అమెరికా మాజీ దౌత్యాధికారిణి అలిసా ఐర్స్
న్యూయార్క్: భారత్, చైనాల మధ్య సంబంధాల్లో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కనిపిస్తోందని అమెరికా మాజీ దౌత్యాధికారిణి అలిసా ఐర్స్ అన్నారు. చైనాను నిలువరించే క్రమంలో అమెరికా నేతృత్వంలోని కూటమిలో భారత్ చేరే అవకాశాలు లేవన్నారు. దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల విభాగంలో పనిచేసిన అలిసా ప్రస్తుతం విదేశీ వ్యవహారాల కౌన్సిల్‌లో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె రాసిన పుస్తకం ‘అవర్ టైం హాజ్ కమ్: హౌ ఇండియా ఈజ్ మేకింగ్ ఇట్స్ ప్లేస్ ఇన్ ది వరల్డ్’ విడుదల సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
చైనాతో పటిష్టమైన వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ సంతృప్తి చెందటం లేదన్నారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెంచుకోవటం, ముఖ్యంగా డిజిబౌటిలో సైనిక స్థావరం ఏర్పాటును భారత్ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పాక్, శ్రీలంకలతో చైనా సన్నిహితంగా మెలుగుతూ పెట్టుబడులు పెట్టడం భారత్‌కు ఇబ్బంది కలిగిస్తోందన్నారు.
స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు ప్రాధాన్యమిచ్చే వాతావరణం ప్రపంచమంతటా ఉండాలని భారత్ ఆకాంక్షిస్తోందని ఆమె చెప్పారు. 2008 ముంబై దాడుల వంటివి పునరావృతమైతే భారత్ ఉదాసీన వైఖరితో ఉంటుందని భావించలేమన్నారు. నిర్ణయాత్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని అంచనా వేశారు. గతేడాది పాక్ భూభాగంపై భారత్ సర్జికల్ దాడులను ఇందుకు ఉదాహరణగా చెప్పారు. 2018లో ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ ముందడుగు వేస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment