ప్రతీకాత్మక చిత్రం
‘ఒక సమాజపు ప్రగతిని, ఆ సమాజంలోని మహిళలు సాధించిన ప్రగతితో కొలుస్తాను’ అన్నారు అంబేద్కర్. ఏ మార్పుకైనా మహిళలు ఎంత కీలకమో చెప్పే అరుదైన వ్యాఖ్య ఇది. మిగతా అన్ని సమూహాల మాదిరిగానే భారత మహిళల ప్రగతికి కూడా భిన్నత్వం ఉంది. ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుందని గురజాడ అంటే, ఆ చరిత్ర స్వేచ్ఛా సమానత్వాలతో అత్యంత ప్రజాస్వామికంగా ఉంటుంది అనుకున్నాము, ఆ వైపు కొన్ని ముందడుగులు పడ్డాయి. అయితే గత యాభై ఏళ్లుగా పాక్షికంగా, గత పదేళ్లుగా వడివడిగా కొన్ని మహిళా సమూహాలు కొత్తచరిత్రని వేగంగా నిర్మిస్తూ పోతున్నాయి. ఆ చరిత్ర ఫాసిస్ట్ భావజాలానికి బలమైన చేర్పుని ఇస్తూ ఉండటం కలవరపరిచే అంశం. ‘ఒక దేశపు ఫాసిస్టు భావజాల పురోగతిని, ఆ దేశపు రైట్ వింగ్ మహిళలు సాధించిన పురోగతితో కొలవాల్సి ఉంటుంది.’ ఇట్లా కొలిచినపుడు విభ్రాంతి కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. కూడూ, గూడూ, చదువూ, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళూ– వీటిలో కాసింత స్వేచ్ఛకోసం జీవితమంతా పణంగా పెట్టి కొందరు స్త్రీలు పోరాటాలు చేస్తున్నారు. మరోవైపు దేశాన్ని హిందూవర్ణంతో నింపేయడానికి సాయుధ, భావజాల, ప్రచార శిక్షణలతో మరికొందరు స్త్రీలు దూసుకుపోతున్నారు.
భారతదేశంలో ఫాసిజం ప్రధానంగా ‘హిందూత్వ బ్రాహ్మణీయ భావజాలరూపం’లో ఉందని విశ్లేషకుల అంచనా. ‘ఈ దుష్ట ఫాసిస్ట్ రాజ్యం నశించాలి’ అంటూ కేవలం అధికార వ్యవస్థలను శత్రువుల్లా చూస్తూ వచ్చిన కాలాన్ని దాటి ముందుకు వచ్చాము. ఇపుడు ఫాసిస్ట్ భావజాలం రాజ్యంలోనే కాదు... మన ఆఫీసుల్లో, ఎదురింట్లో, మనింట్లో, మనలోపలికి కూడా వచ్చేసింది. మొదటిదశలో రాజ్యవ్యవస్థలు ఎవరినైతే అణచివేస్తాయో, ఆయావర్గాల్లో నుంచే కొందరిని మచ్చిక చేసి, ప్రలోభపెట్టి తమకి అనుగుణంగా మలుచుకోవడం రెండోదశ. పైవర్గాలకి అనధికార బానిసలుగా మారడం, స్వీయవర్గాల మీదనే దాడి చేయడం, ఇదంతా దేశభక్తిగా పరిగణింపబడటం ఒక చట్రం. గుజరాత్ ముస్లిం జాతి హననకాండలో వాఘ్రీస్, చరస్ తెగల ఆదివాసీలు, పట్టణ దళితులు తీవ్రమైన హింసకి, లూటీలకి పాల్పడ్డారు. వారి వల్నరబిలిటీని అక్కడి మతతత్వశక్తులు గురిచూసి వాడుకున్నాయి. అగ్రవర్ణాల హిందూ మహిళలు, నాయకురాళ్ళు కొందరు దగ్గరుండి చప్పట్లు కొట్టి మరీ తమ మగవారు చేసే అత్యాచారాలను ప్రోత్సహించారు. తమలోతాము కొట్లాడుకునే బదులు ప్రతి హిందూ యువకుడూ– ఫలానా మైనార్టీ మతంలోని తలొక పురుషుడినీ చంపితే సంతోషిస్తామని మార్గనిర్దేశం చేశారు.
ఉత్తర భారతదేశంలో ‘కొత్తమహిళ’ ఆవిర్భవించింది. మతతత్వపార్టీలకూ, సంస్థలకూ అనుబంధంగా మహిళా విభాగాలు విస్తృతంగా ఏర్పడ్డాయి. ‘మాత్రీ మండలులు’, ‘సేవికా సమితులు’, ‘మహిళా మోర్చాలు’ తమ కార్ఖానాల్లో స్త్రీలకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. స్త్రీలు మృదువుగా, సుకుమారంగా ఉండాలని భావించే పితృస్వామిక సమాజం వారిని మతసంస్థలు నిర్వహించే పారా మిలిటరీ తరహా సాయుధ శిక్షణకి ఎలా ఒప్పుకుంది? స్త్రీలు ఉద్యోగాల కోసమో, ఇతర సామాజిక కార్యకలాపాల కోసమో అడుగు బైటపెడితే చాలు అనేక అనుమానాలతో వేధించే కుటుంబం, వారిని ధార్మిక కార్యకలాపాల కోసం రోజుల తరబడి పుణ్యక్షేత్రాలకి ఎలా అనుమతిస్తోంది? పర్పుల్ అంచున్న తెల్లచీరలు కట్టుకుని మతప్రచారికలుగా, అధ్యాపికలుగా అవివాహిత స్త్రీలు ప్రతిగుమ్మం స్వేచ్చగా తిరుగుతూ ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు?
ఎందుకంటే ఫాసిస్ట్ మతవ్యాప్తి కోసం అధికారవ్యవస్థలు స్త్రీలకి కాస్త కళ్ళాలు వదులు చేస్తాయి. తాము నిర్ణయించిన అంశాలలో స్త్రీలకి చరిత్రను పునర్లిఖించే బాధ్యతని అప్పగిస్తాయి. ‘స్త్రీ స్వేచ్ఛ అంటే, తమమీద జరిగే దాడులు, అత్యాచారాల నుంచి విముక్తి పొందడమే తప్ప భార్యలుగా, తల్లులుగా తమ సాంప్రదాయక విధుల నుంచి విముక్తి పొందడం కాద’ని ఒక మతతత్వ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలి వ్యాఖ్యను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి.
ఇంతకు ముందు మాత్రం స్త్రీలు అధికారం చలాయించలేదా అంటే చంఘిజ్ ఖాన్ నవలలో చెప్పినట్లు అధికారం వస్తే గడ్డిపరక కూడా తలెత్తి నిలబడుతుంది. రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారస్థు్థలు, సెలబ్రిటీ కళాకారులు, అగ్రవర్ణాలు, పదవులు హోదాల్లో ఉన్నవారి భార్యలు, తల్లులు, కూతుళ్ళు, అప్పచెల్లెళ్ళు కొందరు తమకి సొంతంగా పవర్ లేకపోయినా తమ మగవారి తరఫున వారికన్నా ఎక్కువ చలాయించడం వాస్తవం. ప్రాబల్యకులం, ధనికవర్గం, హోదా, అధికారం అంతిమంగా జత కడతాయి. అందులో స్త్రీలు ముఖ్యపాత్ర పోషిస్తారు. అయితే కనీసం మాటవరసకైనా – కులం అనాగరికం అనీ, పేద ఓటర్లే తమ దేవుళ్ళనీ, ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకేననీ – ఇలా బహిరంగంగా పవర్‌ని వ్యతిరేకించడం నైతికవిధిగా ఉండేది. ఇపుడు ఆ భారాన్ని తీసివేస్తూ పైవర్గాల స్త్రీల ఏకీకరణకి మతం అందివచ్చిన సాధనం అయింది.
ఈ సాధనం మొదట సాంస్కృతిక రంగంలో బలమైన పునాదులు వేసుకుంటోంది. వర్గాల, కులాల, హోదాలవారీగా కొంతమంది స్త్రీలు ఏర్పాటు చేసుకునే కిట్టీపార్టీల్లో మత సంబంధ కార్యాచరణ ఏదో ఒకమేరకు సాగుతోంది. పట్టణ, ధనిక, మధ్యతరగతి మహిళలు మత కార్యకలాపాలు నిర్వహించడానికి అపార్ట్‌మెంట్ కల్చర్ చాలా అనువుగా ఉంటోంది. చందాల సేకరణ, ఉత్సవాల నిర్వహణ కమిటీలలో స్త్రీలు చురుకుగా పాల్గొంటున్నారు. దేశభక్తి ముసుగులో మతాన్ని ఉగ్గుపాలతో రంగరించి బిడ్డలకి పోయడానికి తల్లులు సమాయత్తమవుతున్నారు. బాలల వికాసం అంటే కాషాయ దుస్తులు తొడిగి, తలకి కాషాయపట్టీ పెట్టి ప్రతీ పండగలో పిల్లల చేత కోలాటాలు, డీజేలు ఆడించడం విధిగా మారిపోయింది. ఒకప్పుడు శాస్త్రీయ దృక్పథాన్ని అందించడానికి తపన పడిన తల్లులు, ఇప్పుడు పురాణ స్త్రీలను అమ్మాయిలకి ఆదర్శంగా చూపిస్తున్నారు. పాతివ్రత్య నిరూపణ కోసం అగ్నిలో నిలబడి ఉన్న సీత క్యాలెండర్ లక్షలాది కాపీలు అమ్ముడుపోయి ఇంటి గోడలపై ప్రత్యక్షం కావడం ఆడపిల్లలకి ఎటువంటి సంకేతాన్ని ఇస్తుంది?
మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నంతవరకూ, దానినుంచి ప్రమాదం లేకపోవచ్చు, కానీ రాజకీయ ఆచరణగా ముందుకు వచ్చినపుడు అనేకమతాల భారతదేశంలో లౌకికతత్వం వెనక్కిపోయి మెజార్టీమతం అందరి నెత్తికెక్కి సవారీ చేస్తుంది. ఇంటి వరండా, హాలు వంటివి అందరూ వచ్చి పోవడానికి వీలైన లౌకికస్థలాలు. అక్కడ స్త్రీలు తమ చేతికళా నైపుణ్యాలతో తయారు చేసిన మత ప్రదర్శనా చిహ్నాలు, ఇతర మతస్థులు తమకి ఎంత పరాయివాళ్ళో చెబుతూ ఉంటాయి.
రాజకీయాలకి ఏమీ సంబంధం లేదేమో అనిపించేంతగా ఈ కొత్త మహిళలు చుట్టుపక్కల కుటుంబాలతో కలిసిపోతారు. పక్కింటి కొత్త కోడలికి వంట నేర్పడమో, ఎదురింటి పెద్దాయనకి అత్యవసర వైద్యసాయమో; ఆందోళన, అభద్రతల్లో ఉన్నవారికి మాటసాయమో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి చేతిసాయమో చేయడం ద్వారా చుట్టుపక్కల అందరికీ ముఖ్యులు అవుతారు. ఆయా సందర్భాల రోజువారీ చర్చల్లో భాగంగా తమ మత భావజాలాన్ని వ్యాప్తిలోకి తెస్తారు. భార్యాభర్తల సమస్యలకి న్యాయసహాయం తీసుకోకుండా ఈ మహిళలే మతసంఘాల ద్వారా పంచాయితీలు పెట్టి సర్దుకుపోవలసిన భారాన్ని స్త్రీల మీద వేస్తారు. ఎన్నికలు, పార్టీమీటింగుల సమయాల్లో వీరు ప్రచారకర్తలుగా మారి సాయాలు చేయడం ద్వారా తాము పట్టు పెంచుకున్న సర్కి ల్స్‌ని సమీకరించి రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారు.
నాలుగు దశాబ్దాల కిందట స్త్రీలు తమ పిల్లల్నీ, ఇంటినీ చూసుకుంటే చాలన్న దృష్టితో ఉద్యోగాలలో మహిళా రిజర్వేషన్‌ను మూడుశాతానికి కుదించిన ఘనత ఉత్తర భారత రాష్ట్రాలకి ఉంది. అనుకరణలో ఆరితేరిన దక్షిణ భారతదేశం అక్కడి మత రాజకీయాలనే కాదు, అక్కడి కొత్త మహిళలను కూడా ఆవాహన చేసుకుంటోంది. మత రాజకీయాలు మనకి వద్దు అనుకుంటే ప్రజలకు అయిదేళ్ళకాలం చాలు. ఈ కొత్త మహిళలు సర్వరంగాల్లో తెస్తున్న తిరోగతి వద్దు అనుకుంటే పోవడానికి యాభై ఏళ్ల కాలం కూడా చాలదు! (క్లిక్: మానవ హక్కుల వకీలు బాలగోపాల్)
- కె.ఎన్. మల్లీశ్వరి
జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
malleswari.kn2008@gmail.com
Comments
Please login to add a commentAdd a comment