ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇంధన, ఐటీ రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 531 పాయింట్లను కోల్పోయి 48,348 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133 పాయింట్లు పతనమైన 14,238 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు. ఈ మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1444 పాయింట్లకు పైగా పతనమవగా, నిఫ్టీ 407 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, అధిక వెయిటేజీ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు సిక్కిం సరిహద్దుల్లో భారత్– చైనా సైనిక బలగాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. సూచీల ఒకశాతం పతనంతో రూ.2.1 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.192.3 లక్షల కోట్లకు దిగివచ్చింది. దేశీయ ఇన్వెస్టర్ల(డీఐఐ)తో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ నికర అమ్మకందారులుగా మారి మొత్తం రూ.765 కోట్ల షేర్లన విక్రయించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నేడు (మంగళవారం) మార్కెట్లకు సెలవు.
ఇంట్రాడేలో 988 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్..!
ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల పరిణామాలతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రారంభంలో కొంత షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 385 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడ్డాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొన్న అంతర్గత బలహీనతలు సూచీల లాభాలకు అడ్డువేశాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. నేడు మార్కెట్‌కు సెలవు, ఎల్లుండి జనవరి ఎఫ్‌అండ్‌ఓ ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. చివరి అరగంటలో అమ్మకాల తీవ్రత మరింత పెరగడంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి(49,263) 988 పాయింట్లను కోల్పోయి 48,275 వద్దకు వచ్చింది. నిఫ్టీ సైతం డే హై(14,491) నుంచి 274 పాయింట్లు నష్టపోయి 14,491 స్థాయిని తాకింది.
రిలయన్స్‌ను అధిగమించిన టీసీఎస్
రిలయన్స్ షేరు పతనం టీసీఎస్ కంపెనీకి కలిసొచ్చింది. మార్కెట్ క్యాప్ విషయంలో రిలయన్స్‌ను అధిగమించి టీసీఎస్ దేశంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ షేరు ఇంట్రాడేలో రూ.3,345 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకి చివరికి 0.36% స్వల్ప నష్టంతో రూ.3,291 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ 12.34 లక్షల కోట్లకు చేరింది. ఇక 5.36% పతనమైన రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.12.29 లక్షల కోట్ల వద్ద ముగిసింది.
ఒక్కరోజులో ముకేశ్ అంబానీకి రూ. 38వేల కోట్ల నష్టం
రిలయన్స్ షేరు భారీ పతనంతో ఈ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరోజులోనే రూ.38 వేల కోట్ల సంపదను కోల్పోయారు. రిలయన్స్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లు మెప్పించలేకపోయాయి. దీంతో షేరు ఇంట్రాడేలో 5.71% నష్టపోయి రూ.1932 స్థాయికి చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. ఫలితంగా కంపెనీలో సగానికి పైగా వాటా కలిగిన ముకేశ్ ఏకంగా రూ.38 వేల కోట్ల నష్టాన్ని చవిచూశారు. దీంతో బ్లూమ్‌బర్గ్ బిలినియర్ ఇండెక్స్‌లో అంబానీ 11వ స్థానం నుంచి 12వ స్థానానికి తగ్గింది.
మూడోరోజూ అమ్మకాలే..!
Published Tue, Jan 26 2021 5:32 AM | Last Updated on Tue, Jan 26 2021 5:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment