kn malliswari
-
కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త!
‘ఒక సమాజపు ప్రగతిని, ఆ సమాజంలోని మహిళలు సాధించిన ప్రగతితో కొలుస్తాను’ అన్నారు అంబేద్కర్. ఏ మార్పుకైనా మహిళలు ఎంత కీలకమో చెప్పే అరుదైన వ్యాఖ్య ఇది. మిగతా అన్ని సమూహాల మాదిరిగానే భారత మహిళల ప్రగతికి కూడా భిన్నత్వం ఉంది. ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుందని గురజాడ అంటే, ఆ చరిత్ర స్వేచ్ఛా సమానత్వాలతో అత్యంత ప్రజాస్వామికంగా ఉంటుంది అనుకున్నాము, ఆ వైపు కొన్ని ముందడుగులు పడ్డాయి. అయితే గత యాభై ఏళ్లుగా పాక్షికంగా, గత పదేళ్లుగా వడివడిగా కొన్ని మహిళా సమూహాలు కొత్తచరిత్రని వేగంగా నిర్మిస్తూ పోతున్నాయి. ఆ చరిత్ర ఫాసిస్ట్ భావజాలానికి బలమైన చేర్పుని ఇస్తూ ఉండటం కలవరపరిచే అంశం. ‘ఒక దేశపు ఫాసిస్టు భావజాల పురోగతిని, ఆ దేశపు రైట్ వింగ్ మహిళలు సాధించిన పురోగతితో కొలవాల్సి ఉంటుంది.’ ఇట్లా కొలిచినపుడు విభ్రాంతి కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. కూడూ, గూడూ, చదువూ, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళూ– వీటిలో కాసింత స్వేచ్ఛకోసం జీవితమంతా పణంగా పెట్టి కొందరు స్త్రీలు పోరాటాలు చేస్తున్నారు. మరోవైపు దేశాన్ని హిందూవర్ణంతో నింపేయడానికి సాయుధ, భావజాల, ప్రచార శిక్షణలతో మరికొందరు స్త్రీలు దూసుకుపోతున్నారు. భారతదేశంలో ఫాసిజం ప్రధానంగా ‘హిందూత్వ బ్రాహ్మణీయ భావజాలరూపం’లో ఉందని విశ్లేషకుల అంచనా. ‘ఈ దుష్ట ఫాసిస్ట్ రాజ్యం నశించాలి’ అంటూ కేవలం అధికార వ్యవస్థలను శత్రువుల్లా చూస్తూ వచ్చిన కాలాన్ని దాటి ముందుకు వచ్చాము. ఇపుడు ఫాసిస్ట్ భావజాలం రాజ్యంలోనే కాదు... మన ఆఫీసుల్లో, ఎదురింట్లో, మనింట్లో, మనలోపలికి కూడా వచ్చేసింది. మొదటిదశలో రాజ్యవ్యవస్థలు ఎవరినైతే అణచివేస్తాయో, ఆయావర్గాల్లో నుంచే కొందరిని మచ్చిక చేసి, ప్రలోభపెట్టి తమకి అనుగుణంగా మలుచుకోవడం రెండోదశ. పైవర్గాలకి అనధికార బానిసలుగా మారడం, స్వీయవర్గాల మీదనే దాడి చేయడం, ఇదంతా దేశభక్తిగా పరిగణింపబడటం ఒక చట్రం. గుజరాత్ ముస్లిం జాతి హననకాండలో వాఘ్రీస్, చరస్ తెగల ఆదివాసీలు, పట్టణ దళితులు తీవ్రమైన హింసకి, లూటీలకి పాల్పడ్డారు. వారి వల్నరబిలిటీని అక్కడి మతతత్వశక్తులు గురిచూసి వాడుకున్నాయి. అగ్రవర్ణాల హిందూ మహిళలు, నాయకురాళ్ళు కొందరు దగ్గరుండి చప్పట్లు కొట్టి మరీ తమ మగవారు చేసే అత్యాచారాలను ప్రోత్సహించారు. తమలోతాము కొట్లాడుకునే బదులు ప్రతి హిందూ యువకుడూ– ఫలానా మైనార్టీ మతంలోని తలొక పురుషుడినీ చంపితే సంతోషిస్తామని మార్గనిర్దేశం చేశారు. ఉత్తర భారతదేశంలో ‘కొత్తమహిళ’ ఆవిర్భవించింది. మతతత్వపార్టీలకూ, సంస్థలకూ అనుబంధంగా మహిళా విభాగాలు విస్తృతంగా ఏర్పడ్డాయి. ‘మాత్రీ మండలులు’, ‘సేవికా సమితులు’, ‘మహిళా మోర్చాలు’ తమ కార్ఖానాల్లో స్త్రీలకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. స్త్రీలు మృదువుగా, సుకుమారంగా ఉండాలని భావించే పితృస్వామిక సమాజం వారిని మతసంస్థలు నిర్వహించే పారా మిలిటరీ తరహా సాయుధ శిక్షణకి ఎలా ఒప్పుకుంది? స్త్రీలు ఉద్యోగాల కోసమో, ఇతర సామాజిక కార్యకలాపాల కోసమో అడుగు బైటపెడితే చాలు అనేక అనుమానాలతో వేధించే కుటుంబం, వారిని ధార్మిక కార్యకలాపాల కోసం రోజుల తరబడి పుణ్యక్షేత్రాలకి ఎలా అనుమతిస్తోంది? పర్పుల్ అంచున్న తెల్లచీరలు కట్టుకుని మతప్రచారికలుగా, అధ్యాపికలుగా అవివాహిత స్త్రీలు ప్రతిగుమ్మం స్వేచ్చగా తిరుగుతూ ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు? ఎందుకంటే ఫాసిస్ట్ మతవ్యాప్తి కోసం అధికారవ్యవస్థలు స్త్రీలకి కాస్త కళ్ళాలు వదులు చేస్తాయి. తాము నిర్ణయించిన అంశాలలో స్త్రీలకి చరిత్రను పునర్లిఖించే బాధ్యతని అప్పగిస్తాయి. ‘స్త్రీ స్వేచ్ఛ అంటే, తమమీద జరిగే దాడులు, అత్యాచారాల నుంచి విముక్తి పొందడమే తప్ప భార్యలుగా, తల్లులుగా తమ సాంప్రదాయక విధుల నుంచి విముక్తి పొందడం కాద’ని ఒక మతతత్వ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలి వ్యాఖ్యను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇంతకు ముందు మాత్రం స్త్రీలు అధికారం చలాయించలేదా అంటే చంఘిజ్ ఖాన్ నవలలో చెప్పినట్లు అధికారం వస్తే గడ్డిపరక కూడా తలెత్తి నిలబడుతుంది. రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారస్థు్థలు, సెలబ్రిటీ కళాకారులు, అగ్రవర్ణాలు, పదవులు హోదాల్లో ఉన్నవారి భార్యలు, తల్లులు, కూతుళ్ళు, అప్పచెల్లెళ్ళు కొందరు తమకి సొంతంగా పవర్ లేకపోయినా తమ మగవారి తరఫున వారికన్నా ఎక్కువ చలాయించడం వాస్తవం. ప్రాబల్యకులం, ధనికవర్గం, హోదా, అధికారం అంతిమంగా జత కడతాయి. అందులో స్త్రీలు ముఖ్యపాత్ర పోషిస్తారు. అయితే కనీసం మాటవరసకైనా – కులం అనాగరికం అనీ, పేద ఓటర్లే తమ దేవుళ్ళనీ, ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకేననీ – ఇలా బహిరంగంగా పవర్‌ని వ్యతిరేకించడం నైతికవిధిగా ఉండేది. ఇపుడు ఆ భారాన్ని తీసివేస్తూ పైవర్గాల స్త్రీల ఏకీకరణకి మతం అందివచ్చిన సాధనం అయింది. ఈ సాధనం మొదట సాంస్కృతిక రంగంలో బలమైన పునాదులు వేసుకుంటోంది. వర్గాల, కులాల, హోదాలవారీగా కొంతమంది స్త్రీలు ఏర్పాటు చేసుకునే కిట్టీపార్టీల్లో మత సంబంధ కార్యాచరణ ఏదో ఒకమేరకు సాగుతోంది. పట్టణ, ధనిక, మధ్యతరగతి మహిళలు మత కార్యకలాపాలు నిర్వహించడానికి అపార్ట్మెంట్ కల్చర్ చాలా అనువుగా ఉంటోంది. చందాల సేకరణ, ఉత్సవాల నిర్వహణ కమిటీలలో స్త్రీలు చురుకుగా పాల్గొంటున్నారు. దేశభక్తి ముసుగులో మతాన్ని ఉగ్గుపాలతో రంగరించి బిడ్డలకి పోయడానికి తల్లులు సమాయత్తమవుతున్నారు. బాలల వికాసం అంటే కాషాయ దుస్తులు తొడిగి, తలకి కాషాయపట్టీ పెట్టి ప్రతీ పండగలో పిల్లల చేత కోలాటాలు, డీజేలు ఆడించడం విధిగా మారిపోయింది. ఒకప్పుడు శాస్త్రీయ దృక్పథాన్ని అందించడానికి తపన పడిన తల్లులు, ఇప్పుడు పురాణ స్త్రీలను అమ్మాయిలకి ఆదర్శంగా చూపిస్తున్నారు. పాతివ్రత్య నిరూపణ కోసం అగ్నిలో నిలబడి ఉన్న సీత క్యాలెండర్ లక్షలాది కాపీలు అమ్ముడుపోయి ఇంటి గోడలపై ప్రత్యక్షం కావడం ఆడపిల్లలకి ఎటువంటి సంకేతాన్ని ఇస్తుంది? మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నంతవరకూ, దానినుంచి ప్రమాదం లేకపోవచ్చు, కానీ రాజకీయ ఆచరణగా ముందుకు వచ్చినపుడు అనేకమతాల భారతదేశంలో లౌకికతత్వం వెనక్కిపోయి మెజార్టీమతం అందరి నెత్తికెక్కి సవారీ చేస్తుంది. ఇంటి వరండా, హాలు వంటివి అందరూ వచ్చి పోవడానికి వీలైన లౌకికస్థలాలు. అక్కడ స్త్రీలు తమ చేతికళా నైపుణ్యాలతో తయారు చేసిన మత ప్రదర్శనా చిహ్నాలు, ఇతర మతస్థులు తమకి ఎంత పరాయివాళ్ళో చెబుతూ ఉంటాయి. రాజకీయాలకి ఏమీ సంబంధం లేదేమో అనిపించేంతగా ఈ కొత్త మహిళలు చుట్టుపక్కల కుటుంబాలతో కలిసిపోతారు. పక్కింటి కొత్త కోడలికి వంట నేర్పడమో, ఎదురింటి పెద్దాయనకి అత్యవసర వైద్యసాయమో; ఆందోళన, అభద్రతల్లో ఉన్నవారికి మాటసాయమో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి చేతిసాయమో చేయడం ద్వారా చుట్టుపక్కల అందరికీ ముఖ్యులు అవుతారు. ఆయా సందర్భాల రోజువారీ చర్చల్లో భాగంగా తమ మత భావజాలాన్ని వ్యాప్తిలోకి తెస్తారు. భార్యాభర్తల సమస్యలకి న్యాయసహాయం తీసుకోకుండా ఈ మహిళలే మతసంఘాల ద్వారా పంచాయితీలు పెట్టి సర్దుకుపోవలసిన భారాన్ని స్త్రీల మీద వేస్తారు. ఎన్నికలు, పార్టీమీటింగుల సమయాల్లో వీరు ప్రచారకర్తలుగా మారి సాయాలు చేయడం ద్వారా తాము పట్టు పెంచుకున్న సర్కి ల్స్‌ని సమీకరించి రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారు. నాలుగు దశాబ్దాల కిందట స్త్రీలు తమ పిల్లల్నీ, ఇంటినీ చూసుకుంటే చాలన్న దృష్టితో ఉద్యోగాలలో మహిళా రిజర్వేషన్‌ను మూడుశాతానికి కుదించిన ఘనత ఉత్తర భారత రాష్ట్రాలకి ఉంది. అనుకరణలో ఆరితేరిన దక్షిణ భారతదేశం అక్కడి మత రాజకీయాలనే కాదు, అక్కడి కొత్త మహిళలను కూడా ఆవాహన చేసుకుంటోంది. మత రాజకీయాలు మనకి వద్దు అనుకుంటే ప్రజలకు అయిదేళ్ళకాలం చాలు. ఈ కొత్త మహిళలు సర్వరంగాల్లో తెస్తున్న తిరోగతి వద్దు అనుకుంటే పోవడానికి యాభై ఏళ్ల కాలం కూడా చాలదు! (క్లిక్: మానవ హక్కుల వకీలు బాలగోపాల్) - కె.ఎన్. మల్లీశ్వరి జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక malleswari.kn2008@gmail.com -
సంభ్రమం.. ఈ సమరం
ఢిల్లీలో 1988లో ఉత్తరప్రదేశ్ రైతులు జరిపిన బోట్ క్లబ్ ర్యాలీపై ఇద్దరు బీజేపీ ఎంపీలు స్పందిస్తూ రైతు తిరగబడితే దేశమే తిరగబడినట్లు అని వ్యాఖ్యానించారు. అయితే నాటి ప్రతిపక్షం కాస్తా నేడు ప్రభుత్వం అయింది. ఈరోజు బీజేపీ ఎంపీలు 303 మంది. కానీ వారి స్వరం మారి, వ్యంగ్యం రాజముద్రై ప్రజాస్వామికవాదులని వెక్కిరిస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర భారత రైతులు ఉద్యమరూపం తీసుకున్నారు. ఆందోళనల్లో తోటివారు చనిపోతున్నా సరే ‘నిబ్బరం’గా ఉద్యమాన్ని నడుపుతున్నారు. ముళ్ళకంచెల వద్ద పూలమొక్కలు నాటుతామంటున్న రైతుల స్థితప్రజ్ఞత ప్రశంసనీయమైనది. శిబిరాల్లోని రైతులు తాము అనుకున్నది సాధించేవరకూ కదలమంటున్నారు. 1988 పార్లమెంటు శీతాకాల సమావేశాలకి ముందు ఢిల్లీ అంతకుముందు ఎరుగని కొత్త ఆందోళనతో బెంబేలెత్తింది. చెరకు మద్దతు ధర పెంచాలని, విద్యుత్, నీటి బకాయిలు రద్దు చేయాలని పశ్చిమ యూపీ నుంచి కదం తొక్కుతూ వచ్చిన అయిదు లక్షలమంది రైతులు బోట్ క్లబ్ పచ్చికబయళ్ళ మీదుగా ఇండియా గేట్ వరకూ నిండిపోయారు. భారత కిసాన్ సమితికి చెందిన మహేంద్ర సింగ్ తికాయత్ దీనికి నాయకత్వం వహించాడు. ఊరేగింపులు, నినాదాలు, ఉపన్యాసాల నియమబద్ధ ఆందోళన కాదది. లక్షలమంది రైతులు తమ పల్లెజీవితాన్ని తెచ్చి కాస్మో పాలిటన్ ఢిల్లీకి అతికించారు. వారు కాలినడకన పరుగులు పెడుతూ, ఎడ్లబళ్లని ఉరుకెత్తించి, ట్రాక్టర్లు బారులు తీర్చివచ్చారు. తమతోపాటు గేదెలు, ఆవులు తోలుకొచ్చారు, వాటికి పచ్చిక మేపి రెండుపూటలా పాలు పిండారు, పుట్టగొడుగులు మొలిచినట్లు గుడారాలు వేసుకున్నారు. నున్నటి తారు రోడ్లమీద వంటబట్టీలు పెట్టారు, మంచం బద్దీలను మడిచి తెచ్చి, ఇక్కడ విప్పి ఎండుగడ్డి పడకలు వేసుకున్నారు. పాటలు పాడారు, పంచాయతీలు నడిపారు. అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రైతుల 35 డిమాండ్ చార్టర్ని లెక్కచేయలేదు. ఒకరోజు అనుకున్న నిరసన కాస్తా వారమయింది. రాజ్యం కుయుక్తితో ఆహార పదార్థాలకి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, నీటి సదుపాయాలను బంద్ చేసింది. ఎత్తుకి పైఎత్తు వేసిన రైతులు, ఢిల్లీ సంపన్నవర్గాలు తిరిగే ప్రాంతాలను మలమూత్ర విసర్జనతోనింపేశారు. పారిశుధ్యం పెద్దవిషయం అయింది. ఇతరేతర కారణాలు కూడా తోడై ప్రభుత్వం రైతుల డిమాండ్లకు సూత్రప్రాయంగా తలొగ్గింది. హక్కులను సాధించుకోవడానికి అంతవరకూ ఉన్న నిరసన చట్రాలను బోట్ క్లబ్ రాలీ బద్దలుగొట్టింది. పల్లెలకి ఆగ్రహం వస్తే అది ఎంత స్వాభావికంగా, కరపచ్చిగా ఉంటుందో తెలిసివచ్చింది. అప్పటి బీజేపీకి పార్లమెంటు బలం– ఇద్దరు ఎంపీలు. వారు ఈ ర్యాలీ మీద స్పందిస్తూ ‘‘7 రోజులపాటు జరిగిన బోట్ క్లబ్ ర్యాలీ– రాబోయే మరిన్ని ర్యాలీలకి సూచన. రైతు తిరగబడితే దేశమే తిరగబడినట్లు’’ అన్నారు. భవిష్యత్తుని చక్కగా ఊహించారు. అయితే ప్రతి పక్షం కాస్తా ప్రభుత్వం అయింది. ఈరోజు బీజేపీ ఎంపీ సీట్లు 303. స్వరం మారి, వ్యంగ్యం రాజముద్రై ప్రజాస్వామికవాదులని వెక్కిరిస్తోంది. ముప్పై రెండు శీతాకాలాలను దాటుకుని బోట్ క్లబ్ ర్యాలీ ఉత్తేజం బోర్డర్లకి చేరింది. దాదాపు ఆర్నెల్ల కిందట కేంద్రం తీసుకువచ్చిన మూడు ఆర్డినెన్సులపై నిప్పు రాజుకుంది. ఢిల్లీ, పంజాబ్, హరి యాణా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైతులు వాటికి వ్యతిరేకంగా ఉద్యమరూపం తీసుకున్నారు. సరైన చర్చ లేకుండా హడావుడిగా ఆమోదింపజేయడంలో అంతిమంగా పెట్టుబడిదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు రైతులు భావిస్తున్నారు. వ్యవసాయ చట్టాలవల్ల జరగబోయే లాభనష్టాల మీద విస్తృతంగా జరుగుతున్న చర్చతో పాటు, సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లోని రైతు ఉద్యమ స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోవడం అవసరం. ఎక్కడ సమస్య కనపడితే అక్కడ ప్రత్యక్షమయ్యే ‘ఆందోళన్ జీవుల’ మాదిరిగా నేను కూడా ఈ మూడు ప్రాంతాలూ తిరిగాను. ‘ఎముకలు కొరికే చలిలో లక్షలాది రైతులు రోడ్లమీద నిస్సహాయంగా పడి ఉంటే!’ తరహా మూస విశ్లేషణలు, పడికట్టు పదాలు పనికిరావని అర్థమయింది. ఆ రైతులేం మామూలుగా రాలేదు, ‘దమ్ లగా కె హైసా’ అంటూ సరిహద్దుల మీదకి కుప్పించి దూకారు. పాత అనుభవానికి, కొత్త సాంకేతికతని జోడించి వచ్చారు. వారి వెనుక మండీలు, ఖల్సాలు, ఎన్జీవోలు ఉన్నాయేమోనని వెతకడం కాదు ముఖ్యం, వారు దేనికోసం, ఎవరికి ఎదురుగా, ఎంత స్థిరంగా నిలబడి ఉన్నారన్నది ముఖ్యం. రెండునెలలుగా సాగుతున్న ఆందోళనల్లో తోటివారు చనిపోతున్నాసరే ధైర్యం, సాహసం, పౌరుషం, పట్టుదల– ఒక్కమాటలో చెప్పాలంటే ‘నిబ్బరం’గా ఉద్యమాన్ని నడుపుతున్నారు. మూడు సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నపుడు అకస్మాత్తుగా ప్రత్యేక ఆవరణంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. రిపబ్లిక్ డే ఘటన తర్వాత నాలుగంచెల నిర్బంధ వలయాలు పెట్టారు. అవి దాటుకుని అడ్డదారుల గుండా లోపలికి వెళితే రైతుసముద్రం అలలై పలకరిస్తుంది. ఉద్యమం స్థానీయముద్రతో నడవడం ఎలా ఉంటుందంటే రచ్చబండ ఉదయాలు పేపర్లు ముందేసుకుని రాజకీయాలను వాడి వేడిగా చర్చిస్తూ ఉంటాయి. చేయి సాచి అడగకుండానే పెద్దపెద్ద లంగర్లు– గాజర్ హల్వా, పనీర్ రోటీ, ఆలూ బోండా, దూద్ కా మీఠాలతో ఆకలిని రుచికరంగా తీరుస్తాయి. నీలంరంగు దుస్తులు, సాంప్రదాయక వేషధారణతో చేతికి, మొలకి కర, కిర్పణులు ధరించిన ఖల్సా భక్తులు మేలుజాతి గుర్రాలు ఎక్కి నిర్బంధ వలయాలకి ఇవతల పహారా కాస్తుంటారు. ప్రతి ట్రాక్టరు గుడారం వేసుకుని వెచ్చనిగూడులా మారి మెత్తలు, కంబళ్ళతో ఎముకలు కొరికే చలిని ఓడిస్తుం టుంది. గుమిగూడి గుండ్రంగా కూచున్న పగిడీపెద్దలు–ఇళ్లనుంచి దుమ్ముదులిపి తెచ్చుకున్న పురాతన హుక్కాగొట్టాలను తన్మయత్వంతో పీలుస్తుంటారు. వేలాదిమంది టెంట్లకింద నిల్చుని, కూచుని, నడుంవాల్చి పెద్దపెద్ద వేదికల మీది ఉపన్యాసాలు వింటుంటారు. అప్పటివరకూ కులాసాగా సెల్‌ఫోన్ చూస్తూ ఉన్న యువకుడిని ఏ వార్త విచలితుడిని చేస్తుందో ఏమో రివ్వున లేచి జెండా చేతబూని తనొక్కడే ఒక సైన్యమై ‘కిసాన్ జిందాబాద్’ అంటూ అశ్శరభశ్శరభలు వేస్తాడు. బల్లేబల్లే గీతాలతో హోరెత్తుతూ కొన్ని ట్రాక్టర్లు బుర్రుమంటూ సాగుతుంటాయి. కళ్ళవెనుక విషాదాలను దాచుకున్న పంజాబీ మహిళా జలపాతాలు ఆకాశానికి పిడికిళ్ళు ఎత్తుతారు. పిల్లలు విస్ఫారిత నేత్రాలతో నవలోకాన్ని చూస్తుంటారు. వీరంతా– ఎవరో చెప్పి కూడగట్టితే రంగంలోకి దిగినవారు కాదు. బలీయమైన తక్షణ ఉద్వేగాలు, అవసరాలు గుండెనుంచి తన్నుకు వస్తుంటే నిలవలేక కాలు మోపినవారు. కమ్యూన్ జీవితాన్ని కలలు కనేవారికి ఈ ఉద్యమ ప్రాంతాలు సజీవ ఉదాహరణలు. పదిమంది కూడి వంటలు వడ్డనలు, మీటిం గులు, పంచాయతీలు, ఊరేగింపులు, కాపలాలు, పారిశుధ్యం, ఒకటేమిటి! సామూహిక చేతన బలం కనబడుతూ ఉంటుంది. ఎన్నెన్ని యంత్రాలంటే! వేలమందికి ఒకేసారి టీ మరిగించేవి, రొట్టెలు తయారు చేసేవి, బట్టలు ఉతికేవి, అంట్లు తోమేవి అనేకం. తాత్కాలి కంగా కట్టిన పాఠశాలలు, గురుద్వారాలు, ఆసుపత్రులు, పుస్తకశాలలు, పార్టీ ఆఫీసులు, ఆఖరికి రైతులకి న్యాయ సహాయం అందించడానికి లాయర్లతో కూడిన బెంచ్– ఇక్కడ జీవితం విస్తరిస్తూనే ఉంది. ఉద్యమం మీద నిర్బంధాన్ని మరింత మొరటుగా చూపడానికి కేంద్రం కాస్త సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజలలో బలమైన వర్గాలు ప్రభుత్వంతో తలపడుతున్నపుడు లెక్కలు చాలా మారతాయి. అలాగే ‘ముజఫర్‌నగర్‌లో జాట్లకి ముస్లిములు ప్రకటించిన సంఘీభావం ఆసక్తికరం. ఎడమొహం పెడమొహంగా ఉన్న భిన్న ప్రజాశ్రేణుల ఏకీకరణకి ఇటువంటివి సాయపడతాయి. ఈ ఐక్యత ఏలినవారికి గుబులు రేపుతుంది. ముళ్ళకంచెల వద్ద పూలమొక్కలు నాటుతామంటున్న రైతుల స్థితప్రజ్ఞతని నీరుకార్చే పథకరచన చాపకింద నీరులా సాగుతోంది. రైతులేమో అనుకున్నది సాధించేవరకూ కదలమంటున్నారు. అక్కడనుంచి వచ్చేసేపుడు గొప్ప ఉత్తేజమూ వల్ల మాలిన బెంగా కలనేత భావంగా మారాయి. మసకచీకట్లూ మంచుతెరలూ పల్చగా కమ్ముకుంటున్న క్షణాల్లో తిరిగి చూసుకుంటూ నడుస్తున్నాను. టిక్రీ మెట్రోవంతెన కిందున్న గుడారం వెలుపల హుక్కా పీల్చుతున్న ఒక సర్దార్జీ ఆలాపన మొదలుపెట్టాడు. పంజాబీ గ్రామీణ యాస ఉన్న మార్మిక స్వరమది. ఆ గేయపు భావం చెవులను తాకి నన్ను వణికించింది. ‘‘ఓ సోదరీ! పున్నమిరోజు నువ్వు కట్టిన రక్షాబంధన్ సాక్షిగా చెపుతున్నాను, రాత్రి గడిచాకే ఇంటికి తిరిగి వచ్చేది. నేను రాకుంటే సూర్యుడు ఎప్పటికీ ఉదయించడని గ్రహించు.’’ కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ఒక ఆందోళన జీవి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఈ–మెయిల్: malleswari.kn2008@gmail.com -
మౌనం ఒక యుద్ధ నేరం
‘‘చిన్నప్పుడు మా అమ్మ నాకో కథ చెప్పింది / ఇంటి ముందు కుంపట్లోనో వంటింట్లో దాలిలోనో ఉన్నట్లుగానే / ప్రతిమనిషి గుండెలో నిప్పు ఉంటుంది’’ అంటారు ప్రసిద్ధ కవి వరవరరావు. ‘నిప్పు–మనిషి కనుగొన్న న్యాయం’ అని నమ్మిన వ్యక్తి ఆచరణ ఎట్లా ఉంటుందో ‘వివి’ని చూస్తే తెలుస్తుంది. మనిషి మనిషి గుండెలో నిప్పు చల్లారకుండా తన హృదయం, మేధస్సు, శ్రమ, ప్రతిభలతో నిలువెత్తు జ్వాలై ఎగసినవాడు, ఈ రోజు భీమా కోరేగావ్ కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నవీ ముంబై జైలులో ఉన్నారు. భారతదేశం గర్వించదగ్గ మేధావి, కవి, ఉపన్యాసకుడు, ప్రజాస్వామికవాది అయిన వరవరరావుని ఈ కేసులో ఇరికించి ఏడాదిన్నర దాటింది. పుణే నుంచి ముంబై తలోజా జైలుకి మార్చడం తప్ప కేసులో ఎటువంటి పురోగతి లేదు. నేరారోపణ ప్రక్రియ పూర్తి కాలేదు. కేసు విచారణకి రాలేదు. బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాజకీయ ఖైదీల కేసులలో వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు కూడా ఇవ్వడం లేదు. కూర్చునేందుకు కుర్చీ, పడుకోటానికి మంచం కూడా ఇవ్వకుండా శరీరాన్ని హింస పెడుతూనే ఉన్నారు. వయసును, కరోనా విపత్తును, ఖైదీలతో కిక్కిరిసిన జైళ్లను దృష్టిలో ఉంచుకొని వివి, తదితర భీమా కోరేగావ్ అండర్ ట్రైల్ ఖైదీలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి విడుదల చేయమని పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా నెలరోజుల నుండి అనారోగ్యానికి గురయిన వరవరరావుని విడుదల చేయమని ప్రపంచవ్యాప్తంగా విజ్ఞప్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అవేవీ పట్టించుకోకుండా పదే పదే బెయిల్ నిరాకరిస్తున్నారు, అత్యవసర వైద్య సదుపాయాలు కూడా అందించడం లేదు. శరీరంలో తగ్గుతున్న సోడియం నిల్వల స్థాయికి సరైన వైద్యం అందించకపోవడంతో తనవాళ్ళను గుర్తించలేని, పొంతన లేని మాటలు మాట్లాడే స్థితిలోకి ఆయనను తెచ్చింది ప్రభుత్వం. ఫాసిస్ట్ రాజ్యానికి మానవీయత కాదు కదా రాజ్యాంగ బద్ధత అనేది కూడా ఏ మాత్రం లేదని ఇటువంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో వివికి కోవిడ్ పాజిటివ్ అని తేలటం మరీ ఆందోళన కలిగిస్తున్నది. తమ కస్టడీలో ఉన్న మనిషి ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం – చట్టబద్ధం, నైతికం కాదు. కేసు విచారణ ముగిసి, తీర్పు రాకుండానే విడుదల చేయడం చట్టబద్ధం కాకపోవచ్చు. కానీ ఇపుడున్న విపత్తు పరిస్థితుల్లోనూ వయసు రీత్యానూ ఆయన బెయిలు మంజూరు విషయంలో కాలయాపన చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. వరవరరావు ఆరోగ్యం విషయంలో ఇప్పటికైనా తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తక్షణం ఆయనను కోవిడ్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించి నిపుణుల పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో చికిత్స అందజేయాలి. వైద్యరంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కనుక మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందించేలా సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాలి. ప్రతి ఒక్క మనిషికి ఉన్నట్లుగానే వివికి కూడా ఆరోగ్యంగా, గౌరవంగా జీవించే హక్కు ఉన్నదని గుర్తించాలి. తెలంగాణ చారిత్రకత పట్ల ఎంతో గౌరవాన్ని ప్రకటించే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, చరిత్రాత్మక వ్యక్తి అయిన వివిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేసు తెలంగాణ పరిధిలోనిది కాకపోయినా వివి రక్షణ విషయంలో కలగజేసుకుని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడడం ఇప్పుడు అవసరమైన సందర్భం. ఆరు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వివి వేసిన ముద్ర అనితరసాధ్యం. వివి విడుదలను కోరడం, దాని కోసం పోరాడడం అంటే అది ఒక వ్యక్తి కోసం చేసే పోరాటం కాదు. సుదీర్ఘ కాలం ప్రజాక్షేత్రంలో తమ జీవితాలను పణం పెట్టి, అసమాన త్యాగాలకు, సాహసాలకి సిద్ధపడినవారు, వ్యక్తులుగా కాక ప్రజల ఆశలకి, ఆశయాలకి ప్రతీకలుగా మారతారు. అటువంటి ప్రతీక అయిన వరవరరావుకి హాని తలపెట్టడం, అక్రమ నిర్బంధాలకి పాల్పడటం ద్వారా అటువంటి స్ఫూర్తిని దెబ్బతీయడం ఫాసిస్ట్ ప్రభుత్వాల లక్ష్యం. అందుకే వివి తదితర రాజకీయ ఖైదీల విడుదల కోసం మైనార్టీ స్వరాలైనా సరే.. గట్టిగా నినదిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో అటు నాగపూర్ అండా సెల్లో అనేక తీవ్ర ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న మరొక కవి, మేధావి, అనువాదకుడు, అధ్యాపకుడు అయిన సాయిబాబా విషయంలో అత్యవసర ఆరోగ్యపర చర్యలు చేపట్టడం ఇపుడు చాలా అవసరం. కోవిడ్ హానికి అనువుగా ఉన్న నాగపూర్ జైలు వాతావరణం నుండి ఆయనను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలది. జైళ్లు పరివర్తన కేంద్రాలు అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చెప్పే మాట. అవి మనదేశ మానవ వనరుల విధ్వంస కేంద్రాలు కాకూడదు. వివి, సాయిబాబా తదితరుల క్షేమం పట్ల అంతర్జాతీయంగా వస్తున్న విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. ఇందుకోసం ఎవరికి చేతనైన స్థాయిలో వారు కృషి చేయాలి. వరవరరావు స్వయంగా చెప్పినట్లుగా – ‘‘నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వెంటాడుతుంటే ఊరక కూర్చున్న /నోరున్న ప్రతివాడూ నేరస్తుడే’’ కాత్యాయనీ విద్మహే, కె.ఎన్. మల్లీశ్వరి – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -
ఒక మిత్ర విమర్శ
స్త్రీవాదంతో విరసానికి పూర్తిస్థాయి ఏకీభావం ఉండే ఆస్కారం లేనట్లే స్త్రీవాదానికి కూడా ‘మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావో ఆలోచనా విధానం’తో పూర్తిస్థాయి ఏకీభావం ఉండే అవకాశం లేదు. ఇవి విడివిడి సైద్ధాంతిక అవగాహనలుగా ఉనికిలో ఉన్నాయీ అంటేనే వాటి లక్ష్యంలోనో ఆచరణలోనో భిన్నత్వం ఉన్నట్లు. ఒకదాన్ని మరొకటి పూర్తిగా ఒప్పేసుకుంటే రెండో అవగాహన అవసరమే లేనట్లు. ఈ రెండు భావజాలాల ఐక్యత, ఘర్షణలను పరిశీలించడానికి విరసం యాభై ఏళ్ల ప్రయాణం ఒక సందర్భం. స్త్రీల సమస్యలకి విడిగా సైద్ధాంతిక స్థాయి ఇచ్చి ఉండకపోవచ్చు, సూక్ష్మస్థాయి అవగాహన లేకపోవచ్చు. కానీ స్త్రీలకి కుటుంబ, సామాజిక చైతన్యాన్ని సమకూర్చిపెట్టడంలో విరసం, ఇతర కమ్యూనిస్టు పార్టీల దోహదం గొప్పది. తొలితరం స్త్రీవాదుల్లో చాలామందికి, మార్క్సిస్ట్ నేపథ్యం, విరసంతో అనుబంధం ఉన్నాయి. స్త్రీలకి అదనంగా ఉండే పునరుత్పత్తి బాధ్యతలని, నిర్మాణాల్లో ఉండే పితృస్వామ్యం వంటి అంశాలను ప్రశ్నిస్తూ స్త్రీవాదం రాగానే ఘర్షణ ఏర్పడింది. విప్లవోద్యమాన్ని డైల్యూట్ చేయడానికి వచ్చిన పెట్టుబడిదారీ కుట్రగా స్త్రీవాదం విమర్శకి గురయింది. ఓల్గా వంటి స్త్రీవాదులు, మార్క్సిస్టులైన కాత్యాయనీ విద్మహే, విరసం రత్నమాల, విమల వంటివారు భిన్న ప్రక్రియల ద్వారా సమాజంలో, విప్లవ పార్టీల్లో, సంఘాల్లో ఉన్న పితృస్వామ్యాన్ని చర్చకి పెట్టారు. స్త్రీవాదం పట్ల విరసం దృష్టికోణాన్ని 1992లో ఒక ఇంటర్వ్యూలో వివి స్పష్టంగా మాట్లాడారు. స్త్రీవాదం స్త్రీలలో తెచ్చే చైతన్యం సమస్త మానవ శ్రమ విముక్తికీ అంతిమంగా మేలు చేసేదేనని స్పష్టమయ్యాక స్త్రీవాదపు పరిమితులు కూడా మిత్ర విమర్శగా చర్చలోకి వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాల సంక్లిష్ట ఘటనల్లో విరసం– అనవసర జోక్యపు తడబాటుకి లోనవడమూ వాస్తవమే. విరసం వ్యవస్థాపక సభ్యులు ఒకరు అటువంటి తప్పుని ఒప్పుకోవడమూ గమనించాలి. విరసం ఏర్పాటులో భాగమైన శ్రీశ్రీ, రావిశాస్త్రిలాంటి పీడిత పక్షపాత రచయితలు కూడా ‘స్త్రీ హితం’ కాని భాషని వాడారు. ఇప్పటి విరసం వాటిని అధిగమించింది. సంస్థ వ్యక్తీకరణ పద్ధతుల మీద స్త్రీవాద ప్రభావం కూడా ఉంది. ఆధిపత్య కులం, మతం, ప్రాంతం, దేశభక్తి, సంస్కృతి పరిరక్షణ – తమ కక్ష సాధింపుకి స్త్రీల లైంగికత మీద దాడులు చేయడం పరిపాటి అయిపోయిన వర్తమానంలో ఉన్నాం. స్త్రీలు, క్రూరమైన అమానవీయమైన హింసకి గురైనపుడు అక్కున చేర్చుకునే విరసం, లైంగిక వ్యక్తిత్వాల ఎదుగుదలకి జీవితంతో అనేక ప్రయోగాలు చేస్తున్న ఆధునిక మహిళల హక్కులపట్ల ఇదేస్థాయి సహనంతో ఉంటోందా? సైద్ధాంతికంగా ఒప్పుదల ఉన్నప్పటికీ ఆచరణలో నైతికమైన అవరోధాలను దాటలేకపోతోందా? అన్నది పరిశీలించాలి. యాభై ఏళ్లకాలంలో సంస్థ లోపల ఎంతమంది స్త్రీలు నిర్ణాయక స్థానాల్లోకి రాగలిగారన్నది మరొక ప్రశ్న. విప్లవ నిర్మాణాల్లోనూ స్త్రీల ప్రాతినిధ్యం రెండవ తరగతిగానే ఉండడం నిరాశని కలిగిస్తుంది. చైతన్యపు స్థాయి ప్రాతిపదిక అయితే అటువంటి చైతన్యాన్ని పెంచడం కోసం నిర్మాణాలు తమ పనివిధానాలని సమీక్షించుకోవడానికి విరసం నమూనాగా ఉండాలన్న ఆకాంక్ష సహజం. గలగలా పారే తేటనీటి అడుగున చిన్నచిన్న గులకరాళ్ళు కూడా స్పష్టంగా కనపడతాయి. వాటినే ఏరుకుని ప్రవాహాన్ని మరిచి పోవడమంటే అర్ధశతాబ్ది సూరీడుకి అరచేతిని అడ్డుపెట్టినట్లే. సాంస్కృతిక రంగంలో ఇటువంటి ఒక సంస్థ ఇచ్చే భరోసా– మొత్తం సమాజపు గమనంలో కూడా అత్యంత విలువైనది. - కె.ఎన్.మల్లీశ్వరి -
ఏకనగర రాజ్యం మనకి ఆదర్శమా?
సింగపూర్ చిన్నదీవి. ప్రపంచంలోనే ఒకేఒక్క ఏకనగర రాజ్యం. రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా పొందికైన దేశం. ఆర్థికరంగంలో ఆధు నిక నమూనా. ఇటువంటి దేశాన్ని ఇతర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుని స్వీయముద్రతో పని చేయదలిస్తే మంచి విషయమే. కానీ స్వీయ ముద్రని వదిలి ఆంధ్రప్రదేశ్‌ని సింగపూర్‌లా మారుస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. వాటిని ఆచరణ లోకి తెచ్చే ప్రయత్నాలు అమరావతి నిర్మాణక్రమంలో కనబడు తున్నాయి. రాజకీయ, ఆర్థిక విధానాలను భావోద్వేగాల పరిధిలో చర్చించకూడదు కానీ, ప్రజల భావోద్వేగాల విషయంలో ప్రభుత్వాలకి చిన్నచూపు ఉండకూడదు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ నామస్మరణ తప్ప స్థానిక ప్రత్యేకతలను, సొంత సాంకేతికతని పరిగణనలోకి తీసుకున్నట్లు కనపడదు. సింగపూర్ తరహా నగర నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నగరానికైనా సాధ్యమేనా అన్నది ఇపుడు చర్చించవలసిన విషయం. నిర్మాణమన్నది కేవలం భౌతిక స్థాయిలో చూడటం ఒక పరిమితి. దీనివల్ల సింగపూర్ ప్రజల మనోవికసనానికి, స్థిమితమైన జీవన విధానానికి తోడ్పడిన పలు అంశాలను విస్మరించి పెట్టుబడిదారీ విధానానికి అనుకూలమైన వాటిని మాత్రమే గ్రహించడం జరుగుతోంది. సింగపూర్ అభివృద్ధి కేవలం ఆర్థికవిధానాల వల్లనే జరగలేదు. అక్కడి సమస్త వ్యవస్థల పటిష్ట నిర్మాణం వల్ల జరిగింది. అందులో ముఖ్యమైనది రాజకీయవ్యవస్థ. 1959 నుంచీ ఇప్పటి వరకూ ‘పీపుల్స్ యాక్షన్ పార్టీ’ యే అధికారంలో కొనసాగుతున్నది. కమ్యూనిస్ట్ భావజాల ప్రభావం ఆ పార్టీ మూలాల్లో పాదుకుని ఉంది. ఎన్నికలలో గెలుపు కోసం ప్రజా సంక్షేమాన్ని నటించాల్సిన అవసరం ఆ రాజకీయ పార్టీలకి లేదు. అక్కడ ప్రతిపక్షం అనామకం. కానీ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల పట్టింపు అధికం. అభివృద్ధిలో ప్రైవేటు సంస్థల, వ్యక్తుల భాగస్వామ్యాన్ని నిరుత్సాహపరచడానికి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి పరిస్థితిలేదు. ప్రైవేటువాహనాల పార్కింగ్‌కి రోజుకి నాలుగువందల రూపాయలు రుసుము వసూలు చేసే దేశం సింగపూర్. అందులో నాలుగోవంతు రేటుకి ప్రభుత్వ భూములను ఎకరాలకి ఎకరాలు ఫ్యాక్ట రీల కోసం ప్రైవేటు సంస్థలకి అప్పజెప్పే రాష్ట్రం మనది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో కూడిన బృందం గతేడాది సింగపూర్‌లో పర్యటించినపుడు అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ చేయడంలో సీఎం చేసిన కృషిని సింగపూర్ ప్రధాని కీర్తించారు. అందులో సదుద్దేశమే ఉండొచ్చు. గ్రామీణ వ్యవస్థ, భూమితో ప్రజలకి సెంటిమెంటల్ అనుబంధం, వ్యావసాయిక నేపథ్యంలేని సింగపూర్ దేశానికి భూసేకరణ అత్యంత సులువైన విషయం కావొచ్చు కానీ భారతదేశంలో అది అత్యంత సంక్లిష్టం. రాజధాని విషయంలోనే కాక అభివృద్ధి పేరుతో జరిగే ప్రతి భూసే కరణ సందర్భాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ అభివృద్ధిలో బాధితులకు, సామాన్య ప్రజలకి ఎటు వంటి ఫలితం ఉండటం లేదు కనుక. ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమంతో సహా ఏదో ఒక అంశం మీద నిరంతరం ఆందోళనలు అలజడుల నిరసన రూపా లకి ఇక్కడ అవకాశం ఎక్కువ. శాంతిభద్రతల విషయంలో సింగ పూర్ వైఖరి చాలా కఠినం. 2013లో లిటిల్ ఇండియా ప్రాంతంలో బంగ్లా వలస కూలీని చైనా జాతీయుడు బస్‌లో నుంచి తోసి వేయడం వలన అతను చనిపోయాడు. ఆ సందర్భంలో అక్కడి దక్షిణాసియా కార్మికులు ఆరు బస్సులను తగలబెట్టారు. పది మంది పోలీసులు గాయపడ్డారు. గత నలభై ఏళ్లలో సింగపూర్ ఎదుర్కొన్న అతిపెద్ద అలజడిగా ఈ ఘటన గుర్తింపు పొందింది. ప్రజలైనా, ప్రభుత్వాలైనా హింస ఆధునిక నిరసన రూపం కాదని గుర్తించడం వెనుక సమాజపు మానసిక విలువల పెరుగుదల ఉంటుంది. ఆర్ధిక అంతరాల తగ్గుదల ఉంటుంది. ప్రజలంటే ‘ఓటు’గా మాత్రమే గుర్తించే రాజకీయ పార్టీలు అటువంటి సమా నత్వ సాధనను ఆదర్శంగా తీసుకోలేవు. ఆంధ్రప్రదేశ్‌లో కులమత లింగ వివక్షలపై పోరాటాలు సాగు తూనే ఉన్నాయి. అనేక పీటముళ్లు పడిన సామాజిక అంతరాలు అభివృద్ధికి అడ్డుగా నిలిచిఉన్నాయి. వాటి పరిష్కారానికి వ్యవ స్థలో మౌలికమైన మార్పులు జరగాలి. యుక్తవయసు వచ్చిన ప్రతి యువకుడూ రెండేళ్లపాటు సింగపూర్ సైన్యంలో పనిచేయాలి. దీనివల్ల కఠిన తరమైన శ్రమకి యువత సిద్ధంకావడంతో పాటు మరో ప్రయోజనం కూడా ఉంది. యువకులు సైన్యంలో ఉండే కాలంలో యువతులు వారిని దాటుకుని విద్యా ఉద్యోగ రంగా లలో ముందుకు వెళతారు. సింగపూర్ నుంచి గ్రహించవలసిన ప్రజా ప్రయోజనకర అంశాలను పక్కనబెట్టి, సముద్రతీర ప్రేమ పండుగలు, విలాసవంతమైన విశ్రాంతి స్థలాలు, ఎత్తైన బహుళ అంతస్తుల భవనాల మాయాజాలంలో పడటం అంటే ఆకాశంలో మేఘాలను చూసి ముంతలోని నీళ్లను ఒలక బోసుకోవడం వంటిది. -కేఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ) మొబైల్: 88850 16788 -
మునిగిపోతున్న జీవితం
