మునిగిపోతున్న జీవితం | polavaram submerged villages | Sakshi
Sakshi News home page

మునిగిపోతున్న జీవితం

Published Fri, Sep 16 2016 8:47 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

మునిగిపోతున్న జీవితం - Sakshi

మునిగిపోతున్న జీవితం

అయినవారి త్యాగాలకు వేదికలపై సన్మానాలు.. పుల్లా పుడకా ఊడ్చి ఇచ్చేసి నిరాధారంగా నిలబడ్డ బడుగులపై భారీ ప్రొక్లైనర్ల ఉక్కుహస్తాలూ... ప్రజలు చేసే త్యాగాలను గుర్తించడంలో కూడా పక్షపాతమేనా!

తవ్విపోసిన పోలవరం కొండల శిధిలాలను చూస్తున్నపుడు, 2018 కల్లా ప్రాజెక్ట్‌ని పూర్తిచేస్తామని చంద్రబాబు ప్రకటన విన్నపుడూ నిర్మాణం ఆపేయాలన్న డిమాండ్‌ ఇక సరైంది కాదేమో. ఇప్పుడు మాట్లాడాల్సింది బాధితులకి జరగాల్సిన న్యాయం గురించి. కుండలూ తపేళాలతో సహా ఇళ్ళను, జీవికతో ముడిపడి ఉన్న అడవిని, దాహం తీర్చే నదిని దానం చేసేసిన నిర్వాసితుల గురించి మాట్లాడాలి. ఖాళీ అయిపోయిన జీవితాన్ని కళ్ళముందర పెట్టుకుని పాతూరు కొత్తూర్ల మధ్య గాల్లో అయోమయంగా గిరికీలు కొడుతున్న పిట్టల్లాంటి గిరిజ నులు, పల్లీయుల నిస్సహాయత గురించి మాట్లాడాలి.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నుంచి 30 మందికి పైగా రచయిత్రులం పశ్చిమ గోదావరి జిల్లాలోని ముంపు, పునరావాస గ్రామాలను సందర్శించి నపుడు శూన్యంలో కొట్టుకుపోతున్న అనుభూతి కలిగింది. అమరావతి నిర్మాణం కోసం విదేశీ ప్రణాళికలు వేసి భూములను కోల్పోయిన అక్కడి ధనిక, మధ్యతర గతి రైతులను, నిర్మాణ ఫలాల్లో భాగస్వాములను చేసింది ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో అలాంటి నమూనా ఎందుకు రూపొందించడం లేదు? బహుళార్థ సాధక ప్రాజెక్టులయినా, రాజధాని నిర్మాణా లయినా ప్రజలు చేసే త్యాగాలను గుర్తించడంలో కూడా పక్షపాతమేనా! అయినవారి త్యాగాలు వేదికలపై సన్మానాలు పొందుతుంటే, తమకున్న పుల్లా పుడకా ఊడ్చి ఇచ్చేసి నిరాధారంగా నిలబడ్డ బడుగులపై భారీ ప్రొక్లై నర్లు ఉక్కుహస్తాలను విసురుతున్నాయి.

మరణాన్ని కూడా గౌరవంగా చూడాలనే ఆధునిక సమాజంలో, జీవించి ఉన్నవారిని తరలించడంలో ఎంతటి మానవీయత చూపాలి? నిర్బంధ వలసల వల్ల అక్కడి ప్రజల్లో ప్రాజెక్ట్‌ పట్ల వ్యతిరేకత మరింత పెరుగుతోంది. ‘నవ్వాలో ఏడవాలో తెలీడం లేదండీ బాబో! వండుకున్న తపేళాలతో సహా అందరి సామాన్లు ఆళ్లే లారీల్లోకి విసిరేత్తన్నారు. మేము కిందకి దింపడం, వాళ్ళు లారీల్లో పెట్టడం, చివరాకరికి బాంబు లుపెట్టి పేల్చేత్తామని బెదిరించడంతో ఖాళీ చెయ్యక తప్పలేదు’ అని కొత్త రామయ్యపేట పునరావాస గ్రామంలో ఒక మహిళ వాపోయింది.

నష్టపరిహారం విషయంలో కూడా పదోపరకో అంటగట్టి వదిలించుకోవాలన్న తాపత్రయం తప్ప పటిష్టమైన ప్రణాళిక అంటూ ఏమీలేదు. అగ్ర కులస్తు లకి ఇల్లుకి ఇల్లు, పొలానికి డబ్బు నష్టపరిహారం ఇచ్చారు. ఇంటికి పొలానికి ఇచ్చిన పరిహారంతో ఇల్లు మాత్రమే సాదాసీదాగా కట్టుకోగలిగారు. వారికిక ఏ ఆధారమూ లేదు. పునరావాస గ్రామాలకి చుట్టుపక్కల ఉపాధి అవకాశాలూ లేవు. ఆ గ్రామాలు కూరపాదులు వేసుకోడానికి కూడా వీలులేని రాతినేలలు. కోయ, దొరోళ్ల కొత్తల వంటి ఎస్టీలకి పొలానికి పొలం ఇచ్చారు కానీ పునరావాస గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. దానివల్ల గిరిజనులకి ఉపాధి దక్కదు.

వాడీయులు, గూళ్ళొడ్డీలు, అగ్నికుల క్షత్రియులది మరొకరకం సమస్య. ఈ జాలర్లకి గోదావరి నదే ఏకైక ఆధారం. రాత్రి 2, 3 గంటల సమయంలో వేటకి వెళ్లి ఉదయం 8 గంటలకి తిరిగొచ్చి వలలో పడ్డ చేపల్ని అమ్ముకుంటారు. జాలర్లు తమ వృత్తిని దాటి వేరేపనిలో నైపుణ్యాన్ని పొందడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అందుకే తమకి కేటాయించే ఇళ్ల స్థలాలు నదీ తీరప్రాంతాల్లో ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకి డబ్బూ అదీ వద్దని మా గోదారిని మాకు ఇస్తే చాలని ఒక యువకుడు ఆవేదనతో చెప్పాడు.   

అక్కడి ప్రజలంతా మూకుమ్మడిగా చెప్పింది ఒకటే మాట, చేయడానికి పనులేమీ లేవని. ఏ నష్టపరిహా రమూ ఈ లోటుని పూరించలేదు కాబట్టి ఉపాధి అవకా శాలని సత్వరం మెరుగుపరచాలి. ఈ పేరుతో మళ్ళీ పెద్ద కంపెనీలకి దార్లు తెరవడం కాకుండా ప్రజల భాగ స్వామ్యంతో వారి స్వావలంబన కోసం అక్కడి ప్రకృతి వనరుల వినియోగం జరగాలి. పునరావాస గ్రామాల్లో ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చే ఆర్థిక సంక్షోభాలు ప్రభుత్వ ప్రయోజనాల రీత్యా మంచివి కావు. కనుక నిర్వాసితులకి ముందుగా ఆర్థిక స్థిరత్వాన్ని హామీ ఇవ్వాలి. 36 వేల కోట్లకి చేరిన ప్రాజెక్ట్‌ వ్యయానికి వందల కోట్లలోనే నిధులు విడుదల కావడానికీ మధ్య ఉన్న అంతరాలను, వాటి కారణాలను ప్రభుత్వం వెల్లడించాలి. వీటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎవరి నెత్తిమీద భారం రుద్దబోతుందో ప్రకటించాలి.

తాళాలు లేని ఇళ్ళని కల గనే మేధావులకి తలుపులే లేని నిర్వాసితుల ఇళ్ళు అసంతృప్త వర్తమానం. బాధి తులకి అందించాల్సిన కూడూ గూడూ నీడల ఏర్పాట్ల లోనే అడుగడుగునా వైఫల్యం కనపడుతున్న చోట ప్రజల మానసిక, సాంస్కృతిక విధ్వంసాల గురించి మాట్లాడటం ఒక విలాసం. ఎరట్రి ఎండవేళ మొక్క యినా మొలవని ఒక పునరావాస గ్రామంలో చెల్లాచెదు రుగా పడున్న వస్తువుల మధ్య వంగిపోయిన నడుంతో కుక్కిమంచంలో కూరుకుపోయి కూచున్న 85 ఏండ్ల ముదుసలి స్త్రీ జనాంతికంగా అన్నమాట సన్నగా చెవిలో హోరెత్తుతోంది. ‘‘ ఏవుందీ ఇక్కడ! తీసుకొచ్చి అడవిలో పడేసారు.’’ అడవిలో జీవించి అడవిలో పడిపోయిన పోలవరం నిర్వాసితుల పుట్టి ములిగిపోతోంది. ఎత్తి ఒడ్డున పెట్టండి.

-కె.ఎన్‌. మల్లీశ్వరి
వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ)
మొబైల్‌: 8885016788

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement