
బీజింగ్: గతంలో భారత్-చైనా అంటే ఒక యుద్ధ వాతవారణమే కనిపించేది. భారత్ తో పాకిస్తాన్ ఏ రకంగా కయ్యానికి కాలు దువ్వుతుందో ఆ రకంగానే ఉండేది చైనాతో కూడా. అయితే భారత్-చైనా సంబంధాలు ఇప్పుడు దాదాపు మెరుగైన స్థితిలోనే కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఎక్కడా కనిపించకపోవడమే ఇందుకు ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు.
అయితే భారత్ తో స్నేహ హస్తం కోసం చైనా కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తోంది. భారత్ తో కలిసి ఎలిఫెంట్ డ్రాగన్ డ్యాన్స్ చేయాలంటూ ఇప్పటికే చైనా చాలా సార్లు స్నేహ హస్తాన్ని ఇవ్వమని నేరుగానే అడిగేసింది. దీనికి భారత్ కూడా సానుకూలంగానే స్పందించింది. చైనాతో స్నేహ పూర్వకంగా కలిసి పని చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రధాని మోదీ కూడా ఇటీవలే స్సష్టం చేశారు. ఇరు దేశాలది ఘనమైన చరిత్ర అని, ప్రపంచ జీడీపీలో ఇరు దేశాలది సగం వాట ఉందంటే భారత్-చైనాలు ఎంత బలమైన దేశాలో అర్థం చేసుకోవచ్చని కూడా ఆ సందర్భంలో మోదీ పేర్కొన్నారు.
భారత్ చైనాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుడు మంగళవారం అభినందనలు తెలుపుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల అధ్యక్షులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.
ఇరు దేశాలు మరింత స్నేహ పూర్తకంగా కలిసి పని చేయాలని, భారత్ చైనాల బంధం ఎలిఫెంట్ డ్రాగన్ టాంగో రూపంలో ఉండాలని ఈ సందర్భంగా జిన్ పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల సంబంధాలు శాంతియుతంగా, స్నేహపూర్వకంగా మారడానికి మార్గాలను కనుగొనాలని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కమ్యూనికేషన్ తదితర వాటిల్లో మరింతగా పెంచుకోవాలని జిన్‌పింగ్ సూచించారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతిని కాపాడడంలో భారత్‌తో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నానని అన్నారు.