న్యూఢిల్లీ: భారతదేశం, హిందుస్తాన్, ఇండియా.. ఇవన్నీ ఒకే దేశం పేర్లు. భారతదేశం ప్రపంచ దేశాలకు ‘ఇండియా’గానే తెలుసు. అధికారికంగా అమల్లో ఉన్న పేర్లలో ‘ఇండియా’కూడా ఒకటి. అయితే, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా సంబోధిస్తూ ముద్రించిన ఆహ్వాన పత్రికలను ఆమె తరఫున జీ20 దేశాల అధినేతలకు రాష్ట్రపతి భవన్ పంపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దేశం పేరును మార్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
జీ20 శిఖరాగ్ర సదస్సు వేదిక అయిన ‘భారత్ మండపం’లో ఈ నెల 9న రాత్రి జరిగే విందుకు హాజరు కావాలని కోరుతూ ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’తరఫున రాష్ట్రపతి భవన్ ఆహ్వానాలు పంపించింది. ఈ ఆహ్వాన పత్రికను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘జనగణమన అధినాయక జయహే, భారత భాగ్య విధాత’అనే వ్యాఖ్యను సైతం జోడించారు. జయహో అంటూ ముక్తాయించారు. ఈ పత్రిక సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దేశం పేరును ‘భారత్’గా మార్చడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 18 నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్లు ప్రచారం మొదలైంది. తమ కూటమి పేరు ‘ఇండియా’ను చూసి మోదీ సర్కారు భయపడుతోందని, అందుకే దేశం పేరును మార్చేసే కుతంత్రానికి పాల్పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. భారత్ అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, అదే పేరును ఉపయోగిస్తే తప్పేమిటని అధికార బీజేపీ నాయకులు ఎదురు దాడికి దిగారు.
పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు: శరద్ పవార్
మనకు ఇండియా అంటే భారత్, ప్రపంచదేశాలకు మన దేశం కేవలం ఇండియాగానే తెలుసని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ పేర్కొన్నాను. కేవలం భారత్ అనే పేరును వాడాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు ఏమొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీయేతర పార్టీల కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం బీజేపీకి మింగుడు పడడం లేదని, అందుకే దేశం పేరును భారత్ మార్చాలని కోరుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆక్షేపించారు.
ఇండియాను మార్చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ తొమ్మిదేళ్ల తర్వాత చేస్తున్నది కేవలం పేరు మార్చడమేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ‘ఇండియా’ఓడిస్తుందన్నారు. ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి తమ పేరును ‘భారత్’గా మార్చుకుంటే, ఆ పేరును కూడా బీజేపీ మార్చేస్తుందా? ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ప్రశ్నించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తేల్చిచెప్పారు. ‘‘భారత్.. అంటే ఇండియా. రాష్ట్రాల సమాహారమే ఇండియా అని రాజ్యాగంలోని ఆర్టికల్ 1 చెబుతోంది. అలాంటి రాష్ట్రాల సమాహారంపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోంది.
డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, న్యూ ఇండియా అనే పేర్లను బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇండియా షైనింగ్ అంటూ గతంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరిస్తున్నారు. దేశాన్ని విభజిస్తున్నారు. దేశం పేరును మార్చాలనుకుంటే కచ్చితంగా అడ్డుకుంటాం’’కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ హెచ్చరించారు. ‘ఇండియా’పేరుకు లెక్కగట్టలేనంత బ్రాండ్ విలువ ఉందని, దేశం పేరును మార్చే పిచ్చి పనిని బీజేపీ చేయదని తాను భావిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు.
భారత్ కాకుండా ఇంకెలా పిలవాలి?: రాజీవ్ చంద్రశేఖర్
మన దేశం పేరు భారత్ అయినప్పుడు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’అని పేర్కొంటే తప్పేమిటని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిలదీశారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. భారత్‌ను భారత్ అని కాకుండా ఇంకేలా పిలవాలని ప్రశ్నించారు. ప్రాచీన కాలం నుంచి భారత్ అనే పేరు వాడుకలో ఉందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గుర్తుచేశారు. భారతమాత, వందేమాతరం మన రక్తంలోనే ఉన్నాయని చెప్పారు.
భారత్ అనే పేరును తుడిచిపెట్టేయడానికి కొత్త ఖిల్జీలు, కొత్త మొఘల్ రాజులు పుట్టుకొచ్చారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. మన దేశం ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉద్ఘాటించారు. మన నాగరికత అమృతకాలం వైపు సాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ‘భారత్’ను ఓడించడానికే ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’అనే పేరు పెట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి భారత్ అంటే నచ్చదని చెప్పారు.
తెరపైకి భారత్..!
Published Wed, Sep 6 2023 1:28 AM | Last Updated on Wed, Sep 6 2023 6:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment