ఉన్నప్పుడు పనికి ప్రాధాన్యత ఇచ్చాడు. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు కుటుంబానికి అంతే స్థాయిలో ప్రాధాన్యత నిచ్చారు. మా దగ్గరకు మార్చి 21న ఢిల్లీ వచ్చి ఏప్రిల్‌ 15కు వెళ్లారు. సెలవులకు వచ్చినప్పుడు విహార యాత్రలకు పిల్లలతో కలిసి వెళ్లాలనుకున్నాం. కానీ లాక్‌డౌన్‌ వల్ల వెళ్లలేకపోయాం. అదే సమయంలో మా నాన్నకు హాస్పిటల్‌లో చెకప్‌ ఉంటే సూర్యాపేటకు రమ్మని అడిగారు. అయితే ఇక్కడకు వస్తే తానే దగ్గరుండి చూపిస్తానని, వాళ్లనే ఇక్కడికి రమ్మని చెప్పారు. మా అమ్మానాన్నని కూడా వాళ్ల అమ్మానాన్నల్లాగే చూసుకునేవాడు. 

అక్కడ సగం.. ఇక్కడ సగం..
మా పెళ్లయి పదిన్నరేళ్లు అయింది. పెళ్లి తర్వాత మేము రెండేళ్లు కలిసి ఉన్నాం. తర్వాత నాలుగేళ్లు సర్వీస్‌లో ఉన్నారు. మళ్లీ మూడేళ్లు కలిసి ఉన్నాం. గత ఏడాది జూన్‌ నుంచి ఫీల్డ్‌లో ఉన్నారు.  నాకు, పిల్లలకు ఏది ఇష్టమైతే అది కొనిచ్చేవారు. తన గురించి తర్వాత ఆలోచించే వారు. 

పిల్లల గురించి కలలు కన్నారు..
పిల్లలకు మంచి విద్యనందించాలని, వారిని మంచి స్థాయికి తీసుకురావాలని కలలు కన్నారు. కానీ ఇంతట్లోనే ఇలా అవుతుందని అనుకోలేదు...(దుఃఖంతో గొంతు పూడుకుపోయింది) మా పాపకు 9 ఏళ్లు, బాబుకు మూడేళ్లు. ఎప్పుడు ఫోన్‌ చేసినా ముందు వాళ్లతో మాట్లాడిన తర్వాతనే నాతో మాట్లాడేవారు.  

అదే చివరి మాట..
చివరిసారిగా ఈ నెల 14న ఆయన నాతో మాట్లాడారు. పిల్లల యోగ క్షేమాలు అడిగారు. అంతలోనే బిజీగా ఉన్నానని, ఆ తర్వాత తీరిగ్గా కాల్‌ చేస్తానని చెప్పారు. ఇదే నాకు అతని నుంచి వచ్చిన చివరి ఫోన్‌. తర్వాత రెండు రోజులకే.. తాను ఇక లేడన్న విషాద వార్త నాకు చేరింది. యుద్ధంలో కల్నల్‌ సంతోష్‌ బాబు వీరమరణం పొందారని టీవీలో స్క్రోలింగ్‌ చూశాను. 

పిల్లలు ఆర్మీకి వెళ్తా అంటే పంపిస్తా..
పిల్లలు భవిష్యత్‌లో ఏది చేయాలనుకుంటే ఆ స్వేచ్ఛ ఇవ్వాలనే వారు. ఆయన పోయారని నేను వెనుకాడేది లేదు. పిల్లలకు భవిష్యత్‌లో ఏది ఇష్టమైతే అదే చేయిస్తా. ఒకవేళ వాళ్లు ఆర్మీలోకి వాళ్లు వెళ్లాలనుకుంటే అక్కడికైనా పంపిస్తానని‘సాక్షి’అడిగిన ప్రశ్నకు ఆమె సగర్వంగా సమాధానమిచ్చారు. 

ఆయనపై దేశభక్తిని చాటారు..
ఆయన ఒక గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆయన ఆలోచనలు ఎంతో ఉదాత్తంగా ఉండేవి. మాటలు ఎదుటివారికి ఎంతో ధైర్యాన్నిచ్చేవి. వృత్తిధర్మంగా శత్రువులను చీల్చి చెండాడేవారు.  ఆయన ఎంత గొప్పవ్యక్తో ఆయన అంత్యక్రియల సందర్భంగా అందరూ మాట్లాడుకునే మాటలు వింటుంటే బాధతోపాటు గర్వంగా కూడా అనిపించింది. సరిహద్దుల్లో మన కోసం ఎందరో ప్రాణ త్యాగం చేస్తున్నారు. డిఫెన్స్‌లోకి రావాలంటే ప్రాణాలు పోతాయన్న భయం ఉండొద్దు. దేశరక్షణకు ఎంతమంది ఉంటే.. మనకు అంత బలం.  

తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా...
మా మామగారికి ఒక ఆలోచన ఉండేది. పుట్టిన ప్రతి వాళ్లు బతుకుతారు, చస్తారు.. కానీ ఆ చావుకు ఒక అర్థం ఉండాలన్నది ఆయన భావన. ఆ ఆలోచనలకు అనుగుణంగానే తండ్రి తనను, చెల్లిని పెంచేవారని నాకు చెబుతుండేవారు. ఆయన తన తండ్రి ఆదర్శాలకు అనుగుణంగా పెరిగినట్లే నేను రేపు నా పిల్లలను వాళ్ల తండ్రి ఆలోచనలకు తగ్గట్టే తీర్చిదిద్దుతాను. – బొల్లం శ్రీనివాస్, సూర్యాపేట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement