ఆస్పెన్: అగ్రరాజ్యంగా అమెరికా స్థానాన్ని ఆక్రమించేందుకు చైనా ప్రచ్ఛన్నయుద్ధం చేస్తోందని అమెరికా నిఘా సంస్థ (సీఐఏ) వెల్లడించింది. ఇందుకోసం అన్ని వనరులను చైనా వినియోగించుకుంటోందని అమెరికాకు చెందిన సీఐఏ నిపుణుడు (ఆసియా వ్యవహారాల) మైకేల్ కొలిన్స్ తెలిపారు. కొలిన్స్ వ్యాఖ్యలు చైనా ప్రభావం వేగంగా పెరుగుతోందన్న హెచ్చరికలను సూచిస్తోంది. ‘చైనా యుద్ధం చేయాలనుకోవడం లేదు. కానీ జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనా ప్రభుత్వం అమెరికా ప్రభావాన్ని తగ్గించేందుకు వివిధ మార్గాల్లో అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తోంది. నేరుగా యుద్ధం చేయలేక ప్రచ్ఛన్నయుద్ధాన్ని ఆశ్రయిస్తోందని నేను బలంగా చెప్పగలను.
ఇది మనం చూసిన అమెరికా–రష్యాల మధ్య జరిగిన ప్రచ్ఛన్నయుద్ధంలా లేదు. కాస్త భిన్నంగా ఉంది’ అని కొలరాడోలో జరిగిన ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్ సదస్సులో కొలిన్స్ పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు వ్యాపార వివాదాలను దాటి.. ఇరుదేశాలు నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి చేరాయన్నారు. ‘అమెరికాలో జరుగుతున్న అత్యున్నత స్థాయి సాంకేతికత పరిశోధనలకు, వ్యాపార రహస్యాలను చైనా తస్కరిస్తోంది. తన మిలటరీని విస్తరిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని వివిధ ద్వీపాల్లో సైనిక స్థావరాలను ఆధునికీకరిస్తోందని అమెరికా సహా మిగిలిన దేశాలు ఐరాసకు ఫిర్యాదు చేశాయి. ఈ ద్వీపాలన్నీ తూర్పు క్రిమియాలుగా మారిపోతున్నాయి’ అని మైకేల్ కొలిన్స్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment