చేయి దాటకముందే మేలుకోవాలి | Justice B Chandra Kumar Article On Farmers Tractor Rally | Sakshi
Sakshi News home page

చేయి దాటకముందే మేలుకోవాలి

Published Thu, Jan 28 2021 12:35 AM | Last Updated on Thu, Jan 28 2021 4:26 AM

Justice B Chandra Kumar Article On Farmers Tractor Rally - Sakshi

పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. నివారించలేని యుద్ధం అంటూ ఏదీ ఉండదు. మనిషి వివేకం కోల్పోయినప్పుడే సమస్యలు తలెత్తుతాయి. క్షమాగుణం కరువైనప్పుడే ద్వేషాలు ప్రబలుతాయి. ఐదు నెలలుగా శాంతియుతంగా సాగుతున్న రైతు ఉద్యమం ఒక్కసారిగా హింసారూపం దాల్చింది. ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేయడానికే కుట్రపూరితంగా కొందరు హింసకు పాల్పడ్డారని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఏమైనా పరిస్థితి ఇలా చేయిదాటడం అటు నిర్మాణాత్మకంగా సాగే ఉద్యమాలకూ మంచిది కాదు; ఇటు నవభారతాన్ని నిర్మించాల్సిన  ప్రజాస్వామ్యానికీ పనికొచ్చేది కాదు.

నేను గతవారం రాసిన ‘వ్యవసాయ చట్టాల వివాదాన్ని లోక్‌ అదాలత్‌కు రిఫర్‌ చేయ వచ్చా?’ అనే వ్యాసంలో ‘‘ఇంతవరకు రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో రైతులను అభినందించింది. అందుకే వీలైనంత తొందరగా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, రైతు సంఘాలు, మేధావులు కృషి చేస్తారని ఆశిద్దాం’’ అని రాశాను. కానీ తరువాత జరిగిన పరిణామాలను చూస్తే సమస్యను పరిష్కరించే దిశగా కాకుండా వైరుధ్యాన్ని పెంచే విధానాన్ని అనుసరించారని స్పష్టమవుతుంది.

అనివార్యమైన యుద్ధమంటూ ఏదీవుండదు, మనిషిలో విజ్ఞత లోపించినప్పుడే యుద్ధం వస్తుంది అన్నాడు బ్రిటన్‌ మాజీ ప్రధాని ఆండ్రూ బోనార్‌ లా. ‘ఎ స్టిచ్‌ ఇన్‌ టైమ్‌ సేవ్స్‌ నైన్‌’. సరియైన సమయంలో కుట్టు వేస్తే తొమ్మిది చినుగులను అరికట్టవచ్చు. అది వ్యక్తి ఆరోగ్యం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ప్రజల, రైతుల సమస్యలు కావచ్చు లేదా ప్రజా ఆందోళనల విషయంలో ప్రభుత్వ వైఖరి కావచ్చు. ఎవరు ఏ సమయంలో ఏం చేయాలో అది చేయగలిగితే తొంభై శాతం సమస్యలను పరిష్కరించవచ్చు.

అరాచక శక్తుల కుట్ర
గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన రైతుల ట్రాక్టర్‌ ర్యాలీలో ఒక రైతు మరణించడం, అనేక మంది రైతులు, పోలీసులు గాయపడటం వంటి విషాదకర సంఘటనలు జరిగాయి. ఎర్రకోటపై రైతులు జెండాలు ఎగురవేశారు. అయితే ఈ ఉద్యమంలోకి విద్రోహకర శక్తులు ప్రవే శించాయా? గతంలో బీజేపీతో సన్నిహితంగా ఉన్నవారే కొందరు రైతులను ఎర్రకోట వైపు మరల్చారనీ, వారే ఎర్రకోటపై జెండా ఎగుర వేశారనీ కొందరు రైతు సంఘ నాయకులు ఆరోపించారు. పంజాబీ గాయకుడు, నటుడు దీప్‌ సిద్ధూ ఒకప్పుడు ప్రధాని మోదీతో, నటుడు సన్నీ దేవళ్‌తో ఫొటోలు దిగిన వ్యక్తి. ఆయనే స్వయంగా ఎర్రకోటపై జెండా ఎగుర వేశానని బహిరంగంగా ఫేస్‌ బుక్‌లో ప్రకటించాడు. అయితే ప్రభుత్వం ఇది ఖలిస్తాన్‌ వాదుల పని అనీ, ఎగరేసింది ఖలిస్తాన్‌ జెండా అనీ అసత్యాలను ప్రచారం చేస్తు న్నది. శాంతియుత రైతు ఉద్యమాలను అప్రతిష్టపాలు చేయడానికి కుట్రపూరితంగా కొందరు హింసకు పాల్పడ్డారని, ఎర్రకోట వైపు వెళ్లేలా కొంతమందిని రెచ్చగొట్టారని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా పరిస్థితి చేజారిపోయింది. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం, అటు రైతు సంఘాలు కళ్ళు తెరిచి శాంతియుతంగా సమస్యలు పరిష్క రిస్తారని ఆశిద్దాం. 

పదవుల నుంచి విరమణ చేసినవారు సలహాలు చెబుతుంటారు, వినాలా వద్దా? అంటే ఎవరి ఇష్టం వారిది. చెప్పడమే మా ధర్మం, వినకపోతే నీ ఖర్మం అని శ్రీకృష్ణుడే అన్నాడు. మహాభారత యుద్ధంలో దాదాపు కౌరవుల్లోని వీరాధివీరులు, కర్ణుని వంటి దాన శీలి, యావత్‌ కౌరవ వంశము, లక్షలాది మంది సైనికులు చనిపోయారు. అయితే కౌరవ వంశం నాశనం కాకూడదని విదురుడు, భీష్ముడు, ద్రోణా చార్యుడు మొదలైనవారు ధృతరాష్ట్రునికి, దుర్యోధనునికి ఎన్నోతీర్లుగా సలహాలు ఇచ్చారు. కానీ దుర్యోధనాదులు వినలేదు. ఫలితం అనుభ వించారు.  

ఒక పేరు మోసిన ఫ్యాక్షనిస్టు కుటుంబ సభ్యులను హత్య చేయడం, దానితో ఆ ఫ్యాక్షనిస్టు ప్రతీకార హత్యలకు పూనుకోవడం జరిగింది. ఈ పరిస్థితులు అన్నింటినీ గమనించి నేను హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు అతనికి బెయిల్‌ మంజూరు చేశాను. ఆ ఆర్డర్‌లో ఇక నుంచైనా నేర ప్రవృత్తిని మానుకుని శాంతియుత జీవితం కొనసాగిం చాలని చెప్పాను. అతడు ఒక రెండు మూడు నెలలు శాంతియుతంగా గడిపినా, మళ్లీ నేర ప్రవృత్తిని మానుకోలేకపోయాడు. ఫలితం ఏమైంది? కొద్దిరోజుల్లోనే అతను కూడా హత్యకు గురయ్యాడు. హింసతో హింసను, పగతో పగను, కక్షలతో కక్షలను ఎన్నడూ దూరం చేయలేము. ఒక కంటిలో పొడిచినవాడి కంటిలో మనమూ పొడుచు కుంటూ వెళితే ఈ ప్రపంచంలో ఎవరికీ కళ్లు ఉండవు. 

హింసకు ప్రతిహింస సమాధానం కాదు
ఏ సమస్య అయినా ప్రశాంతంగా ఆలోచించి సరైన పరిష్కార మార్గం దిశగా అందరితో గౌరవంగా, ప్రేమగా మాట్లాడి అందరికీ న్యాయం జరిగే సూచనలు చేసినట్లయితే ఆ ప్రతిపాదనలను వారు అంగీకరించే అవకాశం ఉంది. నేను నెల్లూరు, ప్రకాశం జిల్లా జడ్జిగా పనిచేస్తున్న రోజుల్లో ఎన్నో గ్రామాల్లో ప్రజలందరితో మాట్లాడి వారందరూ మళ్లీ కలిసి మెలిసి ఉండేటట్లు వారి మధ్య ఉన్న సివిల్‌ క్రిమినల్‌ కేసులను పరిష్కరించాను. ఎన్నో గ్రామాలను ఎలాంటి తగాదాలు లేని గ్రామా లుగా మార్చాము. అలా పరిష్కరించామన్న తృప్తి కలిగింది. ఏ సమస్య అయినా ఆ సమస్య తీవ్ర దశకు చేరుకోక ముందే పరిష్క రించాలి. 

నీటిని వేడి చేస్తున్నాం అనుకుందాం. 98, 99 డిగ్రీల వరకు వేడి చేశాక కూడా ఇంకా వేడి చేస్తూ నీరు ఆవిరి కాకూడదు అంటే కాకుండా ఉంటుందా? నీటి కాలువకో, చెరువు గట్టుకో, ప్రాజెక్టుకో నెర్రెలు వచ్చినప్పుడు సకాలంలో రిపేరు చేస్తే ఆ కాలువ, చెరువు, లేదా ప్రాజెక్టు తెగిపోదు. అదే రోజుల తరబడి నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు తెగిపోతుంది. ఊళ్లకు ఊళ్లు మునిగి పోతాయి. సర్వనాశనం జరుగు తుంది. అది క్షయ కావచ్చు, మరో వ్యాధి కావచ్చు. మొదటి దశలోనే పూర్తి చికిత్స తీసుకుంటే 99 శాతం కేసుల్లో ఆ వ్యాధి నుంచి నివారణ పొందవచ్చు. మొదటి, రెండవ దశలను నిర్లక్ష్యం చేస్తే జరగబోయే పరిణామాలు చెడుగా ఉండవచ్చు. 

నెలల తరబడి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇంతవరకు ఏ రోజూ హింసకు పాల్పడలేదు.  ఎప్పుడైతే ఆందోళన రోజుల తరబడి కొనసాగుతుందో ప్రజల ఓపిక నశించవచ్చు. లేదా అసంతృప్తి చెందిన కొందరు తమ అసంతృప్తిని చాటడానికి బల ప్రయోగానికి దిగవచ్చు.  సుశిక్షితులైన పార్టీ కార్యకర్తలు ఉండి ఎక్కడ ఎలాంటి శక్తులు ఉద్యమం లోకి వస్తున్నాయో గమనించి వాళ్లను నివారించగలిగితే మేలు. అలాంటి నిర్మాణయుత సంస్థ ఉద్యమాలు చేపట్టడం వేరు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించబడిన ఉద్యమాలను కూడా చీల్చడానికి, బలహీనపరచడానికి వ్యతిరేక శక్తులు అరాచకవాదులను అందులోకి పంపుతాయి. అందుకే ఉద్యమనేతలు జాగ్రత్తగా ఉండాలి. మహాత్మా గాంధీ జరిపిన ఉద్యమంలో ఎక్కడ హింస చెలరేగినా వెంటనే ఉద్య మాన్ని ఆపివేసేవారు. 

అనేక ఉద్యమాలు శాంతియుతంగా మొదలైనా చివరకు హింసాత్మకంగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం తరు వాతనే బ్రిటిష్‌ అధికారుల మీద దాడులు జరిగాయి. భగత్‌సింగ్‌ ఉరితీత తరువాతనే సైనిక తిరుగుబాటుకు ఆలోచనలు బలపడ్డాయి. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వాన అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఏర్పడింది. సిక్కుల స్వర్ణ దేవాలయంలో రక్తం పారిన తరువాతనే ఇందిరా గాంధీని హత్య చేయాలనే కుట్ర జరిగింది. శ్రీలంకలో తమిళ ఈలం దళాలపై దాడులు జరిగిన తర్వాతనే రాజీవ్‌ గాంధీ హత్యకు రూపకల్పన జరిగింది. ఢిల్లీలో సిక్కుల ఊచకోత తర్వాతనే ఖలిస్తాన్‌ వాదం బలపడింది. 

చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి
నేను హింసను సమర్థించడం లేదు. హింస వల్ల ఏ సమస్యా పరి ష్కారం కాదు. కానీ ఒకరు హింసకు పాల్పడితే ఆ హింస వల్ల ఏర్పడిన పరిస్థితి ప్రతిహింసకు దారితీస్తుంది. అనేక మత కలహాల్లో, కుల విద్వేషాల్లో ఎందరో అమాయకులు బలయ్యారు. హింస వల్ల విలు వైన ప్రాణాలు పోతాయి. ఏదైనా తిరిగి వస్తుంది. కానీ ప్రాణం రాదు కదా! ప్రాణానికి విలువ ఇవ్వాలంటే హింసను మానుకోవాలి. ఇటు ప్రభుత్వం, అటు సంఘాలు, మరోవైపు కోర్టులు కక్షపూరిత ధోరణితో కాకుండా ప్రశాంతంగా ఆలోచనకు పూనుకోవాలి. క్షమాగుణం అలం కరించుకుని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఈరోజు కుల విద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతున్నాయి. ఈ విద్వేషాలను తగ్గించకపోతే భవిష్యత్తు చీకటిమయం కాక తప్పదు. ఇప్పటికే పేదరికం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాలు, కల్తీ, అవినీతి... ఇలా ఎన్నో సమస్యలతో దేశం సత మతమవుతోంది. వీటికి తోడు శాంతిభద్రతల సమస్య కూడా ఉత్పన్న మైతే అభివృద్ధి మొత్తంగా కుంటుపడుతుంది. అందుకే సత్వరం మేలు కోవాలి. వివేకంతో మసులుకోవాలి. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటారని ఆశిద్దాం.

జస్టిస్‌ బి. చంద్రకుమార్‌ 
వ్యాసకర్త హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
మొబైల్‌ : 79974 84866

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement