కెనడా తీరుపై భారత్ ధ్వజం
ట్రూడో వైఖరే ప్రధాన సమస్య
విదేశాంగ శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అడ్డగోలు ఆరోపణలు చేసిన కెనడా తీరును భారత్ మరోసారి తూర్పారబట్టింది. ఈ విషయమై ఏ ఆధారాలూ లేకున్నా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాధ్యతారహితంగా చేసిన తీవ్ర ఆరోపణలే ఇరు దేశాల మధ్య తాజా దౌత్య వివాదానికి ఆజ్యం పోశాయంటూ ఆక్షేపించింది.
నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్లున్నారన్న తన ఆరోపణలకు నిఘా సమాచారమే ఆధారం తప్ప దాన్ని నిరూపించేందుకు ఎలాంటి రుజువులూ తమ వద్ద లేవని ట్రూడో బుధవారం స్వయంగా అంగీకరించడం తెలిసిందే. భారత్‌పై ఆయన ఆరోపణల్లో పస ఎంతో దీన్నిబట్టే అర్థమవుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. నిజ్జర్ ఉదంతానికి సంబంధించి కెనడా తమకు ఇప్పటిదాకా ఎలాంటి రుజువులూ ఇవ్వలేదని భారత్ పదేపదే చెబుతూ వస్తుండటం తెలిసిందేది.
దొంగ ఏడ్పులు...
నిజ్జర్ హత్య వెనక కూడా బిష్ణోయ్ గ్యాంగే ఉందని కెనడా చెబుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా నుంచి భారత్‌లో అరాచకాలకు పాల్పడుతున్న ఆ గ్యాంగ్‌కు చెందిన పలువురు సభ్యులను అరెస్టు చేసి అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా స్పందనే లేదని జైస్వాల్ స్పష్టం చేశారు. ‘‘కెనడా గడ్డపై ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ శక్తుల్లో గుర్జీత్‌సింగ్, గుర్జీందర్‌సింగ్, అర్‡్షదీప్‌సింగ్ గిల్, లఖ్బీర్‌సింగ్ లండా, గుర్‌ప్రీత్‌సింగ్ తదితరుల పేర్లను ట్రూడో సర్కారుకు ఎప్పుడో ఇచ్చాం.
వీరిలో పలువురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులూ ఉన్నారు. వీరంతా ఉగ్రవాదం తదితర తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. వీరిని అప్పగించాల్సిందిగా ఏళ్ల క్రితమే కోరాం. తాజాగా ఇటీవల కూడా విజ్ఞప్తి చేశాం. కానీ కనీస స్పందన లేదు’’ అని వివరించారు. ‘‘ఇలాంటి కనీసం 26 విజ్ఞప్తులు కెనడా వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. భారత భద్రత కోణం నుంచి చూస్తే ఇది చాలా తీవ్రమైన అంశం’’ అని వివరించారు.
‘‘వారిపై కనీసం గట్టి చర్యలైనా తీసుకోవాలని భారత్ ఎన్నిసార్లు కోరినా ట్రూడో సర్కారు పెడచెవిన పెడూతూ వస్తోంది. వారి రెచ్చగొట్టే ప్రసంగాలను భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చూసీ చూడనట్టు వదిలేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘ఓవైపేమో భారత్ ఎంతగా విజ్ఞప్తి చేసినా వారిని ఉద్దేశపూర్వకంగానే పట్టుకోవడం లేదు. మరోవైపు అదే బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు భారత ఆదేశాల మేరకు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారంటూ దొంగ ఏడ్పులు ఏడుస్తోంది’’ అంటూ జైస్వాల్ నిప్పులు చెరిగారు. ట్రూడో సర్కారు తాలూకు ఈ ప్రవర్తన కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని ఆయన స్పష్టం చేశారు. మరో ఏడాదిలో కెనడాలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment