ఢిల్లీలో 1988లో ఉత్తరప్రదేశ్ రైతులు జరిపిన బోట్ క్లబ్ ర్యాలీపై ఇద్దరు బీజేపీ ఎంపీలు స్పందిస్తూ రైతు తిరగబడితే దేశమే తిరగబడినట్లు అని వ్యాఖ్యానించారు. అయితే నాటి ప్రతిపక్షం కాస్తా నేడు ప్రభుత్వం అయింది. ఈరోజు బీజేపీ ఎంపీలు 303 మంది. కానీ వారి స్వరం మారి, వ్యంగ్యం రాజముద్రై ప్రజాస్వామికవాదులని వెక్కిరిస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర భారత రైతులు ఉద్యమరూపం తీసుకున్నారు. ఆందోళనల్లో తోటివారు చనిపోతున్నా సరే ‘నిబ్బరం’గా ఉద్యమాన్ని నడుపుతున్నారు. ముళ్ళకంచెల వద్ద పూలమొక్కలు నాటుతామంటున్న రైతుల స్థితప్రజ్ఞత ప్రశంసనీయమైనది. శిబిరాల్లోని రైతులు తాము అనుకున్నది సాధించేవరకూ కదలమంటున్నారు.
1988 పార్లమెంటు శీతాకాల సమావేశాలకి ముందు ఢిల్లీ అంతకుముందు ఎరుగని కొత్త ఆందోళనతో బెంబేలెత్తింది. చెరకు మద్దతు ధర పెంచాలని, విద్యుత్, నీటి బకాయిలు రద్దు చేయాలని పశ్చిమ యూపీ నుంచి కదం తొక్కుతూ వచ్చిన అయిదు లక్షలమంది రైతులు బోట్ క్లబ్ పచ్చికబయళ్ళ మీదుగా ఇండియా గేట్ వరకూ నిండిపోయారు. భారత కిసాన్ సమితికి చెందిన మహేంద్ర సింగ్ తికాయత్ దీనికి నాయకత్వం వహించాడు. ఊరేగింపులు, నినాదాలు, ఉపన్యాసాల నియమబద్ధ ఆందోళన కాదది. లక్షలమంది రైతులు తమ పల్లెజీవితాన్ని తెచ్చి కాస్మో పాలిటన్ ఢిల్లీకి అతికించారు. వారు కాలినడకన పరుగులు పెడుతూ, ఎడ్లబళ్లని ఉరుకెత్తించి, ట్రాక్టర్లు బారులు తీర్చివచ్చారు. తమతోపాటు గేదెలు, ఆవులు తోలుకొచ్చారు, వాటికి పచ్చిక మేపి రెండుపూటలా పాలు పిండారు, పుట్టగొడుగులు మొలిచినట్లు గుడారాలు వేసుకున్నారు. నున్నటి తారు రోడ్లమీద వంటబట్టీలు పెట్టారు, మంచం బద్దీలను మడిచి తెచ్చి, ఇక్కడ విప్పి ఎండుగడ్డి పడకలు వేసుకున్నారు. పాటలు పాడారు, పంచాయతీలు నడిపారు.
అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రైతుల 35 డిమాండ్ చార్టర్ని లెక్కచేయలేదు. ఒకరోజు అనుకున్న నిరసన కాస్తా వారమయింది. రాజ్యం కుయుక్తితో ఆహార పదార్థాలకి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, నీటి సదుపాయాలను బంద్ చేసింది. ఎత్తుకి పైఎత్తు వేసిన రైతులు, ఢిల్లీ సంపన్నవర్గాలు తిరిగే ప్రాంతాలను మలమూత్ర విసర్జనతోనింపేశారు. పారిశుధ్యం పెద్దవిషయం అయింది. ఇతరేతర కారణాలు కూడా తోడై ప్రభుత్వం రైతుల డిమాండ్లకు సూత్రప్రాయంగా తలొగ్గింది. హక్కులను సాధించుకోవడానికి అంతవరకూ ఉన్న నిరసన చట్రాలను బోట్ క్లబ్ రాలీ బద్దలుగొట్టింది. పల్లెలకి ఆగ్రహం వస్తే అది ఎంత స్వాభావికంగా, కరపచ్చిగా ఉంటుందో తెలిసివచ్చింది. అప్పటి బీజేపీకి పార్లమెంటు బలం– ఇద్దరు ఎంపీలు. వారు ఈ ర్యాలీ మీద స్పందిస్తూ ‘‘7 రోజులపాటు జరిగిన బోట్ క్లబ్ ర్యాలీ– రాబోయే మరిన్ని ర్యాలీలకి సూచన. రైతు తిరగబడితే దేశమే తిరగబడినట్లు’’ అన్నారు. భవిష్యత్తుని చక్కగా ఊహించారు. అయితే ప్రతి పక్షం కాస్తా ప్రభుత్వం అయింది. ఈరోజు బీజేపీ ఎంపీ సీట్లు 303. స్వరం మారి, వ్యంగ్యం రాజముద్రై ప్రజాస్వామికవాదులని వెక్కిరిస్తోంది.
ముప్పై రెండు శీతాకాలాలను దాటుకుని బోట్ క్లబ్ ర్యాలీ ఉత్తేజం బోర్డర్లకి చేరింది. దాదాపు ఆర్నెల్ల కిందట కేంద్రం తీసుకువచ్చిన మూడు ఆర్డినెన్సులపై నిప్పు రాజుకుంది. ఢిల్లీ, పంజాబ్, హరి యాణా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైతులు వాటికి వ్యతిరేకంగా ఉద్యమరూపం తీసుకున్నారు. సరైన చర్చ లేకుండా హడావుడిగా ఆమోదింపజేయడంలో అంతిమంగా పెట్టుబడిదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు రైతులు భావిస్తున్నారు. వ్యవసాయ చట్టాలవల్ల జరగబోయే లాభనష్టాల మీద విస్తృతంగా జరుగుతున్న చర్చతో పాటు, సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లోని రైతు ఉద్యమ స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోవడం అవసరం.
ఎక్కడ సమస్య కనపడితే అక్కడ ప్రత్యక్షమయ్యే ‘ఆందోళన్ జీవుల’ మాదిరిగా నేను కూడా ఈ మూడు ప్రాంతాలూ తిరిగాను. ‘ఎముకలు కొరికే చలిలో లక్షలాది రైతులు రోడ్లమీద నిస్సహాయంగా పడి ఉంటే!’ తరహా మూస విశ్లేషణలు, పడికట్టు పదాలు పనికిరావని అర్థమయింది. ఆ రైతులేం మామూలుగా రాలేదు, ‘దమ్ లగా కె హైసా’ అంటూ సరిహద్దుల మీదకి కుప్పించి దూకారు. పాత అనుభవానికి, కొత్త సాంకేతికతని జోడించి వచ్చారు. వారి వెనుక మండీలు, ఖల్సాలు, ఎన్జీవోలు ఉన్నాయేమోనని వెతకడం కాదు ముఖ్యం, వారు దేనికోసం, ఎవరికి ఎదురుగా, ఎంత స్థిరంగా నిలబడి ఉన్నారన్నది ముఖ్యం. రెండునెలలుగా సాగుతున్న ఆందోళనల్లో తోటివారు చనిపోతున్నాసరే ధైర్యం, సాహసం, పౌరుషం, పట్టుదల– ఒక్కమాటలో చెప్పాలంటే ‘నిబ్బరం’గా ఉద్యమాన్ని నడుపుతున్నారు.
మూడు సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతున్నపుడు అకస్మాత్తుగా ప్రత్యేక ఆవరణంలోకి వెళ్ళినట్లు ఉంటుంది. రిపబ్లిక్ డే ఘటన తర్వాత నాలుగంచెల నిర్బంధ వలయాలు పెట్టారు. అవి దాటుకుని అడ్డదారుల గుండా లోపలికి వెళితే రైతుసముద్రం అలలై పలకరిస్తుంది. ఉద్యమం స్థానీయముద్రతో నడవడం ఎలా ఉంటుందంటే రచ్చబండ ఉదయాలు పేపర్లు ముందేసుకుని రాజకీయాలను వాడి వేడిగా చర్చిస్తూ ఉంటాయి. చేయి సాచి అడగకుండానే పెద్దపెద్ద లంగర్లు– గాజర్ హల్వా, పనీర్ రోటీ, ఆలూ బోండా, దూద్ కా మీఠాలతో ఆకలిని రుచికరంగా తీరుస్తాయి. నీలంరంగు దుస్తులు, సాంప్రదాయక వేషధారణతో చేతికి, మొలకి కర, కిర్పణులు ధరించిన ఖల్సా భక్తులు మేలుజాతి గుర్రాలు ఎక్కి నిర్బంధ వలయాలకి ఇవతల పహారా కాస్తుంటారు.
ప్రతి ట్రాక్టరు గుడారం వేసుకుని వెచ్చనిగూడులా మారి మెత్తలు, కంబళ్ళతో ఎముకలు కొరికే చలిని ఓడిస్తుం టుంది. గుమిగూడి గుండ్రంగా కూచున్న పగిడీపెద్దలు–ఇళ్లనుంచి దుమ్ముదులిపి తెచ్చుకున్న పురాతన హుక్కాగొట్టాలను తన్మయత్వంతో పీలుస్తుంటారు. వేలాదిమంది టెంట్లకింద నిల్చుని, కూచుని, నడుంవాల్చి పెద్దపెద్ద వేదికల మీది ఉపన్యాసాలు వింటుంటారు. అప్పటివరకూ కులాసాగా సెల్‌ఫోన్ చూస్తూ ఉన్న యువకుడిని ఏ వార్త విచలితుడిని చేస్తుందో ఏమో రివ్వున లేచి జెండా చేతబూని తనొక్కడే ఒక సైన్యమై ‘కిసాన్ జిందాబాద్’ అంటూ అశ్శరభశ్శరభలు వేస్తాడు. బల్లేబల్లే గీతాలతో హోరెత్తుతూ కొన్ని ట్రాక్టర్లు బుర్రుమంటూ సాగుతుంటాయి. కళ్ళవెనుక విషాదాలను దాచుకున్న పంజాబీ మహిళా జలపాతాలు ఆకాశానికి పిడికిళ్ళు ఎత్తుతారు. పిల్లలు విస్ఫారిత నేత్రాలతో నవలోకాన్ని చూస్తుంటారు. వీరంతా– ఎవరో చెప్పి కూడగట్టితే రంగంలోకి దిగినవారు కాదు. బలీయమైన తక్షణ ఉద్వేగాలు, అవసరాలు గుండెనుంచి తన్నుకు వస్తుంటే నిలవలేక కాలు మోపినవారు.
కమ్యూన్ జీవితాన్ని కలలు కనేవారికి ఈ ఉద్యమ ప్రాంతాలు సజీవ ఉదాహరణలు. పదిమంది కూడి వంటలు వడ్డనలు, మీటిం గులు, పంచాయతీలు, ఊరేగింపులు, కాపలాలు, పారిశుధ్యం, ఒకటేమిటి! సామూహిక చేతన బలం కనబడుతూ ఉంటుంది. ఎన్నెన్ని యంత్రాలంటే! వేలమందికి ఒకేసారి టీ మరిగించేవి, రొట్టెలు తయారు చేసేవి, బట్టలు ఉతికేవి, అంట్లు తోమేవి అనేకం. తాత్కాలి కంగా కట్టిన పాఠశాలలు, గురుద్వారాలు, ఆసుపత్రులు, పుస్తకశాలలు, పార్టీ ఆఫీసులు, ఆఖరికి రైతులకి న్యాయ సహాయం అందించడానికి లాయర్లతో కూడిన బెంచ్– ఇక్కడ జీవితం విస్తరిస్తూనే ఉంది. ఉద్యమం మీద నిర్బంధాన్ని మరింత మొరటుగా చూపడానికి కేంద్రం కాస్త సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజలలో బలమైన వర్గాలు ప్రభుత్వంతో తలపడుతున్నపుడు లెక్కలు చాలా మారతాయి. అలాగే ‘ముజఫర్‌నగర్‌లో జాట్లకి ముస్లిములు ప్రకటించిన సంఘీభావం ఆసక్తికరం.
ఎడమొహం పెడమొహంగా ఉన్న భిన్న ప్రజాశ్రేణుల ఏకీకరణకి ఇటువంటివి సాయపడతాయి. ఈ ఐక్యత ఏలినవారికి గుబులు రేపుతుంది. ముళ్ళకంచెల వద్ద పూలమొక్కలు నాటుతామంటున్న రైతుల స్థితప్రజ్ఞతని నీరుకార్చే పథకరచన చాపకింద నీరులా సాగుతోంది. రైతులేమో అనుకున్నది సాధించేవరకూ కదలమంటున్నారు. అక్కడనుంచి వచ్చేసేపుడు గొప్ప ఉత్తేజమూ వల్ల మాలిన బెంగా కలనేత భావంగా మారాయి. మసకచీకట్లూ మంచుతెరలూ పల్చగా కమ్ముకుంటున్న క్షణాల్లో తిరిగి చూసుకుంటూ నడుస్తున్నాను. టిక్రీ మెట్రోవంతెన కిందున్న గుడారం వెలుపల హుక్కా పీల్చుతున్న ఒక సర్దార్జీ ఆలాపన మొదలుపెట్టాడు. పంజాబీ గ్రామీణ యాస ఉన్న మార్మిక స్వరమది. ఆ గేయపు భావం చెవులను తాకి నన్ను వణికించింది. ‘‘ఓ సోదరీ! పున్నమిరోజు నువ్వు కట్టిన రక్షాబంధన్ సాక్షిగా చెపుతున్నాను, రాత్రి గడిచాకే ఇంటికి తిరిగి వచ్చేది. నేను రాకుంటే సూర్యుడు ఎప్పటికీ ఉదయించడని గ్రహించు.’’
కె.ఎన్. మల్లీశ్వరి
వ్యాసకర్త ఒక ఆందోళన జీవి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక
ఈ–మెయిల్: malleswari.kn2008@gmail.com
Comments
Please login to add a commentAdd a comment