అయినవారి త్యాగాలకు వేదికలపై సన్మానాలు.. పుల్లా పుడకా ఊడ్చి ఇచ్చేసి నిరాధారంగా నిలబడ్డ బడుగులపై భారీ ప్రొక్లైనర్ల ఉక్కుహస్తాలూ... ప్రజలు చేసే త్యాగాలను గుర్తించడంలో కూడా పక్షపాతమేనా! తవ్విపోసిన పోలవరం కొండల శిధిలాలను చూస్తున్నపుడు, 2018 కల్లా ప్రాజెక్ట్‌ని పూర్తిచేస్తామని చంద్రబాబు ప్రకటన విన్నపుడూ నిర్మాణం ఆపేయాలన్న డిమాండ్ ఇక సరైంది కాదేమో. ఇప్పుడు మాట్లాడాల్సింది బాధితులకి జరగాల్సిన న్యాయం గురించి. కుండలూ తపేళాలతో సహా ఇళ్ళను, జీవికతో ముడిపడి ఉన్న అడవిని, దాహం తీర్చే నదిని దానం చేసేసిన నిర్వాసితుల గురించి మాట్లాడాలి. ఖాళీ అయిపోయిన జీవితాన్ని కళ్ళముందర పెట్టుకుని పాతూరు కొత్తూర్ల మధ్య గాల్లో అయోమయంగా గిరికీలు కొడుతున్న పిట్టల్లాంటి గిరిజ నులు, పల్లీయుల నిస్సహాయత గురించి మాట్లాడాలి. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నుంచి 30 మందికి పైగా రచయిత్రులం పశ్చిమ గోదావరి జిల్లాలోని ముంపు, పునరావాస గ్రామాలను సందర్శించి నపుడు శూన్యంలో కొట్టుకుపోతున్న అనుభూతి కలిగింది. అమరావతి నిర్మాణం కోసం విదేశీ ప్రణాళికలు వేసి భూములను కోల్పోయిన అక్కడి ధనిక, మధ్యతర గతి రైతులను, నిర్మాణ ఫలాల్లో భాగస్వాములను చేసింది ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అలాంటి నమూనా ఎందుకు రూపొందించడం లేదు? బహుళార్థ సాధక ప్రాజెక్టులయినా, రాజధాని నిర్మాణా లయినా ప్రజలు చేసే త్యాగాలను గుర్తించడంలో కూడా పక్షపాతమేనా! అయినవారి త్యాగాలు వేదికలపై సన్మానాలు పొందుతుంటే, తమకున్న పుల్లా పుడకా ఊడ్చి ఇచ్చేసి నిరాధారంగా నిలబడ్డ బడుగులపై భారీ ప్రొక్లై నర్లు ఉక్కుహస్తాలను విసురుతున్నాయి. మరణాన్ని కూడా గౌరవంగా చూడాలనే ఆధునిక సమాజంలో, జీవించి ఉన్నవారిని తరలించడంలో ఎంతటి మానవీయత చూపాలి? నిర్బంధ వలసల వల్ల అక్కడి ప్రజల్లో ప్రాజెక్ట్ పట్ల వ్యతిరేకత మరింత పెరుగుతోంది. ‘నవ్వాలో ఏడవాలో తెలీడం లేదండీ బాబో! వండుకున్న తపేళాలతో సహా అందరి సామాన్లు ఆళ్లే లారీల్లోకి విసిరేత్తన్నారు. మేము కిందకి దింపడం, వాళ్ళు లారీల్లో పెట్టడం, చివరాకరికి బాంబు లుపెట్టి పేల్చేత్తామని బెదిరించడంతో ఖాళీ చెయ్యక తప్పలేదు’ అని కొత్త రామయ్యపేట పునరావాస గ్రామంలో ఒక మహిళ వాపోయింది. నష్టపరిహారం విషయంలో కూడా పదోపరకో అంటగట్టి వదిలించుకోవాలన్న తాపత్రయం తప్ప పటిష్టమైన ప్రణాళిక అంటూ ఏమీలేదు. అగ్ర కులస్తు లకి ఇల్లుకి ఇల్లు, పొలానికి డబ్బు నష్టపరిహారం ఇచ్చారు. ఇంటికి పొలానికి ఇచ్చిన పరిహారంతో ఇల్లు మాత్రమే సాదాసీదాగా కట్టుకోగలిగారు. వారికిక ఏ ఆధారమూ లేదు. పునరావాస గ్రామాలకి చుట్టుపక్కల ఉపాధి అవకాశాలూ లేవు. ఆ గ్రామాలు కూరపాదులు వేసుకోడానికి కూడా వీలులేని రాతినేలలు. కోయ, దొరోళ్ల కొత్తల వంటి ఎస్టీలకి పొలానికి పొలం ఇచ్చారు కానీ పునరావాస గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. దానివల్ల గిరిజనులకి ఉపాధి దక్కదు. వాడీయులు, గూళ్ళొడ్డీలు, అగ్నికుల క్షత్రియులది మరొకరకం సమస్య. ఈ జాలర్లకి గోదావరి నదే ఏకైక ఆధారం. రాత్రి 2, 3 గంటల సమయంలో వేటకి వెళ్లి ఉదయం 8 గంటలకి తిరిగొచ్చి వలలో పడ్డ చేపల్ని అమ్ముకుంటారు. జాలర్లు తమ వృత్తిని దాటి వేరేపనిలో నైపుణ్యాన్ని పొందడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకే తమకి కేటాయించే ఇళ్ల స్థలాలు నదీ తీరప్రాంతాల్లో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. తమకి డబ్బూ అదీ వద్దని మా గోదారిని మాకు ఇస్తే చాలని ఒక యువకుడు ఆవేదనతో చెప్పాడు. అక్కడి ప్రజలంతా మూకుమ్మడిగా చెప్పింది ఒకటే మాట, చేయడానికి పనులేమీ లేవని. ఏ నష్టపరిహా రమూ ఈ లోటుని పూరించలేదు కాబట్టి ఉపాధి అవకా శాలని సత్వరం మెరుగుపరచాలి. ఈ పేరుతో మళ్ళీ పెద్ద కంపెనీలకి దార్లు తెరవడం కాకుండా ప్రజల భాగ స్వామ్యంతో వారి స్వావలంబన కోసం అక్కడి ప్రకృతి వనరుల వినియోగం జరగాలి. పునరావాస గ్రామాల్లో ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చే ఆర్థిక సంక్షోభాలు ప్రభుత్వ ప్రయోజనాల రీత్యా మంచివి కావు. కనుక నిర్వాసితులకి ముందుగా ఆర్థిక స్థిరత్వాన్ని హామీ ఇవ్వాలి. 36 వేల కోట్లకి చేరిన ప్రాజెక్ట్ వ్యయానికి వందల కోట్లలోనే నిధులు విడుదల కావడానికీ మధ్య ఉన్న అంతరాలను, వాటి కారణాలను ప్రభుత్వం వెల్లడించాలి. వీటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎవరి నెత్తిమీద భారం రుద్దబోతుందో ప్రకటించాలి. తాళాలు లేని ఇళ్ళని కల గనే మేధావులకి తలుపులే లేని నిర్వాసితుల ఇళ్ళు అసంతృప్త వర్తమానం. బాధి తులకి అందించాల్సిన కూడూ గూడూ నీడల ఏర్పాట్ల లోనే అడుగడుగునా వైఫల్యం కనపడుతున్న చోట ప్రజల మానసిక, సాంస్కృతిక విధ్వంసాల గురించి మాట్లాడటం ఒక విలాసం. ఎరట్రి ఎండవేళ మొక్క యినా మొలవని ఒక పునరావాస గ్రామంలో చెల్లాచెదు రుగా పడున్న వస్తువుల మధ్య వంగిపోయిన నడుంతో కుక్కిమంచంలో కూరుకుపోయి కూచున్న 85 ఏండ్ల ముదుసలి స్త్రీ జనాంతికంగా అన్నమాట సన్నగా చెవిలో హోరెత్తుతోంది. ‘‘ ఏవుందీ ఇక్కడ! తీసుకొచ్చి అడవిలో పడేసారు.’’ అడవిలో జీవించి అడవిలో పడిపోయిన పోలవరం నిర్వాసితుల పుట్టి ములిగిపోతోంది. ఎత్తి ఒడ్డున పెట్టండి. -కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ) మొబైల్: 8885016788