భారత వ్యతిరేక శక్తులతో జస్టిన్ ట్రూడోకు సన్నిహిత సంబంధాలు
రాజకీయ అవసరాల కోసం ఖలిస్తానీ ముష్కరులకు ప్రభుత్వం అండ
భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ వెల్లడి
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తీరును కెనడాలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ బట్టబయలు చేశారు. ట్రూడో ఆంతరంగికుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులు ఉంటాయని చెప్పారు. కెనడాలో రాజకీయ అవసరాల కోసం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ట్రూడో ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని అన్నారు. భారత్–కెనడా మధ్య వివాదం నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మను భారత ప్రభుత్వం ఇటీవల వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
కెనడాలోని ఖలిస్తానీ శక్తులు, భారత వ్యతిరేక శక్తులు ప్రధాని ట్రూడోతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాయని వెల్లడించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ట్రూడో ఆప్తమిత్రులుగా మారిపోయారని తెలిపారు. 2018లో ట్రూడో భారత్‌ను సందర్శించినప్పుడు ఆయన వెంటనే ఖలిస్తాన్ సానుభూతిపరులు కూడా కనిపించారని సంజయ్ కుమార్ వర్మ గుర్తుచేశారు. ఖలిస్తాన్ పోరాట యోధులమని చెప్పుకుంటున్న వ్యక్తులకు కెనడాలో ఎనలేని ప్రోత్సాహం లభిస్తోందని ఆరోపించారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో సంజయ్ కుమార్ వర్మను కెనడా ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని కెనడా చేస్తున్న ఆరోపణలపై సంజయ్ కుమార్ వర్మ స్పందించారు. ఆ కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేలి్చచెప్పారు. ఖలిస్తానీ ముష్కరులు కెనడాలో భారత కాన్సులేట్ కార్యాలయాల ఎదుట అల్లర్లు సృష్టించారని, భారత దౌత్యవేత్తలను సోషల్ మీడియా ద్వారా బెదిరించేందుకు ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు.
దారుణ పరిస్థితుల్లో విద్యార్థులు
కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటున్న భారత విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సంజయ్ కుమార్ వర్మ సూచించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగ్గా లేవని అన్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా మంచి కాలేజీల్లో ప్రవేశాలు దొరకడం లేదని, చదువులు పూర్తిచేసుకున్నాక ఉద్యోగాలు లభించడం లేదని చెప్పారు. విద్యార్థుల్లో కుంగుబాటు, ఆత్మహత్య వంటి పరిణామాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తాను కెనడాలో హైకమిషనర్‌గా పనిచేసిన సమయంలో వారానికి కనీసం రెండు మృతదేహాలను భారత్‌కు పంపించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగాలు రాక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక కెనడాలో భారతీయ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అందుకని కెనడాను ఎంచుకోకపోవడమే మంచిదని సూచించారు. ఒకవేళ భారత్–కెనడా మధ్య సంబంధాలు బాగున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తాను ఇదే సలహా ఇచ్చేవాడినని వ్యాఖ్యానించారు. ఎన్నో ఆశలతో వెళ్లిన విద్యార్థులు శవాలై తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితికి ఏజెంట్లు కూడా కొంత కారణమని విమర్శించారు.
రూ.లక్షలు దండుకొని ఊరూపేరు లేని కాలేజీల్లో విద్యార్థులను చేరి్పస్తున్నారని, సరైన వసతులు కూడా కలి్పంచడం లేదని వెల్లడించారు. వారానికి కేవలం ఒక క్లాసు నిర్వహించే కాలేజీలు కూడా ఉన్నాయన్నారు. ఇరుకు గదిలో ఎనిమిది మంది విద్యార్థులు సర్దుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయని తెలిపారు. కెనడాలో భారతీయ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారని, దుకాణాల్లో చాయ్, సమోసాలు అమ్ముకుంటున్నారని సంజయ్ వర్మ ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment