‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా..’ అనే సినిమా డైలాగ్ తరహాలో ఎలాంటి హామీలిచ్చామన్నది కాదు.. తమకు అనుకూలంగా బ్యాలెట్ బాక్సులు నిండాయా..లేదా? అధికారం చేపడతామా..లేదా?.. ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా రాజకీయ పార్టీల టార్గెట్ ఇదే. నగదుతో పాటు చీరలు, సెల్‌ఫోన్లు, కుక్కర్ల లాంటి వస్తువుల పంపిణీతో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించడం.. ముఖ్యంగా అధికారంలోకి వస్తే అది చేస్తాం..ఇది చేస్తాం..అంటూ హామీలు గుప్పించడం. ప్రపంచవ్యాప్తంగా పార్టీలది ఇదే బాట.
తెలంగాణ అయినా, భారత్‌లో అయినా, పర్యాటక ప్రేమికుల స్వర్గధామం థాయిలాండ్ అయినా, భూకంపాల పుట్టినిల్లు టర్కీ అయినా.. ఎక్కడైనా ఓటర్ల కోసం తాయిలాలే. మన దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా పార్టీలు ఇస్తున్న హామీల తరహాలోనే.. గతంలో ప్రపంచంలోని పలు దేశాల ఎన్నికల్లోనూ పార్టీలు అనేక రకాల హామీలను గుప్పించి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయడం గమనార్హం.
అయితే కొన్ని దేశాల్లో ప్రజాకర్షక హామీలతో పాటు పలు ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాలకు సంబంధించిన అంశాలు కూడా అక్కడి ఓటర్లను ప్రభావితం చేయడం ఆసక్తి కలిగించే అంశం. కాగా, ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎన్నికలు జరిగిన టర్కీ, అర్జెంటీనా, పోలండ్, థాయ్‌లాండ్ దేశాల్లో స్థానిక ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు ఎలాంటి తాయిలాలు ప్రకటించాయో ఓసారి చూద్దాం.
పోలండ్‌లో హక్కుల అంశాలు!
1989లో కమ్యూనిస్టు పాలన ముగిసిన తర్వాత పోలండ్‌లో మొదటిసారి ఈ ఏడాది అక్టోబర్‌లో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అధికార లా అండ్ జస్టిస్ పార్టీ (పీఐఎస్) మిత్రపక్షాలు, సెంటర్ రైట్ సివిక్ ప్లాట్‌ఫామ్ (పీవో)లు హోరాహోరీ తలపడ్డాయి.
ఇక్కడి ఎన్నికలు రక్షణ రంగం, వలసలు, యూరోపియన్ యూనియన్ పాత్ర, మహిళలు, స్వలింగ సంపర్కుల హక్కులు, ద్రవ్యోల్బణం లాంటి అంశాలపై జరిగాయి. చిన్నారులు, వృద్ధులకు ఉచితంగా ఔషధాలను ఇస్తామని, 1989 కంటే ముందు కట్టిన అపార్ట్‌మెంట్లను ఆధునీకరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలను పెంచుతామని, కనీస వేతనాన్ని 6,450 జ్లోటీలకు పెంచుతామనే హామీలనిచ్చాయి.
ఆర్థిక వ్యవస్థ పటిష్టతపై అర్జెంటీనా
అర్జెంటీనాలో అధ్యక్షుడితో పాటు 22 ప్రావిన్సుల గవర్నర్లు, 130 డిప్యూటీ గవర్నర్లు, 24 సెనేటర్ స్థానాలకు ఈ ఏడాది అక్టోబర్ 22న ఎన్నికలు జరిగాయి. ఈ దేశంలో బహుళ పార్టీ వ్యవస్థ ఉన్నా.. ది యూనియన్ పోర్‌లా పాట్రియా (యూపీ), జుంటోస్ పార్ కాంబియో (జేఎక్స్‌సీ), లా లిబరా్టడ్ అవాంజా (ఎల్‌ఎల్‌ఏ) కూటముల మధ్య పోటీ జరిగింది.
దేశంలో జరుగుతున్న నేరాలు, డ్రగ్ ట్రాఫికింగ్‌లను అరికట్టేందుకు భద్రత పెంపు, పన్నుల తగ్గింపు, రాష్ట్రాల పరిధుల తగ్గింపు (మన రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజన తరహాలో), నిరుద్యోగ బీమా, ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ, సామాజిక అంశాలపై ఖర్చు తగ్గింపు, వాణిజ్య రంగంలో నిబంధనల సరళీకరణ, చైనాతో సంబంధాల కటీఫ్, అమెరికన్ డాలర్‌తో పోటీ పడేలా ఆర్థిక వ్యవస్థ రూపకల్పన లాంటి అంశాలు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ప్రచారా్రస్తాలుగా ఉపయోగపడ్డాయి.
టర్కీలో ‘టెర్రర్’
తీవ్రవాదంతో కునారిల్లుతోన్న టర్కీలో జరిగిన ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన భూకంపాల కేంద్రంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇక్కడి ప్రధాన పార్టీలు సిరియా శరణార్ధులను కూడా ఎన్నికల బూచిగా వాడుకున్నారు.
రష్యా మధ్యవర్తిత్వంతో సిరియాతో చర్చలు జరుపుతామని ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగాన్ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. భూకంపాల నుంచి ఉపశమనం పొందేందుకు గాను ఈశాన్య టర్కిలోని ప్రజలకు 20 ఏళ్ల కాలపరిమితితో ఇంటి రుణాలు ఇప్పిస్తామని, రెండేళ్ల తర్వాత ఈ రుణాలు చెల్లించేలా చేస్తామని చెప్పాయి. మొత్తం ఆరున్నర లక్షల ఇళ్లను ప్రభుత్వమే కట్టి ఇస్తుందని, ఇందులో 3.19 లక్షలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని పార్టీలు హామీలిచ్చాయి.
థాయ్‌లాండ్‌లో ఆర్థిక లబ్ధిపై దృష్టి!
ప్రపంచ పర్యాటక కేంద్రమైన థాయ్‌లాండ్‌లో ఈ ఏడాది మేలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలయిన ప్యూ థాయ్ పార్టీ, మూవ్ ఫార్వార్డ్ పార్టీ, యునైటెడ్ థాయ్ నేషన్ పార్టీ, పలాంగ్ ప్రచారత్ పార్టీ, భుంజయ్‌థాయ్ పార్టీ, డెమొక్రాట్ పార్టీలు ఓట్ల వేటలో భాగంగా పలు హామీలు అక్కడి ప్రజలకు ఇచ్చాయి. ఎక్కువగా ఆర్థిక లబ్ధి చేకూర్చే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాయి.
డిజిటల్ వ్యాలెట్ల ద్వారా 16 ఏళ్లు నిండిన వారికి రూ.10వేల బాత్‌లను ఇస్తామని, దినసరి కనీస వేతనాలను 337 బాత్‌ల నుంచి 600 బాత్‌లకు పెంచుతామని, రుణాలపై మూడేళ్ల మారటోరియం ప్రకటిస్తామని, ప్రతి ఉపాధ్యాయునికి, విద్యార్థి కి టాబ్లెట్ కంప్యూటర్ ఇస్తామని, వృద్ధాప్య భృతి నెలకు 3వేల బాత్‌లు చేస్తామని, విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, 1జీబీ ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తామని, వ్యవసాయ కుటుంబాలకు 30వేల బాత్‌లు సాయం చేస్తామని, వరి పండించే రైతాంగానికి రయ్ (అర ఎకరానికి కొంచెం ఎక్కువ)కి 2వేల బాత్ ఇస్తామని ప్రకటించాయి.
-మేకల కళ్యాణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment