భారత్, కెనడా మధ్య ‘నిజ్జర్ నిప్పు’
నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ పేరు చేర్చిన కెనడా
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్
నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్
కెనడా నుంచి దౌత్యాధికారులను వెనక్కి రప్పిస్తున్న భారత్
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్‌సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్‌ను వీడాలని ఆదేశాలు జారీచేసింది.
కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్‌ను కలిశారు.
అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది.
అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్‌కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.
ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు
ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది.
ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు
‘‘ 2023 సెపె్టంబర్‌లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం.
2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్‌తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్‌లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్‌లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్
భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్‌కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్‌కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్‌కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.
ఏమిటీ నిజ్జర్ వివాదం?
నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్‌కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్‌ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది.
హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్‌ను పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్‌పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్‌కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఎవరీ నిజ్జర్?
నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్‌లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్‌పూర్‌లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్‌పోర్ట్‌లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్‌లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